57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (ఇఫీ) సందర్భంగా గోవాలోని పనాజీలో ఉన్న పీఐబీ మీడియా సెంటర్‌లో ఈ రోజు ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రోత్సవ డైరెక్టర్ శ్రీ అశుతోష్ గోవారికర్, జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ధీరజ్ సింగ్ పాల్గొన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) డైరెక్టర్ జనరల్ (పశ్చిమ) శ్రీమతి స్మితా వత్స శర్మ సమన్వయకర్తగా వ్యవహరించారు.
శ్రీ అశుతోష్ గోవారికర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘విశ్వజనీన కథలు (స్టోరీస్ వితవుట్ బోర్డర్స్)’ ప్రధాన ఇతివృత్తంగా నిర్వహిస్తున్న ఇఫీ 57వ ఎడిషన్ విశేషాలను వివరించారు. కేవలం భౌగోళిక, ప్రాదేశిక సరిహద్దులకే పరిమితం కాకుండా.. కులం, సామాజిక వ్యత్యాసాలు, ఇతర సామాజిక-సాంస్కృతిక వాస్తవికతలు సహా కుటుంబాలు, సమాజాల్లో విభజనలకు అతీతంగా ఆలోచించడం కూడా ఈ ఇతివృత్తం పరిధిలోకి వస్తుందని ఆయన వివరించారు. అలాంటి అన్ని సరిహద్దులను అధిగమించి, విభిన్న సంస్కృతుల్లోని ఉమ్మడి మానవీయ అనుభవాలను ప్రతిబింబించే కథలన్నింటినీ ఒకే వేదికపైకి చేర్చడం ఈ వేడుక ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
ఈ చిత్రోత్సవంలోని వివిధ సినీ విభాగాలను ప్రస్తావిస్తూ... ఈ ఏడాది ‘యానిమేషన్’, ‘డాక్యుమెంటరీ’, ‘సినిమా గురించి సినిమాలు’ అనే మూడు కొత్త విభాగాలను ప్రవేశపెడుతున్నట్లు శ్రీ గోవారికర్ ప్రకటించారు. డాక్యుమెంటరీ చిత్రాలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ఆయన.. డాక్యుమెంటరీ రూపకర్తలకు మరింత గుర్తింపునూ, అవకాశాలనూ కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ వేడుకలో భాగంగా.. ఇటీవల ముగిసిన ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవ (ఎంఐఎఫ్ఎఫ్) విజేతలు రూపుదిద్దిన చిత్రాలతో కూడిన ప్రత్యేక గాలా ప్రదర్శనను ఇఫీ నిర్వహించనుందని ఆయన తెలిపారు.
చిత్రోత్సవంలోని వైవిధ్యభరితమైన కార్యక్రమాల ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. పాత క్లాసిక్ చిత్రాల ప్రత్యేక ప్రదర్శనలు, ఎంపిక చేసిన చిత్రాల ప్రదర్శనలు, ప్రత్యేక ప్రదర్శనలు సహా సినిమా వైభవాన్నీ, వైవిధ్యాన్నీ ఆవిష్కరించడంలో ప్రతి విభాగమూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మీడియా ప్రతినిధులు వ్యక్తిగత సినీ అభిరుచులకే పరిమితం కాకుండా ఇఫీలోని అన్ని అంశాలకూ ప్రాధాన్యమివ్వాలనీ, గాలా ప్రదర్శనలు, రెడ్ కార్పెట్ కార్యక్రమాలు, అంతర్జాతీయ మీడియా సమావేశాలు, పనోరమా ముఖాముఖి కార్యక్రమాలకూ హాజరు కావాలనీ కోరారు. సినీ రూపకర్తలు, సందర్శక ప్రతినిధులు తమ కృషిని ప్రపంచానికి చాటేందుకు ఇలాంటి వేదికలు దోహదపడతాయనీ, అంతేకాకుండా విభిన్న సినీ దృక్కోణాలను తెలుసుకునేలా ప్రేక్షకులకు ఉపయోగపడతాయనీ అన్నారు.
ఈ కార్యక్రమానికి విస్తృత ప్రాచుర్యాన్ని కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ గోవారికర్ అన్నారు. మీడియా ప్రతినిధులు తమ స్వతంత్ర అభిప్రాయాలనూ, విమర్శనాత్మక దృక్పథాన్నీ కొనసాగిస్తూనే.. పాత క్లాసిక్ చిత్రాల ప్రదర్శన సహా వివిధ విభాగాల సినిమాలను వీక్షించి కథనాలను ప్రసారం చేయాలని ఆయన కోరారు. ఇఫీ వేదికగా ప్రదర్శించే కథనాలు, సినీ విశేషాలను దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేయడంలో మీడియా భాగస్వామ్యం ముఖ్య పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.
ఈ వేడుక ఆద్యంతం చిత్రోత్సవ బృందం - మీడియా ప్రతినిధుల మధ్య అర్థవంతమైన, స్నేహపూర్వక ముఖాముఖి సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మీడియా సిబ్బంది వృత్తిపరమైన బాధ్యతలు, పని ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని.. ఇఫీ కార్యక్రమాల కవరేజీకి వారికి మరింత వెసులుబాటు, తగినంత సమయం లభించేలా ఈ సమావేశాల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు తెలిపారు.
57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ అధికారిక బ్రోచర్‌ను కూడా ఈ సమావేశం సందర్భంగా శ్రీ అశుతోష్ గోవారికర్ ఆవిష్కరించారు.
ఇఫీ దార్శనికత, ప్రాధాన్యాలవారీగా కార్యక్రమాలపై సమగ్ర అవగాహన కల్పించేలా ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సినిమాకూ, సాంస్కృతిక ఆదానప్రధానలకూ అంతర్జాతీయ వేదికగా ‘ఇఫీ’ పాత్రను మరింత సుస్థిరంగా నిలపడంలో మీడియా భాగస్వామ్యం, సమష్టి కృషి ప్రాధాన్యాన్ని ఈ సమావేశం పునరుద్ఘాటించింది.
ఇఫిలోయిడ్‌ను ఇక్కడ చదవండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
***