ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్-జపాన్ ఆర్థిక ఫోరంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
Posted On:
29 AUG 2025 11:57AM by PIB Hyderabad
గౌరవ ప్రధానమంత్రి ఇషిబా,
భారత్, జపాన్ దేశాల వ్యాపారవేత్తలు,
సోదర సోదరీమణులారా,
నమస్కారం
కొనిచివా!
ఈ రోజు ఉదయమే నేను టోక్యోకి చేరుకున్నాను. నా పర్యటన వ్యాపార ప్రపంచానికి చెందిన దిగ్గజాలతో ప్రారంభం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
వ్యక్తిగతంగా మీలో చాలా మంది నాకు తెలుసు. నేను గుజరాత్‌లో ఉన్నప్పుడుగానీ, లేదా ఢిల్లీకి వచ్చిన తర్వాతగానీ కలిసి ఉంటాం. మీలో చాలా మందితో నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. మీ అందరినీ ఈ రోజు ఇలా కలుసుకొనే అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నాను.
ఈ ఫోరంలో చేరినందుకు ప్రధానమంత్రి ఇషిబాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన విలువైన ప్రసంగాన్ని అభినందిస్తున్నాను.
స్నేహితులారా,
భారత్ ప్రగతి ప్రయాణంలో జపాన్ ఎల్లప్పుడూ ముఖ్యమైన భాగస్వామిగా ఉంది. మెట్రో, తయారీ రంగం, సెమీకండక్టర్లు, అంకుర సంస్థలు.. ఇలా ప్రతి రంగంలోనూ మా భాగస్వామ్యం పరస్పర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.
భారత్‌లో జపాన్ సంస్థలు 40 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాయి. గడచిన రెండేళ్లలోనే.. 13 బిలియన్ డాలర్ల ప్రైవేటు పెట్టుబడులు వచ్చాయి. భారత్‌ను అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా జేబీఐసీ పేర్కొంది. 80 శాతం సంస్థలు భారత్‌లో విస్తరించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, 75 శాతం ఇప్పటికే లాభాల్లో ఉన్నాయని జేఈటీఆర్‌వో తెలియజేసింది.
అంటే.. భారత్‌లో పెట్టుబడి అనేక రెట్లు వృద్ధి చెందుతుందని అర్థం.
స్నేహితులారా,
గడచిన పదకొండేళ్లలో భారత్ సాధించిన అనేక మార్పుల గురించి మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం భారత్‌లో రాజకీయ, ఆర్థిక స్థిరత్వం ఉంది. స్పష్టమైన, ఊహించదగిన విధానాలు అమలు చేస్తున్నాం. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్. అతి త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది.
అంతర్జాతీయ వృద్ధిలో భారత్ 18 శాతం వాటా కలిగి ఉంది. దేశంలోని క్యాపిటల్ మార్కెట్లు మంచి రాబడి ఇస్తున్నాయి. మా దగ్గర బలమైన బ్యాంకింగ్ రంగం ఉంది. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు తక్కువగా ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు సుమారుగా 700 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి.
స్నేహితులారా,
ఈ మార్పులన్నింటి వెనుక ‘సంస్కరణ, ఆచరణ, పరివర్తన’ అనే మా విధానం ఉంది. 2017లో ‘‘ఒకే దేశం- ఒకే పన్ను’’ విధానాన్ని పరిచయం చేశాం. ఇప్పుడు మేం కొత్త, బృహత్ సంస్కరణలను తీసుకొచ్చేందుకు మేం పనిచేస్తున్నాం. కొన్ని వారాల కిందట మా పార్లమెంట్ సరళీకరించిన కొత్త ఆదాయ పన్ను కోడ్‌ను ఆమోదించింది.
మా సంస్కరణలు పన్ను వ్యవస్థకు మాత్రమే పరిమితం కాలేదు. వ్యాపారాన్ని సులభతరం చేయడం పైన కూడా మేం దృష్టి సారించాం. వ్యాపార అనుమతుల కోసం సింగిల్ డిజిటల్ విండోను ఏర్పాటు చేశాం. 45,000 అనుమతులను హేతుబద్దీకరించాం. నియంత్రణలను సరళీకరించే ప్రక్రియను వేగవంతం చేయడానికి అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశాం.
రక్షణ, అంతరిక్షం లాంటి కీలకమైన రంగాల్లో ప్రైవేటు రంగానికి భాగస్వామ్యం కల్పించాం. ఇప్పుడు అణు శక్తి రంగంలోనూ అవకాశాలను అందిస్తాం.
స్నేహితురాలా,
అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించాలనే మా సంకల్పాన్ని ఈ సంస్కరణలు ప్రతిబింబిస్తాయి. మాకు చిత్తశుద్ధి, దృఢ విశ్వాసం, వ్యూహం ఉన్నాయి. వాటిని ప్రపంచం గుర్తించి, ప్రశంసించింది. రెండు దశాబ్దాల తర్వాత భారత్ క్రెడిట్ రేటింగ్‌ను ఎస్ అండ్ పీ గ్లోబల్ పెంచింది.
ఈ ప్రపంచం భారత్‌ను గమనించడమే కాదు.. భారత్‌పై ఆశలు పెట్టుకుంది.
స్నేహితులారా,
భారత్-జపాన్ బిజినెస్ ఫోరం రిపోర్టు ఇప్పుడే సమర్పించారు. దీనిలో మన సంస్థల మధ్య ఉన్న వ్యాపార ఒప్పందాలను వివరించారు. ఈ పురోగతిని సాధించిన మీ అందిరకీ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన భాగస్వామ్యం కోసం కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాను.
మొదటిది తయారీ రంగం. ఆటో రంగంలో మన భాగస్వామ్యం బాగా విజయవంతమైంది. దాని గురించి ప్రధానమంత్రి బాగా వివరించారు. ఈ అద్భుతాన్ని మనం బ్యాటరీలు, రోబోటిక్స్, సెమీ కండక్టర్లు, నౌకా నిర్మాణం, అణు విద్యుత్‌లోనూ మనం పునరావృతం చేయగలం. అలాగే గ్లోబల్ సౌత్ .. ముఖ్యంగా ఆఫ్రికా అభివృద్ధికి మనం గణనీయమైన సహకారం అందించగలం.
ఇండియాకు వచ్చి మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ లో భాగస్వాములవ్వాలని మీ అందరినీ కోరుతున్నాం. సుజుకీ, డైకిన్ తరహాలో మీరూ విజయ గాథలను సృష్టించవచ్చు.
రెండోది, సాంకేతికత, ఆవిష్కరణ. జపాన్ ‘‘టెక్ పవర్ హౌస్’’, భారత్ ‘‘టాలెంట్ పవర్ హౌస్’’. ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్, అంతరిక్ష రంగంలో భారత్ సాహసోపేతమైన, ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాలను చేపట్టింది. జపాన్ టెక్నాలజీ, భారత్ ప్రతిభ రెండూ కలసి ఈ శతాబ్దపు సాంకేతిక విప్లవానికి నాయకత్వం వహించవచ్చు.
మూడోది హరిత ఇంధనానికి మారడం. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను సాధించాలనే లక్ష్యం దిశగా భారత్ వేగంగా ముందుకు సాగుతోంది. అలాగే 2047 నాటికి 100 గిగావాట్ల న్యూక్లియర్ విద్యుత్ సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. సోలార్ బ్యాటరీల నుంచి హరిత హైడ్రోజన్ వరకు, భాగస్వామ్యానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
జాయింట్ క్రెడిట్ మెకానిజంపై భారత్, జపాన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇది స్వచ్ఛమైన, హరిత భవిష్యత్ నిర్మాణంలో సహకారానికి ఉపయోగపడుతుంది.
నాలుగోది, తర్వాతి తరం మౌలిక వసతులు. గడచిన దశాబ్దంలో, తర్వాతి తరం రవాణా, రవాణా అనుబంధ మౌలికవసతుల్లో భారత్ అపూర్వమైన ప్రగతి సాధించింది. మా నౌకాశ్రయాలు రెట్టింపయ్యాయి. 160 కంటే ఎక్కువ విమానశ్రయాలు ఉన్నాయి. 1000 కి.మీ. మెట్రో లైన్లు నిర్మించాం. జపాన్ సహకారంతో ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు పనులు కొనసాగుతున్నాయి.
మా ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు. జపాన్ సమర్థత, భారత్ వృద్ధి రెండూ కలసి పరిపూర్ణ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయగలవు.
అయిదోది, నైపుణ్యాభివృద్ధి, ప్రజల మధ్య సంబంధాలు. భారతీయ యువ ప్రతిభకు అంతర్జాతీయ అవసరాలను తీర్చగలిగే సామర్థ్యం ఉంది. దీని నుంచి జపాన్ కూడా లబ్ధి పొందుతుంది. జపనీస్ భాష, సాఫ్ట్ స్కిల్స్‌లో భారతీయ యువతకు శిక్షణ ఇవ్వొచ్చు. తద్వారా ‘‘జపాన్‌కు అవసరాలకు తగిన’’ శ్రామిక శక్తిని తయారు చేయవచ్చు. ఉమ్మడి శ్రామిక శక్తి.. ఉమ్మడి సంక్షేమానికి దారి తీస్తుంది.
స్నేహితులారా,
చివరిగా.. భారత్, జపాన్ భాగస్వామ్యం వ్యూహాత్మకమైనది, చురుకైనదని చెప్పదలుచుకున్నాను. ఉమ్మడి ఆసక్తులను ఆర్థిక తర్కంతో శక్తిమంతం చేసి ఉమ్మడి సంక్షేమంగా మార్చాం.
గ్లోబల్ సౌత్‌కు జపాన్ వ్యాపారాలు చేరుకొనే వేదికలా భారత్ పనిచేస్తుంది. మనం కలసి స్థిరత్వం, వృద్ధి, సంక్షేమం కోసం ఆసియా శతాబ్దాన్ని రూపొందిస్తున్నాం.
ఈ మాటలతో, ప్రధానమంత్రి ఇషిబాగారికీ, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అరిగటౌ గొజైమసు!
ధన్యవాదాలు.
సూచన: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.
***
(Release ID: 2162028)
Visitor Counter : 11
Read this release in:
English
,
Hindi
,
Punjabi
,
Urdu
,
Nepali
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam