పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియా తాజా పరిణామాలపై అంతర-మంత్రిత్వశాఖల వివరణ


· అధిక సామర్థ్య వినియోగంతో పనిచేస్తున్న భారత చమురు శుద్ధి కర్మాగారాలు

· చిల్లర విక్రయ కేంద్రాలన్నిటా తగినన్ని నిల్వలున్నాయి

· దేశవ్యాప్తంగా నిత్యం 50 లక్షల సిలిండర్ల పంపిణీ

· దేశీయ వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) ఉత్పత్తిలో 28 శాతం పెరుగుదల

· దేశమంతటా ఓడ రేవులలో స్థిరంగా కార్యకలాపాలు

· మౌలిక సదుపాయాలు.. ఆర్థిక సహాయం.. ఇంధన భద్రత పర్యవేక్షణ.. నౌకా భద్రత కార్యకలాపాలపై
సమన్వయ సహిత చర్యలు చేపట్టిన ప్రభుత్వం

· వాణిజ్య విమానాలు.. వీసాలపై సమాచారంతో సాయం చేసేందుకు భారతీయులతో దౌత్య కార్యాలయాల నిరంతర సంప్రదింపులు

· వంటగ్యాస్‌ సిలిండర్ల బుకింగ్‌ విషయంలో ఆందోళన వద్దని పౌరులకు సూచన

· తప్పుదోవ పట్టించే సమాచారం... వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి

నాడు పోస్టు చేయడమైనది: 12 MAR 2026 7:53PM by PIB Hyderabad

పశ్చిమాసియాలో తాజా పరిస్థితులకు ప్రతిస్పందనగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై తాజా సమాచారాన్ని వివిధ మంత్రిత్వ శాఖల సీనియర్‌ అధికారులు ఇవాళ జాతీయ మాధ్యమాల ప్రతినిధులకు వివరించారు. ఈ మేరకు పెట్రోలియం-సహజ వాయువు, విదేశీ వ్యవహారాలు, ఓడరేవులు-షిప్పింగ్-జలమార్గాలు, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖల అధికారులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో నిరంతర ఇంధన సరఫరాతోపాటు సముద్ర భద్రత, ప్రవాస భారతీయుల సంక్షేమానికి భరోసా తదితరాలపై కేంద్ర ప్రభుత్వ సంసిద్ధత, ఏర్పాట్ల గురించి తెలియజేశారు. ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, తప్పుదోవ పట్టించే కథనాలు,  వదంతులను నమ్మవద్దని సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇంధన సరఫరా.. లభ్యత

నిరంతరాయ ఇంధన సరఫరాల దిశగా కేంద్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలూ చేపట్టిందని, నిత్యం 50 లక్షల సిలిండర్లు పంపిణీ అవుతున్నాయని, పెట్రోలియం-సహజ వాయువు మంత్రిత్వశాఖ హామీ ఇచ్చింది.

ముడి చమురు.. శుద్ధి కర్మాగారాలు

·        యుద్ధం ఇవాళ 13వ రోజుకు చేరిన నేపథ్యంలో చరిత్రలోనే తొలిసారి, హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకల నిషేధం కొనసాగుతోంది. అయినప్పటికీ, 40కి పైగా దేశాల నుంచి భారత్‌కు ముడి చమురు సరఫరా అవుతోంది. ఆ మేరకు 70 శాతందాకా ఇతర మార్గాల నుంచి అందుతోంది. మన రోజువారీ వినియోగం 5.5 మిలియన్ బ్యారెళ్లు కాగా, దేశంలోని 22 శుద్ధి కర్మాగారాలతో భారత్‌ ప్రపంచంలో 4వ అతిపెద్ద శుద్ధి కూడలిగా ఉందని అధికారులు తెలిపారు. దీంతోపాటు ఈ కర్మాగారాలన్నీ పూర్తిస్థాయిలో... కొన్ని సందర్భాల్లో 100 శాతం మించిన సామర్థ్యంతో పనిచేస్తున్నాయని చెప్పారు.

·        భారీ శుద్ధి సామర్థ్యమే కాకుండా పెట్రోలియం ఉత్పత్తి-లభ్యతల పరంగా భారత్‌ సురక్షిత స్థానంలో ఉన్నందువల్ల ప్రపంచ సంక్షోభాన్ని స్థిరంగా అధిగమిస్తోంది.

·        అలాగే దాదాపు లక్షదాకా విస్తృత చిల్లర విక్రయ కేంద్రాల నెట్‌వర్క్‌ ఉండటమేగాక అవన్నీ పూర్తిస్థాయి నిల్వలతో సరఫరాకు లోటు లేకుండా చూస్తున్నాయి.

సహజవాయువు

·        అనివార్య పరిస్థితుల వల్ల ప్రభావితమైన సహజ వాయువు సరఫరా కొరతను తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు, సరఫరాదారుల ద్వారా కొనుగోళ్లు చేపట్టారు. ఈ పరిస్థితిని సమర్థంగా నిభాయిస్తూ, సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 9న నిత్యావసర వస్తువుల చట్టం కింద సహజ వాయువుపై నియంత్రణ ఉత్తర్వు జారీ చేసింది.

వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) సరఫరా

·        దేశంలో వినియోగించే వంటగ్యాస్‌లో 60 శాతం మేర భారత్‌ దిగుమతి చేసుకుంటుండగా ఇందులో దాదాపు 90 శాతం హోర్ముజ్ జలసంధి ద్వారానే వస్తుంది. అయితే, ఈ యుద్ధ పరిస్థితి వల్ల ఈ మార్గం మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా సమస్యలు తలెత్తినందున డిమాండ్-సరఫరా సమతౌల్యం కొనసాగించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.

·        శుద్ధి కర్మాగారాల ద్వారా వంటగ్యాస్‌ ఉత్పత్తిని పెంపు: ఈ నెల 9న జారీ అయిన ‘ఎల్‌పీజీ'  నియంత్రణ ఉత్తర్వు ప్రకారం- అన్ని కర్మాగారాలూ ఉత్పత్తి పెంచాయి. అంతేగాక ప్రొపేన్, బ్యూటేన్, ప్రొపైలిన్, బ్యూటీన్‌ సహిత సి3, సి4 హైడ్రోకార్బన్ల మొత్తం ఉత్పత్తిని దేశీయ వంట గ్యాస్ కోసం 3 చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రత్యేకంగా అందిస్తున్నాయి. అందువల్ల గత 5 రోజుల్లో ఈ కర్మాగారాల్లో ఎల్‌పీజీ ఉత్పత్తి 28 శాతం పెంచగా, అదనపు కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయి.

·        దేశవ్యాప్తంగా 25,000కుపైగా పంపిణీ సంస్థలు ఉండగా, నిల్వల పరిస్థితిని రోజువారీ నివేదికల ద్వారా నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు ఏ ఒక్కచోట కూడా పూర్తిస్థాయి కొరత ఏర్పడలేదు. మొత్తం మీద నిత్యం 50 లక్షలకు పైగా సిలిండర్లు వినియోగదారులకు చేరుతున్నాయి. అయితే, అవనసర భయాందోళనలతో ప్రజలు ఆదుర్దా పడుతుండటంతో బుకింగ్‌ ఒత్తిడి కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్త అనిశ్చితి నేపథ్యంలో ఈ ఒత్తిడి అవసరం లేదని, అనవసర బుకింగ్‌ చేయకుండా అధికారులతో సహకరించాలని, అదే సమయంలో ఇంధన పొదుపు పాటించాలని మంత్రిత్వశాఖ కోరింది.

·        గృహేతర వంటగ్యాస్‌ విషయంలో- ఆస్పత్రులు, విద్యాసంస్థల వంటి కీలక రంగాలకు ప్రాధాన్యం  ఇస్తున్నారు. రెస్టారెంట్లు, హోటళ్ళు, ఇతర వాణిజ్య వినియోగదారులకు కేటాయింపుపై సమీక్ష దిశగా ఐఓసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ సంస్థల నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. అందుబాటులోగల వంటగ్యాస్‌ సముచిత, పారదర్శక రీతిలో పంపిణీ అయ్యేలా ప్రణాళిక ఖరారు కోసం రాష్ట్రాల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులతో ఈ కమిటీ చర్చిస్తోంది. ఓ కీలక నిర్ణయంలో భాగంగా సగటు నెలవారీ వాణిజ్య వంటగ్యాస్‌ వినియోగంలో 20 శాతాన్ని ‘ఓఎంసీ’లు నేటినుంచి రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం ద్వారా కేటాయిస్తాయి. తద్వారా అక్రమ నిల్వకు లేదా బ్లాక్ మార్కెటింగ్‌కు అవకాశం ఉండదు.

·        వాణిజ్య సిలిండర్ల సరఫరా దిశగా ‘ఓఎంసీ’లు అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సంప్రదిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అధికారులు చర్చించారు.

·        వంటగ్యాస్‌, సహజ వాయువుకు డిమాండ్‌ ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన సరఫరా చేపడుతున్నారు. ఈ మేరకు చిల్లర విక్రయ కేంద్రాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కిరోసిన్‌ను అందుబాటులోకి తెచ్చారు. అలాగే, పారిశ్రామిక-వాణిజ్య వినియోగదారులకు ఇంధన చమురు సౌలభ్యం కల్పించారు. ఈ సంక్షోభ సమయాన ఆతిథ్య, రెస్టారెంట్ విభాగానికి ప్రత్యామ్నాయ ఇంధనం కింద బయోమాస్, ఆర్డీఎఫ్‌ గుళికలు, కిరోసిన్/బొగ్గును ఒక నెలపాటు వినియోగించేలా అనుమతించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులకు కేంద్ర అటవీ-పర్యావరణ-వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ సూచించింది. ఈ చర్యతో విస్తృత శ్రేణి సంస్థలు,  ప్రాధాన్యంగల వినియోగదారులు ‘ఎల్‌పీజీ’ నుంచి వీటి వాడకం వైపు మళ్లే వీలుంటుంది.

·        బొగ్గు మంత్రిత్వ శాఖ నిన్న రాష్ట్ర ప్రతిపాదిత సంస్థలకు అధిక మొత్తంలో బొగ్గు  కేటాయింపుపై  ఆదేశాలిచ్చింది. ఆ మేరకు చిన్న, మధ్య తరహా, ఇతర వినియోగదారులకు ప్రాధాన్యమిచ్చింది.

·        అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 48,000 కిలో లీటర్ల మేర  కేటాయించగా, ఓ త్రైమాసికానికి లక్ష కిలో లీటర్లకు పైగా అంచనాతో ఇప్పటికే వంట ఇంధనం కేటాయించారు.

సముద్ర భద్రత... నౌకా రవాణా కార్యకలాపాలు

పర్షియా గల్ఫ్ ప్రాంతంలో సముద్ర రవాణా స్థితిగతులు, భారత నావికుల భద్రత-సంక్షేమం, భారత సముద్ర రంగ ప్రయోజనాల పరిరక్షణ దిశగా చేపట్టిన చర్యలపై ఓడరేవులు-షిప్పింగ్-జలమార్గాల మంత్రిత్వ శాఖ తాజా పరిణామాలను కింది విధంగా విలేకరులకు వివరించింది:

·        భారత పతాకంతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించే 28 నౌకలకుగాను 24 హార్ముజ్ జలసంధికి పశ్చిమాన పయనిస్తుండగా, వీటిలో 677 మంది భారత నావికులున్నారు. ఈ జలసంధికి తూర్పున ప్రయాణించే మిగిలిన 4 నౌకలలో 101 మంది భారత నావికులున్నారు. ఈ నౌకలన్నిటితోపాటు వాటిలోని సిబ్బంది రక్షణ, భద్రతను నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

·        నౌకల భద్రతకు భరోసాతోపాటు సిబ్బందికి వైద్య సహాయం దిశగా భారత రాయబార కార్యాలయాలు, స్థానిక అధికారులతో ఓడల అధికారులు నౌకా నిర్వాహకులు, నియామక సంస్థలు సన్నిహితంగా సమన్వయం చేసుకుంటున్నాయి.

·        భారత పతాకంగల నౌకలు, భారతీయ నావికులు సహా సముద్ర వాణిజ్య కార్యకలాపాల భద్రత, ముందు జాగ్రత్త చర్యలపై షిప్పింగ్ డైరెక్టరేట్‌ జనరల్‌ 2026 ఫిబ్రవరి 28న జారీ చేసిన సూచనాత్మక ఆదేశాలు అమలవుతున్నాయి.

·        మొత్తం మీద భారత్‌ అంతటా ఓడరేవుల కార్యకలాపాలు స్థిరంగా సాగుతున్నాయి. అన్ని ప్రధాన ఓడరేవులు/రాష్ట్ర సముద్ర బోర్డులకు ఒక ప్రామాణిక కార్యకలాపాల ప్రక్రియను నిర్దేశించారు. దీని ప్రకారం భాగస్వామ్య సమన్వయం, సమయానుగుణ సమస్యల పరిష్కారం ద్వారా షిప్పింగ్ సంస్థలు, ఎగుమతిదారుల కోసం సౌకర్యాలను కల్పిస్తున్నారు. అన్ని ప్రధాన ఓడరేవులకూ సంబంధించి ఏకైక సేవా ప్రదాన బాధ్యతతో ఒక నోడల్ అధికారి నియమితులయ్యారు.

·        బెర్తుల కేటాయింపులో ఎల్‌పీజీ రవాణా నౌకలకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాన ఓడరేవులను ఆదేశించారు.

·        మధ్యప్రాచ్యానికి వెళ్లే సరుకుల మధ్యస్థ నిల్వకు అనుమతి, అదనపు నిల్వ సదుపాయం కేటాయింపు, నౌకల తాత్కాలిక బెర్తింగ్‌, పాడైన, తిరిగి వెళ్లే ఎగుమతి సరుకుల నిర్వహణకు ప్రాధాన్యం, కస్టమ్స్‌ విభాగ సమన్వయంతో “బ్యాక్ టు టౌన్” ప్రయాణాన్ని వేగిరపరచడం,  సాధ్యమైన సందర్భాల్లో బంకరింగ్ మద్దతు పెంపు వంటి సౌకర్యాల కల్పన చర్యలను ఓడరేవులు అమలు చేస్తున్నాయి.

·        కస్టమ్స్, డీజీఎఫ్‌టీ వంటి సంస్థలతో సమన్వయం, పోర్ట్ రుసుములలో ఉపశమన కల్పన, సంక్షోభ సమయంలో నిరంతర రవాణాకు మద్దతుపై భరోసా తదితరాలపై దైనందిన చర్యల  నివేదికను మంత్రిత్వ శాఖకు సమర్పించాలని ప్రధాన రేవులకు ఆదేశాలిచ్చారు.

·        మౌలిక సదుపాయాలు, ఆర్థిక సౌకర్యాలు, ఇంధన భద్రత పర్యవేక్షణ, నౌకల భద్రత  కార్యకలాపాలకు సంబంధంచి ప్రభుత్వం ఇప్పటికే సమన్వయ సహిత చర్యలు చేపట్టింది.

·        మంత్రిత్వ శాఖ (28 ఫిబ్రవరి 2026) పరిధిలోనే కాకుండా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్‌ పరిధిలోనూ ప్రత్యేక 24 గంటల కంట్రోల్ రూమ్ పనిచేస్తోంది. సకాలంలో తాజా సమాచారం, అవసరమైన సహాయం దిశగా ఓడల యజమానులు, నిర్వాహకులు, నావికుల కుటుంబాలతో డైరెక్టరేట్ నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తోంది.

·        విదేశీ జెండాలతో ప్రయాణించే నౌకలు సముద్రంలో ప్రమాదం బారిన పడిన సంఘటనల్లో వాటిలో పనిచేసే 78 మంది భారతీయ సిబ్బందికిగాను దురదృష్టవశాత్తూ ముగ్గురు మరణించగా, నలుగురు గాయపడ్డారు. మిగిలినవారిలో 70 మంది క్షేమంగా బయటపడగా, ఒకరు గల్లంతయ్యారు.

·        పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుత సముద్ర స్థితిగతులను ఓడరేవులు-షిప్పింగ్-జలమార్గాల మంత్రిత్వ శాఖ నిశిత పర్యవేక్షణ కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో ముప్పు పెరుగుతున్న దృష్ట్యా పర్యవేక్షణ-సంసిద్ధత చర్యలను బలోపేతం చేసింది.

·        అన్నిరకాల సహాయం అందించేందుకు పారిశ్రామిక, భాగస్వామ్య సంస్థలలో క్రమం తప్పకుండా పరస్పర సంప్రదింపులు కొనసాగుతున్నాయి.

·        భారత నావికుల భద్రత, సంక్షేమానికి భరోసా ఇవ్వడంతోపాటు భారత సముద్ర రంగ  ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.

ఈ ప్రాంతంలోని భారతీయుల భద్రత

జీసీసీ, ఇరాన్‌లోని భారతీయుల భద్రత-సంక్షేమంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా సమాచారం కిందివిధంగా ఉంది:

·        మా దౌత్య కార్యాలయాలు అక్కడి భారతీయులతో నిరంతర సంబంధాలు నెరపుతూ క్రమం తప్పకుండా సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి. వారికి వాణిజ్య విమాన రాకపోకల సమాచారం అందించడంతోపాటు కొన్ని సందర్భాల్లో వీసాల విషయంలోనూ సహాయం చేస్తున్నాయి.

·        ఆర్మేనియా, అజర్‌బైజాన్ దేశాల మీదుగా వాణిజ్య విమానాల్లో స్వదేశం రాదలచిన వారికి రాయబార కార్యాలయం చేయూతనిస్తోంది. అలాగే వీసాలు, భూ సరిహద్దు దాటి రావడానికి కూడా సహాయం చేస్తోంది.

·        పశ్చిమాసియాలో ప్రస్తుత సంఘర్షణల కారణంగా ముగ్గురు భారతీయులను మనం కోల్పోయాం. గల్లంతైన వారిలో ఒకరు ప్రస్తుతం మా వద్ద సురక్షితంగా ఉన్నారు.

·        ఈ నలుగురూ ఈ ప్రాంతంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలలో పనిచేస్తున్న వారే.

·        ముగ్గురి మృతదేహాలను సత్వరం భారత్‌ తీసుకురావడం కోసం ఓమన్, ఇరాక్‌లలోని మన రాయబార కార్యాలయాలు, దుబాయ్‌లోని కాన్సులేట్ స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాయి.

·        వాణిజ్య నౌకలపై ఏ పక్షం వైపు నుంచి దాడి జరిగినా భారత్‌ తీవ్రంగా ఖండించడానికి ఇది కూడా ఒక కారణం.

·        ఒక మార్షల్‌ ఐలాండ్‌ పతాకంగల ఓడ ‘సేఫ్‌సీ విష్ణు’ ఇరాక్‌ సమీపాన ప్రయాణిస్తుండగా ఈ తాజా విపరిణామం సంభవించింది.

·        ఈ ఓడలోని 28 మంది సిబ్బందిలో 16 మంది భారతీయులు కాగా, ఒకరు దురదృష్టవశాత్తూ మరణించడంపై మా సంతాపం ప్రకటించాం. మిగిలిన 15 మందిని సురక్షితంగా బస్రా నగరానికి చేర్చారు. మన రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో సంప్రదించడంతోపాటు వారిని తీసుకొచ్చేందుకు అవసరమైన సహాయం చేస్తోంది.

·        పశ్చిమాసియా ఘర్షణలో ఇప్పటిదాకా 24 మందికిపైగా భారతీయులు గాయపడ్డారు. వారిలో చాలామంది చికిత్స అనంతరం కోలుకుని తిరిగి రాగా, మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మీడియా ద్వారా పౌరులకు విజ్ఞప్తి

కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ దేశ పౌరులకు కిందివిధంగా విజ్ఞప్తి చేసింది:

·        సిలిండర్ల బుకింగ్‌ విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావదు... నిరంతరాయ సరఫరా కోసం అన్నిరకాల చర్యలూ తీసుకుంటున్నాం.

·        క్షేత్రస్థాయిలో ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాపై పర్యవేక్షణ, అవసరమైన చర్యల దిశగా జిల్లా స్థాయి కమిటీలు, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను స్పష్టం చేశాం.

·        తప్పుదోవ పట్టించే సమాచారం, వదంతుల వ్యాప్తికి స్వస్తి చెప్పడంతోపాటు విశ్వసనీయ, ధ్రువీకృత సమాచారం మాత్రమే పోస్ట్ చేయాలని సామాజిక మాధ్యమ వినియోగదారులకు విజ్ఞప్తి చేశాం.

·        ఈ సమయంలో పరిస్థితులు క్షణక్షణానికీ మారిపోతుంటాయి కాబట్టి, ఒకే దృశ్యాన్ని పదేపదే ప్రసారం చేయవద్దని టీవీ ఛానెళ్లకు సూచించాం. అలాగే, దృశ్యాలను తేదీ, సమయంతో ఇవ్వాలని కూడా కోరాం. తద్వారా సంబంధిత అంశం ఎప్పటిదో, ఎక్కడ జరిగిందో పౌరులకు సవ్యంగా తెలుస్తుంది.

·        నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వపై కఠిన చర్యలు చేపట్టాలని, నిత్యావసర సామగ్రి నిరంతర లభ్యతపై దృష్టి సారించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు సూచించాం.

 

***


(రిలీజ్ ఐడి: 2239645) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam