క్షయ (టీబీ) వ్యాధి నిర్మూలన దిశగా పోరాటంలో భారత్ ఓ కీలక మలుపును చేరింది. ఈ మేరకు 2015 నుంచి వ్యాధి కారక మరణాలలో 38 శాతం తగ్గుదలను సాధించింది. అంతర్జాతీయంగా ఈ తగ్గుదల 35 శాతం మాత్రమే కావడం ఈ సందర్భంగా గమనార్హం. దీంతోపాటు మందులకు లొంగే క్షయ పీడితులకు చికిత్స 94 శాతం విజయవంతం కావడం కూడా ఒక అద్భుతం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిన్న (నవంబరు 12) ప్రకటించిన ‘గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్-2026’ భారత్ సాధించిన ఈ విజయాలను ప్రముఖంగా ప్రస్తావించింది. వ్యాధి ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్స, సాంకేతిక ఆవిష్కరణలు, రోగుల సమగ్ర సంరక్షణ ద్వారా క్షయ నిర్మూలనలో భారత్ సాధిస్తున్న నిరంతర ప్రగతిని ఈ పరిణామాలు ప్రతిబింబిస్తున్నాయి.
క్షయ మరణాల శాతం తగ్గింపులో భారత్ సాధించిన విజయం ఈ వ్యాధి నిర్మూలన దిశగా దేశం బలమైన పనితీరును ప్రస్ఫుటం చేస్తోంది. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (ఎన్టీఈపీ) కింద చర్యలు ముమ్మరం చేయడాన్ని ఈ పురోగతి ప్రతిబింబిస్తుంది. ఏఐ ఆధారిత ఎక్స్-రే వినియోగం సహా కేసుల ముందస్తు గుర్తింపు, సకాలంలో రోగ నిర్ధారణ, సత్వర చికిత్స, భిన్న రకాల క్షయ నుంచి రోగుల సంరక్షణ, క్షయ పోషణ యోజన, ‘ని-క్షయ మిత్ర’ కార్యక్రమాల ద్వారా పోషకాహార మద్దతు వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. వ్యాధి తీవ్రత గల ప్రాంతాల గుర్తింపు, తీవ్ర దుష్ప్రభావం బారినపడే అధిక ముప్పున్న కేసులపై అంచనా, ఖుషీ- ఏఐ చాట్‌బాట్-అవతార్ వీడియో బాట్ తదితర ఏఐ ఉపకరణాల మద్దతుతో ఈ చర్యలు చేపట్టారు.
చికిత్సలో 94 శాతం విజయవంతం కావడాన్ని బట్టి- భారత్ అనుసరిస్తున్న రోగి కేంద్రక విధానం, పటిష్ట చికిత్స విస్తరణ, వ్యాధి పీడితులకు నిరంతర మద్దతు సామర్థ్యం మరింత స్పష్టమవుతోంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వాన క్షయ వ్యాధిపై భారత్ పోరాటం ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా రూపొందింది. ‘క్షయ విముక్త భారత్’ దిశగా ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, సమాజాలు, పౌరులను ఏకతాటిపైకి తేవడంలో ప్రజల భాగస్వామ్యానికి ప్రధానమంత్రి ప్రాధాన్యమివ్వడమే ఇందుకు కారణం. ఈ మేరకు ‘క్షయ విముక్త భారత్ అభియాన్’ కింద సామాజికాధారిత స్క్రీనింగ్, ఏఐ-సామర్థ్యం గల ఛాతీ ఎక్స్-రే, సత్వర మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ వంటివి క్షయ నివారణతోపాటు చికిత్స, పోషకాహార మద్దతును వేగిరపరచాయి. తద్వారా బలహీన వర్గాల ప్రజలకు అత్యావశ్యక సేవలు మరింత చేరువయ్యాయి.
క్షయ కార్యక్రమ నిధుల అవసరాలలో 96 శాతాన్ని దేశీయ వనరుల ద్వారానే సమకూర్చడం భారత్ నిబద్ధతను స్పష్టం చేస్తోంది. అలాగే, జాతీయ స్థాయిలో నిరంతర శ్రద్ధ, బలమైన రాజకీయ కట్టుబాటు వంటివి క్షయ నిర్మూలనలో ఏకోన్ముఖ ప్రభుత్వ-సామాజిక భాగస్వామ్య విధానాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి.
క్షయ విముక్త భారత్ అభియాన్: 25 కోట్ల మందికి పైగా ప్రజలకు ముమ్మరంగా వ్యాధి నిర్ధారణ పరీక్ష
ముందస్తు స్క్రీనింగ్, సాంకేతికాధారిత రోగ నిర్ధారణ, సామాజిక అవగాహన ద్వారా క్షయ వ్యాధిని గుర్తించే విధానంలో భారత్ మార్పులు చేసింది. ఈ క్రమంలో క్షయ నిర్మూలన కృషిని వేగిరపరచే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘క్షయ విముక్త భారత్ అభియాన్’ ప్రధాన చోదకశక్తిగా ఆవిర్భవించింది.
ఈ కార్యక్రమం కింద 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 347 అధిక ప్రాధాన్యం గల జిల్లాల్లో 2024 డిసెంబరు 7న తొలి ముమ్మర 100 రోజుల ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యంగా బలహీన, అధిక ముప్పుగల జనాభాలో ముందస్తు గుర్తింపు ప్రక్రియ బలోపేతం లక్ష్యంగా ఇది మొదలైనా, ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరింపజేశారు. దీని అమలు అనుభవాలు, లభించిన ఫలితాల ప్రాతిపదికన అధిక ముప్పున్న 1.58 లక్షల గ్రామాలు-వార్డులు, సామూహిక ప్రదేశాలు-బలహీన జనాభా పరంగా వ్యాధి నిర్ధారణపై దృష్టి సారించారు. అటుపైన 2026 మార్చి 24 నుంచి ప్రభుత్వం మరో 100 రోజుల ముమ్మర ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
తొలి కార్యక్రమం నుంచి 2026 నవంబరు దాకా సాధించిన గణనీయ ప్రగతి:
- మొత్తం 25 కోట్ల మందికి పైగా వ్యక్తులను గుర్తించి క్షయ వ్యాధి స్క్రీనింగ్ కార్యకలాపాల పరిధిలోకి తేవడం.
- ముందస్తు గుర్తింపు బలోపేతం లక్ష్యంగా 11 కోట్లకు పైగా ఛాతీ ఎక్స్-రేలు.
- సత్వర-కచ్చిత నిర్ధారణ కోసం 3 కోట్లకు పైగా న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్టుల (ఎన్ఏఏటీ) నిర్వహణ.
- ఎలాంటి లక్షణాలు కనిపించని 14.97 లక్షల క్షయ కేసులు సహా మొత్తం 48.64 లక్షల కొత్త వ్యాధిగ్రస్థుల గుర్తింపు.
ఎలాంటి లక్షణాలు కనిపించని దాదాపు 15 లక్షల మంది వ్యాధిగ్రస్థులను గుర్తించడం ఒక విశిష్టాంశం. లక్షణాలు లేనప్పుడు వ్యాధి ముదిరిన తర్వాతగానీ తెలియని దుస్థితిని తప్పించడంలో ముందస్తు గుర్తింపు పరీక్ష విధానానికి గల ప్రభావం దీన్నిబట్టి స్పష్టమవుతోంది. వ్యాధిని ముందుగానే గుర్తిస్తే- తక్షణ చికిత్స ద్వారా సత్వరం కోలుకునే అవకాశంతోపాటు వ్యాధి వ్యాప్తి నిరోధానికీ వీలుంటుంది.
చికిత్స ఫలితాల మెరుగు దిశగా సత్వర చికిత్స, భిన్నరకాల రోగుల సంరక్షణ, పోషకాహార మద్దతు, సమాజాధారిత నిరంతర చేయూతపైనా ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది. ఈ కృషి ఫలితంగా 2025 నాటికి 67,933 పంచాయతీలు క్షయ విముక్తంగా ప్రకటితమయ్యాయి.
సాంకేతికత-ఆవిష్కరణలతో క్షయ నిర్ధారణ-సంరక్షణ రూపాంతరీకరణ
క్షయ వ్యాధి పరీక్ష-నిర్ధారణను వేగిరపరచడం సహా మరింత కచ్చితంగా, అందరికీ అందుబాటులో ఉండేలా ఈ ప్రక్రియను విస్తృతం చేయడంలో అత్యాధునిక సాంకేతికతలను భారత్ సద్వినియోగం చేసుకుంటోంది.
ముఖ్యంగా- చేతిలో ఇమిడే ఏఐ-చోదిత డిజిటల్ ఎక్స్-రేల వినియోగం, ‘ఎన్ఏఏటీ’ సహా మాలిక్యులర్ డయాగ్నస్టిక్ సాంకేతికతల సత్వర విస్తరణ, డయాగ్నస్టిక్ మౌలిక సదుపాయాల బలోపేతం వంటివి విభిన్న భౌగోళిక-సామాజిక పరిస్థితులలో గల ప్రజలకు ఈ కార్యక్రమాన్ని గణనీయంగా చేరువ చేశాయి.
ఇక ‘ని-క్షయ్’ డిజిటల్ వేదిక రోగుల అన్వేషణ, చికిత్సపై పర్యవేక్షణ, కార్యక్రమ నిర్వహణకు మద్దతిస్తూ సంరక్షణ కొనసాగింపు సహా సకాలంలో కార్యకలాపాలను బలోపేతం చేస్తుంది.
మధుమేహం, పోషకాహార లోపం, ఇతర సహ-వ్యాధుల గుర్తింపు-నిర్వహణతో క్షయవ్యాధి స్క్రీనింగ్‌ను అనుసంధానం రోగి-కేంద్రక, సమగ్ర చికిత్సను మరింత సుసాధ్యం చేస్తోంది.
క్షయవ్యాధిపై భారత్ ప్రతిస్పందనలో పోషకాహార మద్దతు ఓ కీలక మూలస్తంభం. ఈ మేరకు ‘ని-క్షయ్ పోషణ్ యోజన’ ద్వారా అర్హులైన రోగులకు చికిత్స సమయంలో పోషకాహార అవసరాల నిమిత్తం ఆర్థిక సహాయం లభిస్తుంది. అంతేకాకుండా పోషకాహార, మానసిక-సామాజిక మద్దతు దిశగా ‘ని-క్షయ్ మిత్ర’ కార్యక్రమం వ్యక్తులు, సంస్థలు, సంఘాలను సమీకరిస్తుంది.
మెరుగైన రోగ నిర్ధారణ-రోగులపై పర్యవేక్షణ సహా నిర్దిష్ట చికిత్సా ఫలితాలకు, క్షయ మరణాల తగ్గుదలకు ఈ చర్యలు దోహదం చేస్తున్నాయి.
బలమైన శాస్త్రీయ పర్యవేక్షణ-ఆధారాల తోడ్పాటుతో క్షయ నిర్మూలనలో భారత్ ప్రగతి
సాంక్రమిక వ్యాధులపై బలమైన నిఘా, శాస్త్రీయ పరిశోధన సహా ఆధారాల ప్రాతిపదికన క్షయపై అంచనాలు కూడా క్షయ నిర్మూలన దిశగా భారత్ విజయాలకు దోహదం చేస్తున్నాయి.
క్షయ మరణాల అంచనా బలోపేతం దిశగా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నమూనాల రిజిస్ట్రేషన్ వ్యవస్థ, కమ్యూనిటీ-ఆధారిత మౌఖిక శోధనాధారిత అంచనా, ‘ని-క్షయ్’ పోర్టల్ నుంచి కార్యక్రమ సమాచారం సహా బహుళ అనుబంధ వనరుల ద్వారా సమీకరించిన ఆధారాలను కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ‘గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్-2026’లో పొందుపరిచింది.
ఈ అంచనాల ఆధారంగానే భారత్‌లో క్షయ మరణాలు 38 శాతం తగ్గిందని నివేదిక నమోదు చేసింది. భారత్‌లో ఇది 2015లో ప్రతి లక్ష జనాభాకు 28 నుంచి 2025 నాటికి 18కి తగ్గింది.
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), క్షయ వ్యాధిపై జాతీయ పరిశోధన సంస్థ (ఎన్ఐఆర్టీ) 2025లో దేశవ్యాప్తంగా క్షయ వ్యాధి ప్రాబల్యంపై ప్రతినిధిత్వ అధ్యయనం నిర్వహించింది. ఇందులో వెల్లడైన వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థతో పంచుకోగా, ప్రస్తుతం ఇది సాంకేతిక చర్చల దశలో ఉంది.
ప్రజా భాగస్వామ్యం: క్షయవ్యాధి నిర్మూలనకు ప్రజా ఉద్యమం
జాతీయ మిషన్‌లో సమాజాలను, సంస్థలను క్రియాశీల భాగస్వాములుగా సమీకరించడమే భారత్ క్షయవ్యాధి నిర్మూలన కృషిలో ఓ కీలకాంశం.
పంచాయతీ రాజ్, పట్టణ స్థానిక సంస్థలతోపాటు ఎన్నికైన ప్రతినిధులు, పౌర సమాజ సంస్థలు, ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, కార్పొరేట్ భాగస్వాములు, సామాజిక అగ్రగాముల భాగస్వామ్యం ద్వారా క్షేత్రస్థాయిలో అవగాహన, స్క్రీనింగ్, పోషకాహార తోడ్పాటు, రోగి మద్దతు చర్యలు బలోపేతమయ్యాయి.
క్షయ వ్యాధి పీడితుల శ్రేయస్సుకు, చికిత్స ద్వారా వారు త్వరగా కోలుకోవడంలో పౌరులు, సంస్థలు నేరుగా సహకరించేలా మరింత ప్రోత్సహించడం వంటి సామూహిక బాధ్యతల స్ఫూర్తిని ‘ని-క్షయ్ మిత్ర’ కార్యక్రమం బలోపేతం చేసింది.
ఈ ఉత్తేజానికి కొనసాగింపుగా ‘జోష్ టీమ్స్’ కార్యక్రమం క్షయవ్యాధి నిర్మూలన ఉద్యమంలో యువత భాగస్వామ్యాన్ని మరింత పెంచుతోంది. సమితులు, వార్డుల స్థాయిలో నియమితులైన క్లాస్-1 అధికారుల నేతృత్వాన ఎన్సీసీ, మైభారత్ నుంచి ఐదుగురు వంతున కార్యకర్తలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.
అవగాహన కల్పన, సామాజిక కార్యక్రమాలు-సమీకరణ ద్వారా క్షేత్రస్థాయి భాగస్వామ్య బలోపేతం సహా క్షయ విముక్త భారత్ ఆశయ సాధనలో జోష్ బృందాలు తోడ్పడుతున్నాయి.
క్షయ విముక్త భారత్ దిశగా పురోగమనం కొనసాగింపు
ప్రజారోగ్యం, సాంకేతిక ఆవిష్కరణలు, శాస్త్రీయ పర్యవేక్షణ, సామాజికాధారిత కార్యక్రమాలపై భారత్ ప్రదర్శించిస్తున్న నిశిత శ్రద్ధను ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్-2026’లో ప్రముఖంగా ప్రస్తావించిన విజయాలు ప్రతిబింబిస్తున్నాయి.
క్షయ విముక్త భారత్ అభియాన్ అమలుతో మరణాల్లో 38 శాతం తగ్గుదల, చికిత్సలలో 94 శాతం విజయవంతం కావడం, అసాధారణ రీతిలో పరీక్షల నిర్వహణ తదితరాలన్నీ క్షయ నిర్మూలన దిశగా భారత్ ప్రస్థానంలో కీలక ప్రగతిని ప్రస్ఫుటం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా సాధించిన విజయాలను మరింత పటిష్టం చేయడంతో పాటు ముమ్మర పరీక్షలు, నాణ్యమైన రోగ నిర్ధారణ సేవల విస్తరణ, సత్వర-సమర్థ చికిత్స, క్షయ నివారణ చర్యలు, పోషకాహార మద్దతు, ప్రజలతో మరింతగా మమేకం కావడం వంటి చర్యలను ప్రభుత్వం కొనసాగిస్తోంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన ప్రపంచ క్షయ వ్యాధి లక్ష్యాల సాధనలో పురోగతిని వేగిరపరచడం సహా క్షయ విముక్త భారత్ స్వప్న సాకారంపై భారత్ దృఢమైన నిబద్ధతతో ముందడుగు వేస్తోంది. తదనుగుణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, దేశీయ పరిశోధన సంస్థలు, రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రగతి భాగస్వాములు, ప్రజల సన్నిహిత సహకారంతో అవిరళ కృషి చేస్తోంది.
క్షయ నశిస్తుంది… దేశం వర్ధిల్లుతుంది!