సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
దక్షిణ కొరియాలో జరిగే బుసాన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం- బీఐఎఫ్ఎఫ్ 2025 లో సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించనున్న భారత్
భారత్ నుంచి తొలిసారి హాజరవుతున్న మంత్రుల బృందానికి
సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ నేతృత్వం
బీఐఎఫ్ఎఫ్ 2025లో 10 చిత్రాలతో ముందువరసలో భారత్
ఏషియన్ కంటెంట్స్ అండ్ ఫిలిం మార్కెట్ (ఏసీఎఫ్ఎం) లో కో-ప్రొడక్షన్ మార్కెట్‌కు
భారత్ నుంచి అయిదు ప్రాజెక్టుల ఎంపిక
ఉమ్మడిగా చిత్ర నిర్మాణం విస్తరణ, ఏవీజీసీ అవకాశాల పెంపు, దక్షిణ కొరియాతో
సాంస్కృతిక బంధాల బలోపేతం లక్ష్యంగా బీఐఎఫ్ఎఫ్ 2025లో పాల్గొంటున్న భారత్
భారతీయ ఆవిష్కర్తలను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడానికి, ఉమ్మడి చిత్ర నిర్మాణాలకు, ఏవీజీసీకి ప్రోత్సాహకాలను కల్పించడానికి భారత్ పెవిలియన్‌లో వేవ్స్ బజార్
బుసాన్ లో భారత సంస్కృతి, సృజనాత్మకతను ప్రదర్శించనున్న భారత్ పర్వ్, భారతీయ చిత్రాలు
భారత్ - కొరియా దేశాల ఏవీజీసీ, ఫిల్మ్ కో-ప్రొడక్షన్ వ్యవస్థను
బలోపేతం చేయడంపై విధాన చర్చలు, అవగాహన ఒప్పందాలు
Posted On:
16 SEP 2025 1:04PM by PIB Hyderabad
దక్షిణ కొరియాలో జరిగే బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (బీఐఎఫ్ఎఫ్) 2025, ఆసియా కంటెంట్స్, ఫిల్మ్ మార్కెట్ (ఎసిఎఫ్ఎం) లలో సమాచార, ప్రసారశాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో సత్తా చాటేందుకు భారత్ సిద్ధంగా ఉంది. బుసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో భారత్ నుంచి మంత్రుల స్థాయి ప్రతినిధి బృందం పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇది సాంస్కృతిక దౌత్యాన్ని బలోపేతం చేయాలన్న భారత్ కట్టుబాటుకు నిదర్శనం. ఈ సందర్బంగా భారత్ అంతర్జాతీయ స్థాయిలో సృజనాత్మక భాగస్వామ్యాలను విస్తరించడమే కాకుండా, సృజనాత్మక ఆధారిత ఆర్థిక రంగంలో గ్లోబల్ హబ్‌గా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రతినిధి బృందంలో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు, ఎన్ఎఫ్డీసీ, ఫిక్కీ, ఎఫ్టీఐఐ, ఎస్ఆర్ఎఫ్టీఐఐ, ఐఐఎంసి ప్రతినిధులతో పాటు వేవ్స్ బజార్ ద్వారా ఎంపికయిన ఆవిష్కర్తలు ఉంటారు.
కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ఆసియా, ప్రపంచ సినిమాలోని ఉత్తమమైన వాటిని ఒకచోట చేర్చే బీఐఎఫ్ఎఫ్ 2025లో పాల్గొనడం భారత్ గర్వంగా భావిస్తోంది. ఉమ్మడిగా చిత్ర నిర్మాణాల విస్తరణ, ఏవీజీసీ రంగంలో కొత్త అవకాశాల కల్పన, దక్షిణ కొరియాతో సాంస్కృతిక సంబంధాల బలోపేతం లక్ష్యంతో భారత్ ఈ ఉత్సవాలకు హాజరవుతోంది. వేవ్స్ బజార్, భారత్ పర్వ్ ద్వారా మన సృజనాత్మక ఆర్థిక వ్యవస్థనే కాకుండా, శాశ్వతమైన వారసత్వాన్ని, భారత ప్రతిభను కూడా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం” అని పేర్కొన్నారు.
బీఐఎఫ్ఎఫ్ లో భారత్ భాగస్వామ్యం ముఖ్యాంశాలు
బీఐఎఫ్ఎఫ్, ఏసీఎఫ్ఎం వద్ద భారత్ పెవిలియన్ - 'వేవ్స్ బజార్' పై ప్రత్యేక దృష్టి
"ఇండియా - క్రియేటివ్ ఎకానమీ ఫర్ ది వరల్డ్" అనే ఇతివృత్తంతో బీఐఎఫ్ఎఫ్, ఏసీఎఫ్ఎం రెండింటిలోనూ భారత్ పెవిలియన్ ఉంటుంది. భారతీయ కంటెంట్ సృష్టికర్తలు, నిర్మాతలు, పంపిణీదారులను ముఖాముఖి సమావేశాల ద్వారా ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడానికి రూపొందించిన వేవ్స్ బజార్ ప్రత్యేకతను ఈ పెవిలియన్ వివరిస్తుంది. ఏసీఎఫ్ఎం అధికారిక కార్యక్రమంలో భాగంగా, రెండు దేశాలకు చెందిన ప్రముఖ పరిశ్రమ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో “భారత్–కొరియా సహకారాలు: కో-ప్రొడక్షన్‌లలో కొత్త దిశలు” అనే అంశంపై ప్యానెల్ చర్చను నిర్వహిస్తారు.
బుసాన్ లో భారతీయ సినిమా ప్రదర్శన
ఈ సంవత్సరం ఉత్సవంలో భారత్ ఉనికి బలంగా ఉంటుంది. పదికి పైగా చిత్రాలు భారతీయ కథా కథనాల వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి.
*స్పైయింగ్ స్టార్స్ (పద్మశ్రీ నీలా మాధబ్ పాండా) ప్రారంభ పోటీ విభాగంలో పోటీ పడుతున్నారు.
*విజన్ ఆసియా విభాగం: ఇఫ్ ఆన్ ఎ వింటర్స్ నైట్ (సంజు సురేంద్రన్); కోక్ కోక్ కోకూక్ (మహర్షి తుహిన్ కశ్యప్); * షేప్ ఆఫ్ మోమో (త్రిబెని రాయ్)
*ఇతర ప్రాజెక్ట్‌లు: బయాన్ (బికాస్ రంజన్ మిశ్రా); డోంట్ టెల్ మదర్ (అనూప్ లొక్కుర్); ఫుల్ ప్లేట్ (తన్నిష్ఠ చటర్జీ) ;కరింజి (శీతల్ ఎన్.ఎస్.);ఐ, పాపీ (వివేక్ చౌదరి)
ఏషియన్ ప్రాజెక్ట్ మార్కెట్ (ఏసీఎఫ్ఎం) లో కో ప్రొడక్షన్ మార్కెట్ కోసం అయిదు భారతీయ ప్రాజెక్టుల ఎంపిక
*డిఫికల్ట్ డాటర్స్ - దర్శకత్వం: సోనీ రజ్దాన్; నిర్మాతలు: అలియా భట్, షాహీన్ భట్, అలన్ మెక్అలెక్స్, గ్రిష్మా షా.
*ది లాస్ట్ ఆఫ్ దెమ్ ప్లేగ్స్ - దర్శకత్వం: కుంజిల మస్కిల్లమణి; నిర్మాతలు: పాయల్ కపాడియా, జియో బేబీ, కని కుశ్రుతి.
*లంక (ది ఫైర్) - దర్శకత్వం: సౌరవ్ రాయ్; నిర్మాతలు: సుదీప్త సాధుఖాన్, విరాజ్ సెలోట్, అంకిత పుర్కాయస్థ.
*మూన్ - దర్శకత్వం, నిర్మాత ప్రదీప్ కుర్బా.
*ది మ్యాజికల్ మెన్ - దర్శకత్వం: బిప్లోబ్ సర్కార్; భారత్, బంగ్లా సహ నిర్మాణం భారత్, అంతర్జాతీయ భాగస్వాములు.
భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే భారత్ పర్వ్
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ "భారత్ పర్వ్" అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది, ఇందులో భాగంగా సాయంత్రం వేళలో భారతీయ కళలు, సంగీతం, వంటకాలను ప్రదర్శిస్తారు. భారత్, కొరియా దేశాల మీడియా, వినోద పరిశ్రమల ప్రతినిధుల భాగస్వామ్యంతో, రెండు దేశాల మధ్య ప్రజల సంబంధాలను, సాంస్కృతిక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉపయోగపడుతుంది.
విధానాలపై చర్చలు - భాగస్వామ్యాలు
*భారత్, కొరియా ఏవీజీసీ, ఫిల్మ్ కో-ప్రొడక్షన్ ప్రణాళిక కోసం నిర్మాణాత్మక చర్చలను ప్రారంభించడానికి కొరియా సాంస్కృతిక, క్రీడలు, పర్యాటక శాఖల మంత్రి, భారత సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి మధ్య ప్రభుత్వ స్థాయి సమావేశం జరుగుతుంది.
*శిక్షణ, పరస్పర మార్పిడి కార్యక్రమాలు, భారతీయ కంటెంట్ పంపిణీ కోసం ఎన్ఎఫ్డీసీ, ఎఫ్టీఐఐ, ఐఐసీటీ, కొరియాకు చెందిన కేఏఎఫ్ఏ, కేఓఎఫ్ఐసి, కేఓసీసీఏ వంటి సంస్థలతో పాటు, కొరియన్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల మధ్య ఒప్పంద పత్రాలపై సంతకాలు జరుగుతాయి.
బీఐఎఫ్ఎఫ్, ఏసీఎఫ్ఎం గురించి
ఆసియాలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చలనచిత్రోత్సవాలలో బుసాన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (బీఐఎస్ఎఫ్) ఒకటి. దీనికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ), కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు ఎఫ్ఐఏపీఎఫ్ (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్స్) గుర్తింపు ఉంది. కో ప్రొడక్షన్, ఫైనాన్సింగ్ వేదికగా ఏషియన్ కంటెంట్స్ అండ్ ఫిల్మ్ మార్కెట్ (ఏసీఎఫ్ఎం) పనిచేస్తుంది. ఇది చిత్రనిర్మాతలను ప్రపంచ పెట్టుబడిదారులు, భాగస్వాములతో కలుపుతుంది.
***
(Release ID: 2167473)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Nepali
,
Hindi
,
Marathi
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam