ఆర్థిక మంత్రిత్వ శాఖ
'ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన' అమలు తీరును సమీక్షించిన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
- అవగాహన కార్యకలాపాల ఏర్పాటు అవసరమని నొక్కి చెప్పిన మంత్రి
- సకాలంలో క్లెయిమ్‌ల పరిష్కారాన్ని నిర్ధారించడానికి రాష్ట్రాలు ప్రీమియం సబ్సిడీని సకాలంలో విడుదల చేయవలసిన అవసరం ఉంది
Posted On:
13 JUL 2020 6:52PM by PIB Hyderabad
'ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన' (పీఎమ్‌ఎఫ్‌బీవై) అమలు తీరును సమీక్షించేందుకు గాను కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ రోజు న్యూఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. దూర దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి శ్రీ దేభాషిష్ పాండే, డీఏసీ & ఎఫ్‌డబ్ల్యూ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ అగర్వాల్‌తో పాటుగా ఆర్థిక సేవల విభాగం, కేంద్ర వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ (డీఏసీ& ఎఫ్‌డబ్ల్యూ) శాఖల సీనియర్ అధికారులు, పీఎంఎఫ్‌బీఐ పథకాన్ని అమలు చేస్తున్న సాధారణ బీమా కంపెనీల వారు మరియు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల వారు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో భాగంగా వ్యవసాయ, సహకారం మరియు ఎఫ్‌డబ్ల్యూ శాఖ పీఎంఎఫ్‌బీఐ సంబంధించి ఒక సమగ్ర ప్రజెంటేషన్‌ను ఇచ్చింది. ఖరీఫ్- 2016 సీజన్ నుండి పీఎమ్‌ఎఫ్‌బీవై సాగిన తీరు, ఎదుర్కొన్న సవాళ్లతో పాటు పథకంను మరింతగా మెరుగుపరిచిన తరువాత ప్రస్తుత ఖరీఫ్-2020 సీజన్‌లో దీని అమలు స్థితిని గురించి ఈ సందర్భంగా చర్చించారు. రైతులందరికీ ఈ పథకాన్ని స్వచ్ఛందంగా మార్చినందున అన్నదాతలకు పీఎమ్‌ఎఫ్‌బీవై సంబంధించి అన్ని వివరాలతో తగిన అవగాహన కార్యకలాపాల్ని నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థిక శాఖ మంత్రి ప్రధానంగా అభిప్రాయపడ్డారు. క్లెయిమ్‌లు సకాలంలో పరిష్కారించేందుకు ఆయా రాష్ట్రాలు ప్రీమియపు సబ్సిడీని సకాలంలో విడుదల చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను రైతులకు త్వరగా చెల్లించేలా చూడాలనే ఉద్దేశ్యంతో.. ఖరీఫ్ 2020 సీజన్‌లో ఈ పథకాన్ని అమలు చేయని వారికి ప్రత్యేకంగా సబ్సిడీ పెండింగ్‌లో ఉన్న రాష్ట్రాలతో కఠినమైన ఫాలోఅప్‌ను నిర్వహించాలని మంత్రి శ్రీమతి సీతారామన్ సూచించారు. మెరుగుపరచబడిన పీఎమ్‌ఎఫ్‌బీవైలో సాంకేతిక పరిజ్ఞానం ప్రధాన కేంద్రంగా ఉందని డీఏసీ & ఎఫ్‌డబ్ల్యూ కార్యదర్శి తెలిపారు. 2023 నాటికి పంట దిగుబడి అంచనాకు సాంకేతికతను వాడుకొనే దిశగా తమ శాఖ కృషి చేస్తోందని ఆయన అన్నారు. మెరుగుపరచబడిన పీఎమ్‌ఎఫ్‌బీవై ప్రభావాన్ని నిర్ధారించడానికి ఈ ఏడాది రబీ (2020-21) తర్వాత సర్వే నిర్వహించబడుతుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
***
(Release ID: 1638455)
Visitor Counter : 280