ప్రధాన మంత్రి కార్యాలయం
జపాన్ ప్రధానితో కలిసి భారత ప్రధాని సంయుక్త పత్రికా ప్రకటన
Posted On:
29 AUG 2025 5:08PM by PIB Hyderabad
గౌరవ ప్రధానమంత్రి శ్రీ ఇషిబా,
రెండు దేశాల ప్రతినిధులు,
మీడియా మిత్రులారా,
నమస్తే!
కొన్బాన్వా!
ముందుగా ఆప్యాయంగా పలకరించి, ఆత్మీయ స్వాగతం పలికిన ప్రధానమంత్రి ఇషిబా గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఈ రోజు మా చర్చ ఫలప్రదంగా, ప్రయోజనకరంగా సాగింది. రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగా, శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా.. మన భాగస్వామ్యం ఈ రెండు దేశాలకే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వానికి కూడా చాలా ముఖ్యమైనదని మేమిద్దరం అంగీకరిస్తున్నాం.
మెరుగైన ప్రపంచాన్ని తీర్చిదిద్దడంలో బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు సహజంగానే భాగస్వాములవుతాయి.
మిత్రులారా,
మన ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యంలో ఓ కొత్త, సువర్ణాధ్యాయానికి ఈ రోజు బలమైన పునాది పడింది. వచ్చే దశాబ్దానికి మేమొక ప్రణాళికను నిర్దేశించుకున్నాం. పెట్టుబడి, ఆవిష్కరణ, ఆర్థిక భద్రత, పర్యావరణం, సాంకేతికత, ఆరోగ్యం, రవాణా, ప్రజా సంబంధాలు, ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాల మధ్య సహకారం లక్ష్యాలుగా మేం ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాం. రాబోయే పదేళ్లలో భారత్‌లో జపాన్ నుంచి 10 ట్రిలియన్ యెన్ల పెట్టుబడిని లక్ష్యంగా పెట్టుకున్నాం. రెండు దేశాల్లోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలను అనుసంధానించడంపై కూడా మేం ప్రత్యేక శ్రద్ధ చూపుతాం.
‘‘భారత్‌లో తయారు చేద్దాం, ప్రపంచమంతటికీ అందిద్దాం’’ అని భారత్-జపాన్ వాణిజ్య వేదిక నుంచి కూడా జపాన్ కంపెనీలను నేను కోరాను.
మిత్రులారా,
మన ఉమ్మడి పరపతి యంత్రాంగం ఇంధన రంగంలో అత్యంత లాభదాయకమైనది. మన ఆర్థిక భాగస్వామ్యం లాగానే మన పర్యావరణ భాగస్వామ్యమూ బలంగా ఉందని దీనిద్వారా స్పష్టమవుతోంది. ఈ దిశగా, సుస్థిర ఇంధన కార్యక్రమాన్ని, బ్యాటరీ సరఫరా శ్రేణి భాగస్వామ్యాన్ని కూడా ప్రారంభిస్తున్నాం.
ఆర్థిక భద్రతా సహకార కార్యక్రమాన్ని మేం ప్రారంభిస్తున్నాం. దీని కింద కీలకమైన, వ్యూహాత్మక రంగాల్లో సమగ్ర విధానంతో ముందుకు సాగుతాం.
ఉన్నత సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సహకారం మా ఇద్దరి ప్రాధాన్యం. ఈ నేపథ్యంలో.. డిజిటల్ భాగస్వామ్యం 2.0, ఏఐ సహకార కార్యక్రమాలను చేపడుతున్నాం. సెమీకండక్టర్లు, అరుదైన ఖనిజాలది మా ఎజెండాలలో అగ్రస్థానం.
మిత్రులారా,
జపాన్ సాంకేతికత, భారతీయ ప్రతిభ విజయవంతమైన సమ్మేళనమని మేం విశ్వసిస్తున్నాం. ఓవైపు హై స్పీడ్ రైళ్లపై కృషి చేస్తూనే, మరోవైపు సమగ్ర రవాణా భాగస్వామ్యం కింద ఓడరేవులు, విమానయానం, నౌకానిర్మాణం వంటి రంగాల్లోనూ మేం వేగంగా పురోగమిస్తున్నాం.
చంద్రయాన్-5 మిషన్‌లో సహకారం కోసం ఇస్రో - జాక్సా ఒప్పందాన్ని మేం స్వాగతిస్తున్నాం. భౌగోళిక సరిహద్దులకు అతీతంగా, అంతరిక్షం దిశగా మానవాళి పురోగతికి మన క్రియాశీల భాగస్వామ్యం ప్రతీకగా నిలుస్తుంది!
మిత్రులారా,
మానవ వనరుల బదిలీ కార్యాచరణ ప్రణాళిక కింద.. వచ్చే అయిదేళ్లలో ఇరు దేశాలు వివిధ రంగాల్లో 5 లక్షల వ్యక్తుల పరస్పర మార్పిడిని ప్రోత్సహించాలి. దీని కింద, నైపుణ్యం కలిగిన 50,000 భారతీయులు జపాన్ ఆర్థిక వ్యవస్థకు క్రియాశీలంగా దోహదపడతారు.
భారత్ - జపాన్ మధ్య భాగస్వామ్యం ఢిల్లీ - టోక్యోలకే పరిమితం కాదు. భారత రాష్ట్రాలు, జపాన్లోని స్థానిక ప్రభుత్వాల మధ్య సంస్థాగత సహకారం ద్వారా మా భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుంది. వాణిజ్యం, పర్యాటకం, విద్య, సాంస్కృతిక వినిమయానికి ఇది కొత్త తలుపులు తెరుస్తుంది.
మిత్రులారా,
స్వేచ్ఛాయుత, బహిరంగ, శాంతియుత, శ్రేయోదాయకమైన, నియమాల ఆధారిత ఇండో పసిఫిక్‌కు భారత్, జపాన్ పూర్తిగా కట్టుబడి ఉన్నాయి.
ఉగ్రవాదం, సైబర్ భద్రత అంశాలపై మేం చర్చించాం. రక్షణ, సముద్ర భద్రత రంగాల్లో కూడా మనకు ఉమ్మడి ప్రయోజనాలున్నాయి. రక్షణ పరిశ్రమ, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని మేం నిర్ణయించాం.
మిత్రులారా,
పరస్పర విశ్వాసమే భారత్, జపాన్ భాగస్వామ్యానికి ప్రాతిపదిక. మన జాతీయ ప్రాధాన్యాలను ఇది ప్రతిబింబిస్తుంది. మన ఉమ్మడి విలువలు, విశ్వాసాలు దీన్ని తీర్చిదిద్దాయి.
శాంతి, పురోగతితోపాటు మన ప్రజల, ప్రపంచ శ్రేయస్సు అనే ఉమ్మడి కలను మనం సంయుక్తంగా ముందుకు తీసుకెళ్తున్నాం.
గౌరవనీయులారా,
మీరు చూపిన స్నేహంపట్ల మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వచ్చే వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత్‌ను సందర్శించాల్సిందిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.
అరిగతో గోజైమాసు.
ధన్యవాదాలు
గమనిక- ప్రధానమంత్రి ప్రసంగానికి ఇది ఇంచుమించుగా చేసిన అనువాదం. మౌలిక ప్రసంగం హిందీలో ఉంది.
(Release ID: 2162147)
Visitor Counter : 22
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada