ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో రాష్ట్ర విధానసభ కొత్త భవనాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


నేడు నూతన ఆకాంక్షల విషయంలో కొత్త శిఖరాన నిలుస్తున్న ఛత్తీస్‌గఢ్: ప్రధానమంత్రి

ఈ సందర్భంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే విషయంలో దూరదృష్టి గల నాయకుడు భారత రత్న పూజ్య శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులర్పిస్తున్నాను: ప్రధానమంత్రి

నేడు యావత్ భారతదేశం సాంస్కృతిక వారసత్వాన్ని, అభివృద్ధిని రెండింటినీ ఏకకాలంలో స్వీకరిస్తూ ముందుకు సాగుతోంది: ప్రధానమంత్రి

భారతదేశం ప్రజాస్వామ్యానికి మాత: ప్రధానమంత్రి

ఇప్పుడు నక్సలిజం, మావోయిస్టు తీవ్రవాదాన్ని నిర్మూలించే దిశగా పయనిస్తున్న భారత్: ప్రధానమంత్రి

ఈ విధాన సభ కేవలం చట్టాలు చేసే స్థలం మాత్రమే కాదు.. ఛత్తీస్‌గఢ్ భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక మంచి కేంద్రం: ప్రధానమంత్రి

Posted On: 01 NOV 2025 2:59PM by PIB Hyderabad

ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌లోని నవా రాయ్‌పూర్‌లో రాష్ట్ర విధానసభ కొత్త భవనాన్ని  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఛత్తీస్‌గఢ్ అభివృద్ధి ప్రయాణంలో ఒక స్వర్ణారంభాన్ని సూచిస్తుందని అన్నారు. వ్యక్తిగతంగా చాలా సంతోషకరమైన రోజు ఇదన్న ఆయన.. దశాబ్దాలుగా పెంచి పోషించిన ఈ ప్రాంతంతో ఉన్న లోతైన భావోద్వేగ బంధాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పార్టీ కార్యకర్తగా ఉన్న సమయాన్ని గుర్తు చేసిన మోదీ.. రాష్ట్రంలో చాలా సమయం గడిపినట్లు, తద్వారా చాలా విషయాలు నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు ఉన్న దార్శనికత, రాష్ట్ర ఆవిర్భావం వెనుక ఉన్న సంకల్పం, అది నెరవేరటం వంటి ప్రతి క్షణానికి సాక్షిగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరివర్తనలోని ప్రతి క్షణాన్ని ఆయన గుర్తుచేశారు. 25 ఏళ్లు అనే ప్రధాన ఘట్టానికి రాష్ట్రం చేరుకున్న వేళ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు కృతజ్ఞత భావంతో ఉన్నట్లు వ్యక్తం చేశారు. రజతోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజల కోసం ఈ కొత్త అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించే అవకాశం దక్కిందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలతో పాటు అభినందనలు తెలియజేశారు. 

"దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అవుతోంది. కాబట్టి ఈ 2025 గణతంత్ర భారత్‌కు అమృత సంవత్సరాన్ని సూచిస్తోంది” అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ చారిత్రాత్మక క్షణాన్ని పురస్కరించుకొని రాష్ట్రం నుంచి రాజ్యాంగ పరిషత్‌ సభ్యులుగా వ్యవహరించిన ప్రముఖులు శ్రీ రవిశంకర్ శుక్లా, బారిస్టర్ ఠాకూర్ చెడిలాల్, శ్రీ ఘనశ్యామ్ సింగ్ గుప్తా, శ్రీ కిషోరి మోహన్ త్రిపాఠి, శ్రీ రాంప్రసాద్ పోతాయ్ మరియు శ్రీ రఘురాజ్ సింగ్‌లకు ఆయన నివాళులర్పించారు. అప్పట్లో ఈ ప్రాంతంలో ఉన్న వెనుకబాటుతనాన్ని లెక్కచేయకుండా వీరంతా ఢిల్లీకి వెళ్లి బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగ రచనలో ముఖ్యమైన పాత్ర పోషించారని అన్నారు. 

ఛత్తీస్‌గఢ్ శాసనసభ చరిత్ర స్ఫూర్తిదాయకం అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. 2000 సంవత్సరంలో ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు మొదటి అసెంబ్లీ సమావేశం రాయ్‌పూర్‌లోని రాజ్‌కుమార్ కాలేజీలోని జష్పూర్ హాల్‌లో జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో పరిమిత వనరులు ఉన్నప్పటికీ కలలు మాత్రం అపరిమతంగా ఉండేవని అన్నారు. "మనం మరింత వేగంగా మన భవిష్యత్తును వెలుగులు జిమ్మేలా చేసుకుంటున్నాం" అనే ఏకైక ఆలోచన ఆ సమయంలో ఉండేదనని పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ భవనం వాస్తవానికి మరొక శాఖకు సంబంధించిన ప్రాంగణంలో ఉండేదని ప్రధానమంత్రి గుర్తు చేశారు. అక్కడి నుండే ఛత్తీస్‌గఢ్‌లో ప్రజాస్వామ్య ప్రయాణం నూతన శక్తితో ప్రారంభమైందన్నారు. నేడు 25 సంవత్సరాల తర్వాత అదే ప్రజాస్వామ్యం, అదే ప్రజలు ఆధునిక, డిజిటల్, ఆత్మనిర్భర్ శాసన‌సభ భవనాన్ని ప్రారంభించుకుంటున్నారని ప్రధానంగా చెప్పారు. 

అసెంబ్లీ భవనాన్ని ప్రజాస్వామ్య పుణ్యక్షేత్రంగా అభివర్ణించిన ప్రధానమంత్రి.. ఇందులో ప్రతి స్తంభం పారదర్శకతకు, ప్రతి కారిడార్ జవాబుదారీతనానికి, ప్రతి చాంబర్ ప్రజల గళానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు రాబోయే దశాబ్దాల పాటు రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని.. ఈ  గోడల మధ్య మాట్లాడే ప్రతి మాట రాష్ట్ర గతం, వర్తమానం, భవిష్యత్తులో ఒక అవిభాజ్య భాగంగా మారుతుందని చెప్పారు. ఈ భవనం రాబోయే దశాబ్దాలలో రాష్ట్ర విధానాలు, విధి, విధాన రూపకర్తలకు కేంద్రంగా ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

"నేడు యావత్ దేశం సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి రెండింటినీ ఏకకాలంలో స్వీకరిస్తూ ముందుకు సాగుతోంది" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ స్ఫూర్తి ప్రభుత్వంలోని ప్రతి విధానం, నిర్ణయంలో ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. పవిత్రమైన సెంగోల్ ఇప్పుడు భారత పార్లమెంటుకు స్ఫూర్తినిస్తోందని, పార్లమెంట్‌లోని కొత్త గ్యాలరీలు ప్రపంచాన్ని భారత ప్రజాస్వామ్యపు ప్రాచీన మూలాలతో అనుసంధానం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సముదాయంలో ఏర్పాటు చేసిన విగ్రహాలు దేశంలోని ప్రజాస్వామ్య సంప్రదాయాలకు ఉన్న అపారమైన సంబంధాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాయన్నారు. ఈ నైతికత, భావనలే రాష్ట్రంలోని కొత్త అసెంబ్లీలో కూడా కనిపించటం పట్ల మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కొత్త అసెంబ్లీ సముదాయం రాష్ట్రానికి ఉన్న గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబమని అన్నారు. ఈ అసెంబ్లీలోని ప్రతి ఒక్కటి చత్తీస్‌గఢ్ గడ్డపై జన్మించిన మహనీయుల స్ఫూర్తిని తెలియజేస్తుందని పేర్కొన్నారు. నిర్భాగ్యులకు ప్రాధాన్యత ఇవ్వడం, 'సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్' అనే సూత్రాలే ప్రభుత్వ సుపరిపాలకు నిదర్శనమని తెలిపారు. ఇవే భారత రాజ్యాంగ స్ఫూర్తి అని.. దేశంలోని గొప్ప నాయకులు, ఋషులు, మేధావులు అందించిన విలువల సారాంశమని ఆయన పేర్కొన్నారు.

కొత్త అసెంబ్లీ భవనాన్ని పరిశీలించినప్పుడు బస్తర్ కళ కనిపించిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. కొన్ని నెలల క్రితం థాయ్‌లాండ్ ప్రధానమంత్రికి ఇదే బస్తర్ కళాఖండాన్ని అందించనట్లు తెలిపిన ఆయన.. భారత్‌ సృజనాత్మకత, సాంస్కృతిక బలానికి ఇది ప్రతీక అని వివరించారు. 

ఈ అసెంబ్లీ భవనం గోడలు.. సమగ్రత, సర్వతోముఖాభివృద్ధి, అందరి పట్ల గౌరవం అనే బాబా గురు ఘాసీదాస్ సందేశాన్ని తెలియజేస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఈ భవనంలోని ప్రతి ద్వారం మాతా శబరి నేర్పిన ఆప్యాయతను ప్రతిబింబిస్తోందని.. అతిథులతో పాటు ప్రజలందరిని ప్రేమతో స్వాగతించాలని ఇవి గుర్తు చేస్తున్నాయని పేర్కొన్నారు. అసెంబ్లీలోని ప్రతి కుర్చీ సంత్ కబీర్ బోధించిన సత్యం, నిర్భయత్వ స్ఫూర్తిని కలిగి ఉందన్నారు. ఈ భవనం పునాది మహాప్రభు వల్లభాచార్య తెలిపిన ‘నర సేవ, నారాయణ సేవ’ అనే సూత్రం ఇచ్చిన సంకల్పాన్ని తెలియజేస్తుందని వ్యాఖ్యానించారు. 

"భారతదేశం ప్రజాస్వామ్యానికి మాత” అని అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. భారత్‌లోని గిరిజన సమాజాలు తరతరాలుగా ప్రజాస్వామ్య సంప్రదాయాలను కొనసాగిస్తున్నాయని ప్రముఖంగా ప్రస్తావించారు. దీనికి నిదర్శనంగా క్షేత్రస్థాయి ప్రజాస్వామ్య పద్ధతులను ప్రతిబింబించే ఒక 'పురాతన పార్లమెంట్' అయిన బస్తర్‌లోని మురియా దర్బార్‌ను ప్రస్తావించారు. ఏళ్ల తరబటి దేశంలోని సమస్యలను పరిష్కరించేందుకు సమాజంతో పాటు ప్రభుత్వం కలిసి పనిచేశాయని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త అసెంబ్లీ భవనంలో మురియా దర్బార్‌కు కూడా స్థానం కల్పించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

అసెంబ్లీలోని నలుమూలలు మహానాయకుల ఆదర్శాలను తెలియజేస్తున్నాయని.. స్పీకర్‌ స్థానం అనుభవజ్ఞులైన రమణ్ సింగ్ నాయకత్వంతో ప్రకాశిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అంకితభావం గల ఒక పార్టీ కార్యకర్త కఠోర శ్రమ, నిబద్ధత ద్వారా ప్రజాస్వామ్య సంస్థలను ఎంత బలోపేతం చేయగలరో చెప్పేందుకు డాక్టర్ రమణ్ సింగ్ ఒక మంచి ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్ర కవి నిరాలా రచించిన సరస్వతి మాత ప్రార్థనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉటంకించారు. ఇది కేవలం కవిత్వం మాత్రమే కాదు.. స్వతంత్ర భారత్‌ పునర్జన్మకు ఒక మంత్రమని పేర్కొన్నారు. "నవ్ గతి, నవ్ లయ్, నవ్ స్వర్" అనే నిరాలా వ్యాఖ్యాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి సంస్కృతి సంప్రదాయంలో బలంగా పాతుకుపోయి భవిష్యత్ వైపు అడుగులు వేసే భారత్‌కు ప్రతీక అని అన్నారు. ఈ భావన ఛత్తీస్‌గఢ్ కొత్త అసెంబ్లీ‌లో కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ భవనం.. గత అనుభవాలు నూతన కలలతో కలయిక చెందే 'నవ్ స్వర్'కు చిహ్నమని అభివర్ణించారు. ఇదే శక్తితో మనం సాంస్కృతిక వారసత్వంతో అనుసంధానమై ఉంటూనే అభివృద్ధి పథంలో ముందుకు సాగే భారత్‌ను తయారుచేయటంతో పాటు ఛత్తీస్‌గఢ్‌కు పునాది వేయాలని ఆయన అన్నారు.

"నాగరిక్ దేవో భవ" అనేది సుపరిపాలనకు మార్గదర్శక మంత్రమన్న ప్రధానమంత్రి.. అసెంబ్లీలో తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇక్కడ తయారుచేసే చట్టాలు సంస్కరణలను వేగవంతం చేయటంతో పాటు ప్రజల జీవితాలను సులభతరం చేయాలని, అనవసరమైన ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా లేకపోవటం కానీ, అతిగా ఉండటం కానీ ఉండకూడదన్న ఆయన.. ఈ సమతుల్యతే వేగవంతమైన పురోగతికి నిజమైన సూత్రమని వ్యాఖ్యానించారు.

శ్రీరాముని మాతృభూమి ఛత్తీస్‌గఢ్ అని ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధాని.. మర్యాద పురుషోత్తముడు ఈ ప్రాంత మేనల్లుడని అన్నారు. ఈ కొత్త అసెంబ్లీ సముదాయంలో శ్రీరాముడి ఆదర్శాలను స్మరించుకోవడానికి ఈ రోజు కంటే మంచి సందర్భం మరొకటి ఉండదని ఆయన అన్నారు. రాముని విలువలు సుపరిపాలనకు సంబంధించిన కాలాతీత పాఠాలను అందిస్తున్నాయని పేర్కొన్నారు.

అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన సందర్భంగా దేశం మొత్తం భక్తి నుంచి జాతి నిర్మాణం వైపు అంటే ‘దేవ్ టు దేశ్’, "రామ్ టు రాష్ట్ర" వైపు సాగాలని సమష్టిగా సంకల్పించిందని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. ‘రామ్ టు రాష్ట్ర’ సారాంశం మంచి పరిపాలన, ప్రజా సంక్షేమంతో కూడిన ప్రభుత్వాన్ని సూచించే దార్శనికతలో ఉందని.. ఇది సమ్మిళిత అభివృద్ధి స్ఫూర్తి అయిన ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ను ప్రతిబింబిస్తోందని ప్రధానంగా చెప్పారు. ‘రామ్ టు రాష్ట్ర’ అనేది పేదరికం, దుఃఖం లేని సమాజం, లేమిని నిర్మూలించడం ద్వారా ముందుకు సాగే భారత్‌ అని ప్రధాని వివరించారు. దీని అర్థం ఎవరూ అనారోగ్యం కారణంగా అకాల మరణానికి గురికాని దేశం, ఆరోగ్యకరమైన- సంతోషకరమైన భారత్ అని కూడా ఆయన అన్నారు. మొత్తంగా "రామ్ టు రాష్ట్ర" అనేది వివక్షత లేని, అన్ని వర్గాలలో సామాజిక న్యాయం ప్రబలంగా ఉండే సమాజాన్ని కూడా తెలియజేస్తోందని ఆయన పేర్కొన్నారు.

“'రామ్ టు రాష్ట్ర' అనేది మానవత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులను నిర్మూలించాలనే సంకల్పాన్ని, ఉగ్రవాదాన్ని నాశనం చేయాలనే ప్రతిజ్ఞను కూడా సూచిస్తుంది" అని ప్రధానమంత్రి అన్నారు. ఆపరేషన్ సింధూర్‌ ద్వారా భారత్ ‌ఉగ్రవాదానికి వెన్ను విరిచిన తీరులో ఈ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. "భారత్‌ ఇప్పుడు నక్సలిజం, మావోయిస్ట్ తీవ్రవాదాన్ని నిర్మూలించే దిశగా పయనించటంతో పాటు భారీ విజయాల పట్ల గర్వంతో ఉంది" అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ స్ఫూర్తి ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ కొత్త ప్రాంగణం అంతటా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 

గత 25 సంవత్సరాలలో ఛత్తీస్‌గఢ్ సాధించిన పురోగతి అద్భుతంగా, స్ఫూర్తిదాయకంగా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నరు. "ఒకప్పుడు నక్సలిజం, వెనుకబాటుతనానికి పేరుగాంచిన ఈ రాష్ట్రం ఇప్పుడు శ్రేయస్సు, భద్రత, స్థిరత్వానికి చిహ్నంగా రూపుదిద్దుకుంటోంది" అని ఆయన అన్నారు. బస్తర్ ఒలింపిక్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్న ఆయన.. నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు అభివృద్ధి, శాంతి తిరిగి వచ్చాయని పేర్కొన్నారు. ఈ పరివర్తనకు ఛత్తీస్‌గఢ్ ప్రజల కృషి, ప్రభుత్వాల దార్శనిక నాయకత్వమే కారణమని ప్రధానమంత్రి కొనియాడారు.

ఛత్తీస్‌గఢ్ రజతోత్సవాలు ఒక పెద్ద జాతీయ లక్ష్యానికి ప్రారంభ కేంద్రంగా మారుతున్నాయన్న ప్రధానమంతి.. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ సాధించాలనే దార్శనికతను సాధించటంలో ఛత్తీస్‌గఢ్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రం ఈ లక్ష్యం దిశగా ఆవిష్కరణలు చేసేందుకు, తనవంతు పాత్రను పొషించేందుకు స్ఫూర్తినిచ్చే ఒక వ్యవస్థను తయారుచేసేందుకు ఒక మంచి ఆదర్శాన్ని నెలకొల్పాలని ప్రధాని అక్కడ ఉన్న వారందరినీ కోరారు. అసెంబ్లీలో జరిగే చర్చల్లో, అడిగే ప్రశ్నల్లో, సభా కార్యకలాపాల్లో శ్రేష్ఠతను సాధించాలన్నారు. అభివృద్ధి చెందిన ఛత్తీస్‌గఢ్, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా ప్రతి రూపంలో ప్రతి పని ఉండాలని ప్రధానంగా చెప్పారు. 

ఛత్తీస్‌గఢ్ కొత్త అసెంబ్లీ నిజమైన గొప్పదనం భౌతిక వైభవంలో లేదని.. ఇందులో తీసుకునే సంక్షేమ నిర్ణయాలలోనే ఉందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సభ రాష్ట్ర ప్రజల కలలు, ఆకాంక్షలను ఎంత లోతుగా అర్థం చేసుకుంటుంది.. వాటిని నెరవేర్చేందుకు ఎంతవరకు కృషి చేస్తుందనే దానిపై అసెంబ్లీ గొప్పదనం ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రతి నిర్ణయం రైతుల కృషిని గౌరవించటం, యువత కలలకు మార్గనిర్దేశం చేయటం, మహిళలకు కొత్త ఆశను తీసుకురావటం, అట్టడుగు వర్గాలను పురోగతి బాట పట్టించేందుకు ఒక మాధ్యమంగా ఉపయోగపడాలని తెలిపారు. "ఈ విధానసభ కేవలం చట్టాలు చేసే స్థలం మాత్రమే కాదు.. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక కేంద్రం" అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ సభలో తీసుకునే ప్రతి నిర్ణయం.. ప్రజా సేవ స్ఫూర్తి, అభివృద్ధి సంకల్పం, భారత్‌ను కొత్త శిఖరాలకు చేర్చే విశ్వాసాన్ని కలిగి ఉండాలని ఆయన కోరారు. ఇది మన సామూహిక ఆకాంక్ష అని అన్నారు. 

కొత్త అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవం నిజమైన ప్రాముఖ్యత ప్రజాస్వామ్యంలో కర్తవ్యానికి అగ్రస్థానం ఇవ్వడం, ప్రజా జీవితంలో తమవంతు పాత్రను నిబద్ధతతో నిర్వర్తిస్తానని తీసుకునే ప్రతిజ్ఞలో ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. ముఖ్యంగా భారతదేశ గణతంత్ర అమృత సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ప్రజా సేవకు జీవితాలను అంకితం చేస్తామనే సంకల్పంతో ఈ సముదాయం నుంచి బయటకు వెళ్లాలని ఆయన కోరారు. ఈ నూతన ప్రజాస్వామ్య మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ప్రసంగాన్ని ముగించారు.

కార్యక్రమానికి ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శ్రీ రామెన్ దేకా, లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, ఛత్తీస్‌గఢ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ రమణ్ సింగ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి, కేంద్ర మంత్రి శ్రీ తోకన్ సాహు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

నేపథ్యం- 

చత్తీస్‌గఢ్ విధానసభ నూతన సముదాయం హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించారు. పూర్తిగా సౌరశక్తితో నడిచేలూ రూపొందించిన ఈ సముదాయంలో వర్షపు నీటి సేకరణ వ్యవస్థ ఉంది. 

 

***


(Release ID: 2185506) Visitor Counter : 4