57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

ఇఫి 57లోభారతీయ కథా రచనలో కొత్త ప్రతిభను వెలికితీసేందుకు ‘పేజ్‌ సే పిచ్‌ తక్‌’ను ప్రారంభించిన ప్రసార భారతి

తొలిరోజు జ్యూరీ ముందు తమ సొంత స్క్రిప్టులు వినిపించిన పది మంది పోటీదారులు.. నవంబర్‌ 24న విజేతల పేర్లు ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 21 NOV 2026 8:34PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340173Views: 6

57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫి)లో భాగంగా ప్రసార భారతి తన తొలి స్క్రిప్ట్‌ పిచింగ్‌ ల్యాబ్‌ ‘పేజ్‌ సే పిచ్‌ తక్‌’ను నేడు గోవాలోని పనాజీలో ఉన్న కళా అకాడమీలో ప్రారంభించింది. ప్రసార భారతి ఛైర్మన్‌ పద్మశ్రీ ప్రసూన్‌ జోషి ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమం.. ఫీచర్‌ చిత్రాలు, డాక్యుమెంటరీలు, షార్ట్‌ ఫిల్మ్‌ల విభాగాల్లో పది భారతీయ భాషల్లో తమ సొంత స్క్రిప్టులను వినిపించేందుకు దేశవ్యాప్తంగా వర్ధమాన రచయితలకు ప్రతి ఏడాది జాతీయ వేదికగా నిలవనుంది.

ఈ సందర్భంగా ప్రసూన్‌ జోషి మాట్లాడుతూ.. వ్యక్తిగత అనుభవాలు, సాంస్కృతిక దృక్పథాల నుంచి పుట్టుకొచ్చే వాస్తవిక కథనాల ప్రాధాన్యాన్ని వివరించారు. విభిన్నమైన స్వరాలను ప్రోత్సహించడంతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వెలువడే కథలకు వేదిక కల్పించేందుకు ప్రసార భారతి కట్టుబడి ఉందని తెలిపారు. దేశంలోని ప్రతి ప్రాంతం, ప్రతి జానపద సంప్రదాయానికి తనదైన ప్రత్యేక కథలు ఉన్నాయని.. స్థానిక సంస్కృతిని అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే వాటిని నిజమైన రూపంలో చెప్పగలమని, అర్థం చేసుకోగలమని పేర్కొన్నారు.

దూరదర్శన్‌ డైరెక్టర్‌ జనరల్‌ రీనా సోనోవాల్‌ కౌలి స్వాగతోపన్యాసం చేశారు. దేశ భాషా, సృజనాత్మక వైవిధ్యాన్ని చాటిచెప్పడంలో ఈ కార్యక్రమం పోషించే పాత్రను ఆమె వివరించారు.

 

ఈ పిచింగ్‌ సమావేశాల్లో పది మంది అభ్యర్థులు తమ సొంత కథలను ప్రముఖ జ్యూరీ ముందు వినిపిస్తున్నారు. ఈ జ్యూరీలో ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు పొందిన నటుడు పద్మశ్రీ మనోజ్‌ జోషి, భారతీయ చరిత్ర, సంస్కృతి, సాహిత్యంపై రచయిత, సంపాదకుడు, స్వతంత్ర పరిశోధకుడు సందీప్‌ బాలకృష్ణ, ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’, ‘బత్తీ గుల్‌ మీటర్‌ చలు’ చిత్రాలతో ప్రసిద్ధి చెందిన దర్శకుడు, ఎడిటర్‌ శ్రీ నారాయణ్‌ సింగ్‌, జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత, జర్నలిస్టు, రచయిత, సినీ విమర్శకుడు, పుణే ఎఫ్‌టీఐఐ పాలక మండలి వైస్‌ ఛైర్మన్‌ అనంత్‌ విజయ్‌ ఉన్నారు.

 

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పత్రికా సమాచార కార్యాలయ (పీఐబీ) ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ధీరేంద్ర ఓజా, ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్‌, ప్రెస్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌జీఐ) యోగేశ్‌ కుమార్‌ బవేజా, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (ప్రసార, పరిపాలన) పృథుల్‌ కుమార్‌ హాజరయ్యారు.

 

ఈ స్క్రిప్ట్‌ పిచింగ్‌ ల్యాబ్‌ 2026 నవంబర్‌ 21 నుంచి 23 వరకు నిర్వహిస్తున్నారు. ఈ వార్షిక కార్యక్రమం ద్వారా వర్ధమాన రచయితలను సినీ పరిశ్రమ నిపుణులతో అనుసంధానించడం, వారి సృజనాత్మక ఆలోచనలను ఫీచర్‌ చిత్రాలు, డాక్యుమెంటరీలు, షార్ట్‌ ఫిల్మ్‌ల రూపంలో తెరకెక్కించేందుకు అవకాశాలు కల్పించడమే ప్రసార భారతి లక్ష్యం.

 

‘పేజ్‌ సే పిచ్‌ తక్‌’ విజేతలను 2026 నవంబర్‌ 24న ప్రకటించనున్నారు.

ఇఫిలోయిడ్‌ను ఇక్కడ చదవండి:  https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340173
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026