ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 02 AUG 2025 3:51PM by PIB Hyderabad

నమఃపార్వతీ పతయే.. హర హర మహాదేవ.. పవిత్ర శ్రావణ మాసంలో కాశీలోని నా కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఈ రోజు నాకు లభించింది. ఈ సందర్భంగా మీకందరికీ ఇదే నా ప్రణామం.

ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య, శ్రీ బ్రజేష్ పాఠక్, పాట్నా నుంచి మాతో జతకలిసిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయ ముఖ్యమంత్రులు, మంత్రులు, యూపీ ప్రభుత్వ మంత్రులు, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శ్రీ భూపేంద్ర సింగ్ చౌదరి, ఎమ్మెల్యేలు-ఇతర ప్రజా ప్రతినిధులు, నా ప్రియ రైతు సోదరీసోదరులు... ముఖ్యంగా నన్ను శాసించగల నా కాశీ ప్రజలారా!

ఈ పవిత్ర కాశీ నగరం నుంచి నేడు మనం దేశంలోని లక్షలాది రైతులతో సంధానమయ్యాం. ఇది శ్రావణ మాసం... అందునా కాశీ లాంటి పవిత్ర ప్రదేశం నుంచి అన్నదాతలతో మమేకమయ్యే అవకాశం లభించడంకన్నా గొప్ప అదృష్టం మరేముంటుంది? ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి నేనివాళ కాశీకి వచ్చాను. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రదాడికి 26 మంది అమాయకులు బలయ్యారు. వారి కుటుంబాల బాధ, ఆ పిల్లల ఆవేదన,  కుమార్తెల ఆక్రోశం చూసి, నా హృదయం భరించరాని వేదనతో తల్లడిల్లింది. నాటి ఘోర దురంతంలో ఆప్తులను కోల్పోయిన బాధితులందరికీ దుఃఖం నుంచి తేరుకునే ధైర్యమివ్వాలని ఆనాడే నేను కాశీ విశ్వనాథుణ్ని వేడుకున్నాను. కాశీలోని నా శాసనకర్తలారా! మన కుమార్తెల సిందూరం తుడిపేసిన దుండగీళ్లపై ప్రతీకారం తప్పదని నేను చేసిన వాగ్దానం కూడా నెరవేరింది. మహాదేవుని ఆశీర్వాదంతోనే ఇది సాధ్యమైంది. అందుకే, ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ఆయన పాదాలకు అంకితమిస్తున్నాను.

మిత్రులారా!

శ్రావణమాసం తొలి సోమవారం నాడు కాశీలో శివభక్తులు గంగాజలాన్ని మోసుకెళ్లడాన్ని చూసే అవకాశం మనకు లభించినప్పుడు... ముఖ్యంగా మన యాదవ సోదరులు స్వామివారికి జలాభిషేకం చేసేందుకు వెళ్తున్నపుడు, యాదవ సోదరుల బృందం గౌరీ కేదారేశ్వర్ నుంచి గంగాజలాన్ని భుజాలపై మోసుకెళ్లడం ఇవన్నీ ఎంత అందమైన దృశ్యాలు! డమరుక నాదం, వీధుల్లో ప్రతిధ్వనించే శివభక్తుల నినాదాలు.. ప్రపంచంలోనే ఇంతటి అద్భుత  అనుభూతి మరెక్కడా కనిపించదు. పవిత్ర శ్రావణ మాసంలో కాశీ విశ్వనాథుడు, మార్కండేయులను సందర్శించాలనే ఆకాంక్ష నాలో రగిలింది! కానీ, నేను వెళ్తే మహాదేవుని భక్తులకు ఇబ్బంది కలుగుతుంది. అందుకే వారి దర్శనానికి ఆటంకం కలగకుండా, నేనివాళ ఇక్కడి నుంచే భోలేనాథ్ కు, గంగామాతకు నా శిరసాభివందనం అర్పిస్తున్నాను. సేవాపురిలోని ఈ వేదిక నుంచి కాశీ విశ్వనాథ స్వామికి సాష్టాంగ ప్రణామం ఆచరిస్తున్నాను. నమఃపార్వతీపతయే... హరహర మహదేవ!

మిత్రులారా!

కొన్ని రోజుల కిందట నేను తమిళనాడులో ఉన్నాను... అక్కడ వెయ్యేళ్ల పురాతన, చారిత్రక గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించాను. ఇది దేశంలో శైవ సంప్రదాయానికి ప్రాచీన కేంద్రం. మన దేశపు మహోన్నత, సుప్రసిద్ధ చక్రవర్తి రాజేంద్ర చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. అంతేకాదు... ఉత్తర భారత గంగా జలాన్ని తరలించి, దక్షిణాదితో సంధానించాడు. వెయ్యేళ్ల కిందట మహశివునిపై భక్తితోపాటు శైవ సంప్రదాయంపై తనకుగల అనురక్తి ద్వారా ‘ఒకే భారత్-శ్రేష్ఠ భారత్’ అంటూ రాజేంద్ర చోళుడు నినదించాడు. కాశీ-తమిళ సంగమం వంటి కార్యక్రమాల ద్వారా ఆ స్ఫూర్తిని కొనసాగించేందుకు మేము భక్తి పురస్సరంగా కృషి చేస్తున్నాం. ఇటీవల గంగైకొండ చోళపురానికి వెళ్లినపుడు... మీ ఆశీర్వాదంతో వెయ్యేళ్ల తర్వాత నేను కూడా గంగాజలంతో అక్కడికి వెళ్లానన్న భావన నాకెంతో సంతృప్తినిచ్చింది. గంగామాత ఆశీస్సులతో అక్కడ అత్యంత పవిత్ర వాతావరణంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో శివునికి గంగా జలాభిషేకం చేసే భాగ్యం నాకు దక్కింది.

మిత్రులారా!

జీవితంలో లభించే అలాంటి అరుదైన అవకాశాలు ఎంతో స్ఫూర్తినిస్తాయి. దేశ ఐక్యత ప్రతి అంశంలోనూ నవ చైతన్యం నింపుతుంది. కాబట్టే, 140 కోట్ల మంది దేశ ప్రజానీకం శక్తిని అందిపుచ్చుకుని ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైంది.

మిత్రులారా!

మన సైన్యం శౌర్యపరాక్రమాల ప్రదర్శనకు ఆపరేషన్ సింధూర్ ఒక నిదర్శనం. ఇక నేడు భారీ స్థాయిలో నిర్వహిస్తున్న రైతు ఉత్పవంలో అన్నదాతలకు వందనం చేసే అవకాశం నాకు లభించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద దేశంలోని 10 కోట్ల మంది రైతు సోదరీసోదరుల ఖాతాలకు రూ.21 వేల కోట్లు నేరుగా జమయ్యాయి. కాశీ నగరం నుంచి వెళ్లిన ఈ నిధులు సహజంగానే విశ్వనాథుని ప్రసాదంగా పరిగణనలోకి వస్తుంది.

మిత్రులారా!

విశ్వనాథుని ఆశీస్సులతో గంగామాత ప్రవాహంలా కాశీ నగరం అభివృద్ధి పథంలో నిరంతరం దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా నేడు రూ.2 వేల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశాం. ఈ నేపథ్యంలో దేశంలోని రైతులందరికీ ఈ వేదిక నుంచి అభినందనలు తెలుపుతున్నాను. కొన్ని రోజుల కిందట కాశీలో ఎంపీ టూరిస్ట్ గైడ్ పోటీ నిర్వహించారు. పోటీ ద్వారా నైపుణ్యాభివృద్ధి, స్వయం కృషితో నైపుణ్యాభివృద్ధి వంటి అనేక ప్రయోగాత్మక పోటీలను కాశీ నేలపై నిర్వహిస్తున్నారు. అలాగే భవిష్యత్తులో కాశీ ఎంపీ ఫోటోగ్రఫీ పోటీ, ఎంపీ ఉపాధి ఉత్సవం వంటి అనేక కార్యక్రమాలు కూడా చేపడతారు. దీనిపై ఇక్కడి ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులందర్నీ బహిరంగంగా అభినందిస్తున్నాను. వీరందరూ యువతరాన్ని ప్రజా భాగస్వామ్యంతో అనుసంధానించి విజయవంతంగా ముందుకు నడిపించగలరు. ఈ కార్యకలాపాల్లో పాల్గొన్న అధికారులందరికీ కూడా నా అభినందనలు. పోటీలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు.

మిత్రులారా!

దేశంలోని రైతుల సౌభాగ్యం కోసం మా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో రైతుల పేరిట ప్రకటనలు చేయడమేగానీ, ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాల్లేవు. కానీ బీజేపీ ఏం చెబుతుందో అది చేసి తీరుతుంది! ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద నేడు రైతుల ఖాతాలకు నిధులు జమ చేయడం ప్రభుత్వ దృఢ సంకల్పానికి ఒక నిదర్శనం.

సోదరీసోదరులారా!

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో ప్రారంభించినప్పుడు ప్రగతి నిరోధక శక్తులు, సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ వంటి పార్టీలు ఎలాంటి వదంతులు సృష్టించాయో మీకు గుర్తుండే ఉంటుంది. వారు ప్రజలను తప్పుదారి పట్టిస్తూ, రైతులను గందరగోళానికి గురిచేశారు. “మోదీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినా, 2019 ఎన్నికల తర్వాత ఇదంతా ఆగిపోతుంది. మోదీ చేతులమీదుగా రైతుల ఖాతాల్లో జమచేసిన సొమ్మును వెనక్కు తీసుకుంటారు” అంటూ వారెన్నో అబద్ధాలు ప్రచారం చేశారు. ఇన్ని అసత్యాలా? ఇదంతా  దేశం చేసుకున్న పాపం... ప్రతికూల ధోరణిగల వ్యక్తులు నిస్పృహకు లోనై భ్రమల్లో బతుకుతున్నారు. దేశ ప్రజలకు, రైతులకు వారు అబద్ధాలు ఎన్నయినా చెప్పగలరు. కానీ, మీరు చెప్పండి... పథకానికి శ్రీకారం చుట్టిన నాటినుంచీ ఒక్క వాయిదా అయినా ఆగిందా? పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం నిర్విఘ్నంగా, నిరంతరాయంగా కొనసాగుతోంది.
ఇప్పటిదాకా అక్షరాలా రూ.3.75 లక్షల కోట్లు... రైతుల ఖాతాల్లో జమయ్యాయి. విన్నారు కదా... ఇప్పుడు చెప్పండి... ఎంత మొత్తం జమయింది... ఎంత? (రైతులు: 3.75 లక్షల కోట్లు). ఈ 3.75 లక్షల కోట్లు... ఇంత భారీ మొత్తం ఎవరి ఖాతాలకు చేరిందంటారు? అదంతా నా రైతు సోదరీసోదరుల ఖాతాల్లో నేరుగా జమయింది. ఇందులో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని దాదాపు 2.5 కోట్ల మంది రైతులు కూడా లబ్ధి పొందారు. ఆ మేరకు రూ.90 వేల కోట్లకుపైగా యూపీ రైతుల ఖాతాలకు చేరాయి. ఇందులో నా కాశీ నగరం రైతులకు దాదాపు రూ.900 కోట్లు అందాయి. మీరెన్నుకున్న ఎంపీ సమర్థుడు కాబట్టే, రూ.900 కోట్లు మీ ఖాతాల్లో పడ్డాయి. ఇక్కడ గమనించాల్సిన కీలకాంశం ఏమిటంటే-  ఎటువంటి కోత-కమీషన్ రహితంగా, దళారుల బెడద లేకుండా, డబ్బు తారుమారు కాకుండా నేరుగా రైతుల ఖాతాలో పడింది. మరోవైపు మోదీ దీన్నొక శాశ్వత వ్యవస్థగా రూపొందించారు. స్వాహాపర్వానికి అవకాశం ఉండదు. ఎలాంటి లీకేజీ ఉండదు.. పేదల హక్కులకు భంగం కలగదు!

మిత్రులారా!

ఎంత వెనుకబడిన ప్రాంతమైతే అంత ప్రాధాన్యం లభిస్తుంది!... ఇదే మోదీ అభివృద్ధి మంత్రం. ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం మరో భారీ పథకాన్ని ఆమోదించింది. దాని పేరు- ‘ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన’. దేశవ్యాప్తంగా రైతు సంక్షేమం, వ్యవసాయ వ్యవస్థ, వ్యవసాయ రంగం అభివృద్ధి లక్ష్యంగా ఈ పథకం కింద రూ.24 వేల కోట్లు వెచ్చిస్తాం. గత ప్రభుత్వాల లోపభూయిష్ఠ విధానాల వల్ల అనేక జిల్లాలు అభివృద్ధి పరంగా వెనుకబడ్డాయి. వ్యవసాయ రంగంలోనూ ఉత్పాదకత క్షీణిస్తూ, రైతుల ఆదాయం తగ్గుతోంది. కానీ, ఆ విషయం ప్రస్తావించేవారు ఒక్కరూ లేరు. అటువంటి జిల్లాల ప్రగతిపై ఈ పథకం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని లక్షలాది రైతులకూ ప్రయోజనం కలుగుతుంది.

మిత్రులారా!

రైతుల జీవితాల్లో మార్పు తేవడంతోపాటు సాగు ఖర్చులు తగ్గిస్తూ, వారి ఆదాయం పెంచడానికి ఎన్డీఏ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. విత్తనం నుంచి విపణి దాకా రైతులకు మేం అండగా నిలుస్తున్నాం. ప్రతి కమతానికీ సాగునీరు అందేవిధంగా రూ.లక్షల కోట్లతో నీటి పారుదల పథకాలు నిర్వహిస్తున్నాం.

మిత్రులారా!

అన్నదాతకు వాతావరణం పెను సవాలు విసురుతోంది. కొన్ని సందర్భాల్లో వర్షాలు విపరీతంగా కురుస్తాయి. కొన్నిసార్లు వడగళ్లు పడతాయి. మంచు కురుస్తుంది! ఇలాంటి విపత్తులను నుంచి రైతులకు రక్షణగా ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని ప్రారంభించాం. దీనికింద ఇప్పటివరకూ... ఈ సంఖ్యను బాగా గుర్తుంచుకోండి- నేటిదాకా బీమా సంస్థలు రైతులకు రూ.1.75 లక్షల కోట్లదాకా పంట నష్ట పరిహారం చెల్లించాయి.

మిత్రులారా!

మీరు ఆరుగాలం శ్రమించి పండించే పంటలకు సముచిత ధర లభించే విధంగానూ మా ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోంది. ఈ మేరకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను రికార్డు స్థాయిలో పెంచాం. వరి, గోధుమ వంటి ప్రధాన ఆహార పంటల ‘ఎంఎస్‌పీ’ కూడా పెరిగింది. మీ ఉత్పత్తుల భద్రతకు భరోసా ఇస్తూ దేశవ్యాప్తంగా వేలాది కొత్త గిడ్డంగులను ప్రభుత్వం నిర్మిస్తోంది.

సోదరీసోదరులారా!

వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెంచడంపైనా మేం నిశితంగా దృష్టి సారించాం. ఇందులో భాగంగా ‘లక్షాధికారి సోదరి’ (లఖ్‌పతి దీదీ) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. దేశంలో 3 కోట్ల మందిని ‘లక్షాధికారి సోదరి’గా మార్చాలన్నది మా లక్ష్యం. ఈ మేరకు నేటిదాకా 1.5 కోట్ల మంది ‘లక్షాధికారి సోదరి’ లక్ష్యాన్ని చేరుకున్నారు. నేను చెప్పిన ఈ గణాంకాలు విని సమాజ్‌వాది పార్టీ వారు తమ సైకిళ్లపై పారిపోతారు. మొత్తంమీద మా లక్ష్యంలో సగం సాధించాం... గ్రామీణ పేద-రైతు కుటుంబాల్లోని 1.5 కోట్ల మంది మహిళలు లక్షాధికారులయ్యారు. ఈ కార్యక్రమం వేగంగా సాగుతోంది. దీంతోపాటు ప్రభుత్వం ప్రారంభించిన ‘డ్రోన్ సోదరి’ (డ్రోన్‌ దీదీ) పథకం కూడా లక్షలాది గ్రామీణ మహిళల ఆదాయం పెంచింది.

మిత్రులారా!

వ్యవసాయ రంగంలో ఆధునిక పరిశోధనలను పొలాలకు చేర్చడంపై మా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇందుకోసం మే, జూన్ నెలల్లో ప్రత్యేకంగా రూపొందించిన ‘వ్యవసాయ సంకల్ప అభియాన్‌’ను నిర్వహించాం. ‘ప్రయోగశాల నుంచి పంట పొలాలకు’ నినాదంతో 1.25 కోట్ల మందికిపైగా రైతులతో ప్రత్యక్షంగా సంభాషించారు. మన దేశంలో వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ  పరిధిలోని అంశమని భావిస్తారు... అది నిజమే! వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశమే అయినప్పటికీ, ఆ ప్రభుత్వాలు సజావుగా బాధ్యతలు నిర్వహించగలిగినప్పటికీ అనేక రాష్ట్రాలకు ఇది సాధ్యం కావడం లేదు. అందుకే, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం... మోదీ ప్రభుత్వం స్వయంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. తదనుగుణంగా కోట్లాది రైతులతో నేరుగా మాట్లాడి, వారి సంప్రదాయ పద్ధతులను తెలుసుకుని, ఆధునిక వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించాం.

మిత్రులారా!

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలు లభించేలా మీరు అనుసరించాల్సిన విధివిధానాలపై ఈ రోజు నేను కీలక సమాచారం ఇవ్వాలని భావిస్తున్నాను. ఈ విషయంలో నాకు మీ సాయంతోపాటు ఈ సభకు హాజరైన ప్రజల తోడ్పాటు కూడా అవసరం. జన్‌ధన్‌ యోజన కింద దేశవ్యాప్తంగా 55 కోట్ల మంది పేదలు బ్యాంకు ఖాతాలు తెరిచారు. మీకు తెలుసు. బ్యాంకు తలుపులు చూసే భాగ్యం కూడా లేని 55 కోట్ల మందికి ఖాతాలు ఏర్పడ్డాయి. మీరు మోదీకి పనిచేసే అవకాశం ఇచ్చినప్పటి నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ పథకానికి ఇటీవలే పదేళ్లు పూర్తయ్యాయి. అయితే, బ్యాంకింగ్ రంగం ఇప్పుడు కొన్ని కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వీటిలో 10 సంవత్సరాల తర్వాత ‘కేవైసీ’ ప్రక్రియ ద్వారా మీ బ్యాంకు ఖాతాల పునఃధ్రువీకరణ తప్పనిసరి. ఇప్పటిదాకా మీరు బ్యాంకుకు వెళ్లినా, వెళ్లకపోయినా... లావాదేవీలు చేసినా, చేయకపోయినా ప్రతీదీ బ్యాంకుకు వెళ్లి మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది. అయితే, మీకు ‘కేవైసీ’ భారం తగ్గించడం కోసం నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఆ మేరకు బ్యాంకులే ప్రజల వద్దకు వచ్చి, ‘కేవైసీ’ ప్రక్రియ పూర్తిచేయించాలని సూచించాను. ఇదొక మంచి పని... పౌరులను మనం సదా అప్రమత్తంగా ఉంచాలి. అయితే, వాళ్లను బ్యాంకులకు రప్పించకుండా ఈ కార్యక్రమం నిర్వహించగలమా? అన్న సందేహం మొదట్లో పొడసూపింది. కానీ, ఇవాళ దేశవ్యాప్తంగా ఇది జోరుగా సాగుతోంది. ఇందుకుగాను రిజర్వ్ బ్యాంక్‌ సహా దేశంలోని అన్ని బ్యాంకులను, వాటి వ్యవహారాలను పర్యవేక్షించే వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మొత్తంమీద 10 కోట్ల మంది బ్యాంకు అధికారులు 55 కోట్లమంది ఖాతాదారుల ‘కేవైసీ’ ప్రక్రియను చేపట్టడం.. నిజంగా మనకెంతో గర్వకారణం. ఈ కార్యక్రమం జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా కొనసాగుతోంది... బ్యాంకు సిబ్బంది ప్రతి పంచాయతీకి వెళ్లి, ఖాతాదారులను సమావేశపరచి పని పూర్తిచేస్తారు. ఇప్పటిదాకా దాదాపు లక్ష పంచాయతీలలో ప్రత్యేక శిబిరాలు, సమావేశాలు నిర్వహించి, లక్షలాది ప్రజలకు ‘కేవైసీ’ భారం తగ్గించారు. ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి, జన్‌ధన్‌ ఖాతాగల ప్రతి ఒక్కరూ దీన్ని విజయవంతం చేయాలని అభ్యర్థిస్తున్నాను.

 

Iమిత్రులారా,


బ్యాంకులు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నాయి; లక్షలాది పంచాయతీల్లో ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మరో ముఖ్యమైన ఉపయోగమేమిటంటే- ఈ శిబిరాల్లో ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి అనేక పథకాల్లో నమోదులు కూడా చేస్తున్నారు. ఈ బీమా ధర ఒక కప్పు టీ రేటు కన్నా తక్కువే. ఈ పథకాలు మీకు చాలా సహాయపడతాయి. కాబట్టి బ్యాంకులు ప్రారంభించిన ఈ భారీ కార్యక్రమాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. దేశ ప్రజలందరికీ చెబుతున్నాను- మీరు కచ్చితంగా ఈ శిబిరాలకు వెళ్లండి. మీరింకా ఈ పథకాల్లో చేరకపోతే తప్పక నమోదు చేసుకోండి. మీ జన్‌ధన్ ఖాతా కేవైసీని కూడా పూర్తి చేసుకోండి. ఈ కార్యక్రమంపై వీలైనంత ఎక్కువ మందికి అవగాహన కల్పించాలనీ.. శిబిరం ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారో, మనం ఏ విధంగా సహాయపడగలమో అన్న విషయాలపై బ్యాంకులతో మాట్లాడాలని బీజేపీ, ఎన్డీఏ ప్రతినిధులందరినీ కోరుతున్నాను. ఇలాంటి భారీ కార్యక్రమంలో మనం ముందుకొచ్చి బ్యాంకులకు సాయం చేయాలి. వారికి సహకరించండి. ఎక్కడ శిబిరం నిర్వహించినా వీలైనంత ఎక్కువ మంది అందులో భాగస్వాములయ్యేలా చూడండి.

మిత్రులారా,

నేడు మహాదేవుడి నగరంలో విశేషంగా అభివృద్ధి చెందింది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలూ పెద్ద ఎత్తున అమలవుతున్నాయి. శివుడి అర్థం అదే.. శివుడంటే సంక్షేమమే! కానీ శివుడికి మరో రూపం కూడా ఉంది. ఒక రూపంలో శివుడు కల్యాణ కారకుడు. మరొకటి రుద్రరూపం! ఉగ్రవాదమూ అన్యాయమూ ఉన్న చోట మహాదేవుడు రుద్రరూపం దాలుస్తాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత రుద్రరూపాన్ని ప్రపంచం చూసింది. భారతదేశంపై దాడికి పాల్పడినవారు నరకంలోనూ భద్రంగా ఉండలేరు.

సోదరీ సోదరులారా,

దురదృష్టవశాత్తు మన దేశంలో కొందరికి ఆపరేషన్ సిందూర్ విజయం పట్ల కడుపు మంటగా కూడా ఉంది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసిందన్న నిజాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ, దాని అనుచరులు, మిత్ర పక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. నా కాశీ ప్రజానీకాన్ని అడుగుతున్నా – భారత్ శక్తియుక్తుల పట్ల మీరు గర్విస్తున్నారా, లేదా? ఆపరేషన్ సిందూర్ పట్ల మీరు గర్విస్తున్నారా లేదా? ఉగ్రవాద స్థావరాల ధ్వంసం మీకు గర్వకారణమా, కాదా?

మిత్రులారా,

మన డ్రోన్లు, క్షిపణులు కచ్చితమైన దాడులు చేసి ప్రధాన ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన చిత్రాలను మీరు చూసి ఉంటారు. పాకిస్థాన్‌లోని అనేక వైమానిక స్థావరాలు ఇప్పటికీ ఐసీయూలో ఉన్నాయి. పాకిస్థాన్ విచారంగా ఉంది. ఇది అందరికీ అర్థమవుతోంది. కానీ కాంగ్రెస్, ఎస్పీ పాకిస్థాన్ దుఃఖాన్ని భరించలేకపోతున్నాయి. ఒకవైపు ఉగ్రవాద సూత్రదారులు రోదిస్తుంటే.. మరోవైపు ఉగ్రవాదులకు ఈ గతి పట్టడాన్ని చూసి కాంగ్రెస్- ఎస్పీ ఏడుపులు, పెడబొబ్బలు పెడుతున్నాయి.

మిత్రులారా,

మన సాయుధ దళాల పరాక్రమాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ అవమానిస్తోంది. ఆపరేషన్ సిందూర్‌ను తమాషా అన్నది ఆ పార్టీ. మీరే చెప్పండి- సిందూర్ తమాషా అవుతుందా? అలా ఎలా అవుతుంది? దాన్ని తమాషా అనేందుకు ఎవరికైనా నోరెలా వస్తుంది? మన సాయుధ దళాల పరాక్రమం, మన అక్కాచెల్లెళ్ల సిందూర్ నేలరాల్చిన ఘటనపై ప్రతీకారాన్ని బూటకమని పిలవడం వారి నిర్లక్ష్యం, సిగ్గుమాలినతనం.

సోదరీ సోదరులారా,

సమాజ్‌వాదీ పార్టీ కూడా ఈ ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల్లో వెనుకబడిలేదు. పహల్గామ్ ఉగ్రవాదులను ఇప్పుడెందుకు చంపారని ఎస్పీ నాయకులు పార్లమెంటులో అడిగారు. ఇప్పుడు చెప్పండీ.. చంపాలా వద్దా, నేను వారికి ఫోన్ చేసి అడగాలా? దయచేసి ఎవరైనా చెప్పండి సోదరా.. కాస్త ఇంగితజ్ఞానంతో చెప్పండి- ఉగ్రవాదులను హతమార్చేందుకు కూడా మనం వేచి చూడాలా? వారికి తప్పించుకునే అవకాశం ఇవ్వాలా? యూపీలో అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదులకు క్లీన్ చిట్ ఇచ్చింది వీరే. బాంబు పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులపై కేసులను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఉగ్రవాదులు చనిపోతే వీరు ఇబ్బంది పడుతున్నారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో వారు ఇబ్బంది పడుతున్నారు. వీళ్లందరికీ ఈ కాశీ నుంచి చెబుతున్నాను – ఇది నవ భారత్. ఈ నవ భారత్ బోలాశంకరుడిని కొలుస్తుంది. అలాగే, దేశ శత్రు మూకల ఎదుట కాలభైరవుడిగా నిలవడమెలాగో కూడా తెలుసు.

మిత్రులారా,

ఆపరేషన్ సిందూర్ సమయంలో- భారత దేశీయ ఆయుధాల శక్తిని ప్రపంచమంతా చూసింది. మన వైమానిక రక్షణ వ్యవస్థలు, మన దేశీయ క్షిపణులు, దేశీయ డ్రోన్లు, భారత స్వావలంబన శక్తిని చాటాయి. ముఖ్యంగా మన బ్రహ్మోస్ క్షిపణులు.. అవి భారత్ శత్రువులంతా భయంతో వణికిపోయేలా చేశాయి. నిద్రకు కూడా భంగం కలగనంత నిశ్శబ్దంగా బ్రహ్మోస్ పని కానిచ్చేస్తుంది.

ప్రియమైన సోదరీ సోదరులారా,

నేను ఉత్తరప్రదేశ్ ఎంపీని. ఇక్కడి ఎంపీగా.. ఆ బ్రహ్మోస్ క్షిపణులు మన ఉత్తరప్రదేశ్‌లోనూ తయారవుతాయని చెప్పేందుకు నేను సంతోషిస్తున్నాను. బ్రహ్మోస్ క్షిపణుల తయారీ లక్నోలో ప్రారంభమవుతోంది. అనేక పెద్ద రక్షణ కంపెనీలు కూడా యూపీ డిఫెన్స్ కారిడార్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. భవిష్యత్తులో ఉత్తరప్రదేశ్‌లో తయారైన ఆయుధాలు, భారత్‌లోని ప్రతీ ప్రాంతంలో తయారైన ఆయుధాలు భారత దళాలకు ప్రధాన బలమవుతాయి. చెప్పండి మిత్రులారా.. ఈ సైనిక స్వావలంబన శక్తి మీకు గర్వకారణమా, కాదా? బలంగా చేతులు పైకెత్తి చెప్పండి.. మీరు గర్విస్తున్నారా, లేదా? మీరు గర్విస్తున్నారా, లేదా?... హర్ హర్ మహాదేవ్ అని నినదించండి. పాకిస్తాన్ మళ్ళీ ఏదైనా పాపం చేస్తే, యూపీలో తయారైన క్షిపణులు ఉగ్రవాదులను అంతమొందిస్తాయి.

మిత్రులారా,

నేడు ఉత్తరప్రదేశ్ పారిశ్రామికంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలోని, ప్రపంచంలోని పెద్ద కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వ అభివృద్ధి విధానాలదే ఇందులో కీలక పాత్ర. సమాజ్‌వాదీ పార్టీ హయాంలో నేరస్థులు యూపీలో ఎలాంటి జంకూ లేకుండా ఉండేవారు. పెట్టుబడిదారులు ఇక్కడికి రావాలంటేనే భయపడేవారు. కానీ, బీజేపీ ప్రభుత్వ హయాంలో నేరస్థులు భయపడుతున్నారు. యూపీ భవితపై పెట్టుబడిదారులు విశ్వాసాన్ని కనబరుస్తున్నారు. వేగవంతమైన ఈ అభివృద్ధి పట్ల యూపీ ప్రభుత్వానికి అభినందనలు.

మిత్రులారా,

కాశీలో అభివృద్ధి మహా యజ్ఞం కొనసాగుతుండడం సంతోషదాయకం. ఈరోజు ప్రారంభించిన రైలు ఓవర్ బ్రిడ్జి, జల్ జీవన్ మిషన్ సంబంధిత ప్రాజెక్టులు, కాశీలో పాఠశాలల పునరుద్ధరణ పనులు, హోమియోపతీ కళాశాల నిర్మాణం, మున్షీ ప్రేమ్‌చంద్ వారసత్వాన్ని కాపాడడం... ఈ పనులన్నీ బృహత్తరమైన, దైవికమైన, సంపన్నమైన నా కాశీ పురోగమమనాన్ని మరింత వేగవంతం చేస్తాయి. సేవాపురికి రావడం కూడా అదృష్టమే. ఇది కాళికా మాత దర్శనానికి ద్వారం. ఇక్కడి నుంచి కాళికా మాత పాదాలకు ప్రణమిల్లుతున్నాను. మా ప్రభుత్వం కాళికా ధామాన్ని అందంగా, మరింత గొప్పగా తీర్చిదిద్దడం సంతోషాన్నిచ్చే విషయం. ఆలయానికి రావడం కూడా సులభతరమైంది. సేవాపురిది విప్లవాత్మక చరిత్ర. ఇక్కడి నుంచి చాలా మంది స్వాతంత్య్ర  పోరాటంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ కల ఇక్కడ నెరవేరింది. ఇక్కడ ప్రతి ఇంట్లో స్త్రీ పురుషులిద్దరి చేతుల్లో రాట్నం (చరఖా) ఉండేది. యాదృచ్చికంగానే ఇప్పుడేం జరిగిందో చూడండి... చాంద్‌పూర్ నుంచి భదోహి రోడ్డు వంటి ప్రాజెక్టులతో భదోహి, కాశీ నేత కార్మికులిద్దరూ అనుసంధానమవుతున్నారు. బెనారస్ పట్టు నేత కార్మికులూ భడోహీ హస్తకళాకారులూ దీని వల్ల ప్రయోజనం పొందుతారు.

మిత్రులారా,

కాశీ మేధావుల నగరం. నేడు మనం ఆర్థిక పురోగతి గురించి మాట్లాడుకుంటున్న వేళ.. ప్రపంచ పరిస్థితులనూ మీరు గమనించాలని కోరుతున్నాను. నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంటోంది. అస్థిర వాతావరణం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు తమ ప్రయోజనాలపై దృష్టి సారిస్తున్నాయి. తమ తమ దేశాల ప్రయోజనాలపై వారు దృష్టి సారిస్తున్నారు. కాబట్టి, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్న తరుణంలో భారత్ కూడా తన ఆర్థిక ప్రయోజనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మన రైతులు, మన చిన్న పరిశ్రమల ప్రయోజనాలు, మన యువత ఉపాధి మనకు అత్యంత ముఖ్యమైనవి. ఈ దిశగా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. అయితే, దేశ పౌరులుగా మనకూ కొన్ని బాధ్యతలున్నాయి. మోదీకే కాదు, ప్రతి భారతీయుడికీ ఉన్న బాధ్యతలవి. దేశ మంచిని కోరుకునే వారు, దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపాలనుకునేవారు ప్రతీ క్షణం మనస్సుల్లో తలచుకుంటూ ఇతరులకూ చెప్పాల్సిన అంశం ఒకటి ఉంది. అది ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా, ఎంతమాత్రమూ సంకోచించకుండా దేశ ప్రయోజనాల దృష్ట్యా  ప్రతి క్షణమూ, ప్రతి సందర్భంలో, ప్రతి ప్రదేశంలో దేశప్రజల్లో ఈ భావాన్ని పురిగొల్పాలి. అదే స్వదేశీ! స్వదేశీ కోసం ప్రతినబూనుదాం. ఇప్పుడు మనం ఏ వస్తువులను కొన్నా, స్వదేశీనే ప్రాతిపదికగా చూద్దాం.

ప్రియమైన సోదరీ సోదరులారా, దేశ ప్రజలారా,

ఇప్పుడు మనం ఏది కొన్నా ఒకటే ప్రాతిపదికగా ఉండాలి. భారతీయుడు శ్రమించి తయారు చేసిన వాటిని కొనాలి. భారత ప్రజలు నైపుణ్యంతో, శ్రమతో తయారు చేసినవి కొనాలి. అది మనకు స్వదేశీ. ‘వోకల్ ఫర్ లోకల్’ను మనం అందిపుచ్చుకోవాలి. అది మనకు మంత్రప్రదం. మనం మేకిన్ ఇండియా ఉత్పత్తులనే ప్రోత్సహిస్తామని ప్రతిజ్ఞ చేయాలి. మన ఇంటికి కొత్త వస్తువులు ఏవి తెచ్చినా.. నేను కొత్త వస్తువుల గురించి చెప్తున్నాను.. మన ఇంటికి ఏ కొత్త వస్తువులు వచ్చినా, అవి స్వదేశీ అయి ఉండాలి. ఈ బాధ్యత దేశ ప్రజలందరిదీ. వ్యాపార రంగంలోని నా సోదరీసోదరులను ఈరోజు ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాను- దుకాణదారులైన సోదరీ సోదరులను కోరుతున్నాను... ప్రపంచంలో అస్థిర వాతావరణాన్ని ఎదుర్కొంటోంది. మనం కూడా- అది వ్యాపారమైనా, చిన్న దుకాణమే అయినా.. ఇక నుంచి మన దగ్గర స్వదేశీ వస్తువులనే విక్రయిద్దాం.

మిత్రులారా,

స్వదేశీ వస్తువులను అమ్మాలనే ఈ సంకల్పం కూడా నిజమైన దేశాసేవే. వచ్చేవి పండుగ నెలలు. దీపావళి వస్తుంది, తరువాత వివాహాల సమయం. ఇకనుంచి ప్రతిసారీ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేద్దాం. నేను ఇదివరకు దేశ ప్రజలకు చెప్పాను – మనం భారత్‌లో ఉన్నాం. విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకుని దేశ సంపదను వృథా చేయకండి అని. అప్పుడు చాలా మంది యువత తమ కుటుంబం విదేశాల్లో వివాహం చేయాలని నిర్ణయించి కొన్ని ఖర్చులు కూడా చేసిందనీ.. అయితే మీ మాటలు విన్న తర్వాత ఆ కార్యక్రమాలను రద్దు చేసుకుని భారత్‌లోనే పెళ్లి చేసుకోబోతున్నామని పేర్కొంటూ నాకు లేఖలు రాశారు. వివాహం చేసుకోవడానికి ఇక్కడ చాలా మంచి ప్రదేశాలు కూడా ఉన్నాయి. ప్రతి అంశంలోనూ స్వదేశీ భావన రాబోయే రోజుల్లో మన భవితను నిర్ణయించబోతోంది. ఇది మహాత్మా గాంధీకి గొప్ప నివాళి కూడా.

మిత్రులారా,

సమష్టి కృషి వల్లే అభివృద్ధి చెందిన భారత్ అనే కల నెరవేరుతుంది. నేటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల మరోసారి మీకు అభినందనలు. భవిష్యత్తులో ‘వోకల్ ఫర్ లోకల్’ను అనుసరిద్దాం.. ఏదైనా కొంటే స్వదేశీ వస్తువులనే కొందాం. ఇళ్లను అలంకరించుకుంటే స్వదేశీ వస్తువులతోనే అలంకరిద్దాం. మన జీవితాలను మెరుగుపరుచుకోవాలంటే, అదీ స్వదేశీతోనే చేసుకుందాం. ఇదే మంత్రప్రదంగా ముందుకు సాగుదాం. ధన్యవాదాలు. నాతో కలిసి నినదించండి - హర్ హర్ మహదేవ్.

గమనిక: ప్రధానమంత్రి ప్రసంగానికి ఇంచుమించుగా చేసిన అనువాదమిది. మౌలిక ప్రసంగం హిందీలో చేశారు.

 

***


(Release ID: 2151945)