PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
13 JUN 2020 6:28PM by PIB Hyderabad

- దేశంలో కోలుకునేవారి శాతం 49.95కు పెరిగింది. కోవిడ్-19 నయమయ్యేవారి సంఖ్య 1,54,330కి చేరగా, గడచిన 24 గంటల్లో 7,135 మందికి కోలుకున్నారు.
- దేశవ్యాప్తంగా నవ్య కరోనా వైరస్ నిర్ధారణ సామర్థ్యం నిరంతర పెంపుతో 885కు చేరిన ప్రయోగశాలల సంఖ్య.
- కోవిడ్-19 కేసుల వైద్య నిర్వహణకు ఉన్నతీకరించిన విధివిధానాల విడుదల.
- ఆరోగ్య సంరక్షణ సరఫరా గొలుసు కోసం ‘ఆరోగ్యపథ్’ పేరిట వెబ్ ఆధారిత సదుపాయం ప్రారంభం; కీలక సరఫరాలపై ఇకమీదట సకాల సమాచారం అందుబాటు
|
(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)


కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం; కోలుకునేవారి శాతం 49.95కు పెరుగుదల
దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కోవిడ్-19 నుంచి 7,135మంది కోలుకున్నారు. ఈ మేరకు వ్యాధి నయమైన వారి సంఖ్య 1,54,330కి చేరగా, కోలుకునేవారి శాతం 49.95కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,45,779 కాగా, వీరందరూ చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. మరోవైపు నవ్య కరోనా వైరస్ సోకినవారిని గుర్తించేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) పరీక్ష సదుపాయాలను గణనీయంగా పెంచింది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 642, ప్రైవేటు రంగంలో 243 (మొత్తం 885) ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 1,43,737సహా ఇప్పటిదాకా మొత్తం 55,07,182 నమూనాలను ఈ ప్రయోగశాలల్లో పరీక్షించారు.
దేశంలో కోవిడ్-19 వైద్య నిర్వహణకు సంబంధించి కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఉన్నతీకరించిన విధివిధానాలను జారీచేసింది. వైద్యపరంగా స్వల్ప, ఓ మోస్తరు లేదా తీవ్ర స్థాయి వ్యాధి లక్షణాల ఆధారంగా కేసుల నిర్వహణకు ఈ కొత్త విధానం వీలు కల్పిస్తుంది. ఈ మూడు దశలకు సంబంధించి వ్యాధి నిరోధం, నియంత్రణ పద్ధతులను కూడా అందులో నిర్దిష్టంగా వివరించింది. అలాగే నిర్దిష్ట ఉపబృంద రోగుల కోసం పరిశోధనాత్మక చికిత్సపై మార్గదర్శకాలిచ్చింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631384
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లావోస్ ప్రధాని గౌరవనీయ డాక్టర్ థాంగ్లౌన్ సిసౌలిత్ మధ్య టెలిఫోన్ సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ లావోస్ ప్రధాని గౌరవనీయ డాక్టర్ థాంగ్లౌన్ సిసౌలిత్‌తో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక సవాళ్ల గురించి ఈ సందర్భంగా దేశాధినేతలిద్దరూ చర్చించారు. లావోస్‌లో మహమ్మారి వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సమర్థ చర్యలు చేపట్టడంపై ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. కోవిడ్ అనంతర ప్రపంచ పరిస్థితులకు సిద్ధం కావడంలో అంతర్జాతీయ సహకారంసహా ఉత్తమాచరణలు, అభ్యాసాలు, అనుభవాలను కలబోసుకోవడం అవసరమని నాయకులిద్దరూ అంగీకరించారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631283
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, టాంజానియా అధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ జాన్ పోంబే జోసెఫ్ మగుఫులీ మధ్య టెలిఫోన్ సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ టాంజానియా గణతంత్ర సమాఖ్య అధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ జాన్ పోంబే జోసెఫ్ మగుఫులీతో టెలిఫోన్‌ద్వారా సంభాషించారు. ఈ మేరకు 2016 జూలైలో తాను దార్-ఎస్-సలామ్ సందర్శించడాన్ని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. టాంజానియాతో కొనసాగుతున్న సంప్రదాయ, స్నేహపూర్వక సంబంధాలకు భారత్ ఇస్తున్న ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. కోవిడ్-19 నేపథ్యంలో టాంజానియా నుంచి భారత పౌరులను స్వదేశం తరలించడంలో అక్కడి అధికారులు చూపిన చొరవకుగాను డాక్టర్ మగుఫులీకి ప్రధానమంత్రి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631280
ఆరోగ్య సంరక్షణ సరఫరా గొలుసు కోసం వెబ్ ఆధారిత సదుపాయం ‘ఆరోగ్యపథ్’ ప్రారంభం; కీలక సరఫరాలపై ఇకమీదట సకాల సమాచారం అందుబాటు
దేశవ్యాప్తంగా కీలక ఆరోగ్య సంరక్షణ సరఫరాల అందుబాటుపై సకాల సమాచార ప్రదానం కోసం శాస్త్ర-పరిశ్రమల పరిశోధన మండలి (CSIR) జాతీయ ఆరోగ్య సంరక్షణ సరఫరా గొలుసుకు సంబంధించి ‘ఆరోగ్యపథ్’ పేరిట (https://www.aarogyapath.in) పోర్టల్ ప్రారంభమైంది. తయారీదారులు, సరఫరాదారులు, వినియోగదారులకు ఈ ఆరోగ్యపథ్ పోర్టల్ విస్తృత సేవలందిస్తుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా నెలకొన్న ప్రస్తుత జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి నడుమ సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడి కీలక వస్తువుల ఉత్పత్తి సామర్ధ్యం, వాటిని సకాలంలో అందించడం అనేక కారణాలవల్ల సాధ్యం కాకపోవచ్చు. ఈ సవాళ్లను పరిష్కరించడానికి “ఆరోగ్యం (ఆరోగ్యకరమైన జీవితం) వైపు పయనానికి దారితీసే మార్గాన్ని చూపించడం” అనే దృష్టితో ఆరోగ్యపథ్ పేరిట ఈ సమాచార వేదిక రూపొందించబడింది. కీలక ఆరోగ్య సంరక్షణ వస్తువులన్నీ ఒకేచోట లభించే ఈ సమీకృత ప్రజావేదిక వినియోగదారులకు ఎదురయ్యే అనేక సాధారణ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631379
'మై లైఫ్- మై యోగా' వీడియో బ్లాగింగ్ పోటీలో పాల్గొనే గడువు 2020 జూన్ 21వరకు పొడిగింపు
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన వీడియో బ్లాగింగ్ పోటీ ‘మై లైఫ్- మై యోగా’ వీడియో బ్లాగింగ్ పోటీలో పాల్గొనే గడువును 2020 జూన్ 21వరకు పొడిగించారు. ఆరో వార్షిక అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత సాంస్కృతిక సంబంధాల మండలి (ICCR) సంయుక్తంగా డిజిటల్ వేదికపై ఈ ప్రపంచస్థాయి పోటీని నిర్వహిస్తున్నాయి. కాగా, ఇంతకుముందు ఈ పోటీకి తుది గడువు 2020 జూన్ 15గా ప్రకటించారు. అయితే, గడువు పొడిగించాలని దేశవిదేశీ ఔత్సాహికులు కోరుతున్న దృష్ట్యా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగే జూన్ 21తో ముగిసేవిధంగా గడువు పొడిగించేందుకు మంత్రిత్వ శాఖ, ఐసీసీఆర్ నిర్ణయించాయి.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631375
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- చండీగఢ్: దేశవ్యాప్త దిగ్బంధం 30/06/2020న ముగిసేదాకా చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలో అమలు చేయతలపెట్టిన కొన్ని నిర్ణయాలను నగర పాలనాధికారి ప్రకటించారు. సీనియర్ అధికారులు, వైద్య నిపుణులతో సమగ్ర చర్చల అనంతరం తీసుకున్న సదరు నిర్ణయాలిలా ఉన్నాయి: (ఎ) సీడీయూ అంతర్రాష్ట్ర బస్సులను నడపదు; (బి) చండీగఢ్ వచ్చేందుకు అంతర్రాష్ట్ర బస్సులకు ఇచ్చిన అనుమతి ఉపసంహరణ; (సి) చండీగఢ్, పంజాబ్, హర్యానాల మధ్య త్రి-నగర బస్సులు మాత్రం నడుస్తాయి; (డి) రైళ్ల ద్వారా వచ్చే ప్రయాణికులందరికీ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి... దీంతోపాటు 14 రోజుల స్వీయ నిర్బంధవైద్య పర్యవేక్షణ కొనసాగించేలా సూచిస్తారు. అంతేకాకుండా వారు ఆరోగ్యసేతు యాప్‌ను తప్పక డౌన్‌లోడ్ చేసుకుని, స్వీయ పర్యవేక్షణ చేసుకుంటూండాలి. మరోవైపు నగరపాలన యంత్రాంగం కూడా వీలైనంత మేర యాదృచ్ఛిక ఆరోగ్య తనిఖీచేస్తుంది; (ఇ) దేశీయ విమానాలు, రోడ్డుమార్గాల్లో వచ్చే ప్రయాణికులందరికీ ఈ నిబంధనలన్నీ వర్తిస్తాయి; (ఎఫ్) రోడ్డు మార్గంలో చండీగఢ్ వచ్చేవారు వెబ్‌సైట్‌లో తమంతట తాము రూపొందించుకున్న స్వీయ సమాచార పత్రాలను పాలన యంత్రాంగం వెబ్‌సైట్‌నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, తప్పక వెంట తీసుకురావాలి. ఇది వారి ప్రయాణ, నివాసాలను అనుసరించడంలో అధికార యంత్రాంగానికి తోడ్పడుతుంది. అయితే, సదరు పత్రాన్ని అనుమతిగా లేదా పాస్‌గా పరిగణించబోరని స్పష్టం చేశారు. ఇది కేవలం కార్యాలయ రికార్డుల కోసం మాత్రమేనని పేర్కొన్నారు; (జి) కార్యాలయానికి హాజరయ్యే ప్రభుత్వ/ప్రభుత్వరంగ/ప్రైవేట్ ఉద్యోగులు గుర్తింపు కార్డులు చూపితేనే అనుమతి లభిస్తుంది.
- పంజాబ్: కోవిడ్-19 సామాజిక వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో చేపట్టిన తొలి ప్రయత్నంలో భాగంగా ‘ఘర్ ఘర్ నిగ్రాణీ’ పేరిట మొబైల్ ఆధారిత యాప్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి ఇవాళ ఆవిష్కరించారు. రాష్ట్రంలో మహమ్మారి అంతమయ్యేదాకా ఈ యాప్ సహాయంతో ఇంటింటి నిఘా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పంజాబ్‌లోని గ్రామీణ/పట్టణ ప్రాంతాల్లోగల 30 ఏళ్లు పైబడిన జనాభాపై ఈ అధ్యయనం కొనసాగుతుంది. అలాగే 30 ఏళ్లలోపు వ్యక్తులకు ఇతర అనారోగ్యం లేదా ఇన్ఫ్లూయెంజా/తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం వంటివి సోకి ఉంటే గుర్తిస్తారు. ఈ సర్వేచేసే నాటికి వారంముందు ఒక వ్యక్తి పూర్తి వైద్య పరిస్థితులను యాప్‌ద్వారా సంగ్రహిస్తారు. ఇందులో భాగంగా అతని/ఆమె సహ-అనారోగ్యంపైనా సంపూర్ణ వివరాలు నమోదు చేస్తారు. తద్వారా కోవిడ్-19 నియంత్రణకు అవసరమైన తదుపరి ప్రణాళిక రూపకల్పనలో ఈ గణాంక నిధి ప్రభుత్వానికి తోడ్పడుతుంది. ఆ మేరకు సామాజికంగా చేపట్టాల్సిన నిర్దిష్ట చర్యల నిర్ధారణలో సహాయపడుతుంది.
- హర్యానా: రాష్ట్రంలో కరోనా వైరస్ సంక్షోభంవల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. ప్రపంచ మహమ్మారి వ్యాప్తిని సమర్థంగా అరికట్టేందుకు క్రియాశీల వ్యూహాలను రూపొందించినట్లు తెలిపారు. కోవిడ్-19 నిర్వహణ కోసం నియమించిన డిప్యూటీ కమిషనర్లు, నోడల్ అధికారులంతా సంబంధిత సన్నాహాలు సహా ముమ్మర నిఘా, కఠిన నియంత్రణ, సంబంధాల సత్వర అన్వేషణ, నిశిత వైద్య నిర్వహణ తదితరాలతోపాటు క్రియాశీల IEC కార్యకలాపాలను వేగవంతం చేయాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. మాస్క్ ధారణ, సామాజిక దూరం నిబంధన పాటింపు తదితరాలను తప్పనిసరి చేయడమే కాకుండా తూచా తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే తీవ్ర శ్వాసకోశ వ్యాధులు లేదా ఇన్ఫ్లూయెంజా వంటి అనారోగ్యాలపై నిఘా పెట్టాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో శుక్రవారం 3,493 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 1,01,141కి చేరాయి. వీటిలో 49,616 నిర్ధారిత కేసులు కాగా, మృతుల సంఖ్య 3,717గా ఉంది. ఒక్క ముంబై నగరంలోనే 55,451 కరోనా వైరస్ కేసులు నమోదవగా, ఇప్పటిదాకా 2,044 మంది మరణించారు. రాష్ట్రంలోని ప్రైవేటు ప్రయోగశాలల్లో కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష (RT-PCR)కు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.2,200 గరిష్ఠ ధరను నిర్ణయించింది. కాగా, ఇది ఇంతకుముందు రూ.4,400గా ఉంది.
- గుజరాత్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 495 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 22,562కు పెరిగింది. కేంద్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ హస్ముఖ్ అధియా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఆర్థిక పునరుద్ధరణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించింది, కోవిడ్ అనంతర ఆర్థిక పునరుజ్జీవనం దిశగా దృష్టి సారించాల్సిన దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యూహాలపై ఇందులో 231 సూచనలు చేశారు.
- రాజస్థాన్: రాష్ట్రంలో ఈ ఉదయందాకా 118 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో రాజస్థాన్‌లో మొత్తం కేసులు 12,186కు పెరిగాయి. ఇప్పటిదాకా 275 మంది మరణించగా, 9175 మంది కోలుకున్నారని, వీరిలో 8784 మంది డిశ్చార్జ్ అయ్యారని అధికారిక సమాచారం పేర్కొంటోంది. ఇక కొత్త కేసుల్లో అధికశాతం భరత్‌పూర్, పాలి జిల్లాల్లో నమోదవగా జైపూర్ మూడో స్థానంలో ఉంది.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 202 మందికి కోవిడ్-19 నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 10,443కు పెరిగింది. కాగా, 9మంది రోగులు మరణించడంతో మృతుల సంఖ్య 440కి చేరింది. మధ్యప్రదేశ్‌లో మే 31 న దిగ్బంధం ఆంక్షలు సడలించిన తర్వాత రోగుల సంఖ్య 2,354 మేర పెరిగిన నేపథ్యంలో 90 మరణాలు నమోదయ్యాయి.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో 47 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1445కు పెరిగింది.
- అరుణాచల్ ప్రదేశ్: ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ‘స్థానికానికి ఊనిక’ స్ఫూర్తితో రాష్ట్రంలోని తవాంగ్ జిల్లా స్థూలోత్పత్తి (DDP) పనితీరుపై చర్చించేందుకు ఒక సమావేశం నిర్వహించారు. కాగా, స్వయం సమృద్ధ భారతం ప్యాకేజీ కింద అరుణాచల్ ప్రదేశ్‌కు వలసవచ్చిన వారికోసం మే, జూన్ నెలలకుగాను 35 టన్నుల శనగపప్పు సరఫరా చేయబడింది.
- అసోం: రాష్ట్రంలో 25 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 3718కి చేరాయి. వీటిలో యాక్టివ్ కేసులు 2123, కోలుకున్నవి 1584, మరణాలు 8గా ఉన్నాయి.
- మణిపూర్: రాష్ట్రంలో కేసులు పెరగడానికి ప్రధాన కారణం క్రమశిక్షణ లేకపోవడమేనని మేత్రామ్‌లోని యునాకో స్కూల్‌లో కొత్త కోవిడ్-19 సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
- మిజోరం: రాష్ట్రంలోని సెర్చిప్ జిల్లావ్యాప్తంగాగల నిర్బంధవైద్య పర్యవేక్షణ కేంద్రాలకోసం చెకాన్ గ్రామానికి చెందిన మిజోరం రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ పరిధిలోని గ్రామీణ సంస్థ వివిధ రకాల కూరగాయలను సెర్చిప్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు విరాళంగా అందజేసింది.
- నాగాలాండ్: కోవిడ్-19 అనంతరం రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తికి ఉత్తేజమిచ్చే దిశగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలో ఒక్కొక్కటి వంతున ఆదర్శ వ్యవసాయ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నాగాలాండ్ వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇక ప్రపంచ మహమ్మారి సవాళ్లు విసిరిన ప్రస్తుత సమయంలో రాష్ట్ర పౌరులందరి మానసిక శ్రేయస్సుపై అంచనా కోసం రాష్ట్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ సర్వే నిర్వహిస్తోంది.
- సిక్కిం: సిక్కింలో కోవిడ్-19 నిర్ధారణ అయిన తొలి ఇద్దరు వ్యక్తులు ఎస్టీఎన్ఎమ్ ఆసుపత్రిలో చికిత్స పొందిన నేపథ్యంలో పూర్తిగా కోలుకుని ఇవాళ ఆస్పత్రినుంచి ఇళ్లకు వెళ్లారు.
- కేరళ: రాష్ట్రంలో ఆదివారాల కోసం దిగ్బంధం ఆంక్షలలో ప్రభుత్వం కొన్ని సడలింపులు ప్రకటించింది. ఇక జూన్ 20 నుంచి చార్టర్డ్ విమానాలద్వారా రాష్ట్రానికి తిరిగివచ్చే ప్రవాసులకు కోవిడ్-19 పరీక్ష సర్టిఫికెట్లను తప్పనిసరి చేసింది. ఈ మేరకు ప్రయాణం ముగిసిన 48 గంటల్లోగా పరీక్ష నివేదికను అందజేయాలి. అయితే, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ఆచరణసాధ్యం కానిదని విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ పేర్కొన్నారు. కాగా, మరో 8 మంది కేరళీయులు- గల్ఫ్ దేశాల్లో ఐదుగురు, న్యూఢిల్లీలో ఇద్దరు, ముంబైలో ఒకరు వంతున మరణించారు. దీంతో ఇప్పటిదాకా గల్ఫ్ దేశాల్లో మరణించిన మలయాళీల సంఖ్య 220కి పెరిగింది. కాగా, నిన్న రాష్ట్రంలో 78 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో 1,303 మంది చికిత్స పొందుతుండగా 2,27,402 మంది పరిశీలనలో ఉన్నారు.
- తమిళనాడు: పుదుచ్చేరిలో 13 కొత్త కేసులు నమోదు కాగా, వీరిలో ఒకే కంపెనీకి చెందిన ఐదుగురు కార్మికులున్నారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో 91 యాక్టివ్ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 176కు పెరిగింది. కోలుకున్నవారిలో 82 మంది డిశ్చార్జ్ కాగా, మూడు మరణాలు సంభవించాయి. ఇక తమిళనాడులో మరో ఎమ్మెల్యే (అన్నా డీఎంకే) కోవిడ్-19 బారిన పడినట్లు ఇవాళ నిర్ధారణ అయింది. కాగా, డీఎంకే ఎమ్మెల్యే జె.అన్బళగన్ ఇటీవల కోవిడ్‌తో మరణించిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో 1982 కొత్త కేసులు రాగా, 1342 మంది కోలుకున్నారు; 18 మరణాలు నమోదయ్యాయి. చెన్నైలో నిన్నటిదాకా 1477 కేసులు రాగా, మొత్తం కేసులు: 40698కి చేరాయి. యాక్టివ్ కేసులు: 18281, మరణాలు: 367, చెన్నైలో యాక్టివ్ కేసులు: 13906గా ఉన్నాయి.
- కర్ణాటక: రాష్ట్రంలో పరీక్షల ప్రక్రియ క్రమబద్ధీకరించబడిందని వైద్యవిద్యాశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ చెప్పారు. ఇక పరీక్షలు ఆలస్యం కాబోవని, ఐసీఎంఆర్ విధివిధానాల ప్రకారం అనుమానిత కేసుల పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి ప్రభావంతో పర్యాటక రంగంపై ప్రత్యక్షంగా- పరోక్షంగా ఆధారపడిన కనీసం 3 లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కాగా, నిన్న రాష్ట్రంలో 271 కొత్త కేసులు రాగా, 464 మంది డిశ్చార్జి అయ్యారు; ఏడు మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మొత్తం నిర్ధారిత కేసులు: 6516, క్రియాశీల కేసులు: 2995, మరణాలు: 79, కోలుకున్నవి: 3440గా ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 14,477 నమూనాలను పరీక్షించగా, 186 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 42 మంది డిశ్చార్జ్ కాగా, రెండు మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 4588. యాక్టివ్: 1865, రికవరీ: 2641, మరణాలు: 82గా ఉన్నాయి.
- తెలంగాణ: రాష్ట్రంలో విద్యాసంస్థలను తిరిగి తెరవడంపై అనిశ్చితి నెలకొన్నప్పటికీ, అనేక ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే వర్చువల్ తరగతులను ప్రారంభించగా, కొన్ని సోమవారం నుంచి ప్రారంభించే యోచనలో ఉన్నాయి. రాష్ట్రం మరోసారి పూర్తి దిగ్బంధం దిశగా పయనిస్తున్నట్లు వస్తున్న కథనాలతో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ వాసులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇది వదంతి మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. వరంగల్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరికి వ్యాధి నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో వైరస్‌బారిన పడిన తొలి శాసనసభ్యుడుగా రికార్డులకెక్కారు. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం కేసులు 4,484 కాగా, యాక్టివ్ కేసులు 2032; మరణాలు 174గా ఉన్నాయి.
FACT CHECK



*****
(Release ID: 1631462)
Visitor Counter : 461
Read this release in:
English
,
Urdu
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam