ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశాన్ని భవిష్యత్తు అవసరాలకు సిద్ధం చేయడానికి సరైన నైపుణ్యాలను అందించాలి: ఆర్థిక సర్వే


భారత్‌లో నైపుణ్య విప్లవానికి నాయకత్వం వహిస్తున్న ఏఐ, ఐఓటీ, పునరుత్పాదక ఇంధనం, 3డీ ప్రింటింగ్ వంటి భవిష్యత్ నైపుణ్య కోర్సులు

ఐటీఐల ఆధునీకరణ కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన పథకం కింద 1000 ప్రభుత్వ ఐటీఐల ఆధునికీకరణ

జాతీయ అప్రెంటిస్‌షిప్ ప్రోత్సాహక పథకం (పీఎం-ఎన్ఏపీఎస్) కింద 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పనిచేస్తోన్న 43.47 లక్షల మందికి పైగా అప్రెంటిస్‌లు

प्रविष्टि तिथि: 29 JAN 2026 1:52PM by PIB Hyderabad

ధేశానికి ఉన్న జనాభా ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మారుతున్న కార్మిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఒక సమగ్రమైన, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్న నైపుణ్య వ్యవస్థను తయారుచేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2025-2026 ఆర్థిక సర్వే తెలిపింది. 

నైపుణ్యాల అందుబాటును మెరుగుపరిచేందుకు, వాటి నాణ్యతను మెరుగుపరచడానికి చక్కగా అనుసంధానమైన నైపుణ్యాభివృద్ధి వ్యవస్థ అవసరమని ఆర్థిక సర్వే పేర్కొంది. నైపుణ్య విధానం అనేది విద్య, కార్మిక  మార్కెట్లు, పరిశ్రమల కలయికకు కేంద్రంగా ఉంటుంది. వివిధ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, వివిధ స్థాయిలలోని ప్రభుత్వాలు, విద్యార్థులు, అధ్యాపకులు, కార్మికులు, యజమానులు, కార్మిక సంఘాలు, ఇతర సంబంధిత వ్యక్తులతో కూడిన విస్తృత శ్రేణి భాగస్వాముల మధ్య సన్నిహిత సమన్వయం, సహకారం దీనికి అవసరం. పీఎల్ఎఫ్ఎస్ 2023-24 ప్రకారం వృత్తిపరమైన లేదా సాంకేతిక శిక్షణ పొందిన వ్యక్తుల వాటా (15-59 వయస్సు విభాగంలో) 2017-18లో 8.1 శాతం ఉండగా 2023-24 నాటికి 34.7 శాతానికి పెరిగింది. ఇది దేశంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల సానుకూల ప్రభావాన్ని తెలియజేస్తోంది. 

భవిష్యత్ నైపుణ్య కోర్సులు

ఏఐ, ఐఓటీ, పునరుత్పాదక ఇంధనం, 3డీ ప్రింటింగ్ వంటి రంగాల్లో 31 భవిష్యత్ నైపుణ్య (ఫ్యూచర్ స్కిల్స్) కోర్సులతో సహా 169 కోర్సులను (ట్రేడ్స్) తయారు చేయటం ద్వారా ఎన్ఎస్‌క్యూఎఫ్ ఆమోదిత శిక్షణ విస్తరించింది. ఇవి దేశవ్యాప్త ఐటీఐలు, జాతీయ నైపుణ్య శిక్షణ ద్వారా అందుబాటులో ఉన్నాయి. 

ఐటీఐల ద్వారా నైపుణ్యాభివృద్ధి వ్యవస్థ బలోపేతం

శిక్షణ నాణ్యతతో పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఉండటం, సంస్థాగత సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారిస్తూ ఐటీఐ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను సంస్కరణలు బలోపేతం చేస్తున్నాయి. స్మార్ట్ తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ కంటెంట్, పరిశ్రమలకు అనుగుణంగా ఉండే దీర్ఘకాలిక - స్వల్పకాలిక కోర్సుల ద్వారా 200 హబ్ ఐటీఐలు, 800 స్పోక్ ఐటీఐలతో సహా మొత్తం 1,000 ప్రభుత్వ ఐటీఐలను అప్‌గ్రేడ్ చేయాలని ఐటీఐల ఆధునీకరణ కోసం ఉద్దేశించిన జాతీయ పథకం ప్రతిపాదించింది. 

పరిశ్రమల అవసరాలకు నైపుణ్యాభివృద్ధిని అనుసంధానించడం

పాఠ్యాంశాలు, శిక్షణ, అప్రెంటిస్‌షిప్‌లు, మూల్యాంకనాల్లో పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంపొందించడం అనేది  నైపుణ్యాభివృద్ధిని మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మార్చాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. సంస్థలు, ప్రమాణాలు, కార్యక్రమాల పర్యవేక్షణ అంతటా పరిశ్రమలను భాగస్వామ్యం చేయటం వల్ల శిక్షణకు ఉన్న ప్రాముఖ్యత, విశ్వసనీయత పెరుగుతుంది. దీనిని గుర్తిస్తూ పీఎంకేవీవై 4.0 కింద పరిశ్రమల నేతృత్వంలోని సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ (ఎస్ఎస్‌‍సీ) అభివృద్ధి చేసిన నైపుణ్య శిక్షణను ఎన్‌ఎస్‌క్యూఎఫ్ సంబంధిత ఉద్యోగాల విషయంలో అందిస్తున్నారు. అలాగే అనేక కోర్సులను నేరుగా పరిశ్రమ ప్రాంగణాల్లోనే ఆయా యజమాన్య సంస్థలకు చెందిన శిక్షకుల ద్వారా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా క్రమం తప్పకుండా నిర్వహించే ఉద్యోగ మేళాలు, నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళాలు యజమానులకు, ఉద్యోగార్థులకు మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తున్నాయి. 

యజమానులు, ఉద్యోగార్థులను అనుసంధానించటం

క్రమం తప్పకుండా నిర్వహించే ఉద్యోగ మేళాలు, నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళాలు యజమానులకు, ఉద్యోగార్థులకు మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయని ఆర్థిక సర్వే తెలిపింది. డిజిటల్ సాంకేతికతలు, హరిత ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, అధునాతన వ్యవసాయం, ఆర్థిక సేవలు, ఈ-కామర్స్ రంగాలపై పీఎంకేవీవై 4.0 చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ అనేది భారతదేశ దీర్ఘకాలిక వృద్ధి చోదక శక్తులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న కొత్త అవకాశాల వైపు నైపుణ్యాభివృద్ధి పెట్టుబడులను మళ్లించడానికి జరుగుతున్న ఒక క్రమబద్ధమైన ప్రయత్నాన్ని తెలియజేస్తున్నాయి.

ఎస్ఐడీహెచ్, ఎన్‌సీఎస్, ఈ-శ్రమ్ పోర్టల్‌ల అనుసంధానం ఒక పటిష్ఠమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టించింది. దీనిని తక్షణ పర్యవేక్షణ, శిక్షణ రికార్డులను ఉపాధి ఫలితాలతో అనుసంధానించడం, యజమానుల డిమాండ్- వ్యక్తిగత నైపుణ్య ప్రయాణాలను అంచనా వేయడానికి ఉపయోగించుకోవచ్చు.

భారతదేశ అప్రెంటిస్‌షిప్ వ్యవస్థ

భారతదేశ అప్రెంటిస్‌షిప్ వ్యవస్థ కూడా విధానపరమైన, నిర్మాణాత్మక పరివర్తనకు లోనైంది. జాతీయ అప్రెంటిస్‌షిప్ ప్రోత్సాహక పథకం (ఎన్ఏపీఎస్), ఎన్ఏటీఎస్ కార్యక్రమాలు విస్తృత శ్రేణి రంగాలు, సంస్థలకు వర్తించేలా విస్తరణకు గురయ్యాయి. పీఎం-ఎన్ఏపీఎస్ కింద 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 43.47 లక్షల మందికి పైగా అప్రెంటిస్‌లు పనిచేస్తున్నారు. ఇందులో 51,000 కంటే ఎక్కువ సంస్థలు భాగస్వామ్యం కాగా.. మహిళల భాగస్వామ్యం 20 శాతానికి చేరుకుంది. ఎన్ఏటీఎస్ కార్యక్రమం కూడా 2025 ఆర్థిక సంవత్సరంలో 5.23 లక్షల మంది అప్రెంటిస్‌ల నియామకాన్ని నమోదు చేసింది. ఇది భారతదేశ అప్రెంటిస్‌షిప్ వ్యవస్థ విషయంలో విస్తరిస్తున్న పరిధి, సంస్థాగత పరిపక్వతను తెలియజేస్తోంది. 

భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు

వృద్ధి ప్రయాణంలో భారత్ ముందుకు సాగుతున్న వేళ సంస్థాగత సమన్వయాన్ని పెంపొందించడం, ఏకోన్ముఖ ప్రభుత్వం అనే దృక్పథాన్ని ప్రోత్సహించడం వల్ల నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కార్యక్రమాలు పరస్పర సహకారంతో, సమన్వయ పద్ధతిలో పనిచేయడానికి వీలవుతుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాన్ని అందించడంపై మరింత దృష్టి సారించడానికి ఇది వేదికను సిద్ధం చేస్తుంది. ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న మానవ వనరులను తయారుచేసేందుకు, నైపుణ్యం-పరిశ్రమ అనుసంధానాలను బలోపేతం చేయడానికి ఇదే కేంద్రబిందువుగా నిలుస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2220501) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam