ప్రధాన మంత్రి కార్యాలయం

ఐసిసి 95వ వార్షిక ప్లీనరీ ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆంగ్లప్రసంగం పూర్తి భాగం

Posted On: 11 JUN 2020 12:54PM by PIB Hyderabad

నమస్కారం. 
మీరంతా పూర్తి శక్తితో ఉన్నారని ఆశిస్తాను. ఒక దేశానికి 95 సంవత్సరాలు నిరాటంకంగా సేవ చేయడం అంటే ఏ సంస్థ చరిత్రలో అయినా పెద్ద ఘట్టమే. తూర్పు భారతంలో ప్రత్యేకించి ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకించి తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఐసిసి, ఇండియన్ చాంబర్ ఆఫ్ కాంగ్రెస్ ఎంతో కృషి చేసింది. ఇది ఎంతో చారిత్రకం. ఇందుకు తమ వంతు కృషి చేసిన ప్రముఖులు ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు.

మిత్రులారా, 
1925లో ఏర్పాటైన నాటి నుంచి భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ఐసిసి ప్రత్యక్షంగా తిలకించింది. భారత వృద్ధి పథంలో భాగం అయిన తీవ్ర దుర్భిక్షాలు, ఆహార సంక్షోభాలు ఎన్నో చూసింది. 

బహుళ సవాళ్లను దేశం ఎదుర్కొంటున్న సమయంలో ఈ రోజు ఈ ఎజిఎం జరుగుతోంది. కరోనా వైరస్ పై యావత్ ప్రపంచం పోరాటం చేస్తోంది. భారతదేశం కూడా అవిశ్రాంతంగా పోరాటం సాగిస్తోంది. కొత్త కొత్త సవాళ్లు కూడా ఎప్పటికప్పుడు తెర పైకి వస్తున్నాయి. 

ఒక చోట ఆహారం కొరత, మరో చోట మిడతల దండు సమస్య, ఇంకో చోట సుడిగాలులు...మరికొన్ని ప్రదేశాల్లో చమురు బావుల్లో మంటలు, పలు స్వల్ప భూప్రకంపనలు ఇలా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. వీటన్నింటికీ తోడు ఒక దాని వెనుకగా ఒకటి చొప్పున రెండు తుపానులు తూర్పు, పడమటి ప్రాంతాల్లో సంభవించి పెను సవాలు విసిరాయి.

అన్నింటి పైన మనం కలసికట్టుగా పోరాటం సాగిస్తున్నాం. తరచుగా కాలం మనని పరీక్షిస్తూ ఉంటుంది. కొన్ని సార్లు ఎన్నో సవాళ్లు, కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టి దాడి చేస్తాయి. 

కాని అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడల్లా మర ధోరణి ఒక్కటే మనకి ఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది. అలాంటి సవాళ్లను మనం ఎంత దీటుగా ఎదుర్కొంటున్నాం, కష్టాలపై ఎంత సంకల్పశుద్ధితో పోరాడుతున్నాం అనేది మన ముందుకు రాబోయే అవకాశాలను నిర్ణయిస్తుంది. 

మిత్రులారా, 
ఒక నానుడి ఉంది. మనం ఆత్మస్థైర్యం, సంకల్పాలే మనకి ముందుదారి చూపుతాయి ( मन के हारे हार, मन के जीते जीत) అన్నదే ఆ నానుడి. ఈ రోజున కూడా ఎవరైతే ఓటమిని అంగీకరిస్తారో వారి ముందు కొద్ది అవకాశాలు మాత్రమే మిగులుతాయి. అలాగే ఎవరైతే విజయం సాధించడం కోసం శ్రమిస్తూ అచంచల విశ్వాసంతో ముందుకు సాగుతారో, ప్రతీ ఒక్కరికీ ఎంతగా మద్దతు ఇస్తారో అంతగా వారి ముందు పలు అవకాశాలు వచ్చి వాలుతాయి.

మిత్రులారా, 
మన సంఘీభావం, మన స్ఫూర్తి ఎంతో కష్టమైన సవాళ్లను కలిసికట్టుగా పోరాడే శక్తిని అందిస్తున్నాయి. మన సంకల్పం, మన ఆత్మస్థైర్యం జాతికి పెద్ద బలం. 
బలంగా నిలవడమే ఎంత కష్టానికైనా సరైన పరిష్కారం.  అత్యంత కష్టసమయాలు వచ్చినప్పుడల్లా భారతదేశ సంకల్పాన్ని పటిష్ఠం చేస్తూ వస్తున్నాయి. తద్వారా ఆ బలం, శక్తి దేశప్రజలందరూ ఒక జాతిగా నిలిచే సంకల్పం అందిస్తున్నాయి. మీ అందరి ముఖాల్లోనూ, కోట్లాది దేశ ప్రజల ప్రయత్నంలోనూ అదే భావాన్ని నేను చూడగలుగుతున్నాను. కరోనా సంక్షోభం ప్రపంచం అంతటా ఉంది. యావత్ ప్రపంచం పోరాడుతోంది. కరోనా పోరాట యోధుల సహాయంతో మన దేశం కూడా పోరాడుతోంది. 

అన్నింటి కన్నా మిన్నగా ఈ రోజున భారత పౌరుల్లో ప్రతీ ఒక్కరూ ఈ వైపరీత్యాన్ని అవకాశంగా మలుచుకోవాలన్న సంకల్పం కనబరుస్తున్నారు. మనందరం దేశానికి ఒక పెద్ద మలుపును అందించాల్సిన సమయం ఇది.

ఈ మలుపు ఏది?  అదే “ఆత్మనిర్భర్ భారత్, స్వయంసమృద్ధ భారత్”. ఎన్నో సంవత్సరాలుగా ప్రతీ ఒక్క భారతీయునిలోనూ ఈ స్వయంసమృద్ధి భావమే తొణికిసలాడుతోంది. 

కాని ప్రతీ ఒక్క భారతీయుని మనసులోనూ ఒక పెద్ద ఆకాంక్ష ఉంది. వైద్యపరికరాల విభాగంలో మనం స్వయంసమృద్ధి సాధించాలని నేను కోరుతున్నాను. అలాగే రక్షణ ఉత్పత్తుల తయారీలో, బొగ్గు, ఖనిజ రంగాల్లో స్వయంసమృద్ధిని కోరుతున్నాను. 

వంటనూనెలు, ఎరువుల విభాగాల్లో స్వయంసమృద్ధి ఆకాంక్షిస్తున్నాను. ఎలక్ర్టానిక్స్ తయారీ, సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీల తయారీ, చిప్ తయారీల్లో స్వయంసమృద్ధి సాధించాలని కోరుతున్నాను. విమానయాన రంగంలో స్వయంసమృద్ధి ఆకాంక్షిస్తున్నాను. ఇలా లెక్కలేనన్ని ఆకాంక్షలు, కోర్కెలు ప్రతీ ఒక్క భారతీయుని మనసును కుదిపివేస్తున్నాయి.

మిత్రులారా,
గత ఐదారేళ్లుగా భారత విధానాలు, ఆచరణలు అన్నింటిలోనూ ఈ స్వయంసమృద్ధ భారత ఆవిష్కారమే మహోన్నత లక్ష్యంగా ఉంది. ఈ రోజున కరోనా వైరస్ ఆ లక్ష్యంలో వేగం ఎంతగా పెంచాలో మనకి బోధించింది. ఈ బోధన నుంచే ఆత్మనిర్భర్ భారత్ప్రచారం ఆవిర్భవించింది.  

మిత్రులారా,
కుటుంబాల్లో కూడా మనం దీన్ని చూస్తూ ఉంటాం. కుమారుడు, కుమార్తె ఎవరైనా ఒక బిడ్డ పెరిగి పెద్దవారైతే స్వతంత్రంగా, స్వయం సమృద్ధంగా ఉండడం నేర్చుకోమని మనం చెబుతూ ఉంటాం. అలా స్వయంసమృద్ధ భారత్ బోధన మొదట కుటుంబం నుంచే ప్రారంభం అవుతుంది. భారతదేశం కూడా స్వయంసమృద్ధి సాధించాలన్నదే ఆ సంకల్పం లక్ష్యం.

మిత్రులారా,
తేలికమాటల్లో చెప్పాలంటే “ఆత్మనిర్భర్ భారత” ప్రచారం అంటే విదేశాలపై ఆధారనీయతను భారతదేశం తగ్గించుకోవడమే. మన దేశం తప్పనిసరిగా దిగుమతి చేసుకుంటున్న అన్నింటినీ దేశంలోనే తయారుచేసుకోవడం నేర్చుకోవాలి. అలాగే భవిష్యత్తులో ఆ వస్తువుల ఎగుమతిదారుగా పరివర్తన చెందే దిశగా మనం కృషి చేయాలి.

అంతే కాదు, మన దేశంలో చిన్న తరహా పారిశ్రామికులు, వృత్తి కళాకారులు, హస్తకళాకారులు, కోట్లాది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న స్వయం సహాయక బృందాలు దశాబ్దాలుగా తయారుచేస్తున్న, విక్రయిస్తున్న ఉత్పత్తులన్నింటి దిగుమతిని మనం నియంత్రించాలి. కొన్ని వస్తువులు విదేశాల నుంచి తెచ్చుకునే ధోరణిని మనం అదుపు చేసుకోవాలి.

దీన్ని ఆచరించడం ద్వారా మనం చిన్న పారిశ్రామికులు తయారుచేసిన వస్తువులు కొనుగోలు చేయడమే కాదు, తద్వారా మనం వారికి డబ్బు అందిస్తున్నాం. వారి శ్రమశక్తిని గౌరవిస్తున్నాం, వారి పట్ల గౌరవం ప్రదర్శిస్తున్నాం. ఈ ఒక్క సుహృద్భావపూర్వకమైన పని వారి హృదయాల్లో ఎంత గాఢమైన ముద్ర వేస్తుందో, వారు ఎంత గర్వపడతారో మనం ఊహించడం కూడా చేయలేం.

అందుకే స్థానికమే నినాదంగా మార్చుకునే సమయం ఇది. ప్రతీ ఒక్క గ్రామం, ప్రతీ ఒక్క పట్టణం, ప్రతీ ఒక్క జిల్లా, ప్రతీ ఒక్క రాష్ట్రం, యావత్ దేశం ఇందుకు సిద్ధం కావాలి.

మిత్రులారా,
స్వామి వివేకానంద ఒక లేఖలో ఇలా రాశారు. భారతీయులు తయారుచేసిన వస్తువులే వినియోగించడం, భారతీయ కళావస్తువులకు మార్కెట్ కల్పించడమే ఇప్పుడు మనం చేయవలసిన తేలికపాటి కృషి. స్వామి వివేకానందుడు చూపిన ఈ మార్గమే కోవిడ్ అనంతర ప్రపంచంలో భారతదేశానికి స్ఫూర్తి కావాలి. ఇప్పుడు దేశం ఆ ప్రతిజ్ఞనే చేసింది, ఆ దిశగా అడుగులు వేస్తోంది. 

ఆత్మనిర్భర్ భారత్ ప్రచారంలో ప్రకటించిన సంస్కరణలన్నింటినీ త్వరితంగా అమలు పరుస్తున్నాం. 

ఎంఎస్ఎంఇల నిర్వచనాన్ని విస్తరించడం లేదా ఎంఎస్ఎంఇలకు కోట్లాది రూపాయల్లో ప్రత్యేక నిధులు కేటాయించడం వంటివన్నీ ఈ రోజున వాస్తవం అవుతున్నాయి.  ఐబిసికి సంబంధించిన నిర్ణయం కావచ్చు, చిన్న చిన్న పొరపాట్లను నేరాల జాబితా నుంచి తొలగించడం కావచ్చు, పెట్టుబడి ప్రతిపాదనలు త్వరితగతిన అమలు చేయడానికి ప్రాజెక్టు డెవలప్ మెంట్ విభాగాలు ఏర్పాటు చేయడం కావచ్చు...ఇలాంటి పనులెన్నో చేపట్టడం జరిగింది.

ఈ రోజున బొగ్గు, ఖనిజ రంగం సహా భిన్న రంగాలను పోటీకి సంసిద్ధం చేయడానికి, ప్రకటించిన సంస్కరణల నుంచి పూర్తి లాభం పొందడానికి పరిశ్రమ ముందుకు రావాలి. యువమిత్రులు కూడా ముందుకు రావాలి.

మిత్రులారా, 
రైతాంగం కోసం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బానిసత్వం నుంచి విముక్తం చేశాయి. ఈ రోజున రైతన్నలు దేశంలో ఎక్కడైనా తమ ఉత్పత్తులు విక్రయించుకునే స్వేచ్ఛ పొందారు.

ఎపిఎంసి చట్టం, నిత్యావసర వస్తువుల చట్టంలో సవరణలు రైతాంగం, పరిశ్రమ భాగస్వామ్యాలకు అవకాశాలు తెరిచాయి. రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం ఖాయం. ప్రభుత్వ నిర్ణయాలు రైతును ఉత్పత్తిదారుగాను, అతని పంటలను ఉత్పత్తిగాను గుర్తించాయి.

మిత్రులారా,
రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయడం కావచ్చు, ఎంఎస్ పి కల్పించడం కావచ్చు, పింఛన్లు అందించడం కావచ్చు మా ప్రయత్నాలన్నీ రైతులను సాధికారం చేసేవే. ఈ రోజున రైతులు అతి పెద్ద మార్కెట్ శక్తిగా మారడానికి సహాయం అందుతోంది.

మిత్రులారా,
స్థానిక ఉత్పత్తుల కోసం ఈ రోజున అనుసరిస్తున్న క్లస్టర్ ఆధారిత విధానం ప్రతీ ఒక్కరికీ అవకాశం కల్పిస్తుంది. ఏ జిల్లాలో, ఏ బ్లాక్ లో ఏవి ఉత్పత్తి అవుతాయో వాటికి సంబంధించిన క్లస్టర్ సమీపంలో ఏర్పాటవుతుంది. ఉదాహరణకి గోగునారకు సంబంధించిన పరిశ్రమలు  పశ్చిమ బెంగాల్ సమీపంలోని రైతులను శక్తివంతం చేశాయి. 

అపారమైన అటవీ ఉత్పత్తులను సేకరించే గిరిజనుల కోసం వారి సమీపంలో ఆధునిక ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. వాటికి తోడు వెదురు, ఆర్గానిక్ ఉత్పత్తుల క్లస్టర్లు కూడా అభివృద్ధి చేస్తున్నాం. సిక్కిం సహా యావత్ ఈశాన్యం ఆర్గానిక్ వ్యవసాయ కేంద్రంగా మారనుంది. అక్కడ ఆర్గానిక్ రాజధాని అభివృద్ధి కానుంది.

ఐసిసికి చెందిన వ్యాపారులందరూ సంకల్పించుకుంటే ఈశాన్య ప్రాంతంలో ఆర్గానిక్ వ్యవసాయం ఒక పెద్ద ఉద్యమంగా మారుతుంది. మీరు అంతర్జాతీయ గుర్తింపు సాధించి ప్రపంచ మార్కెట్ లో ఆధిపత్యం పొందగలుగుతారు.

మిత్రులారా,
మీరంతా ఎన్నో దశాబ్దాలుగా ఈశాన్య, తూర్పు ప్రాంతాల్లో పని చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలన్నీ తూర్పు, ఈశాన్య రాష్ర్టాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కల్పిస్తాయి.
నా దృష్టిలో కోల్కతా మరోసారి అతి పెద్ద నాయకత్వ స్థానానికి ఎదుగుతుంది. గత వైభవం అందించే స్ఫూర్తితో కోల్కతా యావత్ ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి భవిష్యత్ నాయకత్వం వహిస్తుంది.

తూర్పు ప్రాంతంలోని కార్మికులు, సంపద, వనరుల బలంతో ఈ ప్రాంతం ఎంత వేగంగా ఎదుగుతుందో తెలిసిన వారు మీకన్నా ఎవరున్నారు! 

స్నేహితులారా ఐదు సంవ‌త్స‌రాల త‌ర్వాత అంటే 2025 నాటికి మీ సంస్థ ఏర్ప‌డి వందేళ్లు అవుతుంది. భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 2022 నాటికి 75 సంవ‌త్స‌రాల‌వుతుంది. కాబ‌ట్టి మీ సంస్థ‌కు, స‌భ్యుల‌కు ఒక గొప్ప నిర్ణ‌యం తీసుకోవ‌డానికి ఇదొక గొప్ప సంద‌ర్భం. ఐసిసికి నేను ఒక విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ ఉద్య‌మం కోసం ఐసిసి 50 -100 ల‌క్ష్యాల‌ను ఏర్ప‌రుచుకోవాల‌ని కోరుతున్నాను. 
ఈ ల‌క్ష్యాలు సంస్థ ప‌రంగా కూడా వుండాలి. ఐసిసికి సంబంధించిన ప్ర‌తి ప‌రిశ్ర‌మ‌,వ్యాపార సంస్థ‌, దీనికి సంబంధించిన ప్ర‌తి వ్య‌క్తికి ఈ ల‌క్ష్యాలు వుండాలి. మీరు ఈ ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చ‌డానికిగాను, మీ కృషిని వేగ‌వంతం చేసే కొద్దీ ఈ ఉద్య‌మం  ప్ర‌గ‌తి సాధిస్తుంది. తూర్పు భార‌త దేశంలో, ఈశాన్య భార‌తంలో వ్యాపిస్తుంది. 
స్నేహితులారా, త‌యారీ రంగంలో బెంగాల్ కు వున్న చారిత్రాత్మ‌క గొప్ప‌ద‌నాన్ని తిరిగి పున‌రుద్ధ‌రించాలి. ఈ రోజున బెంగాల్ ఆలోచించిన విష‌యాన్ని, రేప‌టి రోజున భార‌త‌దేశం ఆలోచిస్తుంది అనే స్ఫూర్తిదాయ‌క వాక్యాన్ని మ‌నం వింటూనే వున్నాం. దీన్నించి స్ఫూర్తి పొందుతూ మ‌నం ప్ర‌గ‌తి సాధించాలి. భార‌త‌దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను క‌మాండ్ అండ్ కంట్రోల్ స్థాయినుంచి ప్ల‌గ్ అండ్ ప్లే స్థాయికి తీసుకుపోవాలి. పాత‌కాల‌పు ధోర‌ణికి స్వ‌స్తి చెప్పి సాహ‌సోపేత నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి, భారీ పెట్టుబ‌డులు సాధించ‌డానికి ఇదే స‌మ‌యం. 
అంత‌ర్జాతీయ పోటీని త‌ట్టుకోగ‌లిగే స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ను భార‌త‌దేశంలో త‌యారు చేసుకోవ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం. 
ఇందుకోసం, ప‌రిశ్ర‌మ‌ల రంగం ముందుకొచ్చి త‌న రంగానికి సంబంధించిన‌వారికి చేయూత‌నందించి సాయం చేయాలి.ఈ సంక్షోభాన్నించి బైట‌ప‌డ‌డానికి కృషి చేయాలి. 
స్నేహితులారా, 
ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ ఉద్య‌మాన్ని ముందుకు తీసుకుపోతూ, క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాటం చేస్తూనే ఈ ఏజిఎంలో మీరు ముందుకు తీసుకువ‌చ్చిన అంశం చాలా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ప్ర‌జ‌లు, భూగోళం, లాభాలు అనే ఈ అంశం చాలా ముఖ్య‌మైంది. ఈ మూడు ప‌ర‌స్పరం విరుద్ధ‌మైన‌వని కొంత‌మంది అనుకుంటారు. అయితే అదేమీ కాదు. ప్ర‌జ‌లు, భూగోళం‌, లాభాలు అనేవి ఒక‌దానితో మ‌రొక‌టి ముడిప‌డి వున్న‌వి. ఈ మూడు ఒకే స‌మ‌యంలో ఎదుగుతాయి, స‌హ‌జీవ‌నం సాగిస్తాయి. 
 లెడ్ బ‌ల్బుల‌కు సంబంధించిన మీకు ఒక ఉదాహ‌ర‌ణ ఇస్తాను. ఐదారు సంవ‌త్స‌రాల క్రితం లెడ్ బ‌ల్బు ధ‌ర రూ.350 కంటే ఎక్కువ వుండేది. ఇప్పుడు అదే బ‌ల్బు రూ. 50కి ల‌భిస్తోంది. మీరే ఆలోచించండి. లెడ్ బ‌ల్బుల ధ‌ర‌ను త‌గ్గించ‌డంవ‌ల్ల అవి దేశ‌వ్యాప్తంగా కోట్లాది కుటుంబాల‌కు చేరుకున్నాయి. వీటిని వీధి దీపాలుగా కూడా వాడుతున్నారు. వీటి సంఖ్య‌ భారీగా వుండ‌డంతో వీటి ఉత్ప‌త్తి వ్య‌యం బాగా త‌గ్గింది. అంతే కాదు లాభాలు కూడా పెరిగాయి. దీన్నించి ఎవ‌రు ల‌బ్ధి పొందారు?
ప్ర‌జ‌లు ల‌బ్ధి పొందారు. విద్యుత్ బిల్లు చాలా త‌క్కువ‌గా వుంటోంది. లెడ్ బ‌ల్బుల కార‌ణంగా ఈ రోజున ప్ర‌తి ఏడాది దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు రూ. 19 వేల కోట్ల రూపాయాల‌ను ఆదా చేయ‌గ‌లుగుతున్నారు. ఈ ఆదా అనేది దేశంలోని కోట్లాది మంది పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తోంది. 
అంతే కాదు ఈ నిర్ణ‌యం కార‌ణంగా భూగోళం కూడా ల‌బ్ధి పొందుతోంది. వీటిని దేశ‌వ్యాప్తంగా ప్ర‌భుత్వ సంస్థ‌లు అతి త‌క్కువ ధ‌ర‌కు విక్ర‌యిస్తున్నాయి. వీటి వినియోగం పెర‌గ‌డం వ‌ల్ల ప్ర‌తి ఏడాది 40 మిలియ‌న్ ట‌న్నుల కార్బ‌న్ డ‌యాక్స‌యిడ్ ఉద్గారాలు త‌గ్గాయి. 
కాబ‌ట్టి అటు ప్ర‌జ‌లు, ఇటు భూగోళం రెండూ ల‌బ్ధి చెందాయి. ఇది ఇద్దరికీ విజ‌యం. ఐదారు సంవ‌త్స‌రాలుగా మా ప్ర‌భుత్వం అమ‌లు చే్స్తున్న ప‌థ‌కాలు, నిర్ణ‌యాల‌ను తీసుకుంటే వీటి విష‌యంలో ప్ర‌జ‌లు, భూగోళం, లాభం అనే అంశం చాలా బ‌లంగా అమ‌ల‌వుతున్న‌ట్టు తెలుస్తుంది. 
 ఇక దేశంలోని నీటి ర‌వాణా మార్గాల‌కు ప్ర‌భుత్వం ఎందుకు అంత‌గా ప్రాధాన్య‌త ఇస్తుందో మీరు కూడా చూశారు. హ‌ల్దియానుంచి బ‌నార‌స్ వ‌ర‌కూ ర‌వాణామార్గం ప్రారంభ‌మైంది. ఈ దేశీయ నీటి ర‌వాణా మార్గాలు ఈశాన్య‌భార‌త‌దేశానికి విస్త‌రించ‌డం జ‌రుగుతోంది. 
ఈ నీటి ర‌వాణా మార్గాల కార‌ణంగా ఖ‌ర్చులు తగ్గి ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంది. వీటి కార‌ణంగా భూగోళానికి మేలు జ‌రుగుతుంది. దేశీయ జ‌ల ర‌వాణా మార్గాల‌కు ప్రాధాన్య‌త పెరగ‌డంవ‌ల్ల పెట్రోల్‌, డీజిల్ దిగుమ‌తి త‌గ్గుతుంది. రోడ్డు ర‌వాణాకు సంబంధించిన ట్రాఫిక్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఇక రవాణా ఖ‌ర్చులు త‌గ్గ‌డంవ‌ల్ల వ‌స్తువుల ధ‌ర‌లు త‌గ్గుతాయి. అంతే కాదు ఆయా వ‌స్తువులు తొంద‌ర‌గా గ‌మ్య‌స్థానాల‌కు చేరుతాయి. దీని ద్వారా ఇటు వ్యాపారులు, అటు వినియోగ‌దారులు ల‌బ్ధి పొందుతారు. 
స్నేహితులారా భార‌త‌దేశంలో ప్ర‌స్తుతం మ‌రో ఉద్య‌మం కొన‌సాగుతోంది. అదేంటంటే ఒక సారి వినియోగించే ప్లాస్టిక్ ను  నిషేధించ‌డ‌మ‌నే ఉద్య‌మం. ఈ విష‌యంలో కూడా ప్ర‌జ‌లు, భూగోళం, లాభాలు అనే అంశం ప్ర‌కార‌మే దీన్ని అమ‌లు చేయ‌డం జ‌రుగుతోంది. 
ఈ ప్లాస్టిక్ నిషేధం చాలా ముఖ్య‌మైన‌ది. ఇది ప‌శ్చిమ బెంగాల్ కు మ‌రింత మేలు చేస్తుంది. ఇక్క‌డ జూట్ వ్యాపారం బ‌లోపేతం కావ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్లాస్టిక్ నిషేధాన్ని మీరు లాభంగా మార్చుకుంటున్నారా?  జూట్ సాయంతో ప్యాకేజ్ మెటీరియ‌ల్ త‌యారు చేసుకుంటున్నారా?  ఒక రకంగా చెప్పాలంటే ఇది మీకు ఎంత‌గానో ల‌బ్ధి చేకూర్చే అంశంగా మారింది. 
ఈ అవ‌కాశాన్ని మీరు స‌ద్వినియోగం చేసుకొని మ‌రింత ముందుకు తీసుకుపోవాలి. దీన్ని ప‌ట్టించుకోక‌పోతే మీకు ఎవ‌రు సాయం చేయ‌గ‌ల‌రు?  కాబ‌ట్టి ఒక సారి ఆలోచించండి. ప‌శ్చిమ బెంగాల్ లో త‌యారైన జూట్ బ్యాగు దేశంలో అంద‌రి చేతుల్లో క‌నిపిస్తే.. అది ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌జ‌ల‌కు భారీగా లాభాల‌ను అందిస్తుంది.
స్నేహితులారా, మా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల కేంద్రంగా, ప్ర‌జ‌ల చేత, భూగోళహితంగా అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తోంది. ఇది మా పాల‌న‌లో భాగంగా మారింది. మా ప్ర‌భుత్వ హ‌యాంలో సాంకేతికంగా వ‌స్తున్న మార్పులు కూడా ప్ర‌జ‌లు, భూగోళం, లాభాలు అనే అంశానికి అనుగుణంగా వున్నాయి. 
యూపిఐ కార‌ణంగా బ్యాంకింగ్ రంగంలో పెను మార్పులు వ‌చ్చాయి. డ‌బ్బును ముట్టుకోకుండానే, న‌గ‌దుర‌హిత లావాదేవీలు నిరంత‌రం కొన‌సాగుతున్నాయి. భీమ్ యాప్ ద్వారా సాగుతున్న లావాదేవీలు రికార్డుల‌ను సృష్టిస్తున్నాయి. దేశంలోని పేద‌లు, రైతులు, మ‌ధ్య త‌ర‌గ‌తివారికి, అన్ని వ‌ర్గాల వారికీ రుపే కార్డు బాగా ద‌గ్గ‌రైంది. ప్ర‌జాద‌ర‌ణ పొందుతోంది. ఇప్పుడు మ‌నం స్వ‌యం స‌మృద్ధి భార‌త‌దేశం గురించి కూడా మాట్లాడుతున్నాం. కాబ‌ట్టి మ‌న రుపే కార్డును ఎంతో గ‌ర్వంగా భావించి దాన్ని  ఎందుకు ఉప‌యోగించ‌కూడ‌దు? 
స్నేహితులారా, దేశంలో చాలా కాలంపాటు సామాన్య ప్ర‌జ‌ల‌కు బ్యాంకింగ్ రంగం దూరంగా వుండేది. పేద‌ల‌కు బ్యాంకుల సేవ‌లు అందేవి కావు. అయితే ఈ ప‌రిస్థితి మా ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత మారింది. డిబిటి, జ‌న‌ధ‌న్ ఆధార్ మొబైల్ వ్య‌వ‌స్థ‌ల ద్వారా దేశంలోని కోట్లాది మంది ల‌బ్ధి దారులకు నేరుగా ల‌బ్ధి చేకూర్చ‌డం జ‌రుగుతోంది. ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఈ ప‌ని జ‌రుగుతోంది. 
అదే విధంగా ఎల‌క్ట్రానిక్ మార్కెట్ విధానంద్వారా అంటే గ‌వ‌ర్న‌మెంట్ ఇ మార్కెట్ ప్లేస్ ( జిఇఎం) ద్వారా ప్ర‌భుత్వంతో అనుసంధాన‌మై లాభాలు పొంద‌డానికి అవ‌కాశం ఏర్ప‌డింది. దేశంలోని చిన్న మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు తాము ఉత్ప‌త్తి చేసే వ‌స్తువుల‌ను, సేవ‌ల‌ను ఈ జిఇఎం వేదిక ద్వారా ప్ర‌భుత్వానికి విక్ర‌యించ‌డం జ‌రుగుతోంది. ఇదిగానీ లేక‌పోతే కొన్ని ల‌క్ష‌ల పెట్టుబ‌డితో మాత్ర‌మే ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేసుకున్న సంస్థ‌లు నేరుగా కేంద్ర ప్ర‌భుత్వానికి త‌మ వ‌స్తువుల‌ను, సేవ‌ల‌ను విక్ర‌యించ‌డం సాధ్యం కాదు. 
కాబ‌ట్టి ఐసీసీకి నా విజ్ఞ‌ప్తి ఏమిటంటే మీరు మీ స‌భ్యుల‌కు, అనుబంధ త‌యారీ దారీ సంస్థ‌ల‌కు చెప్పండి. ఎంత వీలైతే అంత ఎక్కువ‌గా జిఇఎంలో చేర‌మ‌ని చెప్పండి. మీకు సంబంధించిన ప్ర‌తి త‌యారీదారుడు ఇందులో చేరితే చిన్న చిన్న వ్యాపారులు త‌మ ఉత్ప‌త్తుల‌ను నేరుగా ప్ర‌భుత్వానికి విక్ర‌యించుకోవ‌చ్చు. 
స్నేహితులారా, భూగోళం గురించి మాట్లాడుకుంటున్నాం. ఐఎస్ ఏ అంటే అంత‌ర్జాతీయ సౌర వేదిక గురించి మీకు కూడా తెలుసు. ఇది అంత‌ర్జాతీయంగా ఒక అతి పెద్ద ఉద్య‌మం. సౌర విద్యుత్ ఉత్ప‌త్తి ద్వారా భార‌త‌దేశం పొందుతున్న ప్ర‌యోజ‌నాల గురించి ఇత‌ర దేశాల‌తో పంచుకోవ‌డానికి కృషి చేస్తున్నాం. ఈ సంద‌ర్భంగా ఇండియ‌న్ ఛాంబ‌ర్ ఆప్ కామ‌ర్స్ కు ఒక విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.  మ‌న దేశంలో పున‌: వినియోగ ఇంధ‌న రంగం, సౌర విద్యుత్ ఉత్ప‌త్తికి సంబంధించి ల‌క్ష్యాల‌ను అందుకోవ‌డానికిగాను మీరు మీ సేవ‌ల‌ని, పెట్టుబ‌డుల‌ను విస్తృతం చేయాల‌ని కోరుతున్నాను. 
నాణ్య‌మైన బ్యాట‌రీల త‌యారీకి సంబంధించి ఆర్ అండ్ డిలోను, త‌యారీలోను పెట్టుబ‌డులు పెట్టండి. త‌ద్వారా దేశంలోని సోలార్ ప్యానెల్ ప‌వ‌ర్ స్టోరేజీ సామర్థ్యాన్ని పెంచ‌డానికి దోహ‌దం చేయండి. ఈ ప‌నిలో ఇప్ప‌టికే వున్న చిన్న మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు, ఇంకా అలాంటి ఇత‌ర సంస్థ‌ల‌కు చేయూత ఇవ్వండి. మారుతున్న కాలంలో సోలార్ రీఛార్చ‌బుల్ బ్యాట‌రీలు ఒక పెద్ద మార్కెట్ గా అవ‌త‌రించ‌నున్నాయి. దీనికి భారతీయ ప‌రిశ్ర‌మ నేతృత్వం వ‌హించ‌గ‌ల‌దా?  ఈ రంగంలో భార‌త‌దేశం భారీ కేంద్రంగా మార‌గ‌ల‌దు. 
భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 2022 నాటికి 75 సంవ‌త్స‌రాల‌వుతుంది. ఐసిసి ఏర్పడి 2025 నాటికి వంద సంవ‌త్స‌రాల‌వుతుంది. ఈ సంద‌ర్భాల‌ను పుర‌స్క‌రించుకొని ఐసిసి, ఐసిసి స‌భ్యులు పైన తెలియ‌జేసిన అంశాల‌వారీగా ల‌క్ష్యాల‌ను ఏర్ప‌రుచుకొని కృషి చేయాల‌ని కోరుతున్నాను. 
స్నేహితులారా, అవ‌కాశాలను గుర్తించే స‌మ‌య‌మిది. మీ సామ‌ర్థ్యాల‌ను ప్ర‌ద‌ర్శించండి. నూత‌న శిఖ‌రాల‌ను అందుకోండి. ఇది అతి పెద్ద సంక్షోభం ...అయితే దీన్నించి అతి పెద్ద గుణ‌పాఠాలు నేర్చుకొని దీన్ని ఉప‌యోగించుకొని ఎద‌గాలి. 
ఈ ల‌క్ష్య సాధ‌నలో మీకు పూర్తిస్థాయిలో సాయం అందించ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా వుంది. నూతన నిర్ణ‌యాల‌తో స్వేచ్ఛ‌గా ముందుకు సాగండి. నూతన ఉత్సాహంతో అడుగులు వేయండి. స్వ‌యం స‌మృద్ధి భార‌త‌దేశ సాధ‌న‌కు... ఆత్మ‌విశ్వాసంతో అడుగులు వేసే భార‌త‌దేశ‌మే పునాదిగా వుంటుంది. 
గురుదేవులు ఠాగూర్ త‌న ప‌ద్యం నూతోన్ జెగేర్ భోర్ లో ఇలా అన్నారు. చోలాయ్ చొలాయ్ బాజ్బె జోయ‌ర్ భేరి, పాయేర్ బేగి పోత్ కెటె జాయ్ కోరిష్ నార్ దేరి అని అన్నారు. అంటే ప్ర‌తి ప్ర‌గ‌తిదాయ‌క అడుగును ప్ర‌క‌టిస్తాం. ప్ర‌గ‌తి సాధించే అడుగులు నూత‌న మార్గాన్ని సృష్టిస్తాయి. ఇక ఆల‌స్యం చేయ‌కండి అని దీని అర్థం. ఈ మంత్రం ఎంత గొప్ప‌దో ఒక సారి ఆలోచించండి. ముందడుగు వేసే పాదాలు ఒక నూత‌న మార్గాన్ని ఆవిష్క‌రిస్తాయి. ఎంతో గొప్ప స్ఫూర్తిదాయ‌క‌మైన మాట‌లు మ‌న ముందున్నాయి. ఇక ఆగే ప్ర‌స‌క్తే లేదు. 
మీరు మీ సంస్థ ఏర్ప‌డి వంద ఏళ్లు అయిన సంద‌ర్భంగా చేసుకోబోయే సంబ‌రాల నాటికి, దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 75 సంవ‌త్స‌రాలు నిండుతున్న స‌మ‌యానికి మ‌న దేశం స్వ‌యం స‌మృద్ధ భార‌త్ సాధ‌న‌లో ముంద‌డుగు వేస్తుంద‌ని నాకు న‌మ్మ‌కంగా వుంది.  
మ‌రోసారి మీ అంద‌రికీ నా శుభాశీస్సులు..
ఆరోగ్యంగా వుండండి, సుర‌క్షితంగా వుండండి
అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియజేసుకుంటూ..
 టేక్ కేర్‌..

***
 



(Release ID: 1631102) Visitor Counter : 195