ప్రధాన మంత్రి కార్యాలయం
వారణాసిలో దాదాపు రూ. 2,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
పీఎం-కిసాన్ 20వ విడత నిధులను విడుదల చేసిన ప్రధాని: దేశవ్యాప్తంగా 9.7 కోట్లకు పైగా రైతులకు రూ. 20,500 కోట్లకు పైగా బదిలీ
· రైతుల జీవితాలను మార్చడానికి, వారి ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ ఖర్చును తగ్గించడానికి విశేషంగా కృషి చేస్తున్న ప్రభుత్వం.. విత్తన దశ నుంచి మార్కెట్ వరకు రైతులకు అండ
· భారత్‌పై దాడికి సాహసిస్తే నరకం కూడా సురక్షితం కాదు
· భారత దేశీయ ఆయుధాల శక్తిని ప్రపంచానికి చాటిన ఆపరేషన్ సిందూర్
· మన రైతులు, చిన్న పరిశ్రమల ప్రయోజనాలే మాకు అత్యున్నతం.. ప్రభుత్వ చర్యలన్నీ ఈ దిశగానే...
· ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది..ఆర్థిక ప్రయోజనాల పట్ల అప్రమత్తత అవసరం: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
02 AUG 2025 1:58PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దాదాపు రూ.2,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ.. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా వారణాసిని సందర్శించడం, ఇక్కడి ప్రజలను కలవడం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. వారణాసి ప్రజలతో తనకు భావోద్వేగ అనబంధముందన్న శ్రీ మోదీ.. ఆదరాభిమానాలను కనబరిచిన నగర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా రైతులతో సంభాషించడంపై శ్రీ మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత తాను వారణాసిలో పర్యటించడం ఇదే మొదటిసారి అని ప్రధానమంత్రి చెప్పారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన గుర్తుచేస్తూ.. 26 మంది అమాయకులను ఉగ్రవాదులు దారుణంగా హతమార్చారన్నారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాలు క్షోభకు గురయ్యాయని, ముఖ్యంగా ఇది చిన్నారులకు అంతులేని విషాదాన్ని మిగిల్చిందని శ్రీ మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తన హృదయం తీవ్ర దుఃఖంతో నిండిపోయిందని, మృతుల కుటుంబాలకు మానసిక స్థైర్యాన్ని ప్రసాదించాలని బాబా విశ్వనాథ్‌ను ప్రార్థించానని చెప్పారు. మన బిడ్డల సిందూరాన్ని నేలరాల్చిన ముష్కరులపట్ల తప్పక ప్రతీకారం తీర్చుకుంటానని మాటిచ్చి, దాన్ని నిలబెట్టుకున్నానని శ్రీ మోదీ పేర్కొన్నారు. మహాదేవుడి ఆశీస్సుల వల్లే ఈ విజయం సాధ్యమైందని, ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ఆయన పాదాల చెంత అంకితం చేస్తున్నానని ప్రధానమంత్రి ప్రకటించారు.
ఈ మధ్య, ముఖ్యంగా శ్రావణ మాసం మొదటి సోమవారం రోజు శివభక్తులు, యాత్రికులు బాబా విశ్వనాథుడికి పవిత్ర జలాలతో అభిషేకం చేయడానికి గంగాజలంతో వెళ్తున్న దృశ్యాలు బాగా కనిపిస్తున్నాయన్నారు. గౌరీ కేదార్‌నాథ్ నుంచి యాదవ సోదరులు గంగాజలాన్ని భుజాలపై మోసుకెళ్తున్న మనోహరమైన దృశ్యాన్ని గుర్తు చేసుకుంటూ.. అది నిజంగా మంత్రముగ్ధులను చేసే సన్నివేశమన్నారు. డమరుక నాదాలు, భక్తుల్లోని ఉత్తేజం... అదో అసాధారణ వాతావరణమన్నారు. పవిత్ర శ్రావణ మాసంలో బాబా విశ్వనాథుడు, మార్కండేయ మహాదేవులను దర్శించుకోవాలన్న కోరిక తనకెప్పటినుంచో ఉందని శ్రీ మోదీ చెప్పారు. అయితే, తను అక్కడికి వెళ్తే భక్తులకు అసౌకర్యమూ, దర్శనానికి అంతరాయమూ కలుగుతాయని.. అందుకే ఆ బోలా శంకరుడికి, గంగామాతకు ఇక్కడి నుంచే నమస్సులు అర్పిస్తున్నట్టు శ్రీ మోదీ తెలిపారు.
వెయ్యేళ్ల నాటి ప్రాచీన ఆలయం, దేశంలో శైవ సంప్రదాయానికి పురాతన కేంద్రమైన తమిళనాడులోని చరిత్రాత్మక గంగైకొండ చోళపురం ఆలయాన్ని కొన్ని రోజుల కిందట తాను దర్శించిన విషయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. ఆ ఆలయాన్ని నిర్మించిన రాజేంద్ర చోళుడు ఉత్తర భారతదేశం నుంచి గంగాజలాన్ని అక్కడికి తీసుకెళ్లాడని, ఇది ఉత్తర, దక్షిణ భారతదేశాల ఐక్యతకు చిహ్నమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. శివభక్తి, శైవ సంప్రదాయం పట్ల అంకితభావంతో.. రాజేంద్ర చోళుడు వెయ్యేళ్ల కిందటే ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ సంకల్పాన్ని చాటాడని శ్రీ మోదీ చెప్పారు. కాశీ-తమిళ సంగమం వంటి కార్యక్రమాల ద్వారా నేడు ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇటీవల గంగైకొండ చోళపురం వెళ్లినప్పుడు గంగాజలాన్ని వెంట తీసుకెళ్లానని, గంగామాత ఆశీస్సులతో అత్యంత పవిత్ర వాతావరణంలో పూజా కార్యక్రమం జరిగిందని ఆయన వెల్లడించారు. ఇవి దేశంలో ఐక్యతా స్ఫూర్తిని రగిలిస్తాయనని, ఆపరేషన్ సిందూర్ వంటి మిషన్లు విజయవంతమవుతాయని అన్నారు. 140 కోట్ల భారతీయుల ఐక్యతే ఆపరేషన్ సిందూర్‌కు బలంగా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.
వారణాసిలో నిర్వహిస్తున్న రైతు వేడుకలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా 10 కోట్ల రైతు సోదరీసోదరుల బ్యాంకు ఖాతాలకు రూ. 21,000 కోట్లు బదిలీ చేసినట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రూ. 2,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసినట్టు తెలిపారు. బాబా ఆశీస్సులతో వారణాసిలో నిరంతర అభివృద్ధి వాహిని ప్రవహిస్తోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. హాజరైన, దేశంలోని రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని రోజుల కిందటే వారణాసిలో ఎంపీ- పర్యాటక గైడ్‌ల పోటీ జరిగిందని ప్రధానమంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో కాశీ ఎంపీ- ఫొటోగ్రఫీ కాంపిటీషన్, ఎంపీ- ఉద్యోగ నియామక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ ప్రశంసనీయమన్నారు.
రైతుల పేరిట చేసిన ఏ ఒక్క ప్రకటనా సరిగ్గా నెరవేర్చని గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా.. తమ ప్రభుత్వం నిరంతరం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తోందన్న శ్రీ మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం వాగ్దానాలను కచ్చితంగా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి తమ ప్రభుత్వ దృఢ నిబద్ధతకు నిదర్శనమన్నారు.
2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించబడినప్పుడు.. కొన్ని ప్రధాన ప్రతిపక్షాలు అనేక పుకార్లను వ్యాప్తి చేశాయని శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. ఎన్నికల తర్వాత చెల్లింపులు ఆగిపోతాయని కొందరు చెప్తే.. అప్పుడు పంపిణీ చేసిన డబ్బును తిరిగి తీసుకుంటామని కూడా ఇంకొందరు దుష్ప్రచారం చేశారన్నారు. రైతులను, దేశ ప్రజలను తప్పుదారి పట్టించడమే ప్రతిపక్ష నిజ స్వభావమని విమర్శించారు. ఇప్పటి వరకు ఒక్క వాయిదా అయినా ఆగిందా అని ప్రశ్నించారు. ఎలాంటి అంతరాయమూ లేకుండా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రూ. 3.75 లక్షల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే దాదాపు 2.5 కోట్ల రైతులు ఈ పథకం కింద రూ. 90,000 కోట్లకు పైగా ప్రయోజనం పొందారని, వారణాసి రైతులు దాదాపు రూ. 900 కోట్లు పొందారని శ్రీ మోదీ తెలిపారు. ఎలాంటి కోతలూ, కమీషన్లు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే నిధులు చేరడం ఈ పథకంలోని అతి ముఖ్యమైన అంశమని ప్రధానమంత్రి వివరించారు. పక్కదారి పట్టే అవకాశం ఉండదని, పేదల హక్కులు తిరస్కరణకు గురికాకుండా - ఇది తమ ప్రభుత్వం చేసిన శాశ్వత ఏర్పాటు అని ఆయన వ్యాఖ్యానించారు.
‘వెనుకబడి ఉన్న ప్రాంతాలకే మొదటి ప్రాధాన్యం’ అనేది తమ అభివృద్ధి మంత్రమని పునరుద్ఘాటించిన శ్రీ మోదీ.. ఈ నెల మొదట్లో ‘ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన’ అనే ఓ ముఖ్యమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ప్రకటించారు. ఈ పథకానికి రూ. 24,000 కోట్లు కేటాయిస్తామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాల లోపభూయిష్ట విధానాల కారణంగా వెనుకబడిన జిల్లాలపై ఈ కార్యక్రమం ద్వారా దృష్టి సారిస్తామని ప్రధానమంత్రి చెప్పారు. వ్యవసాయ దిగుబడి తక్కువ ఉన్న, రైతుల ఆదాయాలు పరిమితంగా ఉన్న ప్రాంతాల అభివృద్ధి ఈ పథకం లక్ష్యమన్నారు. ప్రధాన మంత్రి ధన ధాన్య కృషి యోజన ద్వారా ఉత్తరప్రదేశ్‌లోనూ లక్షలాది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని ఆయన చెప్పారు.
‘‘రైతుల జీవితాల్లో మార్పు తేవడానికి, వారి ఆదాయాన్ని పెంచడానికి, సాగు వ్యయాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం పూర్తి శక్తియుక్తులతో పనిచేస్తోంది. విత్తన దశ నుంచి మార్కెట్ వరకు రైతులకు అండగా నిలుస్తున్నాం’’ అని ప్రధానమంత్రి అన్నారు. వ్యవసాయ క్షేత్రాలకు నీరందించడం కోసం దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల విలువైన నీటిపారుదల పథకాలను అమలు చేస్తున్నట్టు శ్రీ మోదీ చెప్పారు.
అధిక వర్షపాతం, వడగళ్ల వాన లేదా మంచు తుఫాను... ఏదైనా సరే ప్రతికూల వాతావరణం రైతులకు ఎల్లప్పుడూ పెద్ద సవాలుగా నిలుస్తోందన్నారు. అలాంటి అనిశ్చితుల నుంచి రైతులను రక్షించడానికే ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ప్రారంభించిందన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు రైతులకు రూ. 1.75 లక్షల కోట్లకు పైగా విలువైన క్లెయిమ్‌లు పరిష్కారమయ్యాయని తెలిపారు.
రైతులకు తమ ఉత్పత్తులపై న్యాయమైన ధరలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. బియ్యం, గోధుమల వంటి కీలకమైన ఆహారోత్పత్తులు సహా పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) రికార్డు స్థాయిలో పెరిగిందన్నారు. రైతుల పంటలను కాపాడడం కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వం వేలాదిగా కొత్త గిడ్డంగులను నిర్మిస్తోందని తెలిపారు.
వ్యావసాయిక ఆర్థిక వ్యవస్థలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్తూ.. ‘లాఖ్‌పతి దీదీ’ కార్యక్రమాన్ని శ్రీ మోదీ ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా మూడు కోట్ల లాఖ్‌పతి దీదీలను సృష్టించడం దీని లక్ష్యమని వివరించారు. ఇప్పటికే 1.5 కోట్లకు పైగా మహిళలు ఈ లక్ష్యాన్ని సాధించారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ‘డ్రోన్ దీదీ’ కార్యక్రమం లక్షలాది మహిళల ఆదాయాన్నీ గణనీయంగా పెంచిందన్నారు.
ఆధునిక వ్యవసాయ పరిశోధనలను నేరుగా వ్యవసాయ క్షేత్రాలకే తీసుకొచ్చేలా ప్రభుత్వం క్రియాశీలంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ‘ప్రయోగశాలల నుంచి వ్యవసాయ క్షేత్రాలకు (ల్యాబ్ టు ల్యాండ్)’ అనే మార్గదర్శక సూత్రం కింద వికసిత కృషి సంకల్ప్ అభియాన్‌ను ప్రత్యేకంగా రూపొందించి.. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో నిర్వహించినట్లు తెలిపారు. వీటిలో 1.25 కోట్లకు పైగా రైతులు ప్రత్యక్షంగా భాగస్వాములయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఎప్పటికే ఇలాగే సజావుగా ప్రజలకు చేరుతాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
‘‘జన్ ధన్ యోజన కింద దేశవ్యాప్తంగా పేదల కోసం 55 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచాం’’ అంటూ కీలకమైన అంశాన్ని ప్రజలకు వివరించారు. ఈ పథకానికి ఇటీవలే పదేళ్లు పూర్తయ్యాయనీ.. నిబంధనల ప్రకారం పదేళ్ల తర్వాత బ్యాంకు ఖాతాలకు కొత్తగా కేవైసీ ధ్రువీకరణ అవసరమని ఆయన తెలిపారు. ఇందుకోసం 2025 జూలై 1 నుంచి దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. బ్యాంకులు ప్రతి ఊరినీ చేరుతున్నాయని, దాదాపు లక్ష గ్రామ పంచాయతీలలో ఇప్పటికే శిబిరాలు ఏర్పాటు చేశామని, లక్షలాది ప్రజలు విజయవంతంగా కేవైసీని పునరుద్ధరించుకున్నారని ప్రధానమంత్రి తెలిపారు. జన్ ధన్ ఖాతా ఉన్న ప్రతి వ్యక్తీ జాప్యం చేయకుండా కేవైసీ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రధానమంత్రి కోరారు.
గ్రామాల్లో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక బ్యాంకు శిబిరాలతో మరో ప్రయోజనం కూడా ఉందన్నారు. వీటి ద్వారా ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన సహా అనేక కీలక పథకాలకు రిజిస్ట్రేషన్లను సులభతరమవుతున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ పథకాలు పౌరులకు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరూ ఈ శిబిరాలను సందర్శించాలని కోరారు. ఈ పథకాల్లో ఇంకా నమోదు చేసుకోని వారు వెంటనే నమోదు చేసుకోవాలని, అలాగే జన్ ధన్ ఖాతాలకు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంపై విరివిగా అవగాహన పెంచాలని, ప్రజల్లోకి వెళ్లడంలో బ్యాంకులకు సహకరించాలని, ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములయ్యేలా చూడాలని తమ పార్టీ ప్రజా ప్రతినిధులందరికీ ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
మహాదేవుని నగరంలో ఈ రోజు చాలా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కార్యక్రమాలు చేపట్టామని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సందర్భంగా శివుడి అర్థాన్ని ఆయన వివరించారు. శివుడంటే "సంక్షేమం" అని.. కానీ ఉగ్రవాదం, అన్యాయాన్ని ఎదుర్కొనే విషయంలో రుద్ర రూపాన్ని కూడా ఆయన కలిగి ఉంటాడని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశ రుద్ర రూపాన్ని ప్రపంచం చూసిందని ప్రధానంగా పేర్కొన్నారు. "భారత్‌పై దాడి చేసే ఎవరైనా పాతాళంలో ఉన్నా తప్పించుకోలేరు" అని ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ విజయం సాధించినప్పటికీ.. దీనిపై దేశంలోని కొందరు ఇబ్బంది పడుతుండటంపై విచారం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత్ నాశనం చేసిన తీరును వారు జీర్ణించుకోలేకపోతున్నారంటూ ప్రతిపక్ష పార్టీని, దాని మిత్ర పక్షాలను విమర్శించారు. ఉగ్రవాదులకు చెందిన ప్రధాన స్థావరాలను భారత డ్రోన్లు శిథిలావస్థకు చేర్చిన తీరును మోదీ ప్రస్తావించారు. ఇప్పటికీ ఆ దేశంలోని చాలా వైమానిక స్థావరాలు కోలుకోలేని స్థితిలో ఉన్నాయని తెలిపారు. ఉగ్ర సూత్రధారులు ఒక వైపు విచారం వ్యక్తం చేస్తుంటే.. వారి పరిస్థితిని చూసి మరోవైపు ఈ పార్టీలు కూడా విచారం వ్యక్తం చేస్తున్నాయని విమర్శించారు.
భారత సాయుధ దళాల పరాక్రమాన్ని పదే పదే అవమానిస్తున్నందుకు ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు. ఆపరేషన్ సిందూర్‌ను "తమాషా"గా ప్రతిపక్షాలు పేర్కొన్నాయని అన్నారు. గౌరవం, త్యాగానికి చిహ్నంగా ఉన్న సిందూర్‌ను ఎప్పుడైనా నాటకంగా పరిగణించొచ్చా అని ప్రశ్నించారు. సోదరీమణుల సిందూర్‌ను చెరిపేసిన సంఘటనపై ప్రతీకారం తీర్చుకున్న, సాయుధ దళాల మనో ధైర్యానికి ప్రతీకగా ఉన్న ఈ గొప్ప కార్యాన్ని ఈ విధంగా తక్కువ చేసి మాట్లాడొచ్చా అని ఆయన అడిగారు.
ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడటాన్ని ప్రధాని ఖండించారు. పహల్గామ్ దాడి చేసిన ఉగ్రవాదులను వెంటనే ఎందుకు మట్టుబెట్టారని ప్రశ్నిస్తూ పార్లమెంటులో ప్రతిపక్ష నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఉదహరించారు. ఉగ్రవాదులపై చర్య తీసుకునేందుకు భారత్ వేచి చూడాలా అని హాజరైన వారిని అడిగారు. వీళ్లే బాంబు దాడులు చేసిన ఉగ్రవాదులను ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్నప్పుడు నిర్దోషులుగా తేల్చి కేసులను ఉపసంహరించుకున్నారని ప్రజలకు గుర్తు చేశారు. ఉగ్రవాదులను ఏరివేయటం, అది కూడా ఆపరేషన్ సిందూర్ పేరును ఉపయోగించటంతో ఈ పార్టీలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. భోలేనాథున్ని పూజించే ఈ సరికొత్త భారత్‌కు శత్రువుల ముందు కాల భైరవుడిగా ఎలా మారాలో కూడా తెలుసని ప్రకటించారు.
"ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత స్వదేశీ ఆయుధ శక్తి, వైమానిక రక్షణ వ్యవస్థలు, స్వదేశీ క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాన్ని ప్రపంచం తెలుసుకుంది. ఈ ఆపరేషన్ ఆత్మనిర్భర్ భారత్ శక్తిని తెలియజేసింది" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. బ్రహ్మోస్ క్షిపణుల ప్రభావాన్ని ప్రత్యేకంగా వర్ణించారు. వాటి ఉనికి ప్రతి శత్రువు గుండెల్లో భయాన్ని నింపిందని పేర్కొన్నారు.
త్వరలో ఉత్తరప్రదేశ్‌లో బ్రహ్మోస్ క్షిపణులు తయారుకానున్నాయని.. ఈ విషయం పట్ల రాష్ట్రం నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యుడిగా గర్వంగా ఉన్నట్లు తెలిపారు. లక్నోలో బ్రహ్మోస్ క్షిపణుల ఉత్పత్తి ప్రారంభమౌతోందని, అనేక ప్రధాన రక్షణ సంస్థలు రాష్ట్రంలోని రక్షణ నడవాలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని ఆయన ప్రకటించారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో రాష్ట్రంలో తయారయ్యే ఆయుధాలు దేశ సైనిక శక్తిలో కీలకంగా మారుతాయని తెలిపారు. ఈ విషయం పట్ల గర్వపడుతున్నారా అని సభకు హాజరైన ప్రజలను అడిగారు. పాకిస్థాన్ మరొక దుష్కార్యానికి పాల్పడితే ఉత్తరప్రదేశ్‌లో తయారయ్యే క్షిపణులు ఉగ్రవాదులను మట్టుబెడతాయని అన్నారు.
పెట్టుబడులు పెట్టేందుకు ప్రధాన జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తూ పారిశ్రామికాభివృద్ధిలో ఊత్తరప్రదేశ్ దూసుకుపోతోందని మోదీ ప్రధానంగా చెప్పారు. ఈ మార్పునకు తమ ప్రభుత్వం అనుసరిస్తోన్న అభివృద్ధి ఆధారిత విధానాలే కారణమని అన్నారు. నేరస్థులు నిర్భయంగా తిరిగే, రాష్ట్రానికి వచ్చేందుకు పెట్టుబడిదారులు వెనుకడుగు వేసే పరిస్థితులున్న గత ప్రభుత్వాల కాలాన్ని ప్రస్తుత పరిస్థితులను ఆయన పోల్చారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఇప్పుడు నేరస్థులు భయపడుతున్నారని, రాష్ట్ర భవిష్యత్తుపై పెట్టుబడిదారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని ప్రధానంగా పేర్కొన్నారు. వారణాసిలో నిరాటంకంగా కొనసాగుతోన్న అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని.. వేగంగా కొనసాగుతోన్న అభివృద్ధికి సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించారు.
కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జి, జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన కార్యక్రమాలు, వారణాసిలో పాఠశాలల పునర్నిర్మాణం, హోమియోపతిక్ కళాశాల నిర్మాణం, మున్షి ప్రేమ్‌చంద్ సాంస్కృతిక వారసత్వ సంరక్షణకు సంబంధించిన పనులతో సహా ఈ రోజు ప్రారంభించిన అనేక ప్రాజెక్టుల గురించి వివరించారు. ఇవన్నీ ఒక గొప్ప, దివ్యమైన, సుసంపన్నమైన వారణాసిని రూపొందిస్తాయని అన్నారు. సేవాపురిని మా కల్కా దేవి నిలయంగా వర్ణించిన ఆయన.. దీనిని సందర్శించటం ఒక అదృష్టమని అన్నారు. దేవత పాదాలకు మొక్కిన ఆయన.. ప్రభుత్వం ఆలయానికి వెళ్లే భక్తులకు సౌకర్యాలను కల్పించి మా కల్కా ధామ్‌ను మరింత అందంగా, గొప్పగా తీర్చిదిద్దటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సేవాపురి విప్లవాత్మక చరిత్ర, స్వాతంత్ర్య పోరాటంలో చేసిన కృషిని గుర్తు చేశారు. ప్రతి ఇంట్లో ఆడవారి, మగ వారి చేతుల్లో రాట్నం ఉండేదని, మహాత్మాగాంధీ దార్శనికత జీవం పోసుకున్న సేవాపురి ఇదేనని ప్రధానంగా పేర్కొన్నారు. చంద్‌పూర్-భదోహి రోడ్డు వంటి ప్రాజెక్టుల ద్వారా వారణాసిలోని నేత కార్మికులు ఇప్పుడు భదోహితో అనుసంధానమవుతున్నారన్న విషయాన్ని తెలియజేశారు. దీనివల్ల బనారసి పట్టు, భడోహి కళాకారులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.
ఆర్థిక పురోగతి, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. వారణాసిని మేధావుల నగరంగా వర్ణించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పలు రకాల అనిశ్చితులను, అస్థిరతను ఎదుర్కొంటోందని ప్రధానంగా పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా దేశాలు తమ సొంత ప్రయోజనాలపై దృష్టి సారిస్తున్నాయన్నారు. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో దూసుకెళ్తోందన్నారు. దీనివల్ల భారత తన ఆర్థిక ప్రయోజనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రైతులు, చిన్న పరిశ్రమల సంక్షేమం అత్యంత ముఖ్యమైందని… ఈ విషయంలో ప్రభుత్వం సాధ్యమైనంగా కృషి చేస్తోందని ప్రధానంగా పేర్కొన్నారు.
ప్రజలకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయని ప్రధానంగా పేర్కొంటూ.. ప్రతి ఒక్కరూ స్వదేశీ కోసం ప్రతిజ్ఞ చేయాలని మోదీ కోరారు. భారతీయుని కష్టం, కృషితో తయారైనది ఏదైనా కూడా స్వదేశీనే అని పేర్కొన్నారు. ‘వోకల్ ఫర్ లోకల్" అనే మంత్రాన్ని దేశం అనుసరించాలని పిలుపునిచ్చారు. "భారత్‌లో తయారీ (మేకిన్ ఇండియా)" ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరారు. మన ఇళ్లలోకి వచ్చే ప్రతి కొత్త వస్తువు స్వదేశీ అయి ఉండాలి. ఈ బాధ్యతను ప్రతి భారతీయుడు తీసుకోవాలని తెలిపారు. ప్రతి వ్యాపారి, దుకాణదారుడు స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తానంటూ ప్రతిజ్ఞ చేయాలని.. ఇది నిజమైన దేశ సేవ అని అన్నారు. రాబోయే పండగ సమయంలో స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించాలని ప్రజలకు కోరిన ఆయన.. ఇది మహాత్మాగాంధీకి నిజమైన నివాళి అని అన్నారు.
సమష్టి కృషి ద్వారానే అభివృద్ధి చెందిన భారతదేశం అనే కల నెరవేరుతుందని ప్రధానంగా చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు. ఈరోజు ప్రారంభించిన అభివృద్ధి పనుల విషయంలో మరోసారి అభినందనలు తెలియజేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్.. గవర్నర్‌లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు వర్చువల్‌గా కార్యక్రమానికి హాజరయ్యారు.
నేపథ్యం
వారణాసిలో సమగ్ర పట్టణాభివృద్ధి, సాంస్కృతిక పునరుజ్జీవనం, మెరుగైన అనుసంధానత, జీవన నాణ్యత పెంపుదలే లక్ష్యంగా మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక వారసత్వం వంటి బహుళ రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.
వారణాసిలో రోడ్డు అనుసంధానతను మెరుగుపరచాలన్న ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి అనేక కీలక మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు కొన్నింటికి శంకుస్థాపన చేశారు. వారణాసి - భదోహి, చితౌని - షూల్ టంకేశ్వర్ రోడ్లు.. మోహన్ సారాయ్ - అదల్‌పురా రోడ్డులో రద్దీని తగ్గించడానికి హర్దత్‌పూర్ వద్ద నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. దల్మండి, లహర్తారా-కోట్వా, గంగాపూర్, బాబత్‌పూర్‌తో సహా ఇతర గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమగ్ర రోడ్డు విస్తరణ, లెవెల్ క్రాసింగ్ 22సీ, ఖలిస్‌పూర్ యార్డ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు ఆయన శంకుస్థాపన చేశారు.
విద్యుత్ మౌలిక సదుపాయాలను పెంచేందుకు రూ. 880 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ కింద వివిధ పనులు, విద్యుత్ మౌలిక సదుపాయాలకు సంబంధించిన భూగర్భ పనులు ఉన్నాయి.
పర్యాటక రంగానికి ప్రధాని పర్యటనతో పెద్ద ఊతం లభించింది. పునరాభివృద్ధి చేసిన 8 నదీ తీర ఘాట్లు, అభివృద్ధి పనులు చేపట్టిన కాళికా ధామ్.. రంగిల్దాస్ కుటియా, శివపూర్ వద్ద సుందరీకరణ పూర్తయిన చెరువు, ఘాట్.. పునరుద్ధరణ పూర్తయిన దుర్గాకుండ్‌తో పాటు అక్కడున్న నీటి శుద్ధీకరణ సదుపాయాన్ని ప్రారంభించారు. కర్దమేశ్వర్ మహాదేవ్ ఆలయంలో పునరుద్ధరణ పనులు, అనేక స్వాతంత్ర్య సమరయోధుల జన్మ స్థలమైన కార్ఖియావ్ అభివృద్ధి పనులు.. సారనాథ్, రిషి మాండ్వి, రామ్‌నగర్ జోన్లలో సిటీ ఫెసిలిటీ కేంద్రాలకు.. లామాహిలో మున్షీ ప్రేమ్‌చంద్ పూర్వీకుల ఇంటి పునరాభివృద్ధి, మ్యూజియం ఆధునికీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కాంచన్‌పూర్‌లోని అర్బన్ మియావాకి అడవి అభివృద్ధికి.. షహీద్ ఉద్యాన్, 21 ఇతర పార్కుల పునరాభివృద్ధి, సుందరీకరణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.
వీటితో పాటు సాంస్కృతికంగా ముఖ్యమైన నీటి వనరులను సంరక్షించేందుకు ఉద్దేశించిన నాలుగు తెలియాడే పూజా వేదికలతో సహా రామ్‌కుండ్, మందాకిని, శంకుల్ధారా, ఇతర కుండ్‌లతో సహా వివిధ కుండ్‌లలో నీటి శుద్ధి, నిర్వహణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ కింద 47 గ్రామీణ తాగునీటి పథకాలను ప్రారంభించారు.
అందరికీ నాణ్యమైన విద్య అనే ప్రధాని లక్ష్యాన్ని సాదించే దిశగా మున్సిపల్ పరిధిలోని 53 పాఠశాల భవనాల ఆధునికీకరణను ప్రారంభించారు. కొత్త జిల్లా గ్రంథాలయ నిర్మాణం, లాల్‌పూర్‌లోని జఖినిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పునరుద్ధరణతో సహా విద్యా రంగానికి సంబంధించి అనేక ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.
ఆరోగ్య మౌలిక సదుపాయాలకు కూడా ప్రధాని పర్యటనలో పెద్ద ఊతం లభించింది. మహామన పండిట్ మదన్ మోహన్ మాలవ్య క్యాన్సర్ కేంద్రం, హోమి భాభా క్యాన్సర్ ఆస్పత్రిలో రోబోటిక్ సర్జరీ, సీటీ స్కాన్ వంటి అధునాతన వైద్య పరికరాల సదుపాయాలను ప్రధాని ప్రారంభించారు. హోమియోపతి కళాశాల, ఆస్పత్రికి కూడా శంకుస్థాపన చేశారు. వీటితో పాటు జంతు జనన నియంత్రణ కేంద్రం, దానికి అనుబంధంగా పనిచేసే కుక్కల సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
వారణాసిలో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పించాలన్న తన దార్శనికతకు అనుగుణంగా డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్పోర్ట్స్ స్టేడియంలో ప్రధానమంత్రి సింథటిక్ హాకీ టర్ఫ్‌ను ప్రారంభించారు. పోలీసు సిబ్బందికి సంబంధించిన సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రామ్‌నగర్‌లోని ప్రాదేశిక సాయుధ కానిస్టేబులరీలో (పీఏసీ) నిర్మించిన 300 మందికి సరిపోయే మల్టీ పర్పస్ హాల్‌ను ప్రధానమంత్రి ప్రారంభించారు. దీనితో పాటు క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్‌టీ) బ్యారక్‌లకు శంకుస్థాపన చేశారు.
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొంటున్న చర్యల్లో భాగంగా పీఎం కిసాన్ 20వ విడతను ప్రధాని విడుదల చేశారు. రూ. 20,500 కోట్లకు పైగా నిధులు దేశవ్యాప్తంగా 9.7 కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ కానున్నాయి. ప్రారంభించినప్పటి నుంచి ఈ పథకం కింద అందించిన మొత్తం రూ.3.90 లక్షల కోట్లను దాటుతుంది.
కాశీ సంసద్ ప్రతియోగిత కింద చిత్రలేఖనం, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, క్రీడల, విజ్ఞాన, తదితర పోటీలు.. ఉద్యోగ మేళాలతో సహా వివిధ కార్యక్రమాలు కోసం ఉద్దేశించిన రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. దివ్యాంగులు, వృద్ధులకు 7,400కి పైగా సహాయక కిట్లను ప్రధాని అందించారు
***.
(Release ID: 2151884)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam