ఆర్థిక మంత్రిత్వ శాఖ
తక్కువ, మధ్యతరహా ఆర్థిక వ్యవస్థల్లో మౌలిక సదుపాయాల రంగంలో ప్రైవేటు పెట్టుబడుల పరంగా భారత్ ను తొలి అయిదు దేశాల్లో ఒకటిగా పేర్కొన్న ప్రపంచ బ్యాంకు
సుమారు పదింతలు పెరిగిన హై-స్పీడ్ కారిడార్ల పొడవు.. 2014 ఆర్థిక సంవత్సరంలో 550 కిలోమీటర్లు నుంచి 2025 డిసెంబర్ నాటికి 5,364 కిలోమీటర్లకు చేరువ
ప్రపంచంలోనే 3వ అతి పెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా అవతరించిన భారత్.. 2014లో దేశంలో 74 ఉండగా, 2025 నాటికి 164కి చేరిన విమానాశ్రయాల సంఖ్య
రేవులో గడిపే సమయం తగ్గడంతో ప్రపంచ బ్యాంకు 2024 సూచీ ప్రకారం టాప్ 100 ఓడరేవుల్లో దేశానికి చెందిన 7 ఓడరేవులకు చోటు
పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, సౌర విద్యుత్ సామర్థ్యంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో భారత్
प्रविष्टि तिथि:
29 JAN 2026 2:10PM by PIB Hyderabad
భారతదేశ వృద్ధి వ్యూహంలో మౌలిక సదుపాయాల రంగం ఇప్పటికీ కేంద్ర బిందువుగా ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2015 నుంచి ప్రభుత్వ మూలధన వ్యయం నిరంతరంగా పెరుగుతూ వస్తోంది. ఈ మార్పులో ముఖ్యమైనది పీఎం గతిశక్తి ద్వారా బహుళ నమూనా ప్రణాళికను వ్యవస్థీకృతం చేయడం. దీనికి జాతీయ సరుకు రవాణా విధానం, డిజిటల్ వేదికలు తోడవ్వడం వల్ల లావాదేవీల ఖర్చులు తగ్గడంతో పాటు పనుల అమలులో ఎదురయ్యే ముప్పులు కూడా తగ్గాయని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025–26 వెల్లడించింది.
ప్రభుత్వ మూలధన వ్యయంలో భారీ పెరుగుదల
ఈ మార్పులో ప్రధాన అంశం ప్రజా మూలధన వ్యయంలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. భారత ప్రభుత్వ మూలధన వ్యయం 2018 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.63 లక్షల కోట్లు ఉండగా.. అది 2026 నాటికి దాదాపు 4.2 రెట్లు పెరిగి రూ. 11.21 లక్షల కోట్లకు చేరుకుంది. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభావవంతమైన మూలధన వ్యయం రూ. 15.48 లక్షల కోట్లుగా ఉంది. ఇది మౌలిక సదుపాయాలను కీలక వృద్ధి చోదకంగా నిలిపింది. మౌలిక సదుపాయాలు ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చాలా బలంగా ఉంటుందని సర్వే చెప్పింది.
భారత మౌలిక సదుపాయాల ఆర్థిక స్వరూపంలో మార్పులు
దేశంలో మౌలిక సదుపాయాల నిధుల సమీకరణ రంగం వేగంగా మారుతోందని, కేవలం బ్యాంకు రుణాలపైనే విభిన్న మార్గాల్లో విస్తరిస్తోందని సర్వే పేర్కొంది.. 2020-25 కాలంలో వాణిజ్య రంగానికి ఎన్‌బీఎఫ్‌సీ ఇచ్చే రుణాలు 43.3శాతం వార్షిక వృద్ధి రేటుతో పెరిగాయి. దీర్ఘకాలిక సంస్థాగత మూలధనాన్ని సమీకరించడంలో మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్‌లు(ఇన్విట్‌లు), రియల్ ఎస్టేట్ పెట్టుబడి ట్రస్ట్‌లు (రీట్‌లు) కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆర్థిక సర్వే 2025–26 పేర్కొంది.
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం
ఆర్థిక సర్వే 2025–26 ప్రకారం తక్కువ, మధ్యతరహా ఆదాయ దేశాల జాబితాలో మౌలిక సదుపాయాల రంగంలో ప్రైవేట్ పెట్టుబడుల పరంగా టాప్ 5 దేశాల్లో భారత్ ఒకటిగా నిలిపిందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. దక్షిణాసియా ప్రాంతంలో మొత్తం ప్రైవేటు మౌలిక సదుపాయాల పెట్టుబడుల్లో భారత్ 90 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. దీంతో ఈ ప్రాంతంలోనే అత్యధిక పీపీఐ పెట్టుబడులను పొందుతున్న దేశంగా భారత్ అవతరించింది. ఈ బలమైన అంతర్జాతీయ స్థితికి అనుగుణంగా దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ఆమోద కమిటీ ద్వారా ఆమోదం పొందుతున్న ప్రాజెక్టుల సంఖ్యలో కూడా గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది.
కీలక భౌతిక మౌలిక సదుపాయాలు
జాతీయ రహదారులు
దేశంలోని రహదారుల మౌలిక సదుపాయాలు గణనీయంగా విస్తరించాయి. జాతీయ రహదారుల వ్యవస్థ 2014లో 91,287 కిలోమీటర్ల నుంచి 2016 డిసెంబర్ నాటికి 1,46,572 కిలోమీటర్లు పెరిగింది. సుమారు 60 శాతం వృద్ధి నమోదైంది. కార్యాచరణలో ఉన్న హై-స్పీడ్ కారిడార్ల పొడవు దాదాపు పది రెట్లు పెరిగింది. 2014 ఆర్థిక సంవత్సరంలో 550 కిలోమీటర్లు ఉన్న ఈ రహదారులు, 2025 డిసెంబర్ నాటికి 5,364 కిలోమీటర్లకు చేరుకున్నాయి. రోడ్లు, జాతీయ రహదారుల రంగంలో కీలక కార్యక్రమాలు, సంస్కరణల్లో హై-స్పీడ్ కారిడార్ అభివృద్ధి, ఆర్థిక కేంద్రాలతో అనుసంధానం, నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం వంటివి ఉన్నాయి. లక్షకు పైగా జనసంఖ్య కలిగిన నగరాల కోసం యాక్సెస్-కంట్రోల్ చేసిన రింగు రోడ్లు, బైపాసుల కోసం కొత్త విధానాన్ని ఖరారు చేశారని ఆర్థిక సర్వే 2025–26 పేర్కొంది.
రైల్వే మౌలిక సదుపాయాలు
రైల్వే మౌలిక సదుపాయాలు నిరంతరంగా విస్తరిస్తున్నాయని ఆర్థిక సర్వే 2025-26 పేర్కొంది. మార్చి 2025 నాటికి దేశీయ రైల్వే వ్యవస్థలోని రైలు పట్టాల పొడుగు 69,439 కిలోమీటర్లకు చేరుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మరో 3,500 కిలోమీటర్ల మేర దీనిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2025 అక్టోబర్ నాటికి 99.1 శాతం రైల్వే మార్గాల విద్యుదీకరణ పూర్తయింది. ఇటీవల కాలంలో రైల్వే మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం రికార్డు స్థాయిలో మూలధన వ్యయం చేస్తోంది. కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్, మల్టీ-ట్రాకింగ్, ఇంజన్లు, కోచ్‌ల పెంపుదల, సిగ్నలింగ్, భద్రతా సంబంధిత పనులపై ప్రధానంగా దృష్టి సారించింది. రైల్వే రంగంలో కీలక కార్యక్రమాలైన ఆర్థిక రైల్వే కారిడార్లు (మూడు ప్రత్యేక కారిడార్ కార్యక్రమాలు - శక్తి, మినరల్, సిమెంట్, ఓడరేవుల అనుసంధానం, అధికంగా ట్రాఫిక్ ఉండే మార్గాలు), ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు, సరుకు రవాణా కోసం ప్రత్యేక కారిడార్లు, స్టేషన్ల పునరాభివృద్ధి (అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా 1337 స్టేషన్లను అత్యాధునికంగా తీర్చిదిద్దడం), భద్రత, సాంకేతికత ఆధునీకరణ (స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్- అడ్వాన్స్‌డ్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అమలు), ట్రాక్‌ఆధునీకరణ (78 శాతం కంటే ఎక్కువ రైల్వే ట్రాక్‌లను గంటకు 110 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేలా అభివృద్ధి), పీపీలు ఉన్నాయి.
పౌర విమానయాన రంగం
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్ అవతరించిందని ఆర్థిక సర్వే పేర్కొంది. దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉండగా, 2025 నాటికి 164కి పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత విమానాశ్రయాలు 41.2 కోట్ల (412 మిలియన్లు) మంది ప్రయాణికులకు సేవలు అందించాయి. ఇది 2031 నాటికి 66.5 కోట్లకు (665 మిలియన్లు) పెరుగుతుందని అంచనా. విమానాల ద్వారా సరుకు రవాణా సామర్థ్యం 2015లో 2.53 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉండగా, 2025 నాటికి అది 3.72 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఆర్‌సీఎస్-ఉడాన్, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ విధనం, విమానాశ్రయ ఆధునీకరణ, సామర్థ్య విస్తరణ, డిజిటల్, సాంకేతిక కార్యక్రమాలు(డీజీయాత్ర, సరళీకృతమైన డ్రోన్ నిబంధనలు), భారతీయ వాయుయాన్ విధేయక్ 2024, ది ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటరెస్ట్స్ ఇన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ యాక్ట్ 2025' వంటి కొత్త చట్టాలు చేపట్టినట్లు ఆర్థిక సర్వే 2025-26 పేర్కొంది.
ఓడరేవులు, నౌకాయానం
మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 ద్వారా ఓడరేవుల మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, నియంత్రణ వ్యవస్థల బలోపేతం, పనితీరు సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచడంలో గణనీయమైన పురోగతి సాధించింది. ఫలితంగా భారతీయ ఓడరేవులు కంటైనర్ నౌకల సగటు ‘టర్న్‌రౌండ్ టైమ్ (నౌక రేవుకు వచ్చి వెళ్లే సమయం)లో దాదాపు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకున్నాయి. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ‘కంటైనర్ పోర్టు ప్రదర్శన సూచిక 2024’ ప్రకారం ప్రపంచంలోని అత్యుత్తమ 100 ఓడరేవుల్లో దేశానికి చెందిన ఏడు ఓడరేవులు చోటు సంపాదించాయి. ఓడరేవులు, నౌకాయాన రంగంలో ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదించిన కీలక చట్టపరమైన సవరణల్లో.. మర్చంట్ షిప్పింగ్ చట్టం 2025, కోస్టల్ షిప్పింగ్ చట్టం 2025, భారతీయ ఓడరేవుల చట్టం 2025, బిల్స్ ఆఫ్ లాడింగ్ చట్టం 2025, సముద్రం ద్వారా సరుకు రవాణా చట్టం 2025 ఉన్నాయి.
అంతర్గత జల రవాణా రంగంలో భారత్ గణనీయమైన పురోగతిని సాధించింది. 2025 నవంబర్ నాటికి దేశంలో 5,155 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 32 జాతీయ జలమార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 29 జలమార్గాలలో సరుకు రవాణా, 15 జలమార్గాల్లో పర్యాటక నౌకల కార్యకలాపాలు, 23 జలమార్గాలలో ప్రయాణికుల సేవలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 11 జాతీయ జలమార్గాలు ఈ మూడు రకాల సేవలను అందిస్తూ బలమైన బహుమార్గ సమన్వయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అంతర్గత జల రవాణా ద్వారా జరిగే సరుకు రవాణా 2013-14లో 18 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉండగా, 2024-25 నాటికి 146 మిలియన్ మెట్రిక్ టన్నులకు గణనీయంగా పెరిగిందని సర్వే తెలిపింది.
నౌకానిర్మాణ రంగంలో దేశపు షిప్ బిల్డింగ్, సముద్రయాన వ్యవస్థను పునరుద్ధరించడానికి 2025 సెప్టెంబర్‌లో రూ. 69,725 కోట్ల భారీ ప్యాకేజీని ప్రభుత్వం ఆమోదించింది.ఈ కార్యక్రమం నాలుగు స్తంభాల విధానాన్నిఅనుసరిస్తుందని, అంతర్జాతీయంగా పోటీ పడగలిగే, సాంకేతికంగా అభివృద్ధి చెందిన, స్థిరమైన సముద్రయాన రంగాన్ని అభివృద్ధి చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆర్థిక సర్వే పేర్కొంది.
విద్యుత్ రంగం
దేశీయ విద్యుత్ రంగం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది. 2025 నవంబర్ నాటికి దేశం మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం వార్షిక ప్రాతిపదికన 11.6 శాతం వృద్ధి చెంది 509.74 గిగావాట్లకు చేరుకుంది. ప్రతి ఇంటికి నిరంతర విద్యుత్ సరఫరా అందించే లక్ష్యంతో రాష్ట్రాలకు,విద్యుత్ పంపిణీ సంస్థలకు మద్దతుగా భారత ప్రభుత్వం పలు పథకాలను అమలు చేసింది.దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన(డీడీయూజీజేవై), ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీమ్ (ఐపీడీఎస్), పీఎం సౌభాగ్య పథకాల కింద పంపిణీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి సుమారు రూ. 1.85 లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టారు. డీడీయూజీఏవై ద్వారా 18,374 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. సౌభాగ్య పథకం అమలు కాలంలో 2.86 కోట్ల గృహాలకు కొత్తగా విద్యుత్ కనెక్షన్లు లభించాయి. ఈ సంస్కరణల ఫలితంగా 2014 ఆర్థిక సంవత్సరంలో 4.2 శాతంగా ఉన్న విద్యుత్ డిమాండ్, సరఫరా మధ్య అంతరం.. 2025 నవంబర్ నాటికి శూన్యానికి చేరింది. అంటే దేశంలో విద్యుత్ కొరత పూర్తిగా తొలిగిపోయింది.
విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక స్థిరత్వాన్ని, పనితీరు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి రాష్ట్రాలకు మద్దతుగా 2021లో రూ. 3.03 లక్షల కోట్ల వ్యయంతో ‘రివాంప్‌డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్’ను ప్రారంభించారు.ఈ పథకం, ప్రభుత్వం చేపట్టిన ఇతర చర్యల వల్ల విద్యుత్ రంగ సంస్కరణల్లో ఒక చారిత్రక మలుపు చోటుచేసుకుంది. 2025లో విద్యుత్ పంపిణీ సంస్థలు చరిత్రలో తొలిసారిగా రూ. 2,701 కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. విద్యుత్ సరఫరాలో జరిగే సాంకేతిక, వాణిజ్య నష్టాలు 2014లో 22.62 శాతం ఉండగా 2025 నాటికి అవి 15.04 శాతానికి తగ్గాయి. విద్యుత్ పంపిణీ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం విద్యుత్ (సవరణ) బిల్లు, 2026ను ప్రతిపాదించింది. విద్యుత్ రంగంలో సామర్థ్యాన్ని, పోటీతత్వాన్ని, ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ఆర్థిక సర్వే పేర్కొంది.
పునరుత్పాదక ఇంధనం
దేశ ఇంధన రంగం ఒక గొప్ప నిర్మాణాతక మార్పుకు లోనవుతోందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2025 నవంబర్ నాటికి దేశ మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో పునరుత్పాదక ఇంధన వాటా సుమారు 49.83 శాతానికి చేరుకుంది.మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, సౌర విద్యుత్ సామర్థ్యంలో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో నిలిచింది. పవన విద్యుత్ సామర్థ్యంలో ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉంది. గత పదేళ్ల కాలంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం మూడు రెట్లు కంటే ఎక్కువ పెరిగింది. 2014 మార్చిలో 76.38 గిగావాట్లుగా ఉన్న ఈ సామర్థ్యం 2025 నవంబర్ నాటికి 253.96 గిగావాట్లకు చేరుకుందని ఆర్థిక సర్వే 2025–26 పేర్కొంది.
ఇటీవలి కాలంలో దేశం అనుసరిస్తున్న మౌలిక సదుపాయాల వ్యూహం.. భారీ స్థాయి, సమగ్రత, నాణ్యత వైపు నిర్ణయాత్మకమైన మార్పును ప్రతిబింబిస్తోందని ఆర్థిక సర్వే నిర్ధారించింది. స్థిరమైన ప్రభుత్వ మూలధన వ్యయం దేశ ఆర్థిక వృద్ధికి ఒక శక్తిమంతమైన ఉత్ప్రేరకంలా పనిచేస్తోంది సర్వే తేల్చింది. రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, పౌర విమానయానం, ఇంధనం, డిజిటల్, గ్రామీణ మౌలిక సదుపాయాల రంగాలలో సమన్వయంతో కూడిన పెట్టుబడుల వల్ల స్పష్టమైన ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ప్రయాణ సమయం తగ్గడం, వేగవంతమైన రవాణా, సరుకు రవాణా పనితీరు, సౌకర్యాల లభ్యత, నిత్యావసర సేవలు ప్రజలందరికీ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి.పీఎం గతిశక్తి ద్వారా సమగ్ర ప్రణాళికను వ్యవస్థీకరించడంతో పాటు.. ఆర్థిక వనరుల సమీకరణ, ఆస్తుల నగదీకరణ, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు ప్రాజెక్టుల రూపకల్పన, అమలును బలోపేతం చేశాయి. ఇవన్నీ కలిసి ప్రైవేటుపెట్టుబడులను భారీగా ఆకర్షించడానికి దోహదపడ్డాయని ఆర్థిక సర్వే వివరించింది.
***
(रिलीज़ आईडी: 2220531)
आगंतुक पटल : 33
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam