PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 07 JUN 2020 6:36PM by PIB Hyderabad

(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • నిన్న 5,220 మందిసహా కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య 1,19,293కు పెరిగి, కోలుకునేవారి శాతం 48.37కు చేరింది.
 • 1,20,406 యాక్టివ్‌ కేసులు వైద్య పర్యవేక్షణలో ఉన్నాయి.
 • రోగ నిర్ధారణ ప్రయోగశాలల సంఖ్య 759కి చేరగా, నిన్న 1,42లక్షల నమూనాలను పరీక్షించారు.
 • చారిత్రక పన్ను సంస్కరణలు చేపట్టడంతోపాటు 2019-20 ఆర్థిక సంవత్సరంలో వాపసులు అత్యధిక స్థాయిలో ఉన్నందువల్ల దేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు అంచనాల మేరకు తగ్గినప్పటికీ ఇది తాత్కాలిక పరిణామమే.

 

Image

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం

గడచిన 24 గంటల్లో 5,220 మందికి కోవిడ్‌-19 నయంకాగా, ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 1,19,293కు చేరిన నేపథ్యంలో కోలుకునేవారి శాతం 48.37గా నమోదైంది. ప్రస్తుతం 1,20,406 యాక్టివ్‌ కేసులు చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నాయి. మరోవైపు నవ్య కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులను కనుగొనే దిశగా పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని ఐసీఎంఆర్‌ మరింత పెంచింది. ఆ మేరకు  దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రయోగశాలల సంఖ్య 531కి, ప్రైవేటు ప్రయోగశాలల సంఖ్య 228కి (మొత్తం 759 ల్యాబ్‌లు) చేరగా, గత 24 గంటల్లో 1,42,386 నమూనాలను పరీక్షించారు. దీంతో దేశమంతటా ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 46,66,386కి చేరింది

 

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630051

దృఢ సంకల్పం...  సమష్టి కార్యాచరణతో ముందడుగు

దేశంలో కోవిడ్‌-19 నియంత్రణ, నిర్వహణలో ప్రభుత్వం అవిరళ కృషి చేస్తున్నా సాంకేతిక నిపుణుల వివేచనపూర్వక సూచనలను పెడచెవిన పెడుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తూ కొన్ని మాధ్యమాలలో వార్తలు వెలువడుతున్నాయి.

 ఈ విధ‌మైన ఆందోళ‌నలు, ఆరోప‌ణ‌లు పూర్తిగా నిరాధారమేగాక అర్థ‌ర‌ర‌హితమైన‌వి. సాంకేతిక-వ్యూహాత్మక అభిప్రాయాలతోపాటు శాస్త్రీయ ఆలోచనల స్వీకరణ దిశగా ప్రభుత్వం నిరంతరం నిపుణులను సంప్రదిస్తూనే ఉంది. అలాగే కోవిడ్-19 నియంత్రణ కోసం ఆయా రంగాల్లో నిష్ణాతుల మార్గనిర్దేశాల మేరకు కార్యాచరణ చేపడుతోంది. కోవిడ్-19 కోసం ప్రత్యేక జాతీయ కార్యాచరణ బృందం (NTF) కూడా  ఏర్పాటైంది. నీతి ఆయోగ్‌ ఆరోగ్య విభాగం  సభ్యుడు చైర్మన్‌గా ఈ బృందాన్ని డీహెచ్‌ఆర్‌-కమ్‌-డీజీ-ఐసీఎంఆర్‌ కార్యదర్శి ఏర్పాటు చేశారు. ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కార్యదర్శి దీనికి సహాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఈ బృందంలోని 21 మంది సభ్యులలో ప్రభుత్వ-ప్రభుత్వేతర సాంకేతిక నిపుణులుసహా ఆయా రంగాల్లోని అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. వీరిలోనూ ప్రధానంగా ప్రజారోగ్యం, అంటువ్యాధుల విభాగాల నిపుణులు కావడం గమనార్హం. కోవిడ్-19 సంక్లిష్టత, దానివల్ల కలిగే చిక్కులరీత్యా ఈ బృందంలో వైద్య, ఔషధ, వైరాలజీ నిపుణులతోపాటు పథకాల అమలు నిపుణులూ ఉన్నారు.

మరోవైపు లక్షలాది మందికి వ్యాధి సోకకుండా, వేలాది మరణాలను నిరోధించే రీతిలో విధించిన దిగ్బంధం, ఇతర ఆంక్షల ప్రభావంపై పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రజలతో పంచుకుంది. ఈ ప్రభావంతోపాటు ఆరోగ్య వ్యవస్థలో ఒనగూడిన అపార ప్రయోజనాన్ని, ప్రజల సంసిద్ధతను కూడా ఎప్పటికప్పుడు వివరిస్తూనే వస్తోంది. దిగ్బంధం సడలించిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఇటలీ, స్పెయిన్, జర్మనీవంటి దేశాలతో పోలిస్తే భారత్‌లో ప్రతి లక్ష జనాభాకు సగటున 17.23  కేసులు నమోదు కాగా, 0.49 మరణాలు మాత్రమే నమోదయ్యాయి (ఇది సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 జూన్‌6న ప్రకటించిన వాస్తవం).

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630087

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో వృద్ధి చలనం – ఇటీవలి ప్రత్యక్ష పన్ను సంస్కరణలు

దేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్ల‌ వృద్ధి 2019-20 ఆర్థిక సంవత్సరంలో బాగా క్షీణించిందని, స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధితో పోలిస్తే ప్రత్యక్ష పన్ను వసూళ్లలో ప్రతికూల వృద్ధి నమోదైందని కొన్ని మాధ్య‌మాల‌లో వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, ఈ క‌థ‌నాలు ప్రత్యక్ష పన్ను వ‌సూళ్ల వృద్ధిపై వాస్త‌వాల‌ను వెల్ల‌డించ‌డంలేదు. దేశ‌వ్యాప్తంగా 2018-19 ఆర్థిక సంవత్సరం నాటి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లతో పోలిస్తే 2019-20లో తక్కువగా ఉండ‌టం నిజ‌మే. కానీ, చారిత్రక పన్ను సంస్కరణలు చేపట్టడంతోపాటు 2019-20 ఆర్థిక సంవత్సరంలో వాపసులు అత్యధిక స్థాయిలో ఉన్నందువల్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు అంచనాల మేరకు తగ్గినప్పటికీ ఇది తాత్కాలిక పరిణామమే.

దేశంలో సాహ‌సోపేత ప‌న్ను సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టిన నేప‌థ్యంలో కోల్పోయే రాబ‌డిపై అంచ‌నాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న త‌ర్వాత స్థూల వ‌సూళ్ల (ఏడాది కాలంలో ఇచ్చిన వాప‌సుల మొత్తంలో వ్య‌త్యాసాల‌వ‌ల్ల ఏర్ప‌డిన హెచ్చుత‌గ్గుల‌ను ఇది తొల‌గిస్తుంది)ను పోల్చి చూసిన‌ప్పుడు 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో ప్ర‌త్య‌క్ష ప‌న్ను వ‌సూళ్ల‌పై ప్ర‌త్య‌క్ష ప్ర‌భావం ప‌డుతుంద‌న్న వాస్త‌వం మ‌రింత ప్ర‌స్ఫుట‌మ‌వుతుంది. అలాగే 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో మొత్తం వాప‌సులు రూ.1.84ల‌క్ష‌ల కోట్లు కాగా, 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో 1.61ల‌క్ష‌ల కోట్లు మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం. ఏడాది త‌ర్వాత ఏడాదితో పోలిస్తే వాప‌సులలో 14 శాతం పెరుగుద‌ల న‌మోదైంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630018

కోవిడ్‌-19పై పోరులో అవగాహనే కీలకం... ఆందోళన కాదు: డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

కోవిడ్‌-19పై యుద్ధంలో అవగాహనే ప్రధానం తప్ప... ఆందోళన కాదని కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు కోవిడ్‌-19 రోగుల కోసం ‘కోవిడ్‌ బీప్‌’ (COVID BEEP కంటిన్యువస్‌ ఆక్సిజనేషన్‌ అండ్‌ వైటల్‌/ఇన్ఫర్మేషన్‌ డిటెక్షన్‌ బయోమెడ్‌ ఈసీఐఎల్‌ ఈఎస్‌ఐసీ పాడ్‌) పేరిట హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల రూపొందించిన పరికరాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇది పూర్తి దేశీయంగా తయారైన తక్కువధరగల, తంత్రీరహిత శారీరక లక్షణాల పర్యవేక్షణ వ్యవస్థ. హైదరాబాద్‌ ఐఐటీ, అణుఇంధన విభాగం కూడా దీని రూపకల్పనలో భాగస్వాములుగా ఉన్నాయి. కాగా, ప్రస్తుత మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనడంలో వ్యాధి నిరోధానికిగల ప్రాముఖ్యాన్ని మంత్రి నొక్కి చెప్పారు. దేశంలో దాదాపు రెండు నెలలపాటు కొనసాగిన దిగ్బంధంనుంచి దశలవారీ విముక్తి ప్రారంభమైన ప్రస్తుత సమయంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630112

‘ఆన్‌లైన్‌ నైమిష 2020’ పేరిట జూన్‌ 8 నుంచి జూలై 3దాకా- వేసవి చిత్రకళా కార్యక్రమం నిర్వహించనున్న నేషనల్‌ ఆర్ట్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడర్న్‌ ఆర్ట్‌

ప్రపంచ మహమ్మారి పరిస్థితులు, దిగ్బంధం కారణంగా దేశంలోని ప్రదర్శనశాలలు, సాంస్కృతిక సంస్థలు సందర్శకులకు, ప్రేక్షకులకు సేవలు అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జాతీయ ఆధునిక చిత్రకళా ప్రదర్శన శాల  (NGMA) తమ అభిమానులను అలరించేందుకు కొత్త రంగాలు, వేదికలద్వారా వారికి చేరువయ్యేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా దాదాపు గత రెండు నెలలుగా వర్చువల్‌ మార్గంలో అనేక కార్యక్రమాలు, ప్రదర్శనలను నిర్వహించింది. ఇక డిజిటల్‌ రూపంలో ఇటువంటి కార్యక్రమాల నిర్వహణకు సాంకేతిక అభివృద్ధి దోహదం చేస్తుండటంతో బహుళ ప్రాచుర్యంగల తన వార్షిక వేసవి కార్యక్రమం ‘నైమిష’ (NAIMISHA) నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలో నెలపాటు నిర్వహించే ‘ఆన్‌లైన్‌’ వేసవి కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దీంతో కళాసృష్టిలో పాల్గొనే కళాకారులు, అభ్యాసకులు, సందర్శకులందరూ తమ ఆరోగ్యంతో రాజీపడకుండా ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించే వీలు కలుగుతుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630073

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • పంజాబ్: రాష్ట్రంలో పౌరులు తమ విధి నిర్వహణకోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు పడుతున్న అవస్థలను తొలగించి, వారికి ఊరట కల్పించే ప్రయత్నంలో భాగంగా తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు అన్ని ప్రైవేట్ (రవాణారహిత), ప్రజారవాణా వాహనాలు నడిచేందుకు పంజాబ్ ప్రభుత్వం అనుమతించింది. అయితే, ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నిరోధం దిశగా అధికారవర్గాలు ప్రకటించిన నియంత్రణ జోన్లలో ఇందుకు అనుమతి లేదు.
 • హర్యానా: రాష్ట్రంలో 2020 జూన్ 8 నుంచి మతపరమైన ప్రదేశాలు, బహిరంగ ప్రార్థన స్థలాలు, షాపింగ్‌ మాల్స్‌ తదితరాలను నియంత్రిత విధానంలో తిరిగి తెరిచేందుకు హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది.  కాగా- గురుగ్రామ్, ఫరీదాబాద్ జిల్లాల్లో గడచిన పది రోజులుగా కోవిడ్‌ కేసులు అత్యధికంగా నమోదువుతున్న నేపథ్యంలో  ఆ రెండు జిల్లాలను మినహాయించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగాగల హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆతిథ్య సేవా సంస్థలను సాధారణ ముందుజాగ్రత్త చర్యలు పాటిస్తూ తిరిగి ప్రారంభించేందుకు అనుమతించింది. అయితే, ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటలమధ్య మాత్రమే ఇవన్నీ పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత తెల్లవారుజామున 5 గంటల వరకూ కర్ఫ్యూ యధావిధిగా అమలులో ఉంటుంది. ఈ మేరకు దేశీయాంగ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ తాజా ఆదేశాలు అమలయ్యేలా చూడాలని, తదనుగుణంగా కార్యకలాపాలను నియంత్రించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
 • కేరళ: రాష్ట్రంలో కోవిడ్-19 నిర్ధారణ అయిన ఐదు రోజుల పసికందు కోలుకుని కొళ్లంలోని ‘పరిపల్లి వైద్య కళాశాల ఆస్పత్రి నుంచి ఇంటికి చేరింది. కాగా, శిశువు తల్లికి ఇంకా చికిత్స కొనసాగుతోంది. కాగా, కోవిడ్ చికిత్స పరికరాల కచ్చితత్వాన్ని, పరీక్షల సామగ్రి నాణ్యతను పరిశీలించి నిర్ధారించే బాధ్యతను ప్రభుత్వం తిరువనంతపురంలోని రాజీవ్గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీకి అప్పగించింది. ఇక ఇతర రాష్ట్రాల నుంచి శబరిమల దర్శనానికి వచ్చే భక్తులకు కోవిడ్ సోకలేదన్న ధ్రువీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అలాగే శబరిమలతోపాటు గురువాయూర్ ఆలయంలోనూ భక్తులందరికీ వర్చువల్ క్యూ తప్పనిసరి చేయబడింది. కోళికోడ్‌ జిల్లాలో కోవిడ్‌-19 కేసులు పెరుగుతుండటంతో జూలై 15 తర్వాత మాత్రమే హోటళ్లు తిరిగి తెరుస్తారు. కాగా, ఇవాళ న్యూఢిల్లీలో ఎక్స్-రే టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మరో మలయాళీ మరణించాడు. కాగా, కేరళలో నిన్న 108 కొత్త కేసులు నమోదుకాగా, వివిధ ఆస్పత్రుల్లో 1029మంది చికిత్స పొందుతున్నారు.
 • తమిళనాడు: పుదుచ్చేరిలోని జిప్మెర్‌లోని ఐదుగురు వైద్యులు, సాంకేతిక నిపుణులకు కోవిడ్‌-19 నిర్ధారణ కావడంతో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కేసుల సంఖ్య 119కి పెరిగింది. ఇక యాక్టివ్‌ కేసులు 71గా ఉన్నాయి. ఇక ‘సముద్ర సేతు’ మిషన్‌లో భాగంగా నావికాదళ నౌక ‘జలాశ్వ’ మాల్దీవ్స్‌ నుంచి 700 మంది భారతీయులతో రెండోసారి తమిళనాడలోని ట్యుటికోరిన్‌లోగల వి.ఒ.చిదంబరనార్‌ రేవుకు చేరింది. రాష్ట్రంలోని రెస్టారెంట్లు తిరిగి తెరవడంపై ప్రభుత్వం ప్రామాణిక విధివిధానాలను ప్రకటించింది. అయితే, 65 ఏళ్ల వ్యక్తులు, పదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, ఇతర అనారోగ్యాలతో  ఉన్నవారికి వీటిలో ప్రవేశం లేదు. ఇక పరిశ్రమలకు ఆమోదాలను సరళీకరిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో నిన్న 1458 కొత్త కేసులు, 19 మరణాలు నమోదయ్యాయి. చెన్నైలో 1146 కేసులున్నాయి. ఇప్పటివరకు మొత్తం కేసులు: 30152, యాక్టివ్ కేసులు: 13503, మరణాలు: 251. చెన్నైలో యాక్టివ్ కేసులు 10223గా ఉన్నాయి.
 • కర్ణాటక: రాష్ట్రంలో దిగ్బంధ విముక్తి తొలిదశకుగాను ఆరోగ్య పరీక్షలు, నిర్బంధవైద్య పర్యవేక్షణ, అంతర్రాష్ట్ర ప్రయాణికులకు సంబంధించి కర్ణాటక ఆరోగ్యశాఖ జారీచేసిన సవరించిన మార్గదర్శకాలు 2020 జూన్ 8నుంచి అమలులోకి వస్తాయి. ఆ మేరకు హోటళ్ళు, రెస్టారెంట్లు, లాడ్జీలు, ఆలయాలు తదితరాలన్నీ దేశీయాంగ శాఖ జారీచేసిన మార్గదర్శకాలకు లోబడి ఉండాలి. రాష్ట్రంలో నిన్న 378 కొత్త కేసులు, 2 మరణాలు, నమోదవగా 280 మంది ఆస్పత్రుల నుంచి విడుదలయ్యారు. ఇక కొత్త కేసులలో 333 అంతర్రాష్ట్ర వాసులకు సంబంధించినవి కాగా, ఇప్పటివరకూ మొత్తం కేసులు: 5213, యాక్టివ్‌ కేసులు: 3184, మరణాలు: 59, కోలుకున్నవి: 1968గా ఉన్నాయి.
 • ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, మండలి బడ్జెట్‌ సమావేశాలు జూన్ 16నుంచి మొదలు కానున్నాయి. కాగా, మే 21 నుంచి బస్సులు నడపడం ప్రారంభించిన ఆర్టీసీ ఇప్పటిదాకా రూ.29.44 కోట్ల ఆదాయం ఆర్జించింది. రాష్ట్రంలో అటవీ సేవా (ఐఎఫ్‌ఎస్‌) అధికారులను ప్రభుత్వం పెద్ద సంఖ్యలో బదిలీచేసింది. గడచిన 24 గంటల్లో 17,695 నమూనాలను పరీక్షించిన నేపథ్యంలో 130 కొత్త కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. మరో 30 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. మొత్తం కేసులు: 3718. యాక్టివ్: 1290, రికవరీ: 2353, మరణాలు: 75. రోగ నిర్ధారణ అయినవారిలో వలసదారుల సంఖ్య 810కిగాను 508 యాక్టివ్‌ కేసులు కాగా, గత 24 గంటల్లో 28 మంది డిశ్చార్జి అయ్యారు. ఇక విదేశాల నుంచి వచ్చినవారిలో 131కేసులకుగాను 126 యాక్టివ్‌ కాగా, ఇవాళ ఒకరు డిశ్చార్జి అయ్యారు.
 • తెలంగాణ: రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక అధికారి వ్యక్తిగత కార్యదర్శికి కోవిడ్‌-19 నిర్ధారణ కావడంతో కార్యాలయాన్ని మూసివేశారు. ఇక రోగ నిర్ధారణ అయిన ఆరుగురు పోలీసు సిబ్బందిలో ఒక హోమ్‌గార్డ్, ఐదుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. కరోనా వైరస్‌ భయం పూర్తిగా తొలగి పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయన్న దానిపై పిల్లలు, తల్లిదండ్రులలో అనిశ్చితి, ఆందోళన కొనసాగుతున్నాయి. కాగా, జూన్ 6 నాటికి తెలంగాణలో కేసుల సంఖ్య 3496; నేటివరకూ తాజా సమాచారం ప్రకారం వలసదారులు, విదేశాలనుంచి వచ్చినవారిలో 448 మందికి రోగ నిర్ధారణ అయింది.
 • మహారాష్ట్ర: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 2,739 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసులు 82,698కి పెరిగాయి. అలాగే 120 మంది మరణించిన నేపథ్యంలో మొత్తం మరణాల సంఖ్య 2,969కి చేరింది. కోవిడ్-19 నయం కావడంతో ఇప్పటివరకూ 37,390 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో గడచిన 24 గంటల్లో ఇళ్లకు వెళ్లినవారు 2,234 మంది ఉన్నారు. ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రులలో అక్రమాలు, వాటిపై ఫిర్యాదుల పరిష్కారం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు ఐఏఎస్ అధికారులను నియమించింది. ప్రజలు ఈ-మెయిల్‌ద్వారా వీరికి ఫిర్యాదులు పంపవచ్చు. మొత్తం 35 ఆస్పత్రులు ఈ అధికారుల పరిధిలో ఉంటాయి.
 • గుజరాత్: రాష్ట్రంలో ఇవాళ 498 కొత్త కేసులు, 29 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులలో 26 ఒక్క అహ్మదాబాద్‌లోనే నమోదైన నేపథ్యంలో గుజరాత్‌లో మొత్తం కేసుల సంఖ్య 19,617కు, మరణాలు 1,219కి చేరాయి. కోలుకున్న కేసుల సంఖ్య 13,324కు పెరగ్గా 313 మంది ఆసుపత్రుల నుంచి విడుదలయ్యారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 2,45,606 నమూనాలను పరీక్షించారు.
 • రాజస్థాన్: రాష్ట్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  సమాచారం ప్రకారం... రాజస్థాన్‌లో గత 24 గంటల్లో 247 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 10,331కి పెరిగాయి. కోవిడ్-19 సంక్రమణతో రాష్ట్రంలో ఇప్పటిదాకా 231మంది మరణించారు. రాష్ట్రంలో 2599 యాక్టివ్‌ కేసులు ఉండగా- 7,501 మంది కోలుకున్నారు.
 • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 232 తాజా కేసులు నమోదవగా శనివారంనాటికి మొత్తం కేసులు 9228కి చేరాయి. కొత్త కేసులలో భోపాల్‌ 51, ఇండోర్‌ 35, షాజాపూర్‌ 20, నీముచ్‌ 18, బుర్హన్‌పూర్‌ 15, భింద్‌ 14, ఉజ్జయిని 12, ​​గ్వాలియర్‌ 10 వంతున  నమోదయ్యాయి.
 • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 44 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 923కు చేరగా, మరణాల సంఖ్య 4కు పెరిగింది.
 • గోవా: గోవాలో 71 కొత్త కేసులతో మొత్తం కేసులు 267కు చేరాయి. వీటిలో 202 యాక్టివ్‌ కేసులు కాగా, ఇప్పటివరకూ 65 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

 

*******(Release ID: 1630138) Visitor Counter : 21