ప్రధాన మంత్రి కార్యాలయం
బీహార్‌లోని పూర్ణియాలో దాదాపు 40,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి
దేశ విమానయాన పటంలో స్థానం పొందిన పూర్ణియా
జాతీయ మఖానా బోర్డు ఏర్పాటుకు నిన్న అధికారిక నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
దేశంలో చొరబాటుదారుల ఇష్టం కాదు.. భారత చట్టాలదే గెలుపు
చొరబాటుదారులపై చర్యలు తప్పవు... త్వరలో దేశంలో సానుకూల ఫలితాలు
ఇది మోదీ ఇస్తున్న హామీ: ప్రధానమంత్రి
Posted On:
15 SEP 2025 5:50PM by PIB Hyderabad
బీహార్‌లోని పూర్ణియాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దాదాపు రూ.40,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసి, ప్రారంభించారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పూర్ణియా ప్రాంతం మాతా పురాణ్ దేవి, భక్త ప్రహ్లాదుడు, మహర్షి మెహిబాబాల ఫుణ్యభూమి అని వ్యాఖ్యానించారు. ఈ నేల ఫణీశ్వరనాథ్ రేణు, సతీనాథ్ బాధురి వంటి సాహిత్య దిగ్గజాలకు జన్మనిచ్చిందన్నారు. ఈ ప్రాంతాన్ని వినోబా భావే వంటి అంకితభావంతో పనిచేసిన కర్మయోగుల భూమిగా అభివర్ణించారు. ఈ భూమి పట్ల తనకున్న ప్రగాఢమైన భక్తిని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
బీహార్‌లో దాదాపు రూ. 40,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన శ్రీ నరేంద్ర మోదీ.. రైల్వేలు, విమానాశ్రయాలు, విద్యుత్, నీటికి సంబంధించిన ఈ ప్రాజెక్టులు సీమాంచల్ ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 40,000 మందికి పైగా లబ్ధిదారులు పక్కా ఇళ్లు పొందారనీ, ఈ 40,000 కుటుంబాల జీవితాల్లో ఈ రోజు ఒక కొత్త శకం ఆరంభమవుతుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ధంతేరస్, దీపావళి, ఛఠ్ పూజలకు ముందు సొంత ఇంట్లోకి గృహప్రవేశం చేయడం గొప్ప అదృష్టమన్నారు. ఈ కుటుంబాలకు ఆయన అభినందనలు.. శుభాకాంక్షలూ తెలిపారు.
నిరాశ్రయులైన తన సోదరీసోదరులకు కూడా ఒక రోజు పక్కా ఇల్లు లభిస్తుందని భరోసా ఇవ్వడానికి ఈనాటి ఈ సందర్భం ఉపయోగపడుతుందన్నారు. గత 11 సంవత్సరాల్లో ప్రభుత్వం పేదలకు 4 కోట్లకు పైగా పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చిందనీ, ప్రభుత్వం ఇప్పుడు 3 కోట్ల కొత్త గృహాలను నిర్మించడానికి కృషి చేస్తోందన్నారు. ప్రతి పేద పౌరుడికీ పక్కా ఇల్లు లభించే వరకు మోదీ విశ్రమించడని భరోసా ఇచ్చారు. అణగారిన వర్గాలకు ప్రాధాన్యమివ్వడం, పేదలకు సేవ చేయడం తన పాలన ప్రధాన లక్ష్యమని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
ఈ రోజు ఇంజనీర్ల దినోత్సవమనీ, ఈ సందర్భంగా దేశమంతా సర్ ఎం. విశ్వేశ్వరయ్యకు నివాళులు అర్పిస్తోందన్నారు. అభివృద్ధి చెందిన భారత్.. అభివృద్ధి చెందిన బీహార్ నిర్మాణంలోనూ ఇంజనీర్ల పాత్ర కీలకమని తెలిపారు. దేశంలోని ఇంజనీర్లందరికీ ఆయన తన అభినందనలు.. శుభాకాంక్షలూ తెలిపారు. నేటి కార్యక్రమంలోనూ ఇంజనీర్ల అంకితభావం, నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తోందనీ, పూర్నియా విమానాశ్రయ టెర్మినల్ భవనం రికార్డు సమయంలో.. కేవలం అయిదు నెలల కన్నా తక్కువ సమయంలో నిర్మాణం పూర్తి చేసుకుందని తెలిపారు. టెర్మినల్ ప్రారంభోత్సవ అనంతరం ప్రధానమంత్రి మొదటి వాణిజ్య విమానాన్ని ప్రారంభించారు. “"కొత్త విమానాశ్రయం ప్రారంభంతో పూర్ణియా ఇప్పుడు దేశ విమానయాన పటంలో స్థానాన్ని సంపాదించింది" అని శ్రీ మోదీ ప్రకటించారు. పూర్నియా-సీమాంచల్ మధ్య దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలు, కీలక వాణిజ్య కేంద్రాలతో ప్రత్యక్ష అనుసంధానానికి ఇది వీలు కల్పిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
“మా ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రాంతాలను ఆధునిక, హైటెక్ రైలు సేవలతో అనుసంధానిస్తోంది" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. ఒక వందే భారత్, రెండు అమృత్ భారత్, ఒక ప్యాసింజర్ రైలును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కొత్తగా అరారియా-గల్గాలియా రైలు మార్గాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన ప్రధానమంత్రి.. విక్రమశిల-కటారియా రైలు మార్గానికి శంకుస్థాపన చేశారు.
బక్సర్-భాగల్పూర్ హై-స్పీడ్ కారిడార్‌లోని మొకామా-ముంగేరు సెక్షన్‌కు ఆమోదం తెలుపుతూ భారత ప్రభుత్వం ఇటీవల మరో కీలక నిర్ణయం తీసుకుందనీ, ఇది ముంగేరు, జమాల్పూర్, భాగల్పూర్ వంటి పారిశ్రామిక కేంద్రాలకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. భాగల్పూర్-దుమ్కా-రాంపూర్‌హాట్ రైలు మార్గం డబ్లింగ్ పనులకూ ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.
దేశాభివృద్ధి కోసం బీహార్ అభివృద్ధి చాలా అవసరమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. బీహార్ పురోగతికి పూర్ణియా, సీమాంచల్ ప్రాంతాల అభివృద్ధి చాలా కీలకమనీ, గత ప్రభుత్వాల దుష్పరిపాలన కారణంగా ఈ ప్రాంతం ఎంతో నష్టపోయిందని ప్రధానమంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వం ఇప్పుడు ఈ పరిస్థితిని మారుస్తోందనీ, ఈ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి కేంద్రంగా ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
విద్యుత్ రంగంలో బీహార్ స్వయం-సమృద్ధి సాధించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, భాగల్పూర్‌లోని పిర్‌పైంటిలో 2400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. రైతులు, పశువుల పెంపకందారుల ఆదాయాన్ని పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. తూర్పు కోసి ప్రధాన కాలువను విస్తరించే కోసి-మెచి అంతర్-రాష్ట్ర నదుల అనుసంధాన ప్రాజెక్టు మొదటి దశకు శంకుస్థాపన చేస్తున్నట్లు శ్రీ మోదీ వెల్లడించారు. ఈ విస్తరణ లక్షల హెక్టార్లలో నీటిపారుదలని సులభతరం చేస్తుందనీ.. వరదల సవాళ్లను పరిష్కరించడంలోనూ సహాయపడుతుందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. బీహార్ రైతులకు మఖానా సాగు ప్రధాన ఆదాయ వనరుగా ఉందనీ.. గత ప్రభుత్వాలు ఈ పంటనూ, రైతులనూ నిర్లక్ష్యం చేశాయని ప్రధానమంత్రి విమర్శించారు. మఖానాకు తమ ప్రభుత్వం తగిన ప్రాధాన్యమిచ్చిందన్నారు.
‘‘బీహార్ ప్రజలకు నేను ఇచ్చిన జాతీయ మఖానా బోర్డు హామీని సాకారం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం నిన్ననే బోర్డు ఏర్పాటు కోసం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది" అని ప్రధానమంత్రి వెల్లడించారు. మఖానా రైతులకు మెరుగైన ధరలు లభించేలా చేయడం.. ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం మెరుగుపరచడం కోసం బోర్డు నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. మఖానా రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం దాదాపు రూ. 475 కోట్ల విలువైన ప్రణాళికకు ఆమోదం తెలిపిందన్నారు.
బీహార్ ప్రస్తుత అభివృద్ధి, పురోగతి వేగం కొంతమందికి ఆందోళన కలిగిస్తోందనీ, దశాబ్దాలుగా బీహార్‌ను దోచుకుని, ఈ నేలను మోసం చేసిన వారు ఇప్పుడు బీహార్ సరికొత్త ప్రమాణాలను నిర్దేశించగలదని అంగీకరించేందుకు ఇష్టపడటం లేదన్నారు. బీహార్‌లోని ప్రతి రంగంలో వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు సాకారమవుతున్నాయనీ, రాజ్‌గిర్‌లో హాకీ ఆసియా కప్ నిర్వహణ.. ఆంటా-సిమారియా వంతెన చరిత్రాత్మక నిర్మాణం.. మేడ్-ఇన్-బిహార్ రైలు ఇంజిన్‌లను ఆఫ్రికాకు ఎగుమతి చేయడం వంటి కీలక విజయాలను ఆయన ఉటంకించారు. ఈ విజయాలను ప్రతిపక్ష నాయకులు జీర్ణించుకోవడం కష్టమనీ, బీహార్ ముందుకు వచ్చినప్పుడల్లా.. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాన్ని అవమానించడానికి ప్రయత్నిస్తాయన్నారు. ప్రతిపక్ష పార్టీల్లో ఒకరు బీహార్‌ను సోషల్ మీడియాలో బీడీతో పోల్చిన ఇటీవలి సందర్భాన్ని ప్రస్తావించిన శ్రీ నరేంద్ర మోదీ.. ఇది ధిక్కారాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఈ పార్టీలు మోసాలు, అవినీతి ద్వారా బీహార్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయనీ.. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న సమయంలో మళ్లీ ప్రతిష్ఠను దెబ్బతియ్యడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు బీహార్ సంక్షేమం కోసం ఎప్పటికీ పనిచేయలేరని, సొంత ఖజానాను నింపుకోవడానికి మాత్రమే శ్రద్ధ చూపే వారు.. పేదల ఇళ్లను గురించి పట్టించుకోరన్నారు. వారి హయాంలో ప్రభుత్వం పంపిన ప్రతి రూపాయిలో 85 పైసలు అవినీతికి గురైనట్లు మాజీ ప్రధానమంత్రి అంగీకరించారని గుర్తు చేశారు. ఆ పార్టీల పాలనలో డబ్బు ఎప్పుడైనా పేదలకు నేరుగా చేరిందా అని ప్రశ్నించారు. కోవిడ్-19 మహమ్మారి నుంచి ప్రతి పేద కుటుంబం ఉచిత రేషన్ పొందుతోందని శ్రీ మోదీ తెలిపారు. అటువంటి పార్టీల ప్రభుత్వాల హయాంలో ఇలాంటి ప్రయోజనాలు ఎప్పుడైనా అందించారా అని ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద పేదలందరికీ ఇప్పుడు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందుబాటులో ఉందని ప్రధానమంత్రి తెలిపారు. ఆసుపత్రులను నిర్మించడంలో విఫలమైన వారు ఇలాంటి ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను ఎలా అందించగలరని శ్రీ మోదీ ప్రశ్నించారు.
ప్రతిపక్ష పార్టీలు బీహార్ గౌరవానికే కాకుండా దాని గుర్తింపుకు కూడా ముప్పు కలిగిస్తున్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అక్రమ చొరబాటుదారుల కారణంగా సీమాంచల్, భారతదేశ తూర్పు భాగంలో తలెత్తుతున్న తీవ్రమైన జనాభా సంక్షోభాన్ని ఆయన ప్రస్తావించారు. బీహార్, బెంగాల్, అస్సాంలోని ప్రజలు సోదరీమణులు, ఆడబిడ్డల భద్రత గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎర్రకోట నుంచి జనాభా మిషన్‌ను ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులను రక్షించే ప్రయత్నం చేస్తోన్న ప్రతిపక్ష కూటమి, దాని అనుబంధ వ్యవస్థను ఆయన విమర్శించారు. వీళ్లు బీహార్‌తో పాటు భారతదేశ వనరులు, భద్రత రెండింటినీ ప్రమాదంలో పడేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. ప్రతి చొరబాటుదారుడిని ఇక్కడ నుంచి పంపించనున్నట్లు పూర్ణియా సభా వేదిక నుంచి ప్రకటించారు. చొరబాట్లను ఆపేయటం తమ ప్రభుత్వం తీసుకున్న బాధ్యత అని ఆయన తెలిపారు. చొరబాటుదారులను రక్షించే నాయకులు ముందుకు రావాలని ఆయన సవాలు చేశారు. ఈ నాయకులు చొరబాటుదారులను రక్షించేందుకు ఎంత ప్రయత్నించినా ప్రభుత్వం మాత్రం దృఢ సంకల్పంతో పనిచేస్తుందనీ, చొరబాటుదారులకు రక్షణ కవచంగా వ్యవహరించే వారిని ఆయన హెచ్చరించారు. అక్రమంగా ప్రవేశించేవారి ఇష్టాయిష్టాలు కాకుండా భారత చట్టాలదే పైచేయి అవుతుందని ఆయన స్పష్టం చేశారు. చొరబాటుదారులపై చర్యలు తీసుకుంటామనీ, వీటి ఫలితాలను దేశం త్వరలోనే చూస్తుందని ఉద్ఘాటించారు. చొరబాటుదారులకు మద్దతునిస్తూ చేసే భావజాల వ్యాప్తిని ప్రతిపక్ష కూటమి ప్రోత్సహిస్తోందనీ, వాళ్లకు బలమైన నిర్ణయాత్మక గుణపాఠం చెప్పేందుకు బీహార్, భారతదేశ ప్రజలు సిద్ధమవుతున్నారని వ్యాఖ్యానించారు.
గత రెండు దశాబ్దాలుగా బీహార్‌లోని ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రాలేదనీ, దీని వెనుక చోదక శక్తి బీహార్ మహిళలు, తల్లులు, మహిళలేనని ప్రధాని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు పరిపాలించినప్పుడు.. హత్య, అత్యాచారం, దోపిడీ వంటి తదితర నేరాలకు మహిళలే ప్రాథమిక బాధితులుగా ఉన్నారన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లోని తమ ప్రభుత్వం వల్ల ఈ మహిళలు ఇప్పుడు ’లఖ్‌పతి దీదీలు’, ‘డ్రోన్ దీదీలు’గా తయారవుతున్నారని.. స్వయం సహాయక బృందాల ద్వారా వస్తోన్న ఈ పరివర్తనకు మహిళామణులే నాయకత్వం వహిస్తున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ నాయకత్వంలో చేపట్టిన జీవికా దీదీ కార్యక్రమం ఘన విజయం సాధించినందుకు ఆయన ప్రశంసించారు.
మహిళల కోసం దాదాపు రూ. 500 కోట్ల సామాజిక పెట్టుబడి నిధిని (కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ నిధి) విడుదల చేసినట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ మొత్తం క్లస్టర్ స్థాయి సమాఖ్యలకు అందుతుందని.. తద్వారా గ్రామాల్లోని స్వయం సహాయక బృందాలు సాధికారత పొందుతాయని వివరించారు. మహిళలు వారి సామర్థ్యాలను పెంపొందించుకోవటానికి, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ఈ కార్యక్రమం కొత్త అవకాశాలను అందిస్తుందని చెప్పారు.
ప్రతిపక్షాలకు సొంత కుటుంబాల క్షేమమే మొదటి ప్రాధాన్యతని, వారు ఎప్పుడూ ప్రజల కుటుంబాలను పట్టించుకోలేదని మోదీ విమర్శించారు. దేశంలోని ప్రతి ఒక్కరు తన కుటుంబంలో భాగమని ఆయన ప్రముఖంగా చెప్పారు. అందుకే ప్రజల ఖర్చులు, వారి పొదుపుల గురించి ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. దీపావళి, ఛత్ సహా అనేక పండుగలు వస్తున్నందున ప్రభుత్వం నుంచి పేదలు, మధ్యతరగతికి ప్రభుత్వం ఒక మంచి బహుమతిని ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ సెప్టెంబర్ 15 అని, సరిగ్గా ఒక వారం తరువాత నవరాత్రి ప్రారంభమవుతుందని, ఆ రోజు సెప్టెంబర్ 22న దేశవ్యాప్తంగా జీఎస్టీ తగ్గుతుందని తెలిపారు. రోజువారీగా ఉపయోగించే చాలా వస్తువులపై జీఎస్టీ గణనీయంగా తగ్గుతుందని తెలియజేశారు. కార్యక్రమానికి హాజరైన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గింపు వల్ల వంటగదికి సంబంధించిన ఖర్చులు కూడా బాగా తగ్గుతాయన్నారు. టూత్‌పేస్ట్, సబ్బు, షాంపూ, నెయ్యి, వివిధ ఆహార ఉత్పత్తులు వంటివి మరింత అందుబాటు ధరల్లోకి వస్తాయి. పిల్లల విద్యకు సంబంధించిన స్టేషనరీ ఖర్చు కూడా తగ్గుతుందని అన్నారు. ఈ పండుగ సీజన్‌లో పిల్లలకు సంబంధించిన కొత్త బట్టలు, బూట్లు చౌకగా మారుతాయని.. తద్వారా వాటిని కొనటంలో భారం తగ్గుతుందన్నారు. ప్రభుత్వం పేదల పట్ల నిజంగా నిబద్ధతతో నడుచుకున్నప్పుడు ఇటువంటి ప్రభావంతమైన పురోగతిని ప్రజలకు అందుతుందని ప్రముఖంగా చెప్పారు.
పూర్ణియా వీరులు స్వాతంత్ర్య పోరాటంలో భారతదేశ సామర్థ్యాన్ని బ్రిటిష్ వారికి తెలియజేశారని గుర్తు చేసిన ఆయన.. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ మరోసారి తన ప్రత్యర్థులకు అదే సామర్థ్యాన్ని చూపిందన్నారు. ఈ వ్యూహాత్మక దాడిని చేపట్టటంలో పూర్ణియాకు చెందిన ధీరులు పోషించిన కీలక పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. జాతీయ భద్రత అయినా, జాతీయాభివృద్ధి అయినా.. దేశ పురోగతిలో బీహార్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. బీహార్ అభివృద్ధి పూర్తి సామర్థ్యంతో కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీహార్ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్.. కేంద్ర మంత్రులు శ్రీ రామ్మోహన్ నాయుడు, శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, శ్రీ జితన్ రామ్ మాంజీ, శ్రీ గిరిరాజ్ సింగ్, శ్రీ చిరాగ్ పాశ్వాన్, శ్రీ నిత్యానంద రాయ్, శ్రీ రామ్ నాథ్ ఠాకూర్, డాక్టర్ శ్రీ రాజ్ భూషణ్ చౌదరి, శ్రీ సతీష్ చంద్ర దూబే తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
ప్రధానమంత్రి బీహార్‌లో జాతీయ మఖానా బోర్డును ప్రారంభించారు. మఖానా ఉత్పత్తి, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటాన్ని ఈ బోర్డు ప్రోత్సహించనుంది. పంటకోత తర్వాత దిగుబడుల నిర్వహణను కూడా బలోపేతం చేయటంతో పాటుగా విలువ జోడింపు, ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించనుంది. మఖానాకు సంబంధించిన మార్కెట్, ఎగుమతి, బ్రాండ్ అభివృద్ధిని సులభతరం చేయనుంది. మొత్తంగా బీహార్, దేశంలోని మఖానా రైతులకు ప్రయోజనం చేకూర్చనుంది.
దేశంలోని మఖానా ఉత్పత్తిలో 90 శాతం బీహార్‌లోనే జరుగుతోంది. ఈ పంటకు మధుబని, దర్భాంగా, సీతామర్హి, సహర్సా, కతిహార్, పూర్నియా, సుపాల్, కిషన్‌గంజ్, అరారియాలలో అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. నాణ్యమైన మఖానా సాగుకు దోహదపడే సారవంతమైన నేలలు ఇవి కలిగి ఉన్నాయి. ఈ కారణాలతోనే ఈ జిల్లాలు మఖానా ఉత్పత్తికి ప్రధానమైన కేంద్రాలుగా ఉన్నాయి. బీహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేయటం వల్ల రాష్ట్రం, దేశంలో మఖానా ఉత్పత్తికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఇది మఖానా ఉత్పత్తికి సంబంధించిన ప్రపంచ పటంలో బీహార్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది.
పూర్ణియా విమానాశ్రయంలోని కొత్త పౌర ఎన్‌క్లేవ్‌లో తాత్కాలిక టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇది ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతుంది.
పూర్ణియాలో దాదాపు రూ. 40,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.
భాగల్పూర్‌లోని పిర్‌పైంటిలో 3x800 మెగావాట్ల థర్మల్ విద్యుతుత్పత్తి కేంద్రానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. రూ. 25,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు బీహార్ ప్రైవేటు రంగంలో అతిపెద్ద పెట్టుబడిగా ఉంది. ఈ కేంద్రాన్ని అల్ట్రా-సూపర్ క్రిటికల్, తక్కువ ఉద్గారాలు ఉండే సాంకేతికత ఆధారంగా నిర్మించనున్నారు. బీహార్‌కు కూడా విద్యుత్తు అందించే ఈ ప్రాజెక్టు.. రాష్ట్ర ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది.
రూ. 2680 కోట్లకు పైగా విలువైన కోసి-మెచి నది అనుసంధాన ప్రాజెక్టు మొదటి దశకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. కాలువలను ఆధునికీకరించటం, సిల్టింగ్, దెబ్బతిన్న వాటి పునర్నిర్మాణం, సెట్లింగ్ బేసిన్ పునరుద్ధరణ పనులతో పాటు కాలువ సామర్థ్యాన్ని 15,000 క్యూసెక్కుల నుంచి 20,000 క్యూసెక్కులకు పెంచే పనులు ఇందులో భాగంగా చేపట్టనున్నారు. ఇది ఈశాన్య బీహార్‌లోని అనేక జిల్లాలకు నీటిపారుదల, వరద నియంత్రణ, వ్యవసాయ ధృడత్వంలో ప్రయోజనం చేకూరుస్తుంది.
రైలు కనెక్టివిటీని మెరుగుపరచాలన్న నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి బీహార్‌లో పలు రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయటంతో పాటు కొన్ని రైళ్లను ప్రారంభించారు.
గంగా నదిని దాటేందుకు ప్రత్యక్ష రైల్వే అనుసంధానతను అందించే రూ. 2,170 కోట్లకు పైగా విలువైన విక్రమ్‌శిల - కటారియా మార్గానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. గంగా నదిపై ప్రత్యక్ష రైలు అనుసంధానతను అందించటం ద్వారా ఇది ఈ ప్రాంత ప్రజలకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుంది.
4,410 కోట్ల ఖర్చుచేపట్టిన అరరియా - గల్గాలియా (ఠాకూర్గంజ్) మధ్య నూతన రైలు మార్గాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు.
అరారియా - గల్గాలియా (ఠాకూర్గంజ్) మార్గంలో రైలును ప్రధాని ప్రారంభించారు. రెండు జిల్లాల మధ్య వచ్చిన ప్రత్యక్ష రైలు అనుసంధానత ఈశాన్య బీహార్ అంతటా రవాణాను మెరుగుపరచనుంది. జోగ్బానీ- దానాపూర్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా ఆయన ప్రారంభించారు. ఇది అరారియా, పూర్నియా, మాధేపురా, సహర్సా, ఖగారియా, బెగుసరాయ్, సమస్తిపూర్, ముజఫర్‌పూర్, వైశాలి, పాట్నా వంటి జిల్లాలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తుంది. సహర్సా- ఛెహర్తా (అమృత్‌సర్)- జోగ్బానీ- ఈరోడ్ మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా ఆయన ప్రారంభించారు. ఆధునిక ఇంటీరియర్స్, మెరుగైన సౌకర్యాలతో ఉన్న ఈ రైలు వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అదే సమయంలో ఈ ప్రాంతాలలో ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక ఏకీకరణను ప్రోత్సహిస్తుంది.
ప్రధానమంత్రి పూర్ణియలో లింగ విభజన వీర్య కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఏటా లింగ విభజన చేసిన 5 లక్షల వీర్యం డోసులను ఉత్పత్తి చేయగలదు. తూర్పు , ఈశాన్య భారత్‌లో ఈ తరహా కేంద్రాల్లో మొదటిది ఇదే. భారత్‌లో తయారీ, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా 2024 అక్టోబర్‌లో ఆవిష్కరించిన స్వదేశీ సాంకేతికతను ఈ కేంద్రం ఉపయోగిస్తుంది. ఆవు దూడ జన్మించే అవకాశాలను పెంచడం ద్వారా ఈ సాంకేతికత ద్వారా చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని వారు మరిన్ని ఆడ ఆవులను పొందుతారు. తద్వారా ఆర్థిక ఒత్తిడిని తగ్గించడంలో, మెరుగైన ఉత్పాదకత ద్వారా ఆదాయాలను పెంచడంలో వారికి సహాయపడుతుంది.
గ్రామీణ పీఎంఏవై కింద 35,000 మంది లబ్ధిదారులు.. పట్టణ పీఎంఏవై కింద 5,920 మంది లబ్ధిదారుల గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక్కడ కొంతమంది లబ్ధిదారులకు తాళాలను అందజేశారు.
ప్రధానమంత్రి బీహార్‌లోని డే-ఎన్ఆర్ఎల్ఎం కింద క్లస్టర్ స్థాయి సమాఖ్యలకు (సీఎల్ఎఫ్) దాదాపు రూ. 500 కోట్ల సామాజిక పెట్టుబడి నిధులను పంపిణీ చేశారు. కొంతమంది సీఎల్ఎఫ్ అధ్యక్షులకు చెక్కులను అందజేశారు.
***
MJPS/SR
(Release ID: 2167046)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam