ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తాజా సమాచారం

ఉమ్మడి కార్యాచరణతో పట్టుదలగా మునుముందుకు

Posted On: 07 JUN 2020 5:46PM by PIB Hyderabad

 

కోవిడ్ -19  నివారణాచర్యల నిర్వహణలో ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నప్పటికీ,  సాంకేతిక నిపుణుల అభిప్రాయాలను విస్మరిస్తున్నదంటూ కొన్ని మాధ్యమాలలో ఆవేదనాపూర్వకమైన వార్తలు వెలువడుతున్నాయి.  


ఈ అనుమానాలూ, ఆరోపణలూ కేవలం నిరాధారం, అర్థరహితం. ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిపుణుల నుంచి వ్యూహాత్మక అభిప్రాయాలూ, సూచనలూ, శాస్త్రీయ ఆలోచనలూ స్వీకరిస్తూనే ఉంది. కోవిడ్ -19  నివారణ దిశలో ఆ విషయంలో ప్రత్యేక నిపుణుల నిర్దిష్టమైన మార్గదర్శనం స్వీకరిస్తూనే ఉంది. కోవిడ్-19 కోసం ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటైంది. భారత వైద్య పరిశోధనామండలి ( ఐ సి ఎం ఆర్) డిజి ఈ టాక్స్ ఫోర్స్ ఏర్పాటు చేయగా నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు దీనికి అధ్యక్షునిగా ఉన్నారు. ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కార్యదర్శి సహాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఈ టాస్క్ ఫోర్స్ లో మొత్తం 21 మంది సభ్యులున్నారు. వారిలో ప్రభుత్వ, ప్రభుత్వేతర సాంకేతిక నిపుణులు, ఈ రంగంలో అనుభవజ్ఞులు ఉన్నారు. ప్రజారోగ్యం, అంటువ్యాధులలోనిపుణులే ప్రధానంగా ఇందులో సభ్యులు. కోవిడ్-19 లోని సంక్లిష్టత, దాని ప్రభావం దృష్టిలో ఉంచుకొని ఈ బృందంలో వైద్యం, ఔషధ, వైరాలజీ నిపుణులతోబాటు పథకాల అమలు నిపుణులు ఉన్నారు.


అంతేకాకుండా ఈ టాస్క్ ఫోర్స్ నిపుణులతో కూడిన నాలుగు బృందాలను కూడా ఏర్పాటు చేసింది. అంటువ్యాధులు, నిఘా పర్యవేక్షించేలా 13 మంది సభ్యుల బృందాలు ఉండగా, నిర్వహణ, పరిశోధనల మీద 15 మంది సభ్యుల బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. వీరిలో ప్రభుత్వ, ప్రభుత్వేతర నిపుణులున్నారు.
ఈ టాస్క్ ఫోర్స్ ఇప్పటివరకూ 20కి పైగా సమావేశాలు నిర్వహించింది. ఈ అంటువ్యాధి పైన ఒక క్రమబద్ధమైన, శాస్త్రీయమైన ప్రతిస్పందనను ప్రభుత్వానికి తెలియజేస్తూ వస్తోంది. పరీక్షలు, నివారణ, చికిత్స, నిఘా లాంటి అంశాలమీద మార్గదర్శకాలు కూడా రూపొందించింది. టాస్క్ ఫోర్స్ మాత్రమే కాకుండా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రజారోగ్య నిపుణులతో మరొక బృందాన్ని కూడా ఏర్పాటుచేసింది.


ఈ అంటువ్యాధి పట్ల భారత ప్రభుత్వ ప్రతిస్పందన నిర్ణయాలను కూడా కొన్ని మాధ్యమాలు ఎప్పటికప్పుడు వార్తలుగా అందిస్తూనే ఉన్నాయి. కోవిడ్-19 కేసులు అపరిమితంగా పెరుగుతున్న నేపథ్యంలోనే లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రెట్టింపవుతూ ఉన్న కేసులు అధిక మరణాలకు దారితీస్తున్న పరిస్థితులు అనేక పశ్చిమ దేశాల్లో కనబడ్డాయి. అలాంటప్పుడు పెద్ద ఎత్తున పెరుగుతున్న కోవిడ్-19 కేసులు మన ఆరోగ్య వ్యవస్థను చుట్టుముట్టబోతున్న వాస్తవాన్ని  పసిగట్టాం.


దేశం ఎదుర్కుంటున్న ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాటిని సమర్థంగా ఎదుర్కోవటానికి కొన్ని విధానాల, వ్యూహాల రూపకల్పన అవసరమైంది.  ఇదొక కొత్త రకం వైరస్, దాని గురించి ఇప్పటికీ పూర్తి సమాచారం లేదు. అందుబాటులోకి వస్తున్న సమాచారం ఆధారంగా, క్షేత్ర స్థాయి అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన వ్యూహానికి పదును పెడుతూ వస్తోంది.
అంటువ్యాధులు ఒక్కో దశలో విస్తరిస్తున్నప్పుడు  స్పందన ఒక్కో విధంగా ఉండటమన్నది ప్రజారోగ్యంలో  ఆనవాయితీగా వస్తున్నదే. నిజానికి దశలవారీగా స్పందించటమన్నది ఆరోగ్యవ్యవస్థలో సానుకూల లక్షణం కూడా. ప్రజలు, ప్రపంచ ఆరోగ్య సంస్థతోబాటు అంతర్జాతీయంగా ఆరోగ్య నిపుణులు కూడా కోవిడ్-19  పట్ల భారత్ అనుసరిస్తున్న వైఖరిని, ముందస్తు జాగ్రత్తలను అభినందించటం చూశాం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ, లాక్ డౌన్ నిర్ణయాన్ని స్వాగతించాయి.
లక్షలాది మందికి వ్యాధి సోకకుండా, వేలాది మంది మరణాలను అడ్డుకుంటూ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తదితర ఆంక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది. వైద్య వ్యవస్థ పనితీరును, ప్రజల సంసిద్ధతను కూడా వివరంగా చెబుతూనే వచ్చింది. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన యుకె, ఇటలీ, స్పెయిన్, జర్మనీ లాంటి దేశాలలో ప్రతి లక్షమంది బాధితులలో చనిపోయినవారి సంఖ్యను పోల్చినప్పుడు భారత్ లో అది కనిష్ఠంగా ఉంది. లక్షమంది జనాభాలో 17.23  కేసులు, లక్షమందిలో 0.49 మరణాలు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ  2020 జూన్ 6 నాటి నివేదిక పేర్కొన్న సంగతి గమనార్హం. 


కోవిడ్-19  నివారణ, నిర్వహణ, నియంత్రణ కోసం విధాన పరమైన అనేక నిర్ణయాలు, చర్యలు చేపట్టటం, వ్యూహాలు అనుసరించటంతోబాటు వాటన్నిటి సమాచారం బహిరంగంగా అందుబాటులో ఉంచాం. దాని ప్రభావాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు వివిధ మాధ్యమాల ద్వారా, వేదికల ద్వారా తెలియజేశాం. క్రమం తప్పకుండా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయటం ద్వారా, వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల పత్రికాప్రకటనల ద్వారా, చర్చా వేదికల రూపంలో, ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాల ద్వారా సమాచార వ్యాప్తి జరుగుతూనే ఉంది.
                   

 *****


(Release ID: 1630087) Visitor Counter : 303