ఆర్థిక మంత్రిత్వ శాఖ

జి-20 సభ్య దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల మూడవ సమావేశానికి హాజరైన - ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్.

Posted On: 18 JUL 2020 9:21PM by PIB Hyderabad

జి-20 దేశాల ఇతర ఆర్ధిక వ్యవహారాల ప్రాధాన్యతలతో పాటు, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం మధ్య అంతర్జాతీయ ఆర్ధిక దృక్పథం గురించి చర్చించడం కోసం, సౌదీ అరేబియా ప్రెసిడెన్సీ క్రింద నిర్వహించిన జి-20 సభ్య దేశాల ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్.‌ఎం.సి.బి.జి) మూడవ సమావేశంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్  ఈ రోజు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. 

జి-20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్లు 2020 ఏప్రిల్, 15వ తేదీన జరిగిన తమ మునుపటి సమావేశంలో కోవిడ్-19 కు ప్రతిస్పందనగా ఆమోదించిన జి-20 కార్యాచరణ ప్రణాళిక గురించి ఈ సమావేశం మొదటి సదస్సులో ఆర్ధికమంత్రి మాట్లాడారు.  మహమ్మారిపై పోరాడటానికి జి-20 ప్రయత్నాలను సమన్వయం చేసే లక్ష్యంతో, ఆరోగ్య ప్రతిస్పందన, ఆర్థిక ప్రతిస్పందన, బలమైన మరియు భరించదగిన రికవరీ మరియు అంతర్జాతీయ ఆర్థిక సమన్వయం వంటి మూల స్తంభాల క్రింద సమిష్టి కట్టుబాట్ల జాబితాను ఈ జి-20 కార్యాచరణ ప్రణాళిక నిర్దేశిస్తుంది.  ఈ కార్యాచరణ ప్రణాళిక సంబంధితంగా, ప్రభావవంతంగా ఉండేలా చూడటం చాలా కీలకమని శ్రీమతి సీతారామన్ ఉద్ఘాటించారు.

కార్యాచరణ ప్రణాళికపై ముందుకు వెళ్ళే మార్గంలో తన దృక్పథాన్ని వివరిస్తూ, నిష్క్రమణ వ్యూహాల యొక్క స్పిల్-ఓవర్ ప్రభావాలను పరిష్కరించడంలో అంతర్జాతీయ సమన్వయం యొక్క అవసరాన్ని శ్రీమతి సీతారామన్ ఎత్తిచూపారు.  కోవిడ్-19 కు ప్రతిస్పందనగా ఆర్థిక వ్యవస్థలు తమ సరఫరా వైపు మరియు డిమాండ్ వైపు చర్యలను ఎలా సమతుల్యం చేస్తున్నాయో కార్యాచరణ ప్రణాళిక ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు.   ఎక్కువ ద్రవ్యత, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు మరియు ఉపాధి హామీ పథకాల కోసం ఋణ పథకాల ద్వారా భారతదేశం ఈ సమతుల్యతను ఎలా నిర్ధారిస్తున్నదీ, శ్రీమతి సీతారామన్ తన సహచరులతో పంచుకున్నారు.  రికవరీ మరియు వృద్ధిని పరిష్కరించడానికి భారతదేశ జి.డి.పి.లో దాదాపు 10 శాతంగా ఉన్న సుమారు 295 బిలియన్ డాలర్ల భారతదేశ సమగ్ర ఆర్థిక ప్యాకేజీ గురించి, ఆర్థిక మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రేటింగ్ ఏజెన్సీలు క్రిడిట్ రేటింగ్‌ను తగ్గించడం యొక్క భవిష్యత్ ప్రభావం గురించి మరియు విధాన ఎంపికలపై దాని నిరోధక ప్రభావం గురించి, ముఖ్యంగా ఈ.ఎం.ఈ. ల గురించి కూడా శ్రీమతి సీతారామన్ మాట్లాడారు.

సమావేశం యొక్క రెండవ సదస్సులో, సౌదీ అరేబియా ప్రెసిడెన్సీ క్రింద జి-20 ఆర్థిక విధాన ఫలితాల పరిణామాలపై జి-20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు చర్చించారు.

ఈ సందర్భంగా శ్రీమతి సీతారామన్ జోక్యం చేసుకుని, అలాంటి రెండు ముఖ్యమైన అంశాల గురించి ఆమె చర్చించారు. మొదటి విషయం, మహిళలు, యువత మరియు ఎస్.ఎం.ఈ. లకు అందుబాటులో ఉండే విధంగా అవకాశాలను పెంచడం అనేది  సౌదీ ప్రెసిడెన్సీ క్రింద ప్రాధాన్యత ఎజెండా. అదేవిధంగా ఈ అజెండా కింద అవకాశాలను అందుబాటులో ఉంచడంపై ఐచ్ఛిక విధానాల జాబితాను జి-20 అభివృద్ధి చేసింది.  యువత, మహిళలు, అనధికారిక ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత మరియు వయోజన నైపుణ్యాలు మరియు ఆర్థిక చేరిక వంటి అంశాలు లక్ష్యంగా విధానాలకు సంబంధించి జి-20 సభ్య దేశాల అనుభవాలు ఈ జాబితాలో పొందుపరచడం జరిగింది.  మహమ్మారి నిరుపేద వర్గాలను ఎక్కువగా ప్రభావితం చేసినందున ఈ ఎజెండా ఇప్పుడు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 

రెండవది, అంతర్జాతీయ పన్నుల ఎజెండాను సూచిస్తుంది. డిజిటల్ టాక్సేషన్‌కు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడానికి వీలుగా ఒక విధానాన్ని రూపొందించడానికి ఉద్దేశించిన ఈ ఎజెండాలోని పురోగతిని శ్రీమతి నిర్మలా సీతారామన్ గుర్తించారు. ఈ ఏకాభిప్రాయ ఆధారిత పరిష్కారం సరళంగా, సమగ్రంగా మరియు బలమైన ఆర్థిక ప్రభావ అంచనా ఆధారంగా ఉండాలని శ్రీమతి సీతారామన్ సూచించారు. 

ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు, వ్యవసాయం మరియు ఎం.ఎస్.‌ఎం.ఈ. రంగాలకు ప్రత్యేక సహకారం, గ్రామీణ ఉపాధి హామీ చర్యలు వంటి మహమ్మారిపై పోరాడటానికి భారత ప్రభుత్వం తీసుకున్న కొన్ని విధానపరమైన చర్యల గురించి కూడా ఆర్ధిక మంత్రి ఈ సదస్సులో వివరించారు.   420 మిలియన్ల ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి 10 బిలియన్ డాలర్లకు పైగా మొత్తాన్ని సంపర్క రహిత నగదు బదిలీ విధానం ద్వారా జమ చేయడానికి, గత ఐదేళ్ళలో భారతదేశం నిర్మించిన దేశవ్యాప్త డిజిటల్ చెల్లింపు మౌలిక సదుపాయాలను ఉపయోగించడం ద్వారా టెక్నాలజీ ఆధారిత ఆర్థిక చేరికను భారతదేశం ఎలా విజయవంతంగా ఉపయోగించుకుందో శ్రీమతి సీతారామన్ ప్రత్యేకంగా పేర్కొన్నారు.  2020 నవంబర్ వరకు ఎనిమిది నెలల పాటు 800 మిలియన్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలను అందించడానికి తీసుకున్న వేగవంతమైన చర్యల గురించి కూడా ఆమె ప్రస్తావించారు.

****



(Release ID: 1639769) Visitor Counter : 241