కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కార్మిక చట్టాలను క్రమబద్ధీకరించి, సరళీకృతం చేసే దిశగా ఆవిష్కృతమైన కీలక ఘట్టం.. నాలుగు కార్మిక కోడ్‌లను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం


భారతదేశ శ్రామికులకు వేతనాలు, భద్రత, సామాజిక భద్రత, సంక్షేమం మెరుగుపరచటం ద్వారా పరివర్తనకు నాంది పలుకుతున్న నాలుగు కార్మిక నియమావళులు

ఉద్యోగ కల్పనను పెంచటంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ కోసం కార్మిక సంస్కరణలను చేపట్టేందుకు సురక్షిత, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే శ్రామిక శక్తి, ధృడమైన పరిశ్రమలకు పునాది వేయనున్న కార్మిక కోడ్‌లు

కార్మికులందరీకీ సామాజిక న్యాయం అందేలా చూసుకుంటూ భారత కార్మిక వ్యవస్థను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మార్చనున్న కోడ్‌లు

Posted On: 21 NOV 2025 3:00PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న 29 కార్మిక చట్టాలను హేతుబద్ధీకరిస్తూ వేతనాల కోడ్- 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్- 2020, సామాజిక భద్రతా కోడ్- 2020, వృత్తిపరమైన భద్రత- ఆరోగ్యం - పని పరిస్థితుల కోడ్-  2020 పేరుతో తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్‌లను 2025 నవంబర్ 21 నుంచి అమలు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కార్మిక నిబంధనలను ఆధునీకరించడం, కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపరచటం, ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పని పరిస్థితులకు అనుగుణంగా కార్మిక వ్యవస్థను తీర్చిదిద్దటం ద్వారా ఈ చట్టాలు.. ఆత్మనిర్భర్ భారత్‌ దిశగా కావాల్సిన కార్మిక సంస్కరణలను అమలు చేస్తాయి. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే శ్రామిక శక్తి, ధృడమైన పరిశ్రమలకు పునాది వేస్తాయి.

భారతదేశంలోని చాలా కార్మిక చట్టాలను స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం పని విధానం, పరిస్థితులు మారుతున్నాయి. అప్పట్లో ఆర్థిక వ్యవస్థ, పని పరిస్థితులు భిన్నంగా ఉండేవి. ప్రపంచంలోని అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థలు ఇటీవల కాలంలో కార్మిక నిబంధనలను అధునికీకరిస్తూ  నియమాలను ఏకీకృతం చేశాయి. భారత్ మాత్రం 29 కేంద్ర కార్మిక చట్టాల కింద ఉన్న విచ్ఛిన్న, సంక్లిష్ట, పాత కాలం నిబంధనలనే కొనసాగిస్తూ వచ్చింది. మారుతున్న ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి చెందుతున్న ఉపాధి రూపాలకు అనుగుణంగా మారేందుకు ఈ వ్యవస్థ శ్రమించాల్సి వచ్చేది. ఇది కార్మికులు, పరిశ్రమలకు అనిశ్చితిని సృష్టించింది. అదే విధంగా చట్టపరమైన నిబంధనల భారాన్ని పెంచింది. వలసరాజ్యాల కాలం నాటి వ్యవస్థను విడిచిపెడుతూ ఆధునిక ప్రపంచ పోకడలకు అనుగుణమైన వ్యవస్థను తీసుకురావాలన్న దీర్ఘకాల డిమాండ్‌ను ఈ కోడ్‌లు నెరవేర్చాయి. ఈ కోడ్‌లు కార్మికులు, సంస్థలు రెండింటికీ సాధికారతను కల్పిస్తాయి. భద్రతతో పాటు ఉత్పాదకత కలిగి, మారుతున్న పని విధానానికి అనుగుణంగా ఉండే శ్రామిక శక్తిని ఇవి తయారు చేస్తాయి. తద్వారా మరింత ధృడమైన, పోటీతత్వం కలిగిన ఆత్మనిర్భర్ దేశానికి మార్గం సుగమం కానుంది. 

కార్మిక కోడ్‌ల అమలుకు ముందు, తర్వాత కార్మిక వ్యవస్థ:

 

అంశం

సంస్కరణలకు పూర్వం

సంస్కరణల తర్వాత

ఉద్యోగ ధ్రువీకరణ

నియామక పత్రాలు తప్పనిసరి అనే  నిబంధన లేదు

కార్మికులందరికీ తప్పనిసరిగా నియామక పత్రాలు ఇవ్వాలి.

 

లిఖితపూర్వక ఆధారాల వల్ల పారదర్శకత, ఉద్యోగ భద్రత లభిస్తాయి.

సామాజిక భద్రత

సామాజిక భద్రత పరిధి పరిమితంగా ఉండేది.

సామాజిక భద్రతా కోడ్- 2020 ప్రకారం గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులతో సహా అందరికీ సామాజిక భద్రత వర్తిస్తుంది.

 

కార్మికులందరూ పీఎఫ్, ఈఎస్‌ఐసీ, బీమా, ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందుతారు.

కనీస వేతనాలు

కనీస వేతనాలు కేవలం షెడ్యూల్డ్ పరిశ్రమలకు, ఉద్యోగాలకే వర్తించేవి. చాలా మంది కార్మికులు దీని పరిధిలో లేరు.

వేతనాల కోడ్- 2019 ప్రకారం కార్మికులందరూ కనీస వేతనాన్ని ఒక చట్టబద్ధమైన హక్కుగా పొందుతారు. 

 

కనీస వేతనాలు, సమయానికి వేతనాలు అందుకోవటంతో ఆర్థిక భద్రత అందుతుంది.

నివారణాత్మక ఆరోగ్య సంరక్షణ

ఉద్యోగులకు ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు చేయించాలన్న చట్టపరమైన నిబంధన లేదు.

40 ఏళ్లు పైబడిన కార్మికులందరికీ యాజమాన్యాలు ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలను తప్పనిసరిగా చేయించాలి. 

 

ఇది సమయానుకూల నివారణ ఆరోగ్య సంరక్షణ సంస్కృతిని ప్రోత్సహిస్తుంది.

వేతనాల చెల్లింపు

యజమానులు వేతనాలు చెల్లించే విషయంలో తప్పనిసరి నిబంధనలు లేవు.

యజమానులు సమయానికి వేతనాలను చెల్లించటం తప్పనిసరి.

 

ఇది ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించటంతో పాటు పని ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా కార్మికుల నైతిక స్థైర్యాన్ని పెంచుతుంది. .

మహిళా కార్మిక భాగస్వామ్యం

రాత్రి పనివేళలు, కొన్ని వృత్తులలో మహిళల ఉపాధికి పరిమితులు ఉండేవి.

మహిళల అంగీకారం, అవసరమైన భద్రతా చర్యలను తీసుకుంటూ అన్ని సంస్థలలో రాత్రిపూట అన్ని రకాల విధుల్లో పనిచేయొచ్చు.

 

మహిళలు ఎక్కువ వేతనం ఇచ్చే ఉద్యోగాల్లో సమాన అవకాశాలను పొందుతారు.

ఈఎస్ఐసీ పరిధి

నోటిఫై చేసిన ప్రాంతాలు, నిర్దిష్ట పరిశ్రమలకు మాత్రమే ఈఎస్ఐసీ పరిమితమైంది. సాధారణంగా 10 కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు మినహాయింపు ఉంది. ప్రమాదకర పని ఉండే కర్మాగారాల విషయంలో ఏకరీతి ఈఎస్ఐసీ వర్తింపు తప్పనిసరి కాదు.

ఈఎస్ఐసీ వర్తించే పరిధి, ప్రయోజనాలను దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించారు. 10 కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఇది ఐచ్ఛికమే అయినప్పటికీ ప్రమాదకర పనులు ఉన్నట్లయితే ఒక్క ఉద్యోగి ఉన్నా కూడా ఇది తప్పనిసరి.

 

కార్మికులందరూ సామాజిక భద్రత పరిధిలోకి వస్తారు.

నిబంధనల భారం

వివిధ కార్మిక చట్టాలు కింద పలు రకాల రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు, రిటర్న్‌లు ఉంటాయి.

దేశవ్యాప్తంగా వర్తించే ఒకే రిజిస్ట్రేషన్, ఒకే లైసెన్స్, ఒకే రిటర్న్ విధానాలను ప్రవేశపెట్టారు.

 

ఇది ప్రక్రియలను సరళీకృతం చేస్తూ చట్టపరమైన నిబంధనలను పాటించే భారాన్ని తగ్గిస్తుంది.

 

కీలక రంగాలలో కార్మిక సంస్కరణల ప్రయోజనాలు:

1. నిర్ణీత వ్యవధి ఉద్యోగులు (ఎఫ్‌టీఈ- ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిస్):

* శాశ్వత కార్మికులతో సమానంగా నిర్ణీత వ్యవధి ఉద్యోగులు (ఎఫ్‌టీఈ) సెలవు, వైద్య, సామాజిక భద్రతతో సహా అన్ని ప్రయోజనాలను పొందుతారు.
* గ్రాట్యుటీకి అర్హత ఐదేళ్లు కాకుండా కేవలం ఒకే సంవత్సరంగా ఉంది. 
* శాశ్వత సిబ్బందితో సమాన వేతనాలు లభిస్తాయి. తద్వారా ఆదాయం, రక్షణ పెరుగుతుంది.
* ఇది ప్రత్యక్ష నియామకాలను ప్రోత్సహిస్తుంది. కాంట్రాక్టు వ్యవస్థను తగ్గిస్తుంది.  

2. గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు:

* గిగ్ పని, ప్లాట్‌ఫామ్ పని, అగ్రిగేటర్స్ అనే వాటిని మొదటిసారిగా నిర్వచించారు.
* ప్లాట్‌ఫామ్ కార్మికులకు చెల్లించిన లేదా చెల్లించాల్సిన మొత్తంలో 5 శాతానికి మించకుండా వార్షిక టర్నోవర్‌లో 1 నుంచి 2 శాతం వరకు అగ్రిగేటర్లు ప్లాట్‌ఫామ్ కార్మికులకు కేటాయించాలి.
* ఆధార్‌తో అనుసంధానమైన యూనివర్సల్ అకౌంట్ నంబర్ వలన సంక్షేమ ప్రయోజనాలను సులభంగా పొందొచ్చు. నివాస ప్రాంతం మారినప్పుడు ఇబ్బంది లేకుండా పూర్తి పోర్టబుల్‌గా అన్ని రాష్ట్రాలలో ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.

3. ఒప్పంద కార్మికులు:

* నిర్ణీత వ్యవధి ఉద్యోగుల (ఎఫ్‌టీఈ) ఉపాధి అవకాశాలను పెంచడమే కాకుండా.. శాశ్వత ఉద్యోగులతో సమానమైన ప్రయోజనాలు అందించే విధంగా సామాజిక భద్రత, చట్టపరమైన రక్షణ ఉంటుంది.
* కేవలం ఒక సంవత్సరం పనిచేసిన తర్వాత నిర్ణీత వ్యవధి ఉద్యోగులు గ్రాట్యుటీకి అర్హులు అవుతారు.
* ప్రధాన యజమాని ఒప్పంద కార్మికులకు ఆరోగ్య ప్రయోజనాలు, సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించాలి.
* ఒప్పంద కార్మికులు ఉచితంగా వార్షిక ఆరోగ్య పరీక్షలను పొందుతారు.

4. మహిళా కార్మికులు:

* లింగ వివక్షతపై చట్టబద్ధ నిషేధం ఉంది.
* సమాన పనికి సమాన వేతనం ఉంటుంది.
* తప్పనిసరైన భద్రతా చర్యలు తీసుకుంటూ మహిళల అంగీకారంతో రాత్రి వేళల్లో అన్ని రకాల విధుల్లో (భూగర్భ మైనింగ్, భారీ యంత్రాలతో సహా) మహిళలు పనిచేయొచ్చు.
* ఫిర్యాదుల పరిష్కార కమిటీలలో మహిళల ప్రాతినిధ్యం తప్పనిసరి.
* మహిళా ఉద్యోగుల కుటుంబ నిర్వచనంలో అత్తమామలను చేర్చే నిబంధన ఉంది. ఇది ఆధారిత కవరేజీని విస్తరించటంతో పాటు సమ్మిళితత్వాన్ని నిర్ధారిస్తుంది.

5. యువ కార్మికులు:

* కార్మికులందరికీ కనీస వేతన హామీ ఉంది.
* కార్మికులందరూ నియామక పత్రాలను పొందుతారు. ఇది సామాజిక భద్రత, ఉద్యోగ వివరాలు, సంఘటిత ఉపాధిని ప్రోత్సహిస్తుంది.
* యాజమాన్యాలు కార్మికులను దోపిడీ చేయటంపై నిషేధం ఉంది. సెలవు రోజుల్లో తప్పకుండా వేతనం చెల్లించాలి.
* మెరుగైన జీవన ప్రమాణాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీత వేతనం పొందుతారు.

6. ఎంఎస్ఎంఈ కార్మికులు:

* ఉద్యోగుల సంఖ్య ఆధారంగా సామాజిక భద్రతా కోడ్- 2020 పరిధిలోకి ఎంఎస్ఎంఈ కార్మికులందరూ వస్తారు. 

* కార్మికులందరికీ కనీస వేతనం హామీ ఉంది.
* కార్మికులు క్యాంటీన్లు, త్రాగునీరు, విశ్రాంతి ప్రాంతాలు వంటి సదుపాయాలను పొందుతారు.
* ప్రామాణిక పని గంటలు, ఓవర్ టైమ్‌లో రెట్టింపు వేతనాలు, వేతనంతో కూడిన సెలవులకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి.
* కార్మికులు సమయానికి వేతనాలు పొందుతారు. 

7. బీడీ - సిగరేట్ కార్మికులు:

* కార్మికులందరికీ కనీస వేతన భరోసా ఉంది.
* పని గంటలు రోజుకు 8–12 గంటలు, వారానికి 48 గంటలకు మించకూడదు.
* కార్మికుల అంగీకారంపైనే నిర్ణీత వ్యవధికి పైన ఉండే ఓవర్‌టైమ్ పని ఆధారపడి ఉంటుంది. దీనికి సాధారణ వేతనం కంటే కనీసం రెట్టింపు చెల్లించాలి.
* సమయానికి వేతనం చెల్లించాలి.
* కార్మికులు ఒక సంవత్సరంలో 30 రోజులు పని పూర్తి చేసినట్లయితే బోనస్‌కు అర్హత పొందుతారు.  

8. తోటల్లో పనిచేసే కార్మికులు:

* ఇప్పుడు ఓఎస్‌హెచ్‌డబ్ల్యూసీ కోడ్, సామాజిక భద్రతా కోడ్ పరిధిలోకి తోటల్లో పనిచేసే కార్మికులు వచ్చారు.
* 10 మంది కంటే ఎక్కువ కార్మికులు లేదా 5 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న తోటలకు కార్మిక కోడ్‌లు వర్తిస్తాయి.
* రసాయనాలను రవాణా చేయటం, నిల్వ చేయడం, ఉపయోగించే విషయంలో భద్రతాపరమైన శిక్షణను తప్పనిసరిగా ఇవ్వాలి.
* రసాయన, ఇతర ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు రక్షణ పరికరాలు తప్పనిసరిగా ఇవ్వాలి.
* కార్మికులు, వారి కుటుంబాలు పూర్తి ఈఎస్ఐ వైద్య సదుపాయాలను పొందుతారు. వారి పిల్లలకు విద్య సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. 

9. దృశ్య శ్రవణ, డిజిటల్ మీడియా సిబ్బంది:

* ఎలక్ట్రానిక్ మీడియాలోని పాత్రికేయులు, డబ్బింగ్ ఆర్టిస్టులు, స్టంట్ వ్యక్తులతో సహా డిజిటల్, దృశ్య శ్రవణ కార్మికులు ఇప్పుడు పూర్తి ప్రయోజనాలను పొందుతారు.
* హోదా, వేతనాలు, సామాజిక భద్రతా అర్హతలను స్పష్టంగా తెలియజేస్తూ తప్పనిసరిగా సిబ్బంది అందరికీ  నియామక పత్రాలు ఇవ్వాలి.
* సమయానికి వేతనాలు చెల్లించటం తప్పనిసరి.
* నిర్ణీత గంటలకు దాటిన తర్వాత ఓవర్‌టైమ్ పని చేయటం అనేది సిబ్బంది అంగీకారంపై ఆధారపడి ఉంటుంది. దీనికి సాధారణ వేతనం కంటే కనీసం రెట్టింపు చెల్లించాలి. 

10. గని కార్మికులు:

* సామాజిక భద్రతా కోడ్ ప్రకారం పని వేళలు, పని చేసే ప్రదేశానికి సంబంధించిన పరిమితులకు లోబడి ప్రయాణంలో జరిగే కొన్ని ప్రమాదాలను ఉపాధి సంబంధిత ప్రమాదాలుగా పరిగణిస్తారు.
* పని ప్రదేశంలో వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య పరిస్థితులను ప్రామాణీకరించే నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
* కార్మికులందరికీ ఆరోగ్య భద్రత ఉంటుంది. వారంతా ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షల సౌకర్యాన్ని పొందుతారు.
* ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం- పని మధ్య సమతుల్యతను నిర్ధారించేందుకు పని గంటల పరిమితిని రోజుకు 8 నుంచి 12 గంటలు, వారానికి 48 గంటలుగా నిర్ణయించారు.

11. ప్రమాదకర పరిశ్రమల కార్మికులు:

* కార్మికులందరూ ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షల సదుపాయాన్ని పొందుతారు.
* కార్మికులకు మెరుగైన భద్రత కోసం జాతీయ ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుంది.
* మహిళలందరికీ సమాన ఉద్యోగ అవకాశాలు అందేలా చూసుకుంటుంది. భూగర్భ గనుల తవ్వకం, భారీ యంత్రాలు, ప్రమాదకర పనులతో సహా అన్ని సంస్థలలో పనిచేయడానికి మహిళలకు వీలు కల్పిస్తుంది.
* పనిచేస్తున్నప్పుడు భద్రతను పర్యవేక్షించడానికి, ప్రమాదకర రసాయనాలను సురక్షితంగా నిర్వహించేందుకు పని చేసే చోట తప్పనిసరిగా భద్రతా కమిటీ ఉంటుంది. 

12. వస్త్ర పరిశ్రమ కార్మికులు:

* వలస కార్మికులు అందరూ (ప్రత్యక్ష, కాంట్రాక్టర్ ఆధారిత, స్వయంగా వలస వచ్చినవారు) సమాన వేతనాలు, సంక్షేమ ప్రయోజనాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ పోర్టబిలిటీ ప్రయోజనాలను పొందుతారు.
* పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపు కోసం కార్మికులు 3 సంవత్సరాల వరకు క్లెయిమ్స్ దాఖలు చేయొచ్చు. ఇది సరళమైన, సులభమైన పరిష్కారాలు అందేలా చూసుకుంటుంది.
* ఓవర్‌టైమ్ పని చేసిన కార్మికులకు రెట్టింపు వేతనాలు చెల్లించాలనే నిబంధన ఉంది. 

13. ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులు:

* ప్రతి నెలా 7వ తేదీలోపు జీతం చెల్లించటాన్ని తప్పనిసరి చేసింది. ఇది పారదర్శకత, విశ్వాసాన్ని పెంచుతుంది.
* సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి. దీని ద్వారా మహిళల భాగస్వామ్యం మెరుగుపడుతుంది.
* అన్ని సంస్థలలో మహిళలకు రాత్రి వేళల్లో పనిచేసేందుకు వీలు కల్పిస్తుంది. మహిళలు ఎక్కువ వేతనాలు పొందేందుకు అవకాశం ఉంటుంది.
* వేధింపులు, వివక్ష, వేతన సంబంధిత వివాదాలకు సమయానుగుణంగా పరిష్కారం లభిస్తుంది.
* నిర్ణీత వ్యవధి ఉద్యోగం, తప్పనిసరి నియామక పత్రాల ద్వారా సామాజిక భద్రతా ప్రయోజనాలకు హామీ లభిస్తుంది.

14. ఓడరేవుల కార్మికులు:

* ఓడరేవుల కార్మికులందరికీ సంఘటిత గుర్తింపు, చట్టపరమైన రక్షణ లభిస్తుంది.
* సామాజిక భద్రతా ప్రయోజనాలకు భరోసా ఉండేలా తప్పనిసరిగా నియామక పత్రాలు ఇవ్వాలి.
* ఒప్పందం లేదా తాత్కాలిక ఓడరేవుల కార్మికులందరికీ భవిష్య నిధి, పింఛన్లు, బీమా ప్రయోజనాలు అందుతాయి.
* యజమాని ఖర్చుతో వార్షిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించటం తప్పనిసరి.
* మెరుగైన పని పరిస్థితులు, భద్రతను నిర్ధారించడానికి ఓడరేవుల కార్మికులు తప్పనిసరిగా వైద్య సదుపాయాలు, ప్రథమ చికిత్స, పారిశుద్ధ్యం, శుభ్రం చేసుకునే సౌకర్యాలు తదితరాలను పొందుతారు.

15. ఎగుమతి రంగ కార్మికులు:

* ఎగుమతి రంగంలో పనిచేసే నిర్ణీత వ్యవధి కార్మికులు గ్రాట్యుటీ, భవిష్య నిధి, ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందుతారు.
* ఒక సంవత్సరంలో 180 రోజులు పని చేసిన తర్వాత ప్రతి కార్మికుడు వార్షిక సెలవులను పొందొచ్చు.
* ప్రతి కార్మికుడికి సమయానికి వేతనాలు పొందే హక్కు ఉంటుంది. అనధికార వేతన కోతలు ఉండవు. వేతన పరిమితికి సంబంధించిన ఆంక్షలు ఉండవు.
* మహిళలు స్వీయ అంగీకారంతో రాత్రి వేళల్లో పనిచేయొచ్చు. దీని ద్వారా మహిళలు ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు.
* తప్పనిసరి లిఖితపూర్వక అంగీకారం, ఓవర్‌టైమ్‌కు రెట్టింపు వేతనం, సురక్షిత రవాణా, సీసీటీవీ నిఘా, భద్రతా ఏర్పాట్లు వంటి భద్రత, సంక్షేమ చర్యలు ఉన్నాయి.

ఇప్పటికే పేర్కొన్న ప్రధాన సంక్షేమ చర్యలతో పాటు కార్మికుల రక్షణను పెంచే, యాజమాన్యలపై చట్టపరమైన భారాన్ని తగ్గించే అనేక అదనపు సంస్కరణలను కార్మిక కోడ్‌లలో ఉన్నాయి:

* జాతీయ కనీస వేతనం (నేషనల్ ఫ్లోర్ వేజ్): ఏ కార్మికుడు కూడా కనీస జీవన ప్రమాణం కంటే తక్కువ వేతనం పొందకుండా ఉండే విధంగా ఇది చూసుకుంటుంది.
* లింగ తటస్థ వేతనం, ఉద్యోగ అవకాశాలు: ట్రాన్స్‌జెండర్ వ్యక్తులతో సహా ఎవరిపైనా కూడా వివక్షను చూపించటాన్ని నిషేధిస్తుంది.
* ఇన్‌స్పెక్టర్-కమ్-ఫెసిలిటేటర్ వ్యవస్థ: నిబంధనల అమలును శిక్షాత్మక చర్యల నుంచి మార్గదర్శకత్వం, అవగాహన, నిబంధనలు పాటించటంలో సహయ పడటం వైపు తీసుకెళ్తుంది.
* వేగవంతమైన వివాద పరిష్కారం: ఇద్దరు సభ్యుల పారిశ్రామిక ట్రిబ్యునల్స్ ద్వారా సయోధ్య ప్రక్రియ తర్వాత నేరుగా ట్రిబ్యునల్‌లను సంప్రదించే అవకాశం ఉంది. తద్వారా వివాద పరిష్కారం వేగవంతంగా, ఊహించదగినదిగా మారుతుంది.
* ఒకే రిజిస్ట్రేషన్, ఒకే లైసెన్స్, ఒకే రిటర్న్: ఒకదాని పరిధిలోకి ఇంకొటి వచ్చే నిబంధనల స్థానంలో ఒకే రిజిస్ట్రేషన్, ఒకే లైసెన్స్, ఒకే రిటర్న్ విధానం ఉంటుంది.
* జాతీయ ఓఎస్‌హెచ్ బోర్డు: అన్ని రంగాలలో సమగ్ర భద్రత, ఆరోగ్య ప్రమాణాలను నిర్ధారించడానికి దీనిని ఏర్పాటు చేస్తారు.
* భద్రతా కమిటీలు తప్పనిసరి: 500 కంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్న సంస్థల్లో తప్పనిసరిగా భద్రతా కమిటీలను ఏర్పాటు చేయాలి. తద్వారా పని చేసే చోట జవాబుదారీతనం మెరుగుపడుతుంది.
* నిబంధనల సడలింపు: కార్మికులకు అందే ప్రయోజనాల్లో ఎలాంటి మార్పు లేకుండా చిన్న సంస్థలపై చట్టపరమైన నిబంధనల భారం తగ్గింది. 

కార్మిక కోడ్‌ల ముసాయిదా ప్రక్రియ సమయంలో విస్తృత స్థాయి సంప్రదింపులు నిర్వహించినట్లే ఈ కోడ్‌ల కింద నియమాలు, నిబంధనలు, పథకాలు మొదలైన వాటిని రూపొందించడంలో కూడా ప్రజలు, భాగస్వామ్య పక్షాలతో ప్రభుత్వ చర్చిస్తుంది. కొత్త కోడ్‌లకు మారుతున్న సమయంలో ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాల కింద ఉన్న నిబంధనలు, నియమాలు, నోటిఫికేషన్‌లు, ప్రమాణాలు, పథకాలు మొదలైనవి యథాతథంగా కొనసాగుతాయి. 

గత దశాబ్దంలో భారత సామాజిక భద్రతా పరిధి చాలా రెట్లు పెరిగింది. 2015లో దేశంలోని శ్రామిక శక్తిలో కేవలం 19 శాతానికి మాత్రమే సామాజిక భద్రత ఉండేది. 2025 నాటికి ఇది 64 శాతం కంటే ఎక్కువకు పెరిగింది. ఈ పురోగతి దేశవ్యాప్తంగా కార్మికులకు రక్షణ, గౌరవం అందేలా చూసుకుంది. ఇది సామాజిక రక్షణ విషయంలో ప్రపంచ వేదికపై భారత్‌కు గుర్తింపును ఇచ్చింది. నాలుగు కార్మిక కోడ్‌ల అమలు అనేది ఒక కీలకమైన చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తోంది. ఇది సామాజిక భద్రతా పరిధిని మరింత విస్తృతం చేయడమే కాకుండా రంగాలు, రాష్ట్రాల మధ్య పోర్టబిలిటీ సదుపాయాన్ని అందిస్తుంది. సామాజిక భద్రత విస్తరించటంతో పాటు బలమైన రక్షణలు, దేశవ్యాప్త పోర్టబిలిటీతో ఈ కోడ్‌లు కార్మికల సంక్షేమంలో.. ముఖ్యంగా మహిళలు, యువత, అసంఘటిత, గిగ్, వలస కార్మికులను సంక్షేమంలో వారినే కేంద్ర స్థానంలో నిలబెడుతోంది. చట్టపరమైన నిబంధనల భారాన్ని తగ్గించడం, సరళమైన ఆధునిక పని వాతావరణాన్ని కల్పించటం ద్వారా ఈ కోడ్‌లు.. ఉపాధి, నైపుణ్యం, పరిశ్రమల వృద్ధిని పెంచుతాయి. కార్మికుల, మహిళలు, యువత, ఉపాధికి అనుకూలమైన కార్మిక వ్యవస్థ పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తోంది. 

 

***


(Release ID: 2193004) Visitor Counter : 285