ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ, టాంజానియా అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ జాన్ పోంబే జోసెఫ్ మాగుఫులీ మధ్య టెలిఫోన్ సంభాషణ

Posted On: 12 JUN 2020 8:29PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈరోజు టాంజానియా అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ జాన్ పోంబే జోసెఫ్ మాగుఫులీ తో టెలిఫోన్ లో మాట్లాడారు. 

ప్రధానమంత్రి తాను 2016 జూలై నెలలో చేసిన దార్-ఎస్-సలాం పర్యటనను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.  టాంజానియాతో కొనసాగుతున్న సాంప్రదాయక, స్నేహపూర్వక సంబంధాలకు భారతదేశం ఎంత ప్రాముఖ్యతనిచ్చిందో, ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.  టాంజానియా ప్రభుత్వం మరియు ప్రజల ఆకాంక్షలు మరియు అవసరాలకు అనుగుణంగా టాంజానియాను దాని అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామ్యం చేయడానికి భారతదేశం యొక్క నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.

కోవిడ్-19 నేపథ్యంలో టాంజానియా నుండి భారతీయ పౌరులను తరలించడానికి టాంజానియా అధికారులు అందించిన సహాయానికి అధ్యక్షుడు డాక్టర్ మాగూఫులీ కి, ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

రెండు దేశాల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక సంబంధాలను ఇరువురు నాయకులు సమీక్షించారు.  భారతదేశం మరియు టాంజానియా మధ్య పెరుగుతున్న అభివృద్ధి భాగస్వామ్యం, విద్యా సంబంధాలు, వాణిజ్యం మరియు పెట్టుబడి వంటి అంశాలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ పరిస్థితులను మరింత వేగవంతం చేసే అవకాశాలపై కూడా వారు చర్చించారు.

ఈ ఏడాది చివర్లో టాంజానియాలో జరగబోయే అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలకు గౌరవనీయులు అధ్యక్షుడు మాగుఫులీకి, టాంజానియా ప్రజలకూ, ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

*****(Release ID: 1631280) Visitor Counter : 34