PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

• తాజా వివరాల మేరకు దేశంలో కోవిడ్‌-19 నిర్ధారిత కేసుల సంఖ్య 4,421 కాగా, 117 మరణాలు నమోదయ్యాయి
• కోవిడ్‌-19 కేసులకు సంబంధించి వివిధ కేటగిరీలకు మూడు రకాల చికిత్స సదుపాయాలు
• కోవిడ్‌-19 నేపథ్యంలో జంతు ప్రదర్శనశాలలు, జాతీయ పార్కులు, అభయారణ్యాలు, పులుల సంరక్షణ కేంద్రాల్లో ముందుజాగ్రత్త చర్యలపై ప్రభుత్వ ఆదేశపత్రం జారీ
• కోవిడ్‌-19 అనూహ్య సంక్షోభం నేపథ్యంలో దేశంలోని ప్రధాన రేవుల కార్యకలాపాలు సవ్యంగా సాగిపోయేలా కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ చురుకైన చర్యలు చేపట్టింది
• లైఫ్‌లైన్‌ ‘ఉడాన్‌’ విమానాలు ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాలకు వైద్య సరఫరాలు చేశాయి

Posted On: 07 APR 2020 6:39PM by PIB Hyderabad

కోవిడ్‌-19పై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తాజా సమాచారం

దేశవ్యాప్తంగా కోవిడ్‌-19పై తాజా సమాచారం ప్రకారం- నిర్ధారిత కేసుల సంఖ్య 4,421కాగా- 117 మరణాలు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడి కోలుకున్న/పూర్తిగా నయమైన 326 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. కోవిడ్‌-19 కేసులలో వివిధ కేటగిరీలకు సంబంధించి మూడు రకాల సదుపాయాలు- ‘అనుమానితుల వర్గీకరణ, రోగుల నిర్ధారణ, కోవిడ్‌-19 వ్యాధిగ్రస్థులకు ప్రత్యేక చికిత్స’ ఏర్పాట్లు చేస్తారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612077

భారత-స్వీడన్‌ ప్రధానమంత్రుల మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ స్వీడన్‌ ప్రధాని గౌరవనీయ స్టెఫాన్‌ లోఫ్వెన్‌తో టెలిఫోన్‌లో సంభాషించారు. ప్రస్తుత కోవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో ఈ ప్రపంచ మహమ్మారి ప్రభావిత ఆరోగ్య, ఆర్థిక చిక్కుల నియంత్రణకు తమతమ దేశాల్లో ప్రభుత్వాలు తీసుకున్న చర్యల గురించి దేశాధినేతలిద్దరూ చర్చించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612061

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి సందేశం

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611932

ప్రధానమంత్రి-ఓమన్‌ సుల్తాన్‌ల మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఓమన్‌ సుల్తాన్‌ మాననీయ హైతమ్‌ బిన్‌ తారిఖ్‌తో ఫోన్‌లో సంభాషించారు. కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి విసిరిన ఆరోగ్య, ఆర్థిక సవాళ్లతోపాటు తమతమ దేశాల్లో చేపట్టిన ప్రతిస్పందనాత్మక చర్యలపై దేశాధినేతలిద్దరూ చర్చించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612062

ప్రధానమంత్రి – బహ్రెయిన్‌ రాజు మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గౌరవనీయులైన బహ్రెయిన్‌ రాజు హమద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫాతో టెలిఫోన్‌లో సంభాషించారు. ప్రస్తుత కోవిడ్‌-19 ఆరోగ్య సంక్షోభం నేపథ్యంలో రవాణా శృంఖలాలు, ఆర్థిక విపణులుసహా వివిధ రంగాలపై దాని పరిణామాల గురించి దేశాధినేతలిద్దరూ చర్చించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611859

జాతీయ పార్కులు/అభయారణ్యాలు/పులుల సంరక్షణ కేంద్రాల్లో కోవిడ్‌-19 నియంత్రణ, నిర్వహణపై ప్రభుత్వ ఆదేశపత్రం జారీ

దేశంలో కోవిడ్‌-19 వ్యాప్తితోపాటు న్యూయార్క్‌లో ఒక పులికి ఈ వ్యాధి సోకిందన్న వార్తల నేపథ్యంలో భారతదేశంలోని జాతీయ పార్కులు/అభయారణ్యాలు/పులుల సంరక్షణ కేంద్రాల్లో కోవిడ్‌-19 నియంత్రణ, నిర్వహణపై కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ ఆదేశపత్రం జారీచేసింది. అక్కడి జంతువులకు కూడా వైరస్‌ సోకే అవకాశాలు ఉండటమేగాక, మానవులనుంచి జంతువులకు వైరస్‌ వ్యాపించే ముప్పున్న నేపథ్యంలో ఆయా కేంద్రాల అధికారులు అనుసరించాల్సిన విధానాలపై ఆదేశపత్రం జారీచేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611822

న్యూయార్క్‌లో ఒక పులికి కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో దేశంలోని జంతు ప్రదర్శనశాలల్లో అప్రమత్తత పాటించాలని ఆదేశిస్తూ కేంద్రీయ జంతు ప్రదర్శనశాలల ప్రాధికార సంస్థ ఆదేశపత్రం జారీచేసింది.

దేశంలోని జంతు ప్రదర్శనశాలల్లో అత్యంత అప్రమత్తత పాటించాలని కేంద్రీయ జంతు ప్రదర్శనశాలల ప్రాధికార సంస్థ ఆదేశించింది. ఈ మేరకు సీసీటీవీ కెమెరాలతో జంతువులపై నిరంతరం నిఘాపెట్టి, వాటిలో అసాధారణ ప్రవర్తన/లక్షణాలను గమనించాలని సూచించింది. అలాగే జంతు నిర్వాహకులు వ్యక్తిగత రక్షణ సామగ్రి ధరించకుండా వాటివద్దకు వెళ్లరాదని స్పష్టం చేసింది. అనారోగ్యం సోకిన జంతువులను విడిగా ఉంచాలని, ఆహారం అందించేటపుడు ఇతర జంతువులతో కలవకుండా చూడాలని పేర్కొంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611822

కోవిడ్‌-19.. జాతీయ దిగ్బంధం నేపథ్యంలో నౌకా రవాణా సజావుగా సాగేలా నౌకాయాన మంత్రిత్వశాఖ చురుకైన పాత్ర

ప్రధాన రేవులలో నిరుడు ఏప్రిల్‌ నుంచి మార్చి 2020దాకా ఓడల రాకపోకల నిర్వహణలో టన్నేజీపరంగా 0.82 శాతం వృద్ధి; రేవులన్నిటా 46వేల మంది ప్రయాణిక/సిబ్బందికి థర్మల్‌ స్కానింగ్‌; ప్రధాన రేవుల వినియోగదారులపై జరిమానా, ఆలస్యరుసుము, సుంకాలు, ఫీజులు, అద్దెల రద్దు; కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రధాన రేవుల వెంబడి ఆస్పత్రుల సంసిద్ధత; సముద్ర యాత్రికులు, రవాణాదారులకు శానిటైజేషన్‌, భద్రత ధ్రువీకరణ తదితరాలనుంచి ఉపశమనం కల్పించిన నౌకాయాన డైరెక్టరేట్‌ జనరల్‌.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611936

లైఫలైన్‌ ‘ఉడాన్‌’ విమానాలద్వారా ఈశాన్య భారతంలోని జోర్హట్‌, లింగ్‌పుయ్‌, దిమాపూర్‌, ఇంఫాల్‌ తదితర ప్రాంతాలకు వైద్య సరఫరాలు

దేశంలోని సుదూర, పర్వత ప్రాంతాలుసహా వివిధ రాష్ట్రాలకు ఇప్పటిదాకా 152 రవాణా విమానాలు వైద్య సరఫరాలు అందించాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612082

కోవిడ్‌-19: స్మార్ట్‌ సిటీలలో ప్రైవేటు వైద్యులతో స్థానిక ప్రభుత్వాల సంయుక్త కృషి

స్మార్ట్‌ సిటీలలో అనుమానిత కోవిడ్‌-19 కేసుల పర్యవేక్షణ కోసం జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖతో సంయుక్తంగా కృషిచేస్తున్న స్థానిక నగరపాలక యంత్రాంగం

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612051

వ్యక్తిగత రక్షక సామగ్రి ఓవరాల్స్‌ తయారీలో కాలంతో పోటీపడుతున్న రైల్వేశాఖ

వ్యక్తిగత రక్షణ సామగ్రి సంబంధిత ఓవరాల్స్‌ను పూర్తిస్థాయిలో సొంతంగా తయారుచేసేందుకు రైల్వేశాఖ ఉద్యమించింది. ఈ మేరకు జగధారి వర్క్‌షాప్‌లో రూపొందించిన ఓవరాల్‌ను రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ-డీఆర్‌డీవో పరిధిలోని ప్రయోగశాల ఇటీవలే ఆమోదించింది.  తదనుగుణంగా ఆమోదం పొందిన నమూనాలో, సంబంధిత సామగ్రితో ఈ రక్షక ఓవరాల్స్‌ తయారీ బాధ్యతను వివిధ రైల్వేజోన్ల పరిధిలోని వర్క్‌షాపులలో తయారుచేయనున్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611940

కోవిడ్‌-19, జాతీయ దిగ్బంధం మధ్య దేశవ్యాప్తంగా మార్చి 24నుంచి 14 రోజులలో 662 గూడ్సు రైళ్లద్వారా 18.54 లక్షల టన్నుల ఆహారధాన్యాలను రవాణా చేసిన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన అమలు దిశగా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) దేశంలోని వివిధ రాష్ట్రాలకు తగిన పరిమాణంలో ఆహార ధాన్యాలను రవాణా చేసింది. ఈ పథకం కింద జాతీయ ఆహారభద్రత చట్టం పరిధిలోగల ప్రజలకు 3 నెలలపాటు నెలకు తలా 5 కిలోల వంతున ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611857

కోవిడ్‌-19సహా భవిష్యత్‌ సవాళ్లపై పోరాటంలో భాగంగా ‘సమాధాన్‌’ పేరిట ఆన్‌లైన్‌ ప్రశ్నావళిని ప్రారంభించిన హెచ్‌ఆర్‌డి మంత్రిత్వశాఖ

కోవిడ్‌-19పై విద్యార్థుల్లోని ఆవిష్కరణాత్మక సామర్థ్యాన్ని వెలికి తెచ్చే దిశగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘ఆవిష్కరణల సెల్‌’-అఖిలభారత సాంకేతిక విద్యామండలి ‘ఫోర్జ్‌ అండ్‌ ఇన్నొవేషియోక్యూరిస్‌’ సంస్థ సహకారంతో ఒక భారీ ఆన్‌లైన్‌ ప్రశ్నావళిని ప్రారంభించాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612058

కోవిడ్‌-19పై పోరులో భాగంగా ప్రజలకు తమవంతుగా మాజీ సైనికుల చేయూత

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)పై దేశమంతా పోరాడుతున్న వేళ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ రక్షణదళాలకు చెందిన మాజీ సైనికులు (ఈఎస్‌ఎం) పౌర అధికార యంత్రాంగాలకు స్వచ్ఛందంగా, నిస్వార్థంగా తమవంతు చేయూతను అందిస్తున్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611969

దిగ్బంధం సమాప్తి అనంతర ప్రణాళికలో ఆర్థిక వ్యవస్థకన్నా ప్రజారోగ్యానికి ప్రాముఖ్యం ఉండాలి: ఉప రాష్ట్రపతి

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా విధించిన 3వారాల జాతీయ దిగ్బంధం ఏప్రిల్‌ 14న ముగియనుంది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చ సాగుతున్న వేళ... సంబంధిత ప్రణాళికల్లో ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంకన్నా ముందు ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611938

‘పీఎంబీజేపీ’కింద ఇళ్లముంగిటకు ఫార్మాసిస్టుల అత్యవసర సేవలు, మందులు

ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రంలో ‘ఆరోగ్య సైనికులు’గా పిలవబడే ఫార్మసిస్టులు ఇళ్లముంగిటకు తమ సేవలను తీసుకెళ్లడంతోపాటు వృద్ధులకు, రోగులకు మందులు సరఫరా చేస్తున్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612053

కోవిడ్‌-19పై కార్యాచరణ గురించి కేంద్ర సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పెన్షన్ల మంత్రిత్వశాఖ సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన సహాయమంత్రి

ప్రధానమంత్రి కార్యాలయ, సిబ్బంది-ప్రజాఫిర్యాదులు-పెన్షన్ల శాఖ, అణుఇంధనం-అంతరిక్ష శాఖలతోపాటు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయమంత్రి (ఇన్‌చార్జి) డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ తమ శాఖల పరిధిలో కోవిడ్‌-19పై కార్యాచరణ గురించి ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమీక్షించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1612056

విద్యుద్దీపాల ఆర్పివేతపై ప్రధానమంత్రి పిలుపునకు భారీ ప్రజాస్పందన లభించింది: కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి

కోవిడ్‌-19పై పోరాటానికి సంఘీభావంగా దేశమంతటా ఆదివారం నాడు విద్యుద్దీపాలు ఆర్పివేసి, దివ్వెలు వెలిగించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పిలుపునకు భారీ ప్రజాస్పందన లభించిందని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి అన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1611820

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

ఈశాన్య భారతం

  • అరుణాచల్‌ ప్రదేశ్‌లో జీవనోపాధి కార్యక్రమ కార్యకర్తలుసహా అనేక స్వయంసహాయ బృందాలు కోవిడ్‌-19పై పోరాటంలో భాగంగా ప్రజలకు మాస్కులతోపాటు నిత్యావసరాలను అందించడంలో చురుగ్గా పనిచేస్తున్నారు.
  • అసోంలో థింగ్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏఐయూడీఎఫ్‌ ఎమ్మెల్యే అమీనుల్‌ ఇస్లాం కోవిడ్‌-19పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అరెస్టయ్యారు.
  • జాతీయ దిగ్బంధం నేపథ్యంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన మణిపూర్‌ వాసుల బ్యాంకు ఖాతాలకు ‘కోవిడ్‌-19 ముఖ్యమంత్రి సహాయ నిధి’ నుంచి రూ.2000 వంతున బదిలీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు.
  • మేఘాలయలో సాధారణ (కోవిడ్‌-19తో సంబంధంలేని) రోగులకు చికిత్స చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రుల సంసిద్ధత; వైద్య ఖర్చులు భరించనున్న ప్రభుత్వం
  • మిజోరంలో వైద్యపరంగా ఏ వ్యక్తికి, ఏ సమయంలో అవసరం వచ్చినా చికిత్స చేసేందుకు డాక్టర్లందరూ సిద్ధంగా ఉండాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది.
  • నిజాముద్దీన్‌ మర్కజ్‌ అనుమానిత కోవిడ్‌-19 బాధితులను గుర్తించేందుకు అన్వేషణ కొనసాగుతున్నదని నాగాలాండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. అక్కడి కార్యక్రమానికి హాజరైనవారు స్వచ్ఛందంగా రాష్ట్ర కంట్రోల్‌ రూమును సంప్రదించాలని కోరింది.
  • సిక్కింలోని 12 దిగ్బంధ పర్యవేక్షణ, 4 ఏకాంత చికిత్స కేంద్రాల్లో మొత్తం 107 మంది చికిత్స పొందుతున్నారు.
  • త్రిపురలో ప్రజలకు అవసరమైన వస్తువులు అందించేందుకు వివిధ సంస్థలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి.

పశ్చిమ భారతం

  • రాజస్థాన్‌లో మంగళవారం కొత్తగా 24 కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. కాగా, జోధ్‌పూర్‌లో అత్యధికంగా 9 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 325కు చేరింది (రాజస్థాన్‌ ప్రజారోగ్య శాఖ).
  • గుజరాత్‌లో మంగళవారం 19 మందికి కోవిడ్‌-19 వ్యాధి సోకినట్లు నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 165కు పెరిగింది. కొత్త కేసులలో 13 అహ్మదాబాద్‌లో నమోదయ్యాయి (ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ప్రకటన).
  • భోపాల్‌లో మరో 12 కేసులు నమోదు కావడంతో మధ్యప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 268కి చేరింది. కొత్తగా ఆస్పత్రిలో చేరిన రోగులలో ఏడుగురు పోలీసులు, వారి కుటుంబసభ్యులు కాగా, మిగిలిన ఐదుగురు ఆరోగ్య శాఖ ఉద్యోగులు (భోపాల్‌ ముఖ్య వైద్యాధికారి ప్రకటన).
  • గోవాలో ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి సర్వే మూడు రోజుల్లో పూర్తికానుంది. ఈ మేరకు ప్రయాణ చరిత్రతోపాటు ఫ్లూ జ్వరం లక్షణాలున్నవారి కోసం దాదాపు 7,000 మంది సిబ్బంది ఇందులో పాల్గొంటారు.
  • మహారాష్ట్రలోని పాల్గఢ్‌ జిల్లా వాడా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎఫ్‌డీఏ అనుమతి లేకుండా శానిటైజర్లు తయారుచేస్తున్న సంస్థపై పోలీసులు దాడిచేశారు. అక్కడి నుంచి ముడిపదార్థాలతోపాటు కొన్ని శానిటైజర్లను స్వాధీనం చేసుకున్నారు.

దక్షిణ భారతం

  • కేరళ: ఏప్రిల్ 14 తర్వాత కూడా రాష్ట్రంలో ఆంక్షలు కొనసాగుతాయని ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. కాగా, తొలి కోవిడ్‌-19 రోగితో కొంతకాలం కలసి ఉన్న కేరళీయులను ముంబై పోలీసులు ధారవి ప్రాంతంలో గుర్తించారు. వీరందరూ ఢిల్లీలో తబ్లిఘీ-జమాత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు ఇవాళ అమెరికాలో కేరళకు చెందిన వ్యక్తి కోవిడ్‌-19కు బలయ్యాడు.
  • తమిళనాడు: రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించింది: ఈ మేరకు టోల్‌ఫ్రీ నంబర్లు, ఉచిత శీతలగిడ్డంగులు, సంచార కూరగాయల-పండ్ల విక్రయాలు, రైతు-ఉత్పత్తుల కంపెనీలు తదితరాలకు రుణ సదుపాయం వంటివి ఇందులో ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రంలో ఇవాళ 4 కోవిడ్‌-19 మరణాలు సంభవించగా, వీరిలో ఒకరు కర్నూలుకు చెందినవారు. రోగుల కోసం 900 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి;  వ్యాధి తీవ్రత ఉన్న ప్రాంతాల్లో యాదృచ్ఛిక నమూనాల సేకరణ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌-19 రోగులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయాలని ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులను ఆదేశించింది. చికిత్స వ్యయ పరిమితిని రూ.16,000 నుంచి రూ.2.16 లక్షలుగా నిర్ణయించింది.
  • తెలంగాణ: రాష్ట్రంలో ఇవాళ 11 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో రోగుల సంఖ్య 375కు చేరింది. తెలంగాణ పూర్తిస్థాయి హైకోర్టు దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమావేశమై దిగ్బంధాన్ని ఏప్రిల్‌ 30వరకూ పొడిగించాలని నిర్ణయించింది. కాగా, దిగ్బంధాన్ని పటిష్ఠంగా అమలు చేసేదిశగా పోలీసులు ప్రస్తుతం జనవిశ్లేషణ సాఫ్ట్‌వేర్‌తోపాటు డ్రోన్‌ కెమెరాలను, ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ గుర్తింపు సదుపాయాన్ని వినియోగిస్తున్నారు.


(Release ID: 1612106) Visitor Counter : 266