ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

కరోనా మీద పోరులో ప్రసార మాధ్యమాల పాత్ర భేష్! - ఉపరాష్ట్రపతి
• సరైన, అవసరమైన సమాచారం అందిస్తూ.. వైరస్ నుంచి కాపాడుకోవడంపై నిరంతరం ప్రజలను చైతన్యపరచడంలో కీలకపాత్ర పోషించిందని ప్రశంస

• కరోనా పై పోరులో భాగంగా ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయులకు నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి

• సామాజిక మాధ్యమాల్లో అసత్య, ధ్రువీకరించని వార్తల ద్వారా ప్రజల్లో ఆందోళనకు  కారణం కావొద్దని సూచన

• ఫేస్ బుక్ వేదికగా ‘నా మనోగతంలో’ గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

Posted On: 19 JUL 2020 10:34AM by PIB Hyderabad

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలకు సరైన, అవసరమైన సమాచారాన్ని చేరవేస్తూ అనుక్షణం వారిని అప్రమత్తం  చేయడంలో ప్రసారమాధ్యమాలు పోషించిన నిర్మాణాత్మక పాత్రను ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ‘కరోనాపై పోరులో ప్రసార మాధ్యమాల అసమాన పాత్ర’ పేరుతో ఆదివారం ఫేస్‌బుక్‌ వేదికగా విడుదల చేసిన వ్యాసంలో.. గతకొద్ది నెలలుగా వైరస్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్య పరచడంలో.. జాగ్రత్తగా ఉండేందుకు ప్రభుత్వాలు చేసిన సూచనలు నిరంతరం ప్రజలకు చేరవేయడంలో మీడియా పోషించిన పాత్రను అభినందించారు. ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభంగా తన విధులను మీడియా సమర్థవంతంగా నిర్వహించి డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులతోపాటు కరోనాపై పోరాటంలో సైన్యంతో సమానంగా ముందువరసలో నిలిచిందన్నారు.

‘విపత్తులు తలెత్తినపుడు ప్రజలు సరైన సమాచారం, దాని ప్రభావం తదితర అంశాలను తెలుసుకునేందుకు మీడియాపై ఆధారపడతారు. ప్రభుత్వాలు చేసే సూచనలతో సమస్యలనుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ.. వైరస్ విస్తృతి, కరోనాపై పోరాటానికి అవసరమైన సన్నద్ధత, సమాజం పోషించాల్సిన బాధ్యత తదితర అంశాల్లో ప్రజలను చైతన్య పరుస్తూ.. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల్లో మనోధైర్యం కలిగించి ఆందోళన తగ్గించడంలో మీడియా అసమానపాత్ర పోషించిందన్నారు. దీంతోపాటుగా పార్లమెంటరీ వ్యవస్థలో.. కరోనా, సమాజంలోని వివిధ వర్గాలపై దీని ప్రభావం తదితర అంశాలపై చర్చ జరిగేలా అజెండాను కూడా మీడియా సూచించిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

మాస్కులు ధరించడం, సామాజిక, సురక్షిత దూరాన్ని పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, ఆరోగ్యకరమైన భోజనం, మానసిక ఒత్తిడినుంచి బయటపడేందుకు అవసరమైన శారీరక వ్యాయామం, ఆధ్యాత్మికత ఆవశ్యకత తదితర అంశాలను ప్రచారం  చేయడంలో మీడియా పాత్రను ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ఈ విషయాన్ని మీడియా విద్యుక్త ధర్మంగా తలకెత్తుకుని ప్రజల్లో ఆందోళన తగ్గించడంలో కీలక భూమిక పోషించిందన్నారు. 

‘ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవడం వంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. కొన్ని సంస్థలు ఆర్థిక భారాన్ని భరించలేక జర్నలిస్టుల వేతనాల్లో కోత విధించాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రసారమాధ్యమాలు, జర్నలిస్టులు ప్రజలను చైతన్యపరచడంలో తమ బాధ్యతను విస్మరించక వృత్తి ధర్మానికి కట్టుబడ్డారు. వారి చొరవను, సంకల్ప స్ఫూర్తిని అభినందిస్తున్నాను’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 

ప్రజలను కరోనాపై అప్రమత్తం చేసే ప్రక్రియలో చాలా మంది విలేకరులు కరోనా బారిన పడగా, కొందరు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కర్తవ్యనిష్ఠకు కట్టుబడి ప్రాణాలు కోల్పోయిన మీడియా సిబ్బందికి నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

పత్రికలు వైరస్ వాహకాలంటూ జరిగిన ప్రచారంతో కొన్ని పత్రికల పంపిణీలో గణనీయమైనమార్పులు వచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ‘పత్రికలు వైరస్ వాహకాలని మొదట్లో ప్రచారం జరిగింది. ఈవిషయంలో కొంత స్పష్టత వచ్చిన తర్వాత పంపిణీ తిరిగి కొనసాగింది. అయితే ఇప్పటికీ కొంత మంది పాఠకులు వీటిని తీసుకోవటానికి సందేహిస్తున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. పత్రికలు వైరస్ వాహకాలు కాదు. నేను రోజూ పత్రికలు చదువుతూనే ఉన్నాను’ అని ఆయన వెల్లడించారు.

సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు కేవలం అధికారిక, ధృవీకృత సమాచారాన్ని మాత్రమే వెల్లడించాలని.. లేని పక్షంలో అనవసర అపోహలతో ప్రజల్లో ఆందోళన నెలకొనే ప్రమాదముందని ఉపరాష్ట్రపతి సూచించారు.

వలస కార్మికులు, పేదలు వంటి బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై టెలివిజన్ ఛానళ్ళు అందించిన క్షేత్ర స్థాయి నివేదికలు (గ్రౌండ్ రిపోర్ట్) ఇప్పటికీ సమాజంలో ఉన్న అసమానతల స్థాయిని ఎంతో హృద్యంగా వివరించాయన్నారు. 

మహమ్మారికి సంబంధించిన వివిధ అంశాలను లేవనెత్తడం ద్వారా, వాస్తవిక, విశ్లేషణాత్మక పద్ధతిలో ప్రచురించడం ద్వారా ఈ మహమ్మారి నేపథ్యంలో పార్లమెంటరీ సంస్థల చర్చల విషయంలో మీడియా ఒక అజెండాను సూచించిందన్నారు. ‘ఈ విషయంలో మేము ముందుకు సాగటంలో, సంబంధిత సమస్యలను లేవనెత్తే విషయంలో మీడియా నివేదికలు సూత్ర ప్రాయమైన సూచనలుగా ఉపయోగపడ్డాయి’ అని ఉపరాష్ట్రపతి వెల్లడించారు.

***(Release ID: 1639771) Visitor Counter : 58