ప్రధాన మంత్రి కార్యాలయం
కౌశల్ దీక్షాంత్ సమరోహ్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యువత లక్ష్యంగా రూ.62,000 కోట్లకు పైగా విలువైన కార్యక్రమాలు ప్రారంభం
భారత్ జ్ఞానం, నైపుణ్యం కలిగిన దేశం... ఈ మేధో బలమే మన గొప్ప శక్తి
ఐటీఐలు ప్రధాన పారిశ్రామిక విద్యాసంస్థలు మాత్రమే కాదు.. ఆత్మనిర్భర్ భారత్ కార్యశాలలు కూడా
పీఎమ్-సేతు యోజన భారత యువతను ప్రపంచ నైపుణ్య అవసరాలతో అనుసంధానిస్తుంది
భారతరత్న కర్పూరి ఠాకూర్ జీ జీవితం సామాజిక సేవకు, విద్యాభివృద్ధికి అంకితం
ఈ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడానికి శక్తిమంతమైన మార్గం.. ఆయన పేరుతో ఏర్పాటయ్యే స్కిల్ యూనివర్సిటీ
యువత బలం పెరిగితే దేశం మరింత బలంగా మారుతుంది: ప్రధానమంత్రి
Posted On:
04 OCT 2025 1:42PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు నిర్వహించిన కౌశల్ దీక్షాంత్ సమరోహ్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యువత అభివృద్ధి లక్ష్యంగా రూ. 62,000 కోట్లకు పైగా విలువైన పలు కార్యక్రమాలను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఐటీఐలతో అనుబంధం ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు, బీహార్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని సంవత్సరాల కిందటే ప్రభుత్వం ఐటీఐ విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున స్నాతకోత్సవ వేడుకలను నిర్వహించే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించిందని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ రోజు ఆ సంప్రదాయంలో మరో ముందడుగును సూచిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ రోజు జరిగే ఈ కార్యక్రమం భారత్ నైపుణ్యాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని సూచిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా యువత కోసం విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో రెండు ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారు. రూ. 60,000 కోట్ల ప్రధానమంత్రి సేతు పథకం కింద ఐటీఐలు ఇప్పుడు పరిశ్రమలతో మరింత దృఢంగా అనుసంధానమవుతాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాలు, ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో 1,200 నైపుణ్య ప్రయోగశాలలు ఈ రోజు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మొదట విజ్ఞాన్ భవన్‌లో స్నాతకోత్సవ వేడుకను నిర్వహించినట్లు శ్రీ మోదీ తెలిపారు. ఈ సందర్భాన్ని గొప్ప పండగలా నిర్వహించాలనే శ్రీ నితీష్ కుమార్ ప్రతిపాదనతో ఇది "వివిధ అలంకరణలతో అలంకరించిన బంగారు పెట్టె"లా ఒక గొప్ప వేడుకగా ఇది మారిందన్నారు. ఈ వేదిక నుంచి బీహార్ యువత కోసం అనేక పథకాలు, ప్రాజెక్టుల్పి అంకితం చేశామని ప్రధానమంత్రి తెలిపారు. బీహార్‌లో కొత్త నైపుణ్య శిక్షణ విశ్వవిద్యాలయం ఏర్పాటు, ఇతర విశ్వవిద్యాలయాల్లో సౌకర్యాల విస్తరణ, కొత్త యువజన కమిషన్ ఏర్పాటు, వేలాది మంది యువకులకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల కోసం నియామక లేఖల జారీ వంటివి వీటిలో భాగంగా ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు బీహార్ యువత ఉజ్వల భవిష్యత్తుకు భరోసానిస్తాయని ఆయన ధ్రువీకరించారు.
బీహార్ మహిళల ఉపాధి, సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఇటీవలి భారీ కార్యక్రమాన్ని గుర్తుచేసుకుంటూ.. లక్షలాది మంది ఆడపడుచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని శ్రీ మోదీ అన్నారు. బీహార్‌లో యువత సాధికారత కోసం నిర్వహిస్తున్న నేటి మెగా కార్యక్రమం రాష్ట్ర యువత, మహిళలకు స్థానిక ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్ జ్ఞానం, నైపుణ్యం కలిగిన దేశమని, ఈ మేధో బలం దేశపు గొప్ప ఆస్తి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నైపుణ్యాలు, జ్ఞానం జాతీయ అవసరాలకు అనుగుణంగా ఉంటూ వాటిని నెరవేర్చడానికి దోహదపడినప్పుడు వాటి ప్రభావం అనేక రెట్లు పెరుగుతుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దపు డిమాండ్ స్థానిక ప్రతిభ, స్థానిక వనరులు, స్థానిక నైపుణ్యాలు, స్థానిక జ్ఞానాన్ని దేశ అవసరాలకు అనుగుణంగా వేగంగా అభివృద్ధి చేయడమేనని స్పష్టం చేశారు. ఈ లక్ష్యంలో వేలాది ఐటీఐల కీలక పాత్రను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం ఐటీఐలు దాదాపు 170 ట్రేడ్‌లలో శిక్షణనిస్తున్నాయన్నారు. గత 11 సంవత్సరాల్లో 1.5 కోట్లకు పైగా యువత ఈ విభాగాల్లో శిక్షణ పొందారని, విభిన్న రంగాల్లో సాంకేతిక అర్హతలను పొందుతున్నారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ నైపుణ్యాలను స్థానిక భాషల్లో అందిస్తున్నారనీ, దీని వల్ల మెరుగైన అవగాహన, అభ్యసన సౌలభ్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం 10 లక్షలకు పైగా విద్యార్థులు ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారిలో 45 మందికి పైగా విద్యార్థులను సత్కరించే అవకాశం తనకు లభించిందని శ్రీ మోదీ తెలిపారు.
ప్రధానమంత్రి ఈ క్షణం పట్ల తనకెంతో గర్వంగా ఉందన్నారు. అవార్డు గ్రహీతల్లో ఎక్కువ మంది దేశంలోని గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినవారేనని ఆయన అన్నారు. వారిలో కుమార్తెలు, దివ్యాంగ సోదరీ సోదరులూ ఉన్నారని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అంకితభావం, పట్టుదల ద్వారా వారు కష్టపడి సంపాదించిన విజయాన్ని ప్రశంసించారు.
"దేశంలోని ఐటీఐలు ప్రధాన పారిశ్రామిక విద్యాసంస్థలు మాత్రమే కాదు.. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కోసం కార్యశాలలుగా కూడా పనిచేస్తాయి" అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఐటీఐల సంఖ్యను పెంచడం.. వాటిని నిరంతరం అప్‌గ్రేడ్ చేయడం రెండింటిపైనా ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన తెలిపారు. 2014 వరకు దేశంలో కేవలం 10,000 ఐటీఐలు మాత్రమే ఉండగా, గత దశాబ్దంలోనే దాదాపు 5,000 కొత్త ఐటీఐలు ఏర్పాటయ్యాయనీ ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిశ్రమ నైపుణ్య అవసరాలను తీర్చడానికి, రాబోయే పదేళ్లలో భవిష్యత్ అవసరాలను అంచనా వేయడానికి ఐటీఐ నెట్‌వర్క్ సిద్ధమవుతోందని శ్రీ మోదీ తెలిపారు. ఈ సమలేఖనాన్ని బలోపేతం చేయడం కోసం పరిశ్రమ-ఐటీఐల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తున్నారు. దేశవ్యాప్తంగా 1,000కి పైగా ఐటీఐ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే పీఎం సేతు పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా ఐటీఐలను కొత్త యంత్రాలు, పరిశ్రమ శిక్షణ నిపుణులు, ప్రస్తుత-భవిష్యత్తు నైపుణ్య అవసరాలకు అనుగుణమైన పాఠ్యాంశాలతో అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. "పీఎం సేతు పథకం భారతీయ యువతను ప్రపంచ నైపుణ్య అవసరాలతో అనుసంధానిస్తుంది" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
బీహార్ నుంచి వేలాది మంది యువత నేటి కార్యక్రమంలో పాల్గొన్నారని శ్రీ మోదీ గుర్తు చేస్తూ.. రెండు నుంచి రెండున్నర దశాబ్దాల క్రితం బీహార్‌లో విద్యా వ్యవస్థ ఎలా నాశనమైందీ ఈ తరం పూర్తిగా గ్రహించలేకపోవచ్చునని వ్యాఖ్యానించారు. పాఠశాలలు నిజాయితీగా తెరవలేదు.. నియామకాలు కూడా నిర్వహించలేదన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ స్థానికంగా చదువుకుని అభివృద్ధి చెందాలని కోరుకుంటారనీ.. అయితే బలవంతంగా లక్షలాది మంది పిల్లలు బీహార్‌ను వదిలి బనారస్, ఢిల్లీ, ముంబయి వంటి ప్రదేశాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. వలసలకు ఇదే నిజమైన నాంది అయిందని ఆయన గుర్తుచేశారు.
వేర్లకు తెగులు సోకిన చెట్టును తిరిగి బతికించడం చాలా కష్టంతో కూడుకున్నదని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల దుష్పరిపాలన కింద బీహార్ తెగులు సోకిన చెట్టుతో సమానమని అన్నారు. అదృష్టవశాత్తూ బీహార్ ప్రజలు శ్రీ నితీష్ కుమార్‌కు పాలనా బాధ్యతను అప్పగించారనీ, పట్టాలు తప్పిన వ్యవస్థలను పునరుద్ధరించడానికి ఎన్‌డీఏ ప్రభుత్వ బృందం మొత్తం సమష్టిగా పనిచేసిందని ఆయన కితాబిచ్చారు. నేటి కార్యక్రమం ఆ పరివర్తన గురించిన అవలోకనాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి ధ్రువీకరించారు.
ఈ రోజు జరిగిన కౌశల్ స్నాతకోత్సవ కార్యక్రమంలో బీహార్‌కు కొత్త స్కిల్ యూనివర్సిటీ లభించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ.. శ్రీ నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వవిద్యాలయానికి భారతరత్న జననాయక్ కర్పూరి ఠాకూర్ పేరు పెట్టడం ప్రశంసనీయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారతరత్న కర్పూరి ఠాకూర్ తన మొత్తం జీవితాన్ని ప్రజాసేవకు, విద్యావ్యాప్తికి అంకితం చేశారనీ, సమాజంలోని అత్యంత వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడారని శ్రీ మోదీ ప్రశంసించారు. ఆయన గౌరవార్థం ఆయన పేరు పెట్టిన... స్కిల్ యూనివర్సిటీ ఆ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడానికి శక్తిమంతమైన మాధ్యమంగా పనిచేస్తుందని ఆయన ధ్రువీకరించారు.
బీహార్ విద్యా సంస్థలను ఆధునికీకరించడానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఐఐటీ పాట్నాలో మౌలిక సదుపాయాల విస్తరణ సహా, బీహార్ అంతటా అనేక ప్రధాన విద్యా సంస్థల ఆధునికీకరణ కూడా ప్రారంభమైందని ఆయన తెలిపారు. ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఎన్ఐటీ పాట్నాలోని బిహ్తా క్యాంపస్ ఇప్పుడు ప్రారంభమైందని శ్రీ మోదీ ప్రకటించారు. అదనంగా పాట్నా విశ్వవిద్యాలయం, భూపేంద్ర మండల్ విశ్వవిద్యాలయం, చాప్రాలోని జై ప్రకాష్ విశ్వవిద్యాలయం, నలంద ఓపెన్ విశ్వవిద్యాలయంలో విద్యా మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన చేశామని ప్రధానమంత్రి వివరించారు.
విద్యా సంస్థలను బలోపేతం చేయడంతో పాటు, బీహార్ యువతకు విద్యాపరమైన ఆర్థిక భారాన్ని తగ్గించడానికి శ్రీ నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోందని తెలిపారు. ఉన్నత విద్యకు ఫీజు చెల్లించడంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తొలగించే ప్రయత్నం జరుగుతోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. బీహార్ ప్రభుత్వం స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా విద్యార్థులకు మద్దతు ఇస్తోందని, ఈ పథకం కింద విద్యా రుణాలను వడ్డీ లేకుండా అందించేందుకు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అదనంగా విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను రూ. 1,800 నుంచి రూ. 3,600కి పెంచినట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.
"భారత్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ యువ జనాభా గల దేశాల్లో ఒకటిగా ఉంది. బీహార్ సైతం అత్యధిక యువత నిష్పత్తి కలిగిన రాష్ట్రాల్లో ఒకటి" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. బీహార్ యువత సామర్థ్యం పెరిగినప్పుడు దేశం బలమూ పెరుగుతుందని తెలిపారు. బీహార్ యువతను మరింత శక్తిమంతం చేయడానికి తమ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తుందని ఆయన ధృవీకరించారు. గతంలోని ప్రభుత్వంతో పోలిస్తే బీహార్ విద్యా బడ్జెట్‌ను ప్రస్తుత ప్రభుత్వం అనేక రెట్లు పెంచిందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. బీహార్‌లోని దాదాపు ప్రతి గ్రామం, కుగ్రామంలోనూ ఈ రోజు ఒక పాఠశాల ఉంది.. ఇంజనీరింగ్, వైద్య కళాశాలల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. బీహార్‌లోని 19 జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసిందని ఆయన తెలియజేశారు. బీహార్‌లో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు లేని సమయం ఉండేదని, కానీ రాష్ట్రంలో ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలూ జరుగుతున్నాయని ప్రధానమంత్రి గుర్తు చేశారు.
గత రెండు దశాబ్దాలుగా బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలో 50 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పించిందని శ్రీ మోదీ తెలిపారు. ఇటీవలి కొద్ది సంవత్సరాల్లోనే బీహార్ యువతకు దాదాపు 10 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల నియామకాలు జరుగుతున్నాయనీ, దీనికి విద్యా శాఖే నిదర్శమన్నారు. గత రెండు సంవత్సరాల్లోనే బీహార్‌లో 2.5 లక్షలకు పైగా ఉపాధ్యాయుల నియామకాలు జరిగాయని, ఫలితంగా యువతకు ఉపాధి లభించిందనీ, విద్యా వ్యవస్థ నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని ఆయన తెలియజేశారు.
బీహార్ ప్రభుత్వం ఇప్పుడు కొత్త లక్ష్యాలతో పనిచేస్తోందని పేర్కొన్న శ్రీ మోదీ.. గత రెండు దశాబ్దాలుగా సృష్టించిన ఉపాధి అవకాశాల కంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో రెండింతలు ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా రాష్ట్రం ముందుకు సాగుతున్నదని తెలిపారు. బీహార్ యువతలో స్థానికంగా ఉద్యోగాలు కనుగొని బీహార్‌లోనే పని చేయాలనే సంకల్పం స్పష్టంగా ఉందని ప్రధానమంత్రి ధ్రువీకరించారు.
బీహార్ యువతకు ఇది డబుల్ బోనస్ సమయం అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జీఎస్టీ పొదుపు పండుగను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. బైక్‌లు, స్కూటర్లపై జీఎస్టీ తగ్గించడం వల్ల బీహార్ యువతలో ఆనందం ఉందని తనకు తెలియజేసినట్లు పంచుకున్నారు. ధంతేరాస్ సందర్భంగా చాలా మంది యువకులు ఈ కొనుగోళ్లు చేయాలని కూడా ప్లాన్ చేసుకున్నారని తెలిపారు. చాలా ముఖ్యమైన వస్తువులపై జీఎస్టీని తగ్గించిన సందర్భంలో బీహార్ యువతకు, దేశానికి శ్రీ మోదీ తన అభినందనలు తెలిపారు.
"నైపుణ్యాలు పెరిగేకొద్దీ దేశం స్వయం-సమృద్ధి సాధిస్తుంది.. ఎగుమతులూ పెరుగుతాయి.. ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి" అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. 2014 కి ముందు భారత్ "ఫ్రాగైల్ ఫైవ్" ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండిపోయిందని.. తక్కువ వృద్ధి.. పరిమిత ఉద్యోగ కల్పనతో వెనకబడిందని ఆయన గుర్తు చేసుకున్నారు. నేడు తయారీ, ఉపాధిలో గణనీయమైన వృద్ధితో భారత్ మూడో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పురోగమిస్తోంది. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, రక్షణ రంగాల్లో తయారీ, ఎగుమతుల్లోనూ అపూర్వమైన వృద్ధి సాధించినట్లు శ్రీ మోదీ తెలిపారు. ఈ వృద్ధి పెద్ద పరిశ్రమలు, ఎమ్ఎస్ఎమ్ఈలలో గణనీయమైన ఉద్యోగాల సృష్టికి దారితీసిందని, ఐటీఐలలో శిక్షణ పొందిన వారితో సహా యువతకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందని ఆయన పేర్కొన్నారు. ముద్రా పథకం కోట్లాది మంది యువత తమ సొంత వెంచర్లను ప్రారంభించడంలో సహాయపడిందని ఆయన తెలిపారు. అదనంగా రూ. 1 లక్ష కోట్లతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన అమలు చేస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఇది ప్రైవేట్ రంగంలో ఉపాధిని పొందడంలో సుమారు 3.5 కోట్ల మంది యువతకు సహాయపడుతుందన్నారు.
దేశంలోని యువతకు ఇది అవకాశాలతో నిండిన సమయం అన్న ప్రధానమంత్రి.. అనేక విషయాలకు ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ నైపుణ్యం, ఆవిష్కరణలు, కృషికి ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. ఈ లక్షణాలన్నీ భారత యువతలో కనిపిస్తాయని, వారి బలం వికసిత్ భారత్ కోసం బలం అవుతుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానిస్తూ.. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ జయంత్ చౌదరితో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, కేంద్ర మంత్రులు శ్రీ జుయెల్ ఓరం, శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, శ్రీ సుకాంత మజుందార్, ఇతర ప్రముఖులు వీడియో అనుసంధానం ద్వారా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నేపథ్యం
యువత అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన రూ. 62,000 కోట్లకు పైగా విలువైన కార్యక్రమాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించారు. ఇవి దేశవ్యాప్తంగా విద్య, నైపుణ్యం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం నిర్ణయాత్మక ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా నిర్వహించిన జాతీయ నైపుణ్య స్నాతకోత్సవ నాల్గో ఎడిషన్ కౌశల్ దీక్షాంత్ సమరోహ్ కూడా ఉంది. ఇక్కడ నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పారిశ్రామిక శిక్షణ సంస్థల నుంచి 46 మంది అఖిల భారత టాపర్లను సత్కరించారు.
ప్రధానమంత్రి పీఎమ్-సేతు ఫథకం (అప్‌గ్రేడ్ చేయబడిన ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి నైపుణ్యం, ఉపాధి పరివర్తన) ప్రారంభించారు. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం. దీనిని రూ. 60,000 కోట్ల పెట్టుబడితో రూపొందించారు. ఈ పథకం దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐలను 200 హబ్ ఐటీఐలు, 800 స్పోక్ ఐటీఐలతో కూడిన హబ్-అండ్-స్పోక్ మోడల్‌లో అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తోంది. ప్రతి హబ్ సగటున నాలుగు స్పోక్‌లను అనుసంధానించి, అధునాతన మౌలిక సదుపాయాలు, ఆధునిక ట్రేడ్లు, డిజిటల్ లెర్నింగ్ సిస్టమ్‌లు, ఇంక్యుబేషన్ సౌకర్యాలతో కూడిన క్లస్టర్‌లను సృష్టిస్తుంది. యాంకర్ ఇండస్ట్రీ భాగస్వాములు ఈ క్లస్టర్‌లను నిర్వహిస్తారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఫలితాల ఆధారిత నైపుణ్యాన్ని నిర్ధారిస్తారు. హబ్‌లు ఇన్నోవేషన్ సెంటర్లు, ట్రైనర్ల శిక్షణ సౌకర్యాలు, ఉత్పత్తి యూనిట్లు, ప్లేస్మెంట్ సేవలను కూడా ఇవి కలిగి ఉంటాయి. స్పోక్స్ యాక్సెస్‌ను విస్తరించడంపైనా దృష్టి సారిస్తాయి. సమష్టిగా పీఎమ్-సేతు భారత ఐటీఐ వ్యవస్థను పునర్నిర్వచిస్తుంది. దీనిని ప్రభుత్వ యాజమాన్యంలోకి తీసుకున్నప్పటికీ ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి ప్రపంచ సహ-ఫైనాన్సింగ్ మద్దతుతో పరిశ్రమ-నిర్వహణలోనే ఉండనుంది. పథకం అమలు మొదటి దశలో పాట్నా, దర్భంగాలోని ఐటీఐలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది.
34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 400 నవోదయ విద్యాలయాలు, 200 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 1,200 వృత్తి నైపుణ్య ప్రయోగశాలలను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ ప్రయోగశాలలు మారుమూల, గిరిజన ప్రాంతాలతో సహా విద్యార్థులకు ఐటీ, ఆటోమోటివ్, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, పర్యాటకం వంటి 12 అధిక డిమాండ్ ఉన్న రంగాల్లో ఆచరణాత్మక శిక్షణను అందిస్తాయి. జాతీయ విద్యా విధానం-2020, సీబీఎస్ఈ పాఠ్యాంశాలతో అనుసంధానించిన ఈ ప్రాజెక్టులో పరిశ్రమ-సంబంధిత అభ్యాసాన్ని అందించడానికి, ఉపాధికి ముందస్తు పునాదిని సృష్టించడానికి 1,200 మంది వృత్తి ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రాధాన్యత బీహార్‌లోని పరివర్తన ప్రాజెక్టులపై ఉంటుంది. ఇది రాష్ట్ర గొప్ప వారసత్వాన్ని, యువ జనాభాను ప్రతిబింబిస్తుంది. బీహార్‌లో పునరుద్ధరించిన ముఖ్యమంత్రి నిశ్చయ స్వయం సహాయత భత్తా యోజనను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు ఐదు లక్షల మంది గ్రాడ్యుయేట్ యువతకు రెండు సంవత్సరాల పాటు ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు రూ.1,000 నెలవారీ భత్యం అందిస్తారు. పునఃరూపకల్పన చేసిన బీహార్ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇది రూ.4 లక్షల వరకు పూర్తిగా వడ్డీ లేని విద్యా రుణాలను అందిస్తుంది. ఇది ఉన్నత విద్యలో ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ పథకం కింద 3.92 లక్షలకు పైగా విద్యార్థులు ఇప్పటికే రూ.7,880 కోట్లకు పైగా రుణాలను పొందారు. రాష్ట్రంలో యువత సాధికారతను మరింత బలోపేతం చేస్తూ, 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తుల కోసం చట్టబద్ధమైన కమిషన్ అయిన బీహార్ యువ ఆయోగ్‌ను ప్రధానమంత్రి అధికారికంగా ప్రారంభించారు.
ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వంతో కూడిన శ్రామిక శక్తిని సృష్టించడం లక్ష్యంగా యువతకు పరిశ్రమ ఆధారిత కోర్సులు, వృత్తి విద్యను అందించడానికి ఉద్దేశించిన జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రధానమంత్రి బీహార్‌లో ప్రారంభించారు.
ఉన్నత విద్యా మార్గాలను మెరుగుపరచాలనే దార్శనికతతో జాతీయ విద్యా విధానం-2020ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధానమంత్రి బీహార్‌లోని నాలుగు విశ్వవిద్యాలయాలు.. పాట్నా విశ్వవిద్యాలయం, మాధేపురాలోని భూపేంద్ర నారాయణ్ మండల్ విశ్వవిద్యాలయం, చాప్రాలోని జై ప్రకాష్ విశ్వవిద్యాలయం, పాట్నాలోని నలంద ఓపెన్ విశ్వవిద్యాలయంలలో పీఎమ్-ఉష (ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్) కింద కొత్త విద్య, పరిశోధన సౌకర్యాలకు పునాది వేశారు. మొత్తం రూ. 160 కోట్ల కేటాయింపులతో ఈ ప్రాజెక్టులు ఆధునిక విద్యా మౌలిక సదుపాయాలు, అధునాతన ప్రయోగశాలలు, హాస్టళ్లు, బహుళ విభాగ అభ్యాసాన్ని ప్రారంభించడం ద్వారా 27,000 మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తాయి.
ఎన్ఐటీ పాట్నాలోని బిహ్తా క్యాంపస్‌ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. 6,500 మంది విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యం గల ఈ క్యాంపస్‌లో 5జీ యూజ్ కేస్ ల్యాబ్, ఇస్రో సహకారంతో ఏర్పాటు చేసిన రీజినల్ అకాడెమిక్ సెంటర్ ఫర్ స్పేస్, ఇప్పటికే తొమ్మిది అంకురసంస్థలకు మద్దతునిచ్చిన ఇన్నోవేషన్-ఇంక్యుబేషన్ సెంటర్ వంటి అధునాతన సౌకర్యాలు ఉన్నాయి.
బీహార్ ప్రభుత్వం కొత్తగా నియమించిన 4,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక లేఖలను ప్రధానమంత్రి పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి బాలక్/బాలికా స్కాలర్‌షిప్ పథకం కింద 9-10 తరగతులకు చెందిన 25 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా రూ. 450 కోట్ల స్కాలర్‌షిప్‌లనూ విడుదల చేశారు.
ఈ రోజు ప్రారంభించిన కార్యక్రమాలు భారత యువతకు గణనీయమైన అవకాశాలను సృష్టిస్తాయని భావిస్తున్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పరిశ్రమలు, మెరుగైన మౌలిక సదుపాయాలను సమగ్రపరచడం ద్వారా దేశ పురోగతికి దృఢమైన పునాదిని వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బీహార్‌పై ప్రత్యేక దృష్టి సారించడంతో రాష్ట్రం నైపుణ్యం కలిగిన సిబ్బందికి కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇది ప్రాంతీయ, జాతీయ వృద్ధికీ దోహదపడుతుంది.
(Release ID: 2175015)
Visitor Counter : 4
Read this release in:
Bengali
,
Bengali-TR
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam