PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 14 JUL 2020 7:14PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • గత 24 గంటల్లో 17,989 మందికి కోవిడ్‌-19 నయంకాగా, కోలుకున్నవారి సంఖ్య 5,71,459కి పెరిగి కోలుకునేవారి జాతీయ సగటు 63.02 శాతంగా నమోదైంది.
 • ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,01,609 మంది చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
 • భారతదేశంలో మరణాల సగటు మరింత తగ్గి 2.62 శాతంగా ఉంది.
 • దేశంలో రోగ నిర్ధారణ పరీక్ష ప్రయోగశాలల సంఖ్య 1,206కు పెరిగింది.
 • సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుంటున్నాం: డాక్టర్‌ హర్షవర్ధన్‌.
 • కోవిడ్‌ అనంతర కాలంలో సురక్షిత ప్రయాణం కోసం ‘కోవిడ్‌ బోగీల’ను సృష్టించిన భారత రైల్వేశాఖ.

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సమాచారం

దేశ‌వ్యాప్తంగా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల ప్రయోగశాలల సంఖ్య ఇవాళ 1,206కు చేరగా, ఇందులో ప్రభుత్వ రంగంలో 853, ప్రైవేటు రంగంలో 353 పనిచేస్తున్నాయి. గ‌త 24 గంటల్లో 2,86,247 ప‌రీక్షలు నిర్వహించగా, ఇప్ప‌టిదాకా ప‌రీక్షించిన నమూనాల సంఖ్య 1,20,92,503కు పెరిగింది. దీంతో ప్రతి పది లక్షల జనాభాలో 8762.7 మందికి పరీక్షలు నిర్వ‌హించిన‌ట్ల‌యింది. ఇక గడచిన 24 గంటల్లో 17,989 మంది కోలుకోగా ఇప్ప‌టివ‌ర‌కూ వ్యాధి న‌య‌మైన‌వారి సంఖ్య 5,71,459కి పెరిగింది. దీనికి అనుగుణంగా  కోలుకున్నవారి జాతీయ సగటు 63.02 శాతంగా నమోదైంది. ఇక దేశంలోని వివిధ కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రులు, సంరక్షణ కేంద్రాలుసహా ఏకాంత గృహవాసంలో 3,11,565 మంది చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. ఇక చికిత్సలో ఉన్నవారికన్నా కోలుకున్నవారి సంఖ్య 2,59,894 మేర అధికంగా న‌మోదైంది. భారత్‌లో సమర్థ వైద్య నిర్వహణ వల్ల మరణాల శాతం కూడా గణనీయంగా తగ్గి 2.62 శాతానికి దిగివచ్చింది.

సంక్షోభాన్ని అవకాశంగా మ‌లుస్తున్నాం: ద్వైపాక్షిక ఆరోగ్య సహకారంసహా కోవిడ్-19 నిర్వహణపై ఆస్ట్రేలియా ఆరోగ్యశాఖ మంత్రితో డాక్టర్ హర్షవ‌ర్ధ‌న్ చ‌ర్చ‌

భార‌త ఆస్ట్రేలియాల మ‌ధ్య ద్యైపాక్షిక ఆరోగ్య స‌హ‌కారంపై కేంద్ర ఆరోగ్య‌-కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఇవాళ డిజిటల్ మాధ్య‌మంద్వారా ఆస్ట్రేలియా ఆరోగ్య‌శాఖ మంత్రి గ్రెగ‌రీ ఆండ్రూ హంట్‌తో చ‌ర్చించారు. మహమ్మారి నియంత్రణ,  నిర్వహణలో భారత వైద్య సమాజం పోషించిన పాత్రను ఈ సందర్భంగా వివరించారు. కోవిడ్-19ను అదుపులో ఉంచడంలో భారత వైద్య నిపుణులు, పారామెడికల్‌ సిబ్బంది, శాస్త్రవేత్తలు కీలకపాత్ర పోషించారని డాక్టర్‌ హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. ఔషధ ఆవిష్కరణలో, ఇప్పటికే ఉన్న ఔషధాలను భిన్న వినియోగానుకూలం చేయడంలో వారు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వ్యాధి వ్యాప్తి ఆరంభ సమయంలోనే వారు వైరస్‌ను వేరుచేసి, జన్యుచిత్రం రూపకల్పనద్వారా వైరస్‌ను అధ్యయనం చేయడంలో నిమగ్నమైనట్లు చెప్పారు. “భారత్‌లో 2020 జనవరి నాటికి వైరస్‌ నిర్ధారణ పరీక్ష చేయగల ప్రయోగశాల ఒక్కటి మాత్రమే ఉండగా, ఇప్పుడు దేశవ్యాప్తంగా 1200కుపైగా ప్రయోగశాలలున్నాయి. ప్రజలకు విస్తృత పరీక్ష సౌకర్యం నేడు అందుబాటులో ఉంది” అని డాక్టర్‌ హర్షవర్ధన్‌ వివరించారు. అలాగే భారత ఔషధ తయారీదారులు 140 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ సరఫరా చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారని తెలిపారు. ఆరోగ్యంసహా ఇతరత్రా ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి సంయుక్త కృషిపై ఆరోగ్యశాఖ మంత్రులిద్దరూ అంగీకారానికి వచ్చారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638567

కోవిడ్‌ అనంతర కాలంలో సురక్షిత ప్రయాణం కోసం కోవిడ్‌ బోగీలను సృష్టించిన భారత రైల్వేశాఖ

కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి నిరోధానికి భారత రైల్వేశాఖ అనేకానేక చర్యలతోపాటు విశేషంగా కృషిచేసింది. కోవిడ్‌-19 మహమ్మారిపై తిరుగులేని సుస్థిర పోరాటంలో భాగంగా కపుర్తలలోని భారత రైల్వేశాఖకు చెందిన రైలుబోగీల నిర్మాణ ఫ్యాక్టరీ ‘కోవిడ్‌ అనంతర కాలపు బోగీ’కి రూపమిచ్చింది. చేయి ఉపయోగించాల్సిన అవసరంలేని సదుపాయాలు, రాగిపూతగల చేపట్లు-గడియలు ప్లాస్మా పరిశుభ్ర గాలి సరఫరా ఏర్పాట్లు, పాదంతో తెరవగల మరుగుదొడ్ల తలుపులు, పాదంతో పనిచేయించగలిగే నీటివాల్వ్‌, తలుపు గొళ్లాలు, వెలుపలి వాష్‌బేసిన్‌లో పాదంతో పనిచేయించగల కొళాయి, సబ్బునందించే ఏర్పాటు, ముంజేతితో పనిచేయించగల బోగీ తలుపు తదితరాలు ఈ ప్రత్యేక బోగీల విశిష్టతలు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638552

డిజిటల్‌ విద్యపై ‘ప్రజ్ఞత మార్గదర్శకాలు’ వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా విడుదల చేసిన కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ఇవాళ న్యూ ఢిల్లీలో ఆన్‌లైన్ ద్వారా ‘డిజిటల్ విద్యపై ప్రజ్ఞత మార్గదర్శకాలు’ విడుదల చేశారు. ఇందులో ఆన్‌లైన్‌ డిజిటల్‌ అభ్యాసానికి సంబంధించి... “ప్లాన్- రివ్యూ- అరేంజ్- గైడ్- యాక్ (టాక్‌) – అసైన్‌- ట్రాక్- అప్రీషియేట్‌” పేరిట 8 దశలున్నాయి. డిజిటల్ విద్య సంబంధింత ప్రణాళికల రూపకల్పన, అమలుకు ఈ 8 దశలు ఉదాహరణలతో మార్గనిర్దేశం చేస్తాయి. ఈ సందర్భంగా శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్మాట్లాడుతూ- కోవిడ్ మహమ్మారి దుష్ప్రభావాలను ఉపశమింపజేసేందుకు పాఠశాలలు ఇప్పటిదాకా సాగిన బోధనాభ్యసన పద్ధతులను పునర్నవీకరించాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638649

కోవిడ్‌-19తో పోరాడుతున్న ఆరోగ్య సిబ్బందికోసం పీఎంజీకేపీ కింద ప్రకటించిన బీమా పథకం అమలుపై ఆర్థికశాఖ మంత్రి సమీక్ష

కోవిడ్‌-19పై పోరాడుతున్న ఆరోగ్యం సిబ్బంది కోసం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ (పీఎంజీకేపీ) కింద ప్రకటించిన ప్రత్యేక బీమా పథకం అమలుపై నిన్న నిర్వహించిన సమీక్ష సమావేశానికి కేంద్ర ఆర్థిక-కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షత వహించారు. ఈ పథకానికి సంబంధించిన అభ్యర్థనలను వేగంగా పరిష్కరించాల్సిన ప్రాముఖ్యాన్ని వివరిస్తూ- పాలసీదారుల వారసులకు వీలైనంత త్వరగా బీమా సొమ్ము అందించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638329

ప్రధానమంత్రి పంటల బీమా పథకంపై సమీక్ష నిర్వహించిన ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌

దేశంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై) అమలుతీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి కేంద్ర ఆర్థిక-కార్పొరేట్‌ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షత వహించారు. ఈ పథకం గురించి రైతులకు సమగ్ర సమాచారం అందించే దిశగా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆమె నొక్కిచెప్పారు. ఈ పథకం రైతులందరికీ స్వచ్ఛందం కాబట్టి, ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రీమియం సబ్సిడీని సకాలంలో విడుదల చేసేలా అధికారులు శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఖరీఫ్‌-2020కి సంబంధించి సబ్సిడీ విడుదల చేయని రాష్ట్రాల విషయంలో పరిస్థితిని పరిశీలించి కచ్చితంగా పరిష్కారమయ్యేలా కృషిచేయాలని చెప్పారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638455

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల వెల్లడి; ఉత్తీర్ణులు కానివారికి “ఫెయిల్‌” బదులు “తప్పనిసరి పునరభ్యాసం” పదం వాడాలని నిర్ణయం

కేంద్ర మాధ్యమిక విద్యాబోర్డు (సీబీఎస్‌ఈ) నిన్న 12వ తరగతి ఫలితాలను ప్రకటించింది. దేశంలోని అన్ని ప్రాంతాలకన్నా త్రివేండ్రం ప్రాంత విద్యార్థులు 97.67 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచారు. అలాగే బెంగళూరు ప్రాంతం 97.05 శాతంతో రెండోస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 11, 92,961 మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షలలో 10,59,080 మంది ఉత్తీర్ణులవగా ఉత్తీర్ణత 88.78 శాతంగా నమోదైంది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 5.38 శాతం అధికం. వాస్తవానికి 12వ తరగతి పరీక్షలను 15.02.2020 నుంచి 30.03.2020 వరకు నిర్వహించాల్సి ఉండగా కోవిడ్ -19 మహమ్మారి కారణంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన పరీక్షలను సీబీఎస్‌ఈ రద్దు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత అనిశ్చితి, అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం-శ్రేయస్సు దృష్ట్యా ఫలితాల నిర్ధారణకు సీబీఎస్‌ఈ రూపొందించిన విధానానికి ఆమోదం తెలుపుతూ సర్వోన్నత న్యాయస్థానం 26.06.2020న ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638458

 

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్‌పై పోరాటాన్ని ముమ్మరం చేయడంలో భాగంగా పంజాబ్ ప్రభుత్వం బహిరంగ సభలను నిషేధించింది. అలాగే సామాజికంగా ఐదుగురికి మించి గుమికూడరాదని, వివాహాలు/ఇతర సామాజిక కార్యక్రమాలకు ప్రస్తుతం 50 మందిని అనుమతిస్తుండగా ఆ సంఖ్యను 30కి తగ్గించింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై తప్పనిసరిగా కేసుల నమోదవుతుంది. భవిష్యత్ చర్యలకు మార్గనిర్దేశం దిశగా, గతంలో వ్యాధి వ్యాప్తి కారణాలను పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన నేపథ్యంలో నిఘా తీవ్రతరం చేయడంపై ఐఐటీ-చెన్నై నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కుదుర్చుకుంది.
 • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో గౌరవనీయ గవర్నర్, వారి కుటుంబసభ్యులు, అధికారులు, గవర్నర్ సచివాలయ సభ్యులకు రాజ్‌భవన్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
 • అసోం: రాష్ట్రంలోని జొనాయ్‌ జిల్లాలోగల ఓక్లాండ్‌ ప్రాంతంలో నేల కోత, వరదల నివారణకు జలవనరుల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రాజెక్టులు, పనులపై అసోం ముఖ్యమంత్రి శ్రీ సర్వానంద సోనోవాల్ ఇవాళ సమీక్షించారు.
 • మణిపూర్: రాష్ట్రంలో దిగ్బంధం నిబంధనలు ఉల్లంఘించే, మాస్కులు ధరించని, సామాజిక దూరం పాటించనివారిని శిక్షించే దిశగా మణిపూర్ పోలీస్ శాఖ 411 మందిని అదుపులోకి తీసుకుంది. అలాగే మరో 310 వాహనాలను స్వాధీనం చేసుకుని రూ.60,750 జరిమానాగా వసూలు చేసింది.
 • మిజోరం: రాష్ట్రంలో ఇవాళ 8 మంది కోవిడ్‌ రోగులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా 159 మంది కోలుకోగా, ప్రస్తుతం మిజోరంలో 74 మంది చికిత్స పొందుతున్నారు.
 • నాగాలాండ్: రాష్ట్రంలోని అన్ని నియంత్రణ జోన్లలో కోవిడ్‌-19 సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేసేందుకు కోహిమా జిల్లా పాలన యంత్రాంగం కేసుల సత్వర గుర్తింపునకు నిఘాను ముమ్మరం చేసింది.
 • సిక్కిం: రాష్ట్రంలోని రోంగ్లీ సబ్ డివిజన్‌లో కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై చర్చించడానికి ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమంగ్ ఇవాళ రాష్ట్ర కార్యాచరణ బృందంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ విభాగాల అధిపతులు ఇందులో పాల్గొన్నారు. కాగా, కోవిడ్‌-19 నియంత్రణలో భాగంగా సిక్కిం ప్రభుత్వం కొత్త చర్యలను ప్రకటించింది. ఇందులో భాగంగా వ్యాయామశాలలు, బార్లు మూసివేయాలని ఆదేశించింది. అలాగే అన్ని అంతర్రాష్ట్ర, రాష్ట్రాంతర జన సంచారాన్ని ప్రభుత్వం నిషేధించింది. దీంతోపాటు ద్విచక్ర వాహనాలుసహా అన్నిరకాల ప్రైవేట్ వాహనాల రాకపోకలను కూడా నిషేధించారు. టాక్సీలు బేసి-సరి నిబంధనను అనుసరిస్తూనే ఉంటాయి... కానీ, ఇది స్థానిక ప్రయాణానికి మాత్రమే పరిమితం. తక్షణం అమలులోకి వచ్చే ఈ నిబంధనలన్నీ జూలై 31 వరకు కొనసాగుతాయని పేర్కొంది.
 • మహారాష్ట్ర: రాష్ట్రంలో గత 24 గంటల్లో 6,497 కొత్త కేసుల నమోదుతో మొత్తం రోగుల సంఖ్య 2,60,924కు చేరింది. ఇక 193మంది మహమ్మారికి బలికావడంతో మొత్తం మృతుల సంఖ్య 10,482కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్‌ రోగుల సంఖ్య 1,05,637గా ఉంది. కేసులు పెరిగినందువల్ల నిన్న అర్ధరాత్రి నుంచి పుణె, పింప్రి-చించివాడ్‌, ప్రాంతాల్లో మళ్లీ దిగ్బంధం విధించారు.
 • గుజరాత్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 902 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 42,808కి పెరిగింది. రాష్ట్రంలోని 10,945 యాక్టివ్‌ కేసులలో 74 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరందరూ ప్రస్తుతం వెంటిలేటర్‌ ఆధారిత వార్డులలో చికిత్స పొందుతున్నారు. కాగా, రాష్ట్రంలో నేటిదాకా 4.70 లక్షల నమూనాలను పరీక్షించారు.
 • రాజస్థాన్: రాష్ట్రంలో మంగళవారం 98 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 25,034కు చేరాయి. ప్రస్తుతం రాజస్థాన్‌లో 5,759 యాక్టివ్‌ కేసులున్నాయి.
 • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో సోమవారం ఒకేరోజు అత్యధికంగా 575 కొత్త  కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 18,207కు పెరిగింది. ప్రస్తుతం 4,336 యాక్టివ్‌ కేసులుండగా ఇప్పటిదాకా 13,208 మంది కోలుకున్నారు. ఇక 110 కొత్త కేసులతో గ్వాలియర్ కొత్త హాట్‌స్పాట్‌గా మారింది. అలాగే ఇండోర్‌లో 92,  భోపాల్‌లో 88 వంతున కేసులు నమోదయ్యాయి.
 • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో సోమవారం ఒకేరోజు అత్యధికంగా 184 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4265కు చేరగా, ప్రస్తుతం వీటిలో 1044 యాక్టివ్‌ కేసులున్నాయి. కొత్త కేసులలో గరిష్ఠంగా రాయ్‌పూర్‌ నుంచి 87 కేసులు నమోదవగా, రాజ్ నందగావ్ 26, దుర్గ్‌ 25 వంతున కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
 • గోవా: గోవాలో మరో 130 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,583కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,026 యాక్టివ్‌ కేసులున్నాయి.
 • కేరళ: రాష్ట్రంలోని అలప్పుళ వైద్యకళాశాల ఆస్పత్రిలో గల్ఫ్‌ నుంచి వచ్చిన వ్యక్తి కోవిడ్-19కు బలికావడంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 34కు పెరిగింది. స్థానిక సంక్రమణ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  అలప్పుళ, త్రిస్సూర్, పాలక్కాడ్, కన్నూర్ జిల్లాల్లో అప్రమత్తత ప్రకటించారు. ఈ ప్రదేశాల పరిధిలో మరిన్ని సముదాయాలను నియంత్రణ మండళ్లుగా ప్రకటించే అవకాశం ఉంది. ఎర్నాకుళంలోని చెల్లనం పంచాయతీ పరిధిలో 35 కేసులు నమోదు కావడంతో సత్వర ప్రతిస్పందన బృందాన్ని ప్రభుత్వం ఇక్కడ నియమించింది. ఇక కొచ్చి, త్రివేండ్రంలలో ఇద్దరు వైద్యులకు వ్యాధి నిర్ధారణ అయింది. కాగా, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో నిరసనలపై నిషేధం కోరుతూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక రాష్ట్రంలో నిన్న 449 కొత్త కేసులు నమోదవగా వాటిలో 144 పరిచయాలవల్ల సంక్రమించాయి. మరో 18 కేసులకు మూలం తెలియరాలేదు. రాష్ట్రంలో ప్రస్తుత యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,028 కాగా, నిన్న ఒకేరోజు అత్యధికంగా 713 మంది ఆస్పత్రులలో చేరడం గమనార్హం.
 • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కేసుల సంఖ్య 1,531కి పెరిగిన నేపథ్యంలో ప్రతి లక్ష జనాభాకు 3,000 వంతున కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాగా, ఇవాళ పుదుచ్చేరిలో 63 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక తమిళనాడు ముఖ్యమంత్రితోపాటు సీఎంవో కార్యాలయ ఉద్యోగులకు నిర్వహించిన రోగ నిర్ధారణ పరీక్షల్లో కోవిడ్‌ సోకలేదని తేలింది. కాగా, ఇటీవల ముగ్గురు మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలు, సీఎంవోలోని కొందరు ఉద్యోగులకు వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో నిన్న 4328 కొత్త కేసులు, 66 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,42,798; యాక్టివ్‌ కేసులు: 48,196; మరణాలు: 2032; చెన్నైలో చురుకైన కేసులు: 16,601గా ఉన్నాయి.
 • కర్ణాటక: బెంగళూరు పట్టణ-గ్రామీణ జిల్లాల్లో ఈ రాత్రి 8 గంటలనుంచి దిగ్బంధం అమలులోకి వచ్చింది. అలాగే దక్షిణ కన్నడ, ధార్వాడ్, కల్బుర్గి జిల్లాల్లో రేపటినుంచి అమలు కానుంది. మరోవైపు పండుగలు, బహిరంగ వేడుకలను కూడా ప్రభుత్వం నిషేధించింది. కోవిడ్ రోగులకు చికిత్స నిరాకరిస్తే క్రిమినల్ కేసు తప్పదని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్య కళాశాలలను హెచ్చరించింది. కోవిడ్ రోగులకు సాయంలో భాగంగా బీబీఎంపీ సకాల బెడ్ లభ్యత సమాచార వ్యవస్థను ప్రారంభించింది. బెంగుళూరునుంచి 1315 కేసులు నమోదవగా రాష్ట్రంలో నిన్న 2738 కేసులు, 73 మరణాలు నమోదయ్యాయి. మొత్తం  కేసులు: 41,518; యాక్టివ్‌ కేసులు: 24,572; మరణాలు: 757గా ఉన్నాయి.
 • ఆంధ్రప్రదేశ్: దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి, విదేశాలనుంచి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించే వ్యక్తుల నిర్బంధవైద్య పరిశీలన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు 14 రోజులపాటు కఠిన గృహనిర్బంధాన్ని సూచించింది. అలాగే కర్ణాటక, తెలంగాణ అధిక ముప్పున్న రాష్ట్రాలుగా వర్గీకరించింది. మరోవైపు జనం రాకపోకల కోసం అంతర్రాష్ట్ర సరిహద్దులను ఇంకా తెరవలేదు. రాష్ట్రంలో ప్రవేశానికి ఇ-పాస్ పొందడం ఇప్పటికీ తప్పనిసరి. ఇక బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, కోవిడ్‌ నియంత్రణ, వీధి బాలలను వైరస్ నుంచి రక్షించడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ప్రారంభించారు. రాష్ట్రంలో గత 24గంటల్లో 1916 కొత్త కేసులు, 952 డిశ్చార్జెస్, 43 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 33,019, యాక్టివ్: 15,144; డిశ్చార్జ్: 17,467; మరణాలు: 408గా ఉన్నాయి.
 • తెలంగాణ: రాష్ట్రంలో సామూహిక కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించకపోవడంపై తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. దీనిపై ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావును ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలను చాలా ఆలస్యంగా ప్రారంభించడమేగాక ఐసీఎంఆర్ నిర్దేశిత విధానాలను కచ్చితంగా పాటించకపోవడంపై హైకోర్టు మండిపడింది. యాంటిజెన్ పరీక్షలో వ్యాధి సోకలేదని తేలినప్పటికీ, వారు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ సూచించింది. కానీ, వారికి మళ్లీ పరీక్ష నిర్వహించే బదులుగా ఏకాంతవాసంలోకి వెళ్లాల్సిందిగా ప్రభుత్వం సూచిస్తోంది. కాగా, నిన్నటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు: 36,221; యాక్టివ్‌ కేసులు: 12,178; మరణాలు: 365; డిశ్చార్జ్: 23,679గా ఉన్నాయి.

*****(Release ID: 1638650) Visitor Counter : 50