సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఊతమిచ్చేలా రెండు కీలక నిర్ణయాలను తీసుకున్న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
प्रविष्टि तिथि:
29 JUN 2026 8:27PM by PIB Hyderabad
భారతీయ చలనచిత్ర పరిశ్రమ వృద్ధిని వేగవంతం చేసేందుకు, దేశవ్యాప్తంగా సినిమా థియేటర్ల తెరల సంఖ్యను పెంచడానికి దోహదపడే రెండు కీలక నిర్ణయాలను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ రోజు తీసుకుంది.
ఢిల్లీలో ఈ రోజు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో జరిగిన ఈ సమావేశంలో చలనచిత్ర నిర్మాణం, పంపిణీ, సాంకేతిక అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడానికి తక్షణ నిర్మాణాత్మక చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి ఆదేశించారు.
అధ్యయన కమిటీ నియామకం
శ్రీ ప్రసూన్ జోషి అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి అధ్యయన కమిటీని మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఇందులో చలనచిత్ర పరిశ్రమ నిపుణులు, సాంకేతిక భాగస్వాములు కూడా సభ్యులుగా ఉంటారు.
ఈ కమిటీ భారతీయ సినిమా ముందున్న అవకాశాలు, ఎదుర్కొంటున్న సవాళ్లను అధ్యయనం చేయటంతో పాటు సినీ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి అవసరమైన మార్గాలను సూచిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమాలు మరింత పోటీతత్వంగా మారేలా తీర్చిదిద్దడానికి తీసుకోవలసిన చర్యలను కూడా సిఫార్సు చేస్తుంది.
ఈ అధ్యయన కమిటీ ఇతర అంశాలతో పాటు ముఖ్యంగా కింది విషయాలపై దృష్టి సారిస్తుంది:
-
ప్రపంచ మార్కెట్లలో భారతీయ సినిమాలు మరింత పోటీ పడేలా చేసేందుకు తీసుకోవలసిన చర్యలు.
-
సినిమా రంగంపై సరికొత్త సాంకేతికతల ప్రభావం. ఇందులో కృత్రిమ మేధ(ఏఐ), వర్చువల్ ప్రొడక్షన్ వంటివి ఉన్నాయి. భారతీయ చలనచిత్ర నిర్మాతలు ఈ సాంకేతిక పరికరాలను ఎలా ఉపయోగించుకోవచ్చో ఈ కమిటీ సూచిస్తుంది.
-
చలనచిత్ర నిర్మాతలు మార్కెట్ నుంచి సంస్థాగత ఫైనాన్స్ పొందే విధానం, సినిమా నిర్మాణానికి ఉన్న సరికొత్త నిధుల అవకాశాలను పరిశీలిస్తుంది.
-
సినిమా నిర్మాణం, పంపిణీ కోసం నిధులు సమకూర్చుకోవడంలో చలనచిత్ర నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలు.
-
రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వామ్య పక్షాలతో కలిసి పనిచేయడం. అత్యుత్తమ విధానాలను ఈ కమిటీ గుర్తిస్తుంది. భారతీయ చలనచిత్ర రంగం దీర్ఘకాలికంగా వృద్ధి చెందడానికి అవసరమైన ఒక సమగ్ర విధాన ఫ్రేమ్‌వర్క్‌ను సిఫార్సు చేస్తుంది.
ఈ అధ్యయన కమిటీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సంబంధిత భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు చేపడుతుంది. అనంతరం మూడు నెలల లోపు తన నివేదికను మంత్రిత్వ శాఖకు సమర్పిస్తుంది.
రాష్ట్రాలు అమలు చేసేందుకు 'నమూనా రాష్ట్ర సినిమా నిబంధనలు'
రాజ్యాంగంలోని 'రాష్ట్ర జాబితా' కింద సినిమాలు, థియేటర్ల నియంత్రణ ఉంది. సినిమా థియేటర్లకు అవసరమైన వివిధ అనుమతుల కోసం వేర్వేరు రాష్ట్రాలు వేర్వేరు నిబంధనలను అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సినిమా మౌలిక సదుపాయాల వృద్ధికి ఈ వైవిధ్యమైన నిబంధనలు ఒక పెద్ద అడ్డంకిగా మారాయి.
సినిమా మౌలిక సదుపాయాల విస్తరణను వేగవంతం చేయడానికి మంత్రిత్వ శాఖ ఒక నమూనా నిబంధనల పత్రాన్ని సిద్ధం చేసింది. భాగస్వామ్య పక్షాలన్నింటితో చర్చించిన తర్వాత ఈ నిబంధనలను రూపొందించింది. మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఈ 'నమూనా రాష్ట్ర సినిమా నిబంధనలను' అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. వీటిని అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలను కోరింది. ఈ నిబంధనలను ఆచరణలోకి తీసుకురావడంలో రాష్ట్రాలకు మంత్రిత్వ శాఖ తగిన సహాయాన్ని కూడా అందిస్తుంది.
ఈ రెండు నిర్ణయాలు కలిసి భారతీయ చలనచిత్ర పరిశ్రమను మరింత బలోపేతంగా, ఆధునికంగా, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగలిగేలా తీర్చిదిద్దుతాయి. తద్వారా భారతీయ సినిమా సృజనాత్మకతకు, సంస్కృతికి, ఆవిష్కరణలకు ఒక శక్తిమంతమైన మాధ్యమంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2279250)
आगंतुक पटल : 4