పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాల దృష్ట్యా కీలక రంగాలపై తాజా సమాచారం


పీఎన్‌జీ కనెక్షన్లు ఉన్నవారు ఎల్పీజీ సిలిండర్లను అప్పగించేలా ఎల్పీజీ నియంత్రణ చట్ట సవరణ.. అందరికీ ఎల్పీజీ అందుబాటులో ఉండేలా చూడటమే లక్ష్యం

డిజిటల్ వేదికల ద్వారా ఎల్పీజీ సిలిండర్లను బుకింగ్ చేసుకోవాలని వినియోగదారులకు సూచన

సాధ్యమైన చోట పీఎన్‌జీని ఎంచుకోవాలని పౌరులకు విజ్ఞప్తి

బ్లాక్ మార్కెట్, నిల్వలను అరికట్టటానికి వివిధ రాష్ట్రాల్లో తనిఖీలు

పరిస్థితి పర్యవేక్షణకు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసిన 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. అదే దిశలో మరిన్ని రాష్ట్రాలు

ఫుజైరా టెర్మినల్ ప్రమాదం తర్వాత సురక్షితంగా స్వదేశానికి పయనమైన భారత నౌక జగ్ లాడ్కి

దేశవ్యాప్తంగా నౌకాశ్రయాల్లో నౌకల కదలికలు, సరకు రవాణా కార్యకలాపాలపై కొనసాగుతున్న నిఘా

పశ్చిమాసియాలో 24X7 హెల్ప్‌లైన్లు, భారతీయులకు సహాయాన్ని అందిస్తున్న భారత రాయబార కార్యాలయాలు

నాడు పోస్టు చేయడమైనది: 15 MAR 2026 3:50PM by PIB Hyderabad

పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సన్నద్ధత, సహాయక చర్యలకు సంబంధించి భారత ప్రభుత్వం చేపట్టిన కార్యకలాపాల వివరాలను ఇచ్చారు. ఇవి ఇంధన సరఫరా నిర్వహణ, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయ పౌరుల సంక్షేమం, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే చర్యలకు సంబంధించినవి.

ఇంధన సరఫరా, ఇంధన లభ్యత

దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరం అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వీటి సరఫరా, పంపిణీ క్రమబద్ధంగా కొనసాగేలా అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉంది:

ముడి చమురు, రిఫైనరీలు

అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయి. వాటివద్ద తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిలో మన దేశం స్వయం సమృద్ధిని సాధించింది. దేశీయ అవసరాల కోసం పెట్రోల్, డీజిల్‌ను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు.

రిటైల్ విక్రయ కేంద్రాలు

 

చమురు విక్రయ సంస్థల రిటైల్ అవుట్‌ లెట్స్‌లో ఇంధనం అయిపోయినట్లు నివేదికలు లేవు. పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరం కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నందున ప్రజలు ఆందోళనతో ముందస్తు కొనుగోళ్లు చేయవద్దని సూచించారు.

సహజవాయువు

ప్రాధాన్యత రంగాలకు గ్యాస్ సరఫరా నిరంతరంగా కొనసాగుతోంది. పీఎన్‌జీ, సీఎన్‌జీ విభాగాలకు 100% సరఫరా కొనసాగుతుండగా.. పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు 80% సరఫరా జరుగుతోంది.

 

ప్రధాన నగరాలు, పట్టణాల్లోని వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులు ఇకపై పీఎన్‌జీ కనెక్షన్లను ఎంచుకోవాల్సిందిగా ప్రోత్సహిస్తూ.. ఆసక్తి గల వినియోగదారులు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) కంపెనీలకు ఈమెయిల్, లేఖ ద్వారా లేదా కస్టమర్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 

పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు.. పీఎన్‌జీఆర్‌బీ, సీజీడీ సంస్థలతో కలిసి మార్చి 14, 2026న నిర్వహించిన సమావేశంలో పీఎన్‌జీ కనెక్షన్లు, ఎల్పీజీ-టు-పీఎన్‌జీ మార్పులపై సమీక్షించారు.

ఎల్పీజీ

ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎల్పీజీ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.

ఎల్పీజీ పంపిణీ కేంద్రాల వద్ద గ్యాస్ నిల్వలు లేవని నివేదికలు అందలేదు.

ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్స్ గణనీయంగా తగ్గాయి. మార్చి 13, 2026న 88.8 లక్షల బుకింగ్స్ అవగా, నిన్న ఆ సంఖ్య సుమారు 77 లక్షలకు పడిపోయింది.

 

ఆన్‌లైన్‌ ద్వారా జరిగే బుకింగ్స్ శాతం 84% నుంచి సుమారు 87%కి పెరిగింది.

 

బీహార్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ వంటి పలు రాష్ట్రాలు, యూటీలు గృహేతర ఎల్పీజీ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేశాయి.

 

వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్లను ప్రాధాన్యత ప్రాతిపదికన పంపిణీ చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించారు. ప్రస్తుతం ఇవి 30 రాష్ట్రాలు, యూటీల్లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

 

రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన సమావేశాలు

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి నిత్యావసర వస్తువుల సరఫరాను పర్యవేక్షించటంలో రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఎల్పీజీ సరఫరా పర్యవేక్షణకు, పంపిణీలో అంతరాయం కలగకుండా చూసేందుకు, బ్లాక్ మార్కెటింగ్, ముందస్తు బుకింగ్స్ అరికట్టేందుకు పలు రాష్ట్రాలు, యూటీల్లో ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయి.

 

పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించటానికి 22 రాష్ట్రాలు, యూటీలు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశాయి. పౌరులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు పలు రాష్ట్రాలు మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నాయి.

అమలు చర్యలు

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

ఎల్పీజీ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్, బీహార్ సహా పలు రాష్ట్రాల్లో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసేందుకు, అక్రమాలను అరికట్టేందుకు ఎల్పీజీ సరఫరాదారుల వద్ద పీఎస్‌యూ ఆయిల్ మార్కెట్ కంపెనీలు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాయి.

ప్రభుత్వ చర్యలు

దేశీయ వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా ఇళ్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థల వంటి ముఖ్యమైన విభాగాలకు ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.

రిఫైనరీల నుంచి దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ఠ స్థాయికి పెంచారు. సరఫరా, డిమాండ్‌కు సంబంధించి పలు చర్యలు తీసుకున్నారు.

మార్చి 14, 2026న జారీ చేసిన ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వుల సవరణ ప్రకారం.. పీఎన్‌జీ కనెక్షన్‌ ఉన్న వినియోగదారులు దేశీయ ఎల్పీజీ కనెక్షన్లను తప్పనిసరిగా వదులుకోవాలి. పీఎన్‌జీ కనెక్షన్‌ ఉన్నవారికి నూతన ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వకూడదు.

 

అందరికీ సమానంగా పంపిణీ చేసేందుకు బుకింగ్ కాలపరిమితిని పట్టణాల్లో 25 రోజులకు, గ్రామాల్లో 45 రోజులకు మార్చారు.

ప్రత్యామ్నాయ ఇంధన అవసరాలకు రాష్ట్రాలు, యూటీల్లో అదనంగా 48,000 కిలోలీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు.

 

ఎల్పీజీ సరఫరా వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు హోటళ్లు, రెస్టారెంట్లు వంటి కొన్ని రంగాల్లో కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని అందుబాటులోకి తెచ్చారు.

 

సరఫరా సజావుగా సాగేందుకు పీఎస్‌యూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. డిజిటల్ బుకింగ్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి. వినియోగదారులు ముందస్తు బుకింగ్స్ చేయవద్దని సూచించారు. అంతేకాక, ఆదివారాల్లోనూ గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి.

 

బహిరంగ ప్రకటన

గృహ అవసరాలకు, ఇతర ముఖ్య రంగాలకు అవసరమైన ఎల్పీజీ నిరంతరం అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. పౌరులెవరూ ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు.

 

ఐవీఆర్‌ఎస్‌ కాల్స్, ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మొబైల్ యాప్స్ వంటి పలు రకాల డిజిటల్ వేదికల ద్వారా ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు.

 

ఆందోళనతో వినియోగదారులు ముందస్తు బుకింగ్స్ చేయకూడదని, డిజిటల్ వేదికలను వినియోగించుకోవాలని, గ్యాస్ సరఫరా కార్యాలయాలకు అనవసరంగా వెళ్లవద్దని కోరారు.

 

సాధ్యమైన ప్రాంతాల్లో పౌరులు పీఎన్‌జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఎంచుకోవాలని ప్రోత్సహిస్తున్నారు.

 

ఎల్పీజీ సరఫరా నిరంతరాయంగా జరుగుతుందని, ఆందోళనతో అనవసరంగా చేసే బుకింగ్స్ ఇటీవల తగ్గినట్లు ప్రభుత్వం, పీఎస్‌యూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి.

 

అనవసర భయాందోళనలను నివారించటానికి పౌరులు, మీడియా సంస్థలు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, ఖచ్చితమైన సమాచారాన్ని అందరికీ తెలియజేయటంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

 

సముద్ర భద్రత, షిప్పింగ్ కార్యకలాపాలు

 

పశ్చిమాసియా ప్రాంతంలో ప్రయాణించే భారత నౌకలు, నౌకాయాన సిబ్బంది భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. సముద్రయాన కార్యకలాపాలు సాఫీగా సాగేలా చూసేందుకు షిప్పింగ్ అధికారులు, పరిశ్రమల్లోని ఇతర భాగస్వాములతో సమన్వయం కొనసాగుతోంది.

 

ఆ ప్రాంతంలో భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటలుగా భారత నావికులు, నౌకాయాన ప్రమాదాలు ఎదుర్కొన్నట్లు నివేదికలు లేవు.

 

మార్చి 14, 2026న భారత నౌక జగ్ లాడ్కి.. ఫుజైరా సింగిల్ పాయింట్ మూరింగ్ వద్ద ముడి చమురును లోడ్ చేస్తున్న సమయంలో ఫుజైరా ఆయిల్ టెర్మినల్‌పై దాడి జరిగింది. ఆ నౌక సుమారు 80,800 మెట్రిక్ టన్నుల ముర్బాన్ ముడి చమురుతో ఈ రోజు ఉదయం 10:30 గంటలకు (ఐఎస్‌టీ) ఫుజైరా నుంచి సురక్షితంగా బయలుదేరి భారత్‌కు పయనమైంది. నౌక, అందులోని భారత సిబ్బంది సురక్షితంగా ఉన్నారు.

 

సుమారు 92,712 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ లోడ్‌తో వస్తున్న శివాలిక్, నందాదేవి.. రెండు భారత గ్యాస్ వాహక నౌకలు మార్చి 14, 2026న హార్ముజ్ జలసంధిని దాటాయి. ప్రస్తుతం ఇవి భారత్ వైపు పయనిస్తున్నాయి. మార్చి 16న ముంద్రా ఓడరేవుకు శివాలిక్, మార్చి 17న కాండ్లా ఓడరేవుకు నందాదేవి చేరుకోవాల్సి ఉంది.

 

ప్రస్తుతం 611 మంది భారత నౌకాయాన సిబ్బందితో కూడిన 22 భారతదేశ ఓడలు పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నాయి. ఓడ యజమానులు, ఆర్‌పీఎస్‌ఎల్‌ ఏజెన్సీలు, భారతీయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్ ఈ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.

 

డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూం ప్రారంభమైనప్పటి నుంచి సమాచారం, సహాయం కోరుతూ.. నావికులు, వారి కుటుంబ సభ్యులు, సముద్రయాన సంబంధిత వ్యక్తుల నుంచి వచ్చిన 2,995 ఫోన్ కాల్స్, 5,357కు పైగా ఈమెయిల్స్‌ ద్వారా సమాచారం అందించారు.

 

ఇప్పటివరకు గల్ఫ్ ప్రాంతం నుంచి 276 మంది భారత నావికులను షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్ సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది. గడిచిన 24 గంటల్లో వివిధ విమానాశ్రయాలు, ప్రాంతీయ ప్రాంతాల నుంచి స్వదేశానికి చేరిన 23 మంది నావికులు చేరారు.

 

ప్రస్తుతం సముద్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నౌకాశ్రయాలన్నీ.. నౌకల రాకపోకలను, కార్గో ఆపరేషన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.

 

భారత నావికుల భద్రత, సంక్షేమంతో పాటు నౌకా వాణిజ్యం, ఓడరేవు కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేలా చూస్తూనే.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, షిప్పింగ్ కంపెనీలు, సముద్రయాన సంబంధిత సంస్థలతో సంబంధిత మంత్రిత్వ శాఖ నిరంతరం సమన్వయం చేసుకుంటోంది.

 

భారత పౌరుల భద్రత

 

భారత రాయబార కార్యాలయాలు, ఇతర కార్యాలయాలు అక్కడున్న భారత ప్రజలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాయి. భారత పౌరుల భద్రత, క్షేమం కోసం అవసరమైన సూచనలు జారీ చేస్తూనే ఉన్నాయి.

 

పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం నిశితంగా గమనిస్తోంది. ఆ ప్రాంతంలోని భారత పౌరుల రక్షణ, క్షేమం, భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది.

 

భారత పౌరులు, వారి కుటుంబసభ్యుల సందేహాల నివృత్తికి ఎంఈఏ ప్రత్యేక సహాయక కేంద్రాన్ని నిరంతరం నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సమన్వయం కొనసాగిస్తోంది.

 

ఆ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయాలు, కేంద్రాలు 24x7 హెల్ప్‌లైన్లను నిర్వహిస్తూ.. భారత సమాజానికి సంబంధించిన సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఎప్పటికప్పుడు ఆదేశాలను జారీ చేస్తున్నాయి.

 

విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు స్థానిక అధికారులను నిరంతరం సంప్రదిస్తూ.. అక్కడ చిక్కుకుపోయిన భారతీయులకు, సందర్శకులకు అవసరమైన వీసా, రవాణా ఏర్పాట్లు, ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తున్నాయి. ఆ ప్రాంతంలోని భారత నౌకాయాన సిబ్బందికి కూడా సహాయ సహకారాలను అందిస్తున్నాయి.

 

ఫిబ్రవరి 28, 2026 నుంచి ఇప్పటివరకు పశ్చిమాసియా ప్రాంతం నుంచి సుమారు 1,94,000 మంది ప్రయాణికులు భారత్‌కు తిరిగి వచ్చారు.

 

యూఏఈ పౌర విమానయాన అధికారుల ఆదేశాల మేరకు యూఏఈ విమానయాన సంస్థలు.. షెడ్యూల్ మార్చి, పరిమితంగా సర్వీసులను నడుపుతున్నాయి. అబుదాబి, దుబాయ్, రస్ అల్ ఖైమా, షార్జా, ఫుజైరా నుంచి భారతదేశంలోని వివిధ నగరాలకు విమానాలు నడుస్తున్నాయి. విమాన సర్వీసులకు సంబంధించిన తాజా సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు.

 

సౌదీ అరేబియాలోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌లోని పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి.

 

ఒమన్‌ నుంచి భారత్‌లోని పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి.

 

ఖతార్ గగనతలం పాక్షికంగా తెరుచుకోవటంతో ఖతార్ ఎయిర్‌వేస్, భారత్‌కు పరిమితంగా విమాన సర్వీసులను నడుపుతోంది. ఈ క్రమంలో ఇవాళ ఢిల్లీకి ఒక విమానాన్ని నడిపింది.

 

గగనతలాల మూసివేత కారణంగా బహ్రెయిన్, కువైట్, ఇరాక్‌లో చిక్కుకున్న భారత పౌరులు, సౌదీ అరేబియా మీదుగా ప్రయాణాన్ని కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

 

ఇదివరకు జరిగిన ఘటనలు, ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణల వల్ల అయిదుగురు భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఒక భారత పౌరుడు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం, మరణించిన వారి భౌతికకాయాలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఒమన్, ఇరాక్, యూఏఈలోని భారత రాయబార కార్యాలయాలు.. సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.

సంబంధిత మంత్రిత్వ శాఖలు, సంస్థల మధ్య సమన్వయాన్ని కొనసాగిస్తూ.. కీలక రంగాల్లో సంసిద్ధతను పెంపొందించటానికి, దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం చేపడుతోంది.

***

 


(రిలీజ్ ఐడి: 2240422) సందర్శకుల సూచీ సంఖ్య : : 131