ప్రధాన మంత్రి కార్యాలయం
పంజాబ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఏరియల్ సర్వే
గురుదాస్‌పూర్‌లో సమీక్ష... నష్టాన్ని అంచనా వేసిన ప్రధానమంత్రి
పంజాబ్‌కు ఇప్పటికే విడుదలైన రూ. 12,000 కోట్లకు అదనంగా
రాష్ట్రానికి రూ. 1600 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నష్టపరిహారం,
గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం ప్రకటించిన ప్రధానమంత్రి
ఇటీవలి వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా
అనాథలైన పిల్లలకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద సమగ్ర సహాయాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి
బాధిత కుటుంబాలను కలుసుకుని సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఆపద మిత్ర వాలంటీర్లను కలుసుకొని వారి సేవలను ప్రశంసించిన ప్రధాని
ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణ,
పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తుందని హామీ
Posted On:
09 SEP 2025 5:34PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 సెప్టెంబర్ 9న పంజాబ్ చేరుకుని… వరద పరిస్థితిని సమీక్షించారు. వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, భారీ వర్షాల కారణంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేశారు.
పంజాబ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి వైమానిక సర్వే నిర్వహించారు. అనంతరం గురుదాస్‌పూర్‌లో ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులతో అధికారిక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పంజాబ్‌లో జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటు చేపట్టిన సహాయ, పునరావాస చర్యలను ప్రధాని మోదీ సమీక్షించారు.
పంజాబ్‌కు ఇప్పటికే అందించిన రూ. 12,000 కోట్లకు అదనంగా రూ. 1600 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రెండో విడతను కూడా ముందస్తుగా విడుదల చేయనున్నారు.
ప్రంజాబ్ ప్రాంత పునరుద్దరణ, ప్రజలు కోలుకునేందుకు బహుముఖ ప్రణాళికలను అమలు చేయాల్సిన అవసరముందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను పునర్నిర్మించడం, జాతీయ రహదారులను పునరుద్ధరించడం, పాఠశాలలను పునర్నిర్మించడం, పీఎంఎన్ఆర్ఎఫ్ ద్వారా నేరుగా సహాయం, పశువులకు మినీ కిట్లను పంపిణీ చేయడం వంటి చర్యలు ఉంటాయి.
వ్యవసాయ రంగంపై దృష్టిసారిస్తూ... ప్రస్తుతం విద్యుత్ కనెక్షన్లు లేని రైతులకు అదనంగా ఆర్థిక సహాయం అందించనున్నారు. మట్టిలో కూరుకుపోయిన లేదా వరదల వల్ల కొట్టుకుపోయిన బోర్లను పునరుద్దరించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల ఆధారంగా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద సహాయం అందించనున్నారు.
ఎమ్‌ఎన్‌ఆర్‌ఈ సహకారంతో డీజిల్ బోర్ పంపులకు బదులుగా సౌరశక్తి ఆధారిత పంపులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోనున్నారు. ఇది ‘‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ అనే పథకం కిందగా సూక్ష్మ సాగునీటి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చేపడుతున్నారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ పథకం ద్వారా వరదల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లను పునర్నిర్మించేందుకు పంజాబ్ ప్రభుత్వం సమర్పించిన “స్పెషల్ ప్రాజెక్ట్” కింద ఆర్థిక సహాయం అందించనున్నారు.
పంజాబ్‌లో ఇటీవల సంభవించిన వరదల్లో దెబ్బతిన్న ప్రభుత్వ పాఠశాలలకు సమగ్ర శిక్షా అభియాన్ కింద ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ సహాయం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం అవసరమైన అన్ని సహాయక సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
పంజాబ్‌లో జల్ సంచయ్ జన భాగీదారి కార్యక్రమం కింద నీటి సంరక్షణకు సంబంధించిన నిర్మాణాలను విస్తృతంగా చేపడుతున్నారు. ఇప్పటికే పాడైపోయిన వాటిని మరమ్మత్తు చేయడం, కొత్త నీటి సేకరణ నిర్మాణాలను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ చర్యలు వర్షపు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించి, దీర్ఘకాలిక నీటి స్థిరత్వాన్ని సాధించడంలో సహాయపడతాయి.
పంజాబ్‌లో వరదల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం.. అంతర్-మంత్రిత్వ కేంద్ర బృందాలను పంపింది. వీరు అందించే వివరణాత్మక నివేదిక ఆధారంగా తదుపరి సహాయం పరిగణనలోకి తీసుకోనుంది.
ప్రకృతి విపత్తు కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ.. అన్ని విధాల సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
పంజాబ్‌లో వర్షాలు, వరదల వల్ల ప్రభావితమైన కుటుంబాలను ప్రధానమంత్రి పరామర్శించారు. వరదలు, ప్రకృతి వైపరీత్యంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల నష్టపరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు.
ఇటీవల సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల అనాథలైన పిల్లలకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద సమగ్ర సహాయాన్ని అందిస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు. ఇది వారి దీర్ఘకాలిక సంక్షేమానికి తోడ్పడుతుంది.
ముందస్తు నిధుల విడుదలతోపాటు, విపత్తు నిర్వహణ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని విధాల సహాయం రాష్ట్రాలకు అందించనునన్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సైన్యం, రాష్ట్ర యంత్రాంగం, ఇతర సేవా సంస్థల సిబ్బందిని ప్రధాన మంత్రి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన మెమోరాండం, కేంద్ర బృందాల సమగ్ర నివేదిక ఆధారంగా పరిస్థితిని మరింత సమీక్షించి, అదనపు సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు.
ఈ విపత్తు తీవ్రతను గుర్తించి, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేయడానికి కట్టుబడి ఉందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.
***
(Release ID: 2165192)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam