ప్రధాన మంత్రి కార్యాలయం

భారత వాణిజ్య మండలి (ఐ.సి.సి) 2020 వార్షిక ప్లీనరీ సదస్సు లో ప్రసంగించిన - ప్రధానమంత్రి
మనం స్వావలంబన భారతదేశాన్ని నిర్మించాలి : ప్రధానమంత్రి

Posted On: 11 JUN 2020 2:37PM by PIB Hyderabad

భారత వాణిజ్య మండలి (ఐ.సి.సి) యొక్క 95 వ వార్షిక ప్లీనరీ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ ఈ రోజు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోపన్యాసం చేశారు. 

కోవిడ్-19 మహమ్మారి కి వ్యతిరేకంగా జరిగిన యుద్ధాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, మొత్తం ప్రపంచంతో పాటు భారతదేశం ధైర్యంగా ముందుకు వెళ్తోందని అన్నారు.  మిడుత దాడులు, వడగళ్ళు, ఆయిల్ రిగ్ మంటలు, చిన్న భూకంపాలు మరియు రెండు తుఫానుల వంటి విపత్తులతో పాటు దేశం అనేక ఇతర సమస్యలను ఎదుర్కుంటోందనీ, అయితే దేశం ఈ సమస్యలపై ఐకమత్యంతో పోరాడుతోందని ఆయన అన్నారు.

ఇలాంటి క్లిష్ట సమస్యలే భారతదేశాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  దృఢ సంకల్పం, సంకల్ప బలం మరియు ఐక్యత దేశాన్ని పటిష్టంగా నిలిపాయనీ, అవే దేశాన్ని అన్ని సంక్షోభాలతో సమర్ధవంతంగా పోరాడేలా చేస్తున్నాయని అభివర్ణించారు.  ఏదైనా సంక్షోభం మనకు స్వావలంబన భారతదేశాన్ని (ఆత్మ నిర్భర్ భారత్) నిర్మించడానికి ఒక మలుపుగా మార్చడానికి అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన అన్నారు.

స్వావలంబన దిశగా భారతదేశం :

చాలా సంవత్సరాలుగా స్వావలంబన అనేది భారతదేశానికి ప్రేరణగా ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

"ఇప్పుడు దేశంలోని ప్రతి గ్రామాన్నీ, ప్రతి జిల్లానూ స్వావలంబన దేశంగా మార్చే సమయం వచ్చింది." అని ఆయన అన్నారు.  భారతీయ ఆర్థిక వ్యవస్థను 'కమాండ్ అండ్ కంట్రోల్' పరిస్థితి నుండి నుండి బయటకు తీసి 'ప్లగ్ అండ్ ప్లే' విధానం వైపు మళ్లించాలని ఆయన పిలుపునిచ్చారు.

సాంప్రదాయిక విధానాల కోసం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే దేశీయ సప్లై చైన్ ను సిద్ధం చేయడానికి ధైర్యమైన నిర్ణయాలు మరియు ధైర్యమైన పెట్టుబడులకు ఇది సమయం అని ఆయన అన్నారు.  ఆత్మనిర్భర్ కావడానికి భారతదేశం సాధించాల్సిన రంగాల జాబితాను ఆయన రూపొందిస్తున్నారు. 

ప్రధానమంత్రి మాట్లాడుతూ “దేశం యొక్క విధానం మరియు ఆచరణలో స్వావలంబన లక్ష్యం చాలా ముఖ్యమైనది. దానిని ఎలా వేగవంతం చేయాలో,  కరోనా మహమ్మారి ఇప్పుడు మనకు ఒక పాఠం నేర్పింది.  ఈ పాఠం నుండే - ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారం ప్రారంభమైంది." అని చెప్పారు. 

భారతదేశం ప్రస్తుతం తప్పనిసరి పరిస్థితుల్లో దిగుమతి చేసుకుంటున్న అన్ని ఉత్పత్తులను మనం ఎగుమతి చేసే దిశగా మనందరం కృషి చేయాలి అని శ్రీ మోడీ అన్నారు. చిన్న వ్యాపారుల కృషిని ఆయన అభినందిస్తూ, మనం వారి నుండి స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు, మనం కేవలం వారి వస్తువులు, సేవలకు మాత్రమే ధర చెల్లించినట్లు కాదు, వారి సేవలను గుర్తించి, వారిని ప్రోత్సహిస్తున్నట్లుగా మనం భావించాలి. 

'ప్రస్తుతం పని చేయాల్సిన సరళమైన పద్ధతి ఏమిటంటే, భారతీయులు తమ సొంత ఉత్పత్తులను ఉపయోగించుకోవటానికి ప్రేరేపించడం మరియు ఇతర దేశాలలో భారతీయ ఉత్పత్తులకు మార్కెట్లు పొందడం' అని స్వామి వివేకానంద చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా ఉటంకిస్తూ - స్వామి వివేకానంద చూపిన ఈ మార్గం కోవిడ్ అనంతర ప్రపంచంలో భారతదేశానికి ప్రేరణ అని పేర్కొన్నారు. 

ఎం.ఎస్.‌ఎం.ఈ. ల నిర్వచనం యొక్క పరిధిని విస్తరించడం, ఎం.ఎస్.‌ఎం.ఈ. లకు మద్దతు ఇవ్వడానికి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయడం, ఐ.బి.సి.కి సంబంధించిన నిర్ణయం, పెట్టుబడులను వేగవంతం చేయడానికి ప్రాజెక్టు అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటుచేయడం వంటి ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారంలో ప్రకటించిన ప్రధాన సంస్కరణలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా  వివరించారు. 

ఎ.పి.ఎం.సి. చట్టానికి సవరణ :

వ్యవసాయ రంగంలో ఇటీవల తీసుకున్న విధాన నిర్ణయాలను ప్రధానమంత్రి ప్రశంసించారు. సంవత్సరాల తరబడి  పరిమితులను ఎదుర్కొంటున్న వ్యవసాయ ఆర్ధిక వ్యవస్థకు విముక్తి లభించిందని ఆయన అన్నారు.  ఇప్పుడు భారతదేశ రైతులకు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా విక్రయించే స్వేచ్ఛ లభించింది. 

సేంద్రీయ వ్యవసాయానికి ఈశాన్య ప్రాంతం కేంద్రంగా ఉంది

స్థానిక ఉత్పత్తులపై ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న క్లస్టర్ ఆధారిత విధానం అందరికీ అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన అన్నారు.  వీటితో సంబంధం ఉన్న క్లస్టర్‌లు వారు జన్మించిన జిల్లాల్లో, బ్లాక్‌లలో అభివృద్ధి చేయబడతాయి.  "దీనితో పాటు, వెదురు మరియు సేంద్రీయ ఉత్పత్తులకు కూడా క్లస్టర్లు తయారు చేయడం జరిగింది. సిక్కిం మాదిరిగా, మొత్తం ఈశాన్య ప్రాంతం సేంద్రీయ వ్యవసాయానికి  భారీ కేంద్రంగా రూపొందింది. " అని ఆయన చెప్పారు.  సేంద్రీయ వ్యవసాయం ప్రపంచ గుర్తింపుగా మారి ప్రపంచ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించినట్లయితే ఈశాన్య ప్రాంతం సేంద్రీయ వ్యవసాయానికి  భారీ ఉద్యమంగా మారగలదని ఆయన అన్నారు.

ప్రజలు, గ్రహం మరియు లాభం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి

తయారీ రంగంలో బెంగాల్ యొక్క చారిత్రక ఆధిపత్యాన్ని పునరుద్ధరించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.  "భారతదేశం రేపు ఏమి ఆలోచిస్తుందో, దాన్ని బెంగాల్ ఈ రోజే ఆలోచిస్తుంది"  అనే దాని నుండి ప్రేరణ పొంది, పారిశ్రామిక రంగం ముందుకు సాగాలని ప్రధానమంత్రి కోరారు.  ప్రజలు, భూగోళం మరియు లాభం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయని ఆయన అన్నారు.  ఈ మూడు ఏకకాలంలో కలిసి వృద్ధి చెందే అవకాశం ఉంది.   ఇంకా వివరంగా చెప్పాలంటే,  6 సంవత్సరాల క్రితం తో పోల్చితే ఎల్.‌ఈ.డీ. బల్బుల ధర తగ్గింపును ఆయన ఒక ఉదాహరణగా చెప్పారు.  దీనివల్ల,  ప్రతి సంవత్సరం విద్యుత్ బిల్లుల్లో సుమారు 19 వేల కోట్ల రూపాయలు  ఆదా అవుతోందని తెలిపారు.   అంటే, ఈ లాభం ఇటు ప్రజలకు అటు భూగోళానికీ చెందుతుంది.   గత 5-6 సంవత్సరాలలో ప్రభుత్వం తీసుకున్న ఇతర పథకాలు మరియు నిర్ణయాలు కూడా  ప్రజలు, భూ గ్రహం మరియు లాభాలు అనే భావనపైనే  ఆధారపడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.   జల మార్గాలను ఉపయోగించడం ద్వారా ప్రజలు ఎలా ప్రయోజనం పొందుతున్నారో, వస్తురవాణా ఖర్చును అది ఎలా తగ్గించిందో మరియు తక్కువ ఇంధన వినియోగం ద్వారా భూగోళానికి ఎంత ప్రయోజనం చేకూరిందో, ఆయన వివరించారు. 

ప్రజలతో ముడిపడిన, ప్రజలతో నడిచే, భూగోళానికి ప్రియమైన అభివృద్ధి విధానం 

ఆయన మరొక ఉదాహరణగా, "ఒక సారి వినియోగించే ప్లాస్టిక్ నుండి దేశానికి విముక్తి కలిగించాలానే ఉద్యమం"  గురించి ప్రస్తావించారు.   ఇది, పశ్చిమ బెంగాల్ లో జనపనార వ్యాపారం మరింతగా అభివుద్ధి చెందడానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మరింతగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పారిశ్రామిక రంగాన్ని కోరారు.  ప్రజలతో ముడిపడిన, ప్రజలతో నడిచే, భూగోళానికి ప్రియమైన అభివృద్ధి విధానాలు ఇప్పుడు దేశ పాలనలో భాగమయ్యాయని ఆయన అన్నారు.  " మన సాంకేతిక విధానాలు - ప్రజలు, భూగోళం మరియు లాభం అనే ఆలోచనా సరళికి అనుకూలంగా ఉన్నాయి. "

రూపే కార్డు మరియు యు.పి.ఐ. 

బ్యాంకింగ్ సేవలు ఇప్పుడు చేతులతో ముట్టుకోవలిసిన అవసరం లేకుండా, ఎవరినీ కలవాల్సిన అవసరం లేకుండా, నగదు లావాదేవీలు లేకుండా 24  గంటలూ అందుబాటులో ఉంటున్నాయని ప్రధానమంత్రి చెప్పారు.  భీమ్ యాప్ నుండి లావాదేవీలు ఇప్పుడు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. రూపే కార్డు ఇప్పుడు పేదలు, రైతులు, మధ్యతరగతి మరియు దేశంలోని ప్రతి వర్గానికి ఇష్టమైన కార్డుగా మారుతోంది.  స్వయం ప్రతిపత్తి గల భారతదేశాన్ని సృష్టించడానికి రూపే కార్డులను ఉపయోగించాలని ఆయన కోరారు.  డి.బి.టి, జే.ఏ.ఎమ్. (జన ధన్ ఆధార్ మొబైల్) ద్వారా ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా లక్షలాది మంది లబ్ధిదారులకు అవసరమైన సహాయాన్ని అందించడం సాధ్యమైందని ఆయన అన్నారు.

చిన్న స్వయం సహాయక బృందాలు, ఎమ్.ఎస్.ఎమ్.ఈ. లు తమ వస్తువులు మరియు సేవలను,  జి.ఈ.ఎమ్. ప్లాట్‌ఫామ్‌లో భారత ప్రభుత్వానికి నేరుగా అందించడం ద్వారా ఎలా ప్రయోజనం పొందవచ్చో ఆయన వివరించారు.

దేశంలో సోలార్ ప్యానెల్ యొక్క విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి పరిశోధన, అభివృద్ధి తో పాటు, మెరుగైన బ్యాటరీల తయారీల లో పెట్టుబడులు పెట్టాలని ఆయన పరిశ్రమను కోరారు.  ఈ పనిలో నిమగ్నమై ఉన్న అటువంటి ఎం.ఎస్.‌ఎం.ఈ. లను గుర్తించి, ప్రోత్సహించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

గురువర్ ఠాగూర్ యొక్క ప్రసిద్ధ కవిత “నూతన్ జుగర్ భోర్” నుండి ప్రధానమంత్రి ఉటంకిస్తూ, ప్రస్తుత సవాళ్ళలో లభించే అవకాశాలను అర్థం చేసుకోవాలని పరిశ్రమను ప్రోత్సహించారు.  కవాతు చేసే పాదాలు మాత్రమే కొత్త మార్గాన్ని సృష్టించగలవని ఆయన పేర్కొన్నారు.  ఇక, ఇప్పుడు ఆలస్యం చేయకూడదని, ఆయన పిలుపునిచ్చారు. 

తూర్పు భారతదేశం మరియు ఈశాన్య ప్రాంతాలలోని పరిశ్రమల అభివృద్ధికి ఐ.సి.సి. అందించిన సహకారాన్ని కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు.

*****(Release ID: 1630925) Visitor Counter : 130