వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

దిగ్బంధంలో పారిశ్రామిక-వాణిజ్య సమస్యల పరిశీలన-భాగస్వాముల ఇబ్బందుల పరిష్కారంలో డీపీఐఐటీ కంట్రోల్‌ రూమ్‌ కీలకపాత్ర

89 శాతం ఫిర్యాదులకు ముగింపు/పరిష్కారం; మంత్రి, కార్యదర్శి, సీనియర్‌

అధికారుల నిరంతర పర్యవేక్షణ-సమీక్షల ద్వారా సత్వర పరిష్కారాలు;

ఫోన్‌ నం.011-2306 2487; ఈ-మెయిల్‌: controlroom-dpiit@gov.in

Posted On: 30 APR 2020 2:04PM by PIB Hyderabad

   కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని ‘పారిశ్రామిక-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం’ (DPIIT) 26.03.2020న ఒక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది. పారిశ్రామిక-వాణిజ్య రంగాల సమస్యల పర్యవేక్షణతోపాటు ఆయా రాష్ట్ర/జిల్లా/పోలీసు తదితర సంబంధిత అధికార స్థానాలకు వాటి నివేదన బాధ్యతను ఇది నిర్వర్తిస్తుంది. నిత్యావసరాల అంతర్గత వాణిజ్యం, తయారీ, సరఫరా, రవాణాసహా దిగ్బంధం వేళ వివిధ భాగస్వాములకుగల సరఫరా శృంఖల ఇబ్బందులను పర్యవేక్షిస్తూ, పరిష్కారాలు చూపుతుంది. ఈ మేరకు 2020 ఏప్రిల్‌ 28దాకా 1962 ఫిర్యాదులు/సమస్యలు అందితే, వాటిలో 1739 పరిష్కారం కాగా, మరో 223 అంశాలకు త్వరలో ముగింపు లభించనుంది. మొత్తం ఫిర్యాదులు/సమస్యలలో 1,000 వరకూ ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, గుజరాత్‌లకు చెందినవే. సమస్యల స్వీకరణ-పరిష్కారాన్వేషణ, నివేదన తదితరాలపై పర్యవేక్షణ, అనుగమనం కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేయబడింది. ప్రధానాంశాలపై ఈ బృందం బాధితులను ఫోన్‌ద్వారా వాకబు చేస్తుంది. అటుపైన సముచిత విభాగానికి పంపి పరిష్కారమయ్యేలా చూస్తుంది. తయారీ, రవాణా, పంపిణీ, టోకు లేదా ఈ-కామర్స్‌ కంపెనీలు క్షేత్రస్థాయిలో ఇబ్బందులను నంబరు 011-2306 2487కు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య లేదా controlroom-dpiit[at]gov[dot]in కు మెయిల్‌ పంపి తెలియజేయవచ్చు. ఈ ఫిర్యాదులు/సమస్యలను కేంద్ర వాణిజ్య-పరిశ్రమల-రైల్వేశాఖల మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ తరచూ సమీక్షిస్తుంటారు.

*****



(Release ID: 1619553) Visitor Counter : 215