ఆయుష్

‘నా జీవితం, నా యోగా’ వీడియో బ్లాగింగ్ పోటీకి దరఖాస్తు చేసుకునే గడువును 2020 జూన్ 21వ తేదీ వరకు పొడిగించబడింది

Posted On: 13 JUN 2020 10:14AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇటీవల ప్రకటించిన వీడియో బ్లాగింగ్ పోటీ ‘నాజీవితం, నా యోగా' కోసం దరఖాస్తులు సమర్పించడానికి గడువు తేదీని 2020 జూన్ 21వ తేదీ వరకు పొడిగించారు.  6 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డిజిటల్ వేదికపై ఈ అంతర్జాతీయ పోటీని, ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు సాంస్కృతిక సంబంధాల భారతీయ మండలి (ఐ.సి.సి.ఆర్) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

ఇంతకు ముందు, ఈ  పోటీకి దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీని 2020 జూన్ 15 గా నిర్ణయించడం జరిగింది.  ఈ గడువును పొడిగించాలని భారతదేశం మరియు విదేశాల నుండి పలు విజ్ఞప్తులు వచ్చాయి.  తద్వారా ఈ పోటీలో పాల్గొనేవారికి వీడియోలను సిద్ధం చేయడానికి మరింత సమయం లభిస్తుంది.  అందువల్ల, జూన్ 21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పోటీల గడువు తేదీని ఆ రోజు వరకు పొడిగించాలని మంత్రిత్వ శాఖ మరియు ఐ.సి.సి.ఆర్.  నిర్ణయించాయి.

మే 31వ తేదీన జాతినుద్దేశించి ప్రసంగించిన "మన్-కీ-బాత్" ప్రసంగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ,   ‘నాజీవితం, నా యోగా'   వీడియో బ్లాగింగ్ పోటీలో పాల్గొనాలని అందరికీ పిలుపునిచ్చారు.  వ్యక్తుల జీవితాలపై యోగా యొక్క ప్రభావంపై దృష్టి పెట్టే విధంగానూ, 6 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలలో ఒకటిగానూ, ఈ పోటీని ఏర్పాటుచేయడం జరిగింది. 

పోటీలోకి ప్రవేశించడానికి, పాల్గొనేవారు 3 యోగ అభ్యాసాల (క్రియ, ఆసనం, ప్రాణాయామం, బంధ లేదా ముద్ర) యొక్క 3 నిమిషాల వ్యవధి వీడియోను అప్‌లోడ్ చేయాలి, ఇందులో యోగ అభ్యాసాలు వారి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయో అనే చిన్న వీడియో సందేశం కూడా జత చేయాలి.  పోటీ హాష్ ట్యాగ్ #MyLifeMyYogaINDIA మరియు తగిన కేటగిరీ హ్యాష్ ‌ట్యాగ్ ‌తో వీడియోను ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లేదా మైగోవ్ ప్లాట్‌ఫామ్ ‌లో అప్ ‌లోడ్ చేయవచ్చు.

ఈ పోటీలో పాల్గొనడానికి అవసరమైన  వివరణాత్మక మార్గదర్శకాలను ఆయుష్ మంత్రిత్వ శాఖ యొక్క యోగా పోర్టల్‌లో చూడవచ్చు. 

(https://yoga.ayush.gov.in/yoga/).

ఈ పోటీ రెండు దశల్లో ఉంటుంది.   మొదటి దశ కింద వివిధ దేశాల స్థాయిలో  వీడియో బ్లాగింగ్ పోటీని నిర్వహిస్తారు. ఇందులో విజేతలు దేశ స్థాయిలో ఎంపిక చేయబడతారు.  దీని తరువాత ప్రపంచ స్థాయి పోటీ ఉంటుంది.  ఈ దశలో బహుమతి విజేతలను  వివిధ దేశాల విజేతల నుండి ఎంపిక చేస్తారు.  వ్యక్తులపై యోగా యొక్క ప్రభావాన్ని అన్వేషించే ప్రయత్నంలో భాగంగా ఈ పోటీని నిర్వహించడం జరుగుతోంది. అభ్యర్థులు సమర్పించిన వీడియోలోని అంశాలను బట్టి ఈ ఎంపిక ఉంటుంది. 

ఈ పోటీలో పాల్గొనేవారు 3 విభాగాల కింద యువత (18 ఏళ్లలోపు), పెద్దలు (18 ఏళ్లు పైబడినవారు) మరియు యోగా నిపుణులు, పురుషులు మరియు ఆడవారు తమ ఎంట్రీలను విడిగా సమర్పించవచ్చు.  భారతీయ పోటీదారులకు, ప్రతి విభాగంలో 1, 2 మరియు 3 వ ర్యాంకు గెలుచుకున్న వారికి వరుసగా  1 లక్ష, 50,000 మరియు 25,000 రూపాయల చొప్పున నగదు బహుమతులను మొదటి దశలో ప్రకటిస్తారు.  అదే, అంతర్జాతీయ స్థాయిలో, ప్రతి విభాగంలో 1, 2 మరియు 3 వ ర్యాంకు గెలుచుకున్న వారికి వరుసగా 2,500, 1,500 మరియు 1,000 అమెరికా డాలర్లు చొప్పున నగదు బహుమతులను ప్రకటించారు.  

ఆయుష్ మంత్రిత్వ శాఖ పొడిగించిన సమయాన్ని ఉపయోగించుకోవాలని మరియు మరింత ఆలస్యం చేయకుండా వీడియోలను సమర్పించాలని అందరినీ ఆహ్వానిస్తుంది.

*****(Release ID: 1631375) Visitor Counter : 68