ప్రధాన మంత్రి కార్యాలయం
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పోర్టు బ్లెయిర్‌లోని వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయ కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన ప్రారంభోత్సవం, ప్రధాన మంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
18 JUL 2023 1:47PM by PIB Hyderabad
నమస్కారం!
అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ డీకే జోషి, మంత్రివర్గ సహచరులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, వీకే సింగ్, పార్లమెంటరీ సహచరులు, ఇతర ప్రముఖులు, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన నా సోదరీసోదరులారా..
నేటి కార్యక్రమం పోర్టు బ్లెయిర్‌లో జరుగుతున్నప్పటికీ.. యావత్ దేశం దృష్టి ఈ కార్యక్రమంపైనే ఉంది. వీర్ సావర్కర్ విమానాశ్రయ సామర్థ్యాన్ని పెంచాలని అండమాన్ నికోబార్ ప్రజల నుంచి చాలా కాలంగా డిమాండ్ ఉంది. మా గత పార్లమెంట్ సభ్యులు ఈ విషయంపై పని చేయడానికి ప్రతి వారం నా ఛాంబర్‌కు వచ్చేవారు. అందుకే ఈరోజు ఆయన ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు. నా పాత మిత్రులందరినీ నేను తెరపై చూడగలుగుతున్నాను. నేను ఈ రోజు స్వయంగా మీతో కలిసి ఈ వేడుకలో పాల్గొని ఉంటే బాగుండేది. కానీ సమయం లేకపోవడం వల్ల రాలేకపోయాను. అయితే మీ అందరి ముఖాల్లోని ఆనందాన్ని నేను చూడగలుగుతున్నాను. అక్కడ నెలకొన్న ఉత్సాహభరితమైన వాతావరణాన్ని నేను ఇక్కడి నుంచే అనుభూతి చెందుతున్నాను.
మిత్రులారా,
ఈ ప్రాంతాన్ని సందర్శించాలనుకునే దేశవ్యాప్త ప్రజలందరికీ కూడా ఇదే కోరిక ఉండేది. ఇప్పటివరకు ఉన్న టెర్మినల్ సామర్థ్యం రోజుకు 4,000 మంది పర్యాటకలను మాత్రమే నిర్వహించగలిగేది. కానీ ఈ కొత్త టెర్మినల్ నిర్మాణం తర్వాత ఈ విమానాశ్రయం ప్రతిరోజు సుమారు 11,000 మంది పర్యాటకులను నిర్వహించే సామర్థ్యాన్ని పొందింది. కొత్త వ్యవస్థ కింద ఇప్పుడు విమానాశ్రయంలో ఒకేసారి 10 విమానాలను నిలపడానికి వీలవుతుంది. అంటే ఇక్కడికి కొత్త విమాన సర్వీసులు రావడానికి మార్గం సుగమమైంది. ఎక్కువ విమానాలు, ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడికి రావడం అంటే నేరుగా మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే. పోర్ట్ బ్లెయిర్‌లోని ఈ కొత్త టెర్మినల్ భవనం వల్ల ప్రయాణ సౌలభ్యం పెరుగుతుంది. వ్యాపార నిర్వహణ సౌలభ్యం మెరుగుపడుతుంది. అనుసంధానం మరింత బలపడుతుంది. ఈ సౌకర్యం లభించినందుకు దేశ ప్రజలకు, పోర్టు బ్లెయిర్ మిత్రులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
చాలా కాలం పాటు దేశంలో అభివృద్ధి కేవలం కొన్ని ప్రధాన నగరాలకు లేదా కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యేది. కొన్ని పార్టీల స్వార్థపూరిత రాజకీయాల వల్ల అభివృద్ధి ఫలాలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరలేదు. ఆ పార్టీలు కేవలం తమకు, తమ కుటుంబాలకు వ్యక్తిగతంగా ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇచ్చేవి. దీని ఫలితంగా మన గిరిజన ప్రాంతాలు, ద్వీపకల్పాలు అభివృద్ధికి దూరమై, అభివృద్ధి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గత తొమ్మిది ఏళ్లలో మేం పూర్తి సున్నితత్వంలో గత ప్రభుత్వాలు చేసిన ఆ తప్పులను సరిదిద్దాం. అంతేకాకుండా కొత్త వ్యవస్థలను కూడా అభివృద్ధి చేశాం. ఇప్పుడు దేశంలో ఒక కొత్త అభివృద్ధి నమూనా రూపుదిద్దుకుంది. ఈ నమూనా అందరినీ కలుపుకుని పోయేది, అందరినీ వెంట తీసుకెళ్లేది. ఈ నమూనానే ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’, నేను ‘సబ్ కా వికాస్’ లేదా ‘అందరి అభివృద్ధి’ అని అన్నప్పుడు దానికి అర్థం చాలా విస్తృతమైనది. ‘సబ్ కా వికాస్’ అంటే ప్రతి వ్యక్తి, ప్రతి వర్గం, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందడం అని అర్థం. సబ్ కా వికాస్ అంటే జీవితంలోని ప్రతి అంశం, విద్య, ఆరోగ్యం, అనుసంధానం.. ఇలా అన్ని విధాలుగా అందరి అభివృద్ధి అని అర్థం.
మిత్రులారా,
ఈ ఆలోచనా విధానంతోనే గత 9 ఏళ్లలో అండమాన్ నికోబార్‌లో అభివృద్ధికి ఒక కొత్త అధ్యాయం లిఖించాం. గత ప్రభుత్వం ఉన్న 9 ఏళ్ల కాలంలో.. అంటే మా కంటే ముందున్న ప్రభుత్వ హయాంలో అండమాన్ నికోబార్‌కు దాదాపు రూ. 23 వేల కోట్ల బడ్జెట్ కేటాయించారు. అదే మన ప్రభుత్వం గత 9 ఏళ్లలో అండమాన్ నికోబార్ అభివృద్ధి కోసం దాదాపు రూ. 48 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. అంటే అండమాన్ నికోబార్ అభివృద్ధి కోసం మన ప్రభుత్వం మునుపటి కంటే రెండింతలు ఎక్కువ డబ్బు ఖర్చు చేసింది.
గత ప్రభుత్వం 9 సంవత్సరాల పాలనలో అండమాన్ నికోబార్‌లోని 28 వేల ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు ఇచ్చారు. కానీ మన ప్రభుత్వ 9 ఏళ్ల హయాంలో ఇక్కడ దాదాపు 50 వేల ఇళ్లకు నీటి కనెక్షన్లు అందించాం. అంటే ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ అందించే విషయంలో మన ప్రభుత్వం మునుపటి కంటే రెండింతలు వేగంగా పనిచేసింది.
ఈరోజు ఇక్కడ ఉన్న దాదాపు ప్రతి ఒక్కరికీ సొంత బ్యాంకు ఖాతా ఉంది. ప్రతి పేదవాడికి ‘‘ఒక దేశం, ఒకే రేషన్ కార్డు’’ సౌకర్యం లభించింది. గత ప్రభుత్వ హయాంలో అండమాన్ నికోబార్‌లో కనీసం ఒక్క వైద్య కళాశాల కూడా లేదు. పోర్టు బ్లెయిర్‌లో వైద్య కళాశాలను ఏర్పాటు చేసింది మన ప్రభుత్వమే.
మిత్రులారా,
అండమాన్ నికోబార్‌లో మెరుగవుతున్న ఈ సౌకర్యాలు ఇక్కడి పర్యాటక రంగానికి గొప్ప ఊతాన్ని ఇస్తున్నాయి. మొబైల్ అనుసంధానం పెరిగినప్పుడు పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగుపడినప్పుడు పర్యాటకుల రాక మరింత పెరుగుతుంది. విమానాశ్రయంలో సౌకర్యాలు మెరుగుపడితే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఇష్టపడతారు. రోడ్లు నాణ్యంగా ఉంటే పర్యాటకులు ఇక్కడ ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపుతారు. అందుకే 2014తో పోలిస్తే అండమాన్ నికోబార్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య ఇప్పుడు రెట్టింపు అయింది.
స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్, సీ-క్రూయిజ్ వంటి సాహస క్రీడల కోసం ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతోంది. అండమాన్ నికోబార్‌లోని నా సోదర సోదరీలారా, ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే ఏళ్లలో ఈ సంఖ్య ఇంకా రెట్టింపు కానుంది. దీనివల్ల అండమాన్ నికోబార్‌లో ఉపాధి, స్వయం ఉపాధికి సంబంధించి కొత్త అవకాశాలు మెండుగా లభించనున్నాయి.
మిత్రులారా,
‘‘విరాసత్ భీ ఔర్ వికాస్ భీ’’.. అంటే వారసత్వ సంపదతోపాటు అభివృద్ధి అనే ఈ గొప్ప మంత్రానికి నేడు అండమాన్ నిలువెత్తు నిదర్శనంగా మారుతోంది. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేయడానికి చాలా కాలం ముందే అండమాన్, నికోబార్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని మీకు కూడా తెలుసు. అయినప్పటికీ ఇక్కడ బానిసత్వపు ఆనవాళ్లు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి.
మిత్రులారా,
2018వ సంవత్సరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్‌లో ఎక్కడైతే జెండా ఎగురవేశారో అదే ప్రదేశంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అదృష్టం నాకు కలిగింది. రాస్ ద్వీపానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టింది మన ప్రభుత్వమే. హావ్‌లాక్, నీల్ దీవులకు ‘స్వరాజ్’, ‘షహీద్’ అని పేరు పెట్టింది కూడా మన ప్రభుత్వమే. దేశం కోసం శౌర్యాన్ని ప్రదర్శించిన వీరపుత్రులైన 21 మంది పరమవీర చక్ర విజేత పేర్లను మేం ఇక్కడి ఇక్కడి 21 దీవులకు పెట్టాం. నేడు అండమాన్ నికోబార్‌లోని ఈ దీవులు దేశాభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా ఉన్న యువతకు సరికొత్త స్ఫూర్తిని ఇస్తున్నాయి.
మిత్రులారా,
స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో మన భారత్ ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకుని ఉండేదని నేను ఎంతో బాధ్యతతో చెబుతున్నాను. మన భారతీయుల్లో సామర్థ్యానికి ఎప్పుడూ కొదవ లేదు. కానీ అవినీతి, కుటుంబ రాజకీయాలు చేసే పార్టీల వల్ల సామాన్యులు, భారతీయుల సామర్థ్యానికి అన్యాయం జరిగింది. నేడు దేశ ప్రజలు 2024 ఎన్నికల్లో మరోసారి మన ప్రభుత్వాన్నే తీసుకురావాలని నిశ్చయించుకున్నారు. వారు ఇప్పటికే ఆ నిర్ణయం తీసుకున్నారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో దేశ దుస్థితికి కారణమైన కొందరు వ్యక్తులు మళ్ళీ తమ మురికి రాజకీయ పద్ధతులను మొదలుపెట్టారు. వారిని చూస్తుంటే నాకు ఒక కవితలోని కొన్ని పంక్తులు గుర్తుకు వస్తున్నాయి. ఒక కవి అవధి భాషలో ఇలా రాశారు.
‘‘పాడేది ఒకటి, పరిస్థితి మరొకటి, లేబుల్ ఒకటి, లోపల సరుకు ఇంకొకటి’’
ఇది 224 ఎన్నికల కోసం కలిసి పోటి చేస్తున్న 26 పార్టీలకు సరిగ్గా సరిపోతుంది.
అంటే వారు పాడుతున్న పాట ఒకటి, కానీ అసలు నిజం మరొకటి. పైన ఉన్న లేబుల్ ఒకటి, లోపల ఉన్న సరుకు వేరొకటి. ఇదే వారి వ్యాపార అసలు రూపం. వారి దుకాణాల్లో రెండు అంశాలకు గ్యారంటీ ఉంటుంది. మొదటిది, వారు తమ దుకాణాల్లో కులతత్వమనే విషాన్ని అమ్ముతారు. రెండోది, ఈ వ్యక్తులు అపరిమితమైన అవినీతికి పాల్పడుతుంటారు. ఈ రోజుల్లో వీరంతా బెంగళూరులో సమావేశమయ్యారు.
ఒకప్పుడు చాలా ప్రసిద్ధ పాట ఒకటి ఉండేది. అది నాకు పూర్తిగా గుర్తులేదు. కానీ కొంత గుర్తుంది. ఒకే ముఖంపై ప్రజలు వేర్వేరు ముసుగులు ధరిస్తారు. వీరి ముఖాలు కూడా అంతే. వీరంతా కెమెరా ముందు ఒకేసారి కలిసినప్పుడు దేశ ప్రజల మనసులో మొదట మెదిలో ఆలోచన.. లక్షల కోట్ల రూపాయల అవినీతి. అందుకే దేశ ప్రజలు దీనిని ‘‘పరిపూర్ణ అవినీతి సదస్సు’ అని పిలుస్తున్నారు. ఈ వ్యక్తులు పాడేది ఒకటి, కానీ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. వారు లేబుల్స్ ఒకటి పెట్టారు. కానీ వారి ఉత్పత్తులు వేరేగా ఉన్నాయి. వారి ఉత్పత్తి రూ. 20 లక్షల కోట్ల కుంభకోణానికి గ్యారంటీ.
మిత్రులారా,
వారి సమావేశానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా కోట్ల రూపాయల కుంభకోణంలో ఇరుక్కొని బెయిల్‌పై బయటకు వచ్చిన వారిని ఇక్కడ ఎంతో గౌరవంగా చూస్తారు. ఒకవేళ ఆ కుటుంబం మొత్తం బెయిల్‌పై ఉంటే వారికి ఇంకా ఎక్కువ గౌరవం లభిస్తుంది. ఏదైనా పార్టీకి చెందిన మంత్రి అవినీతి కేసులో జైలుకు వెళ్తే అతనికి అదనపు మార్కులు వేసి మరీ ‘‘ప్రత్యేక ఆహ్వానితులు’’గా పిలుస్తారు. ఎవరైనా ఒక సామాజిక వర్గాన్ని అవమానించి కోర్టు ద్వారా శిక్ష అనుభవిస్తే వారికి గొప్ప ఆతిథ్యం లభిస్తుంది. ఒకవేళ ఎవరైనా కోట్ల రూపాయల కుంభకోణంలో కోర్టు ద్వారా దోషిగా తేలితే ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఇంకా ఎక్కువ అర్హత లభిస్తుంది. నిజానికి వీరంతా అటువంటి వారి నుంచే మార్గదర్శకత్వం కోరుకుంటారు. అవినీతి విషయంలో వీరి మధ్య అంతటి గొప్ప అనుబంధం, మాభిమానాలు ఉన్నాయి. అందుకే రూ. 20 లక్షల కోట్ల అవినీతికి హామీ ఇచ్చే ఈ వ్యక్తులంతా ఎంతో ప్రేమానురాగాలతో ఒకరినొకరు కలుసుకుంటున్నారు.
మిత్రులారా,
అవినీతిలో కూరుకుపోయిన వీరంతా కుటుంబ రాజకీయాలకు గట్టి మద్దతుదారులు. కుటుంబం ఏం చెబితే అదే సరైనదని వారు నమ్ముతారు. ప్రజాస్వామ్యం అంటే ‘‘ప్రజల, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకోవడం’’ అని నమ్ముతారు. కానీ ఈ కుటుంబ రాజకీయ పార్టీల మంత్రం..‘‘కుటుంబం చేత, కుటుంబం కొరకు, కుంటుంబమే ఎన్నుకునేది’’, ‘‘కుటుంబమే ముందు, దేశం కాదు’’ అన్నదే వీరి నినాదం. ఇదే వీరికి స్పర్తి.
ఈ వ్యక్తులు దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తమ బందీలుగా మార్చుకోవాలని చూస్తున్నారు. నేను వారికి చెప్పదలచుకున్నది ఒక్కటే.. ‘‘అక్కడ ద్వేషం ఉంది, కుంభకోణాలు ఉన్నాయి. అక్కడ బుజ్జగింపు రాజకీయం, వంచన ఉన్నాయి. దశాబ్దాలుగా దేశం ఈ కుటుంబ రాజకీయాల గుప్పిట్లో చిక్కుకుంది’’
మిత్రులారా,
దేశంలోని పేదల పిల్లల అభివృద్ధి వారికి ముఖ్యం కాదు. కేవలం వారి సొంత పిల్లలు, సోదరులు, మేనల్లుళ్ల అభివృద్ధి మాత్రమే ఎల్లప్పుడూ వారి ప్రాధాన్యత. ఈ రోజుల్లో దేశంలో అంకుర సంస్థల సంఖ్య పెరుగుతుండటం మీరు చూస్తున్నారు. మన యువత పేటెంట్లను పొందుతున్నారు. భారీ సంఖ్యలో వ్యాపారాలు నమోదవుతున్నాయి. నా దేశ యువత క్రీడా ప్రపంచంలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మన అమ్మాయిలు అద్భుతాలు సృష్టిస్తున్నారు.
ఈ యువశక్తి మన దేశంలో గతంలో కూడా ఉంది. కానీ ఈ వారసత్వ రాజకీయ పార్టీలు దేశ యువత శక్తికి ఎన్నడూ న్యాయం చేయలేదు. వారికి ఒకే ఒక సిద్ధాంతం ఒకే ఒక ఎజెండా ఉంది. అదే కుటుంబాన్ని కాపాడుకోవడం, కుటుంబం కోసం అవినీతిని బతికించుకోవడం. దేశ అభివృద్ధిని అడ్డుకోవడం, తమ దుష్ట పరిపాలనను కప్పిపుచ్చుకోవడం, అవినీతిపరులపై చర్యలు తీసుకోకుండా ఆపడమే వీరి ఉమ్మడి కనీస కార్యక్రమం.
ఇప్పుడు చూడండి ఈ ముఠా చేసిన అతిపెద్ద కుంభకోణాలు, నేరాల విషయానికి వస్తే ఈ గుంపు నోరు మూసుకుంటుంది. ఏదైనా ఒక రాష్ట్రంలో వారి దుష్పరిపాలన బయటపడితే ఇతర రాష్ట్రాల్లోని వారి బృందం సభ్యులు వెంటనే తమర రక్షణ కోసం వారిని సమర్థిస్తూ వాదనలు మొదలుపెడతారు. కానీ ఎక్కడైనా కుంభకోణం జరిగినా లేదా ఎవరైనా కిడ్నాప్‌కు గురైనా ఈ వంశానికి చెందిన వ్యక్తులందరూ మౌనంగా ఉండిపోతారు.
మిత్రులారా,
కొద్ది రోజుల క్రితమే పశ్చిమ బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికలు జరిగిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. అక్కడ బహిరంగంగా హింస, విచ్చలవిడిగా రక్తపాతం జరిగిది. ఈ విషయంపై కూడా వారందర మాట్లాడటం మానేశారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీల కార్యకర్తలు తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్, వామపక్ష నాయకులు తమ స్వార్థం కోసంకార్యకర్తలను గాలికి వదిలేశారు.
రాజస్థాన్‌లో కుమార్తెలపై జరుగుతున్న దౌర్జన్యాలైనా లేదా పరీక్షా పత్రాల లీకేజీలైనా.. వీరు ప్రతిదానికీ కళ్లు మూసుకుని ఉంటారు. మార్పు గురించి మాట్లాడుతూ ప్రజలను వంచించే వారు కోట్ల రూపాయల మద్యం కుంభకోణాల్లో చిక్కుకున్నప్పుడు ఈ కుటుంబం మళ్లీ వారికి రక్షణ కవచంలా నిలడుతుంది. ఆ పచ్చి అవినీతిని చూసీచూడనట్లు వదిలేస్తారు.
దేశంలోని ఏదైనా దర్యాప్తు సంస్థ వారిపై చర్య తీసుకున్నప్పుడు ప్రతిసారీ వారు చెప్పే మాట ఒక్కటే. ‘‘ఏం జరగలేదు.. ఇదంతా కుట్ర, మమ్మల్ని అన్యాయంగా ఇరికించారు’’. మీరు తమిళనాడును పరిశీలిస్తే.. అక్కడ అనేక అవినీతి, కుంభకోణాల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఈ వంశానికి చెందిన అన్ని పార్టీలు అప్పటికే అందరికీ క్లీన్ చిట్ ఇచ్చేశాయి. అందుకే మిత్రులారా ఈ వ్యక్తులను గుర్తిస్తూ ఉండండి, వారి గురించి తెలుసుకోండి. సోదర సోదరీలారా ఇలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి.
మిత్రులారా,
ఈ వ్యక్తుల కుట్రల మధ్యే మనం దేశాభివృద్ధికి అంకితం కావాలి. నేడు ప్రపంచంలో అపూర్వమైన పురోగతిని సాధించిన ద్వీపాలు, చిన్న దేశాల ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఆ దేశాలు పురోగతి మార్గాన్ని ఎంచుకున్నప్పుడు వారు కూడా వివిధ సవాళ్లను ఎదుర్కొన్నారు.
అన్నీ అనుకున్నంత సులభంగా జరగలేదు. కానీ అభివృద్ధి అనేది జరిగితే అది అన్ని రకాల సమస్యలకు పరిష్కారాలను కూడా తీసుకొస్తుందని ఆ దేశాలు నిరూపించాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ఈ మొత్తం ప్రాంతాన్ని మరింత బలోపేతం చేస్తాయని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అనుసంధానానికి సంబంధించిన ఈ కొత్త సౌకర్యం, అంటే వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్ అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను.
ఈ ఆకాంక్షతో ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆనందాన్ని, ఉత్సాహాన్ని నేను ఇక్కడి నుంచి కూడా అనుభూతి చెందగలుగుతున్నాను.
ఇలాంటి సందర్భంలో దేశం ఒక కొత్త నమ్మకం, కొత్త సంకల్పంతో ముందుకు సాగాలి. అండమాన్ నికోబార్ కూడా దానితో పాటు ముందడుగు వేస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ ఆకాంక్షతో మీ అందరికీ నా శుభాకాంక్షలు, హృదయపూర్వక ధన్యవాదాలు.
***
(रिलीज़ आईडी: 2207572)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam