ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’ పురస్కారం స్వీకరించిన సందర్భంగా ప్రధాని ప్రసంగం

Posted On: 04 JUL 2025 10:45PM by PIB Hyderabad

నమస్కారం,

అందరికీ శుభోదయం,

అధ్యక్షులు క్రిస్టీన్ కంగలూ,

ప్రధానమంత్రి కమలా పెర్షాద్ బిసేసార్,

విశిష్ట అతిథులకు,

అత్యున్నత జాతీయ పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’ ప్రదానం చేసిన మీకు, మీ ప్రభుత్వానికి, మీ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మన రెండు దేశాల మధ్య ఉన్న శాశ్వతమైన, గాఢమైన స్నేహబంధాన్ని ఈ పురస్కారం ప్రతిబింబిస్తుంది. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఈ పురస్కారాన్ని సగర్వంగా స్వీకరిస్తున్నాను.

స్నేహితులారా,

ఈ పురస్కారాన్ని మొదటిసారిగా ఓ విదేశీ నాయకుడికి ఇచ్చారు. ఇది మన రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ బంధం మన ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక వారసత్వంలో నిండి ఉంది.

180 ఏళ్ల క్రితం భారత్ నుంచి వచ్చిన వారు మన స్నేహ బంధానికి పునాది వేశారు. వారు ఇక్కడికి ఖాళీ చేతులతో వచ్చినప్పటికీ, వారి మెదళ్లలో భారతీయ నాగరికత, సంస్కృతి, వైవిధ్యం నిండి ఉన్నాయి. వారు నాటిన సామరస్యం, సౌహార్ద్రం అనే విత్తనాలు నేడు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రగతి, సంక్షేమం రూపంలో విరబూస్తున్నాయి.

ఇక్కడ ఉన్న భారతీయ సమాజానికి మన ఉమ్మడి సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలను సంరక్షించుకోవడం గర్వకారణం. ఈ సమాజానికి అధ్యక్షుడు కంగలూజీ, ప్రధానమంత్రి కమలాజీ గొప్ప బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. రెండు దేశాల మధ్య అడుగడుగునా సాంస్కృతిక వినిమయం కనిపిస్తుంది.

స్నేహితులారా,

స్వామి తిరువళ్లువర్ నడయాడిన తమిళనాడు నుంచి అధ్యక్షుడు కంగలూ పూర్వీకులు వచ్చారు. వేల ఏళ్ల క్రితం స్వామి తిరువళ్లువర్ ఏమన్నారంటే:

पडई कुडी कूळ् अमईच्चु नट्परन् आरुम्

उडैयान् अरसरुळ् एरु

దీని అర్థం - బలమైన దేశం ఆరు అంశాలను కలిగి ఉండాలి: పరాక్రమం కలిగిన సైన్యం, దేశభక్తులైన పౌరులు, వనరులు, మంచి ప్రజా ప్రతినిధులు, బలమైన రక్షణ వ్యవస్థ, నిరంతరం వెన్నంటి ఉండే మిత్ర దేశాలు. భారత్‌కు ట్రినిడాడ్ అండ్ టొబాగో అలాంటి మిత్ర దేశం.

మన బంధంలో క్రికెట్లో ఉండే మజా, మిరియాలలో ఉండే ఘాటు ఉంది. కాలిప్సో లయకు మృదంగ వాయిద్యం తోడయితే.. మన సంబంధాలు మరింత శ్రావ్యంగా మారతాయి. రెండు దేశాల మధ్య సామరస్యమే మన బంధానికి గొప్ప బలం.

స్నేహితులారా,

ఈ గౌరవాన్ని మన అనుబంధం పట్ల ఓ బాధ్యతగా నేను చూస్తున్నాను. సన్నిహితమైన, నమ్మకమైన భాగస్వామిగా ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రజల నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య నిర్మాణంపై మేం ఎప్పుడూ దృష్టి సారించాం. ట్రినిడాడ్ అండ్ టొబాగో క్యారికామ్‌లో కీలక భాగస్వామిగా మాత్రమే కాకుండా.. అంతర్జాతీయంగా భారత్‌కు ముఖ్యమైన భాగస్వామిగా ఉంది.

మొత్తం గ్లోబల్ సౌత్ అంతటికీ మన సహకారం కీలకమైనది. రెండు బలమైన ప్రజాస్వామ్య దేశాలుగా, మన ప్రజలతో పాటు మానవాళి సంక్షేమం దిశగా కలసి పనిచేయడం కొనసాగిస్తాం.

అధ్యక్షా,

ఈ పురస్కారాన్ని నాకు అందించినందుకు మరోసారి, 140 కోట్ల మంది భారతీయుల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతీ రంగంలోనూ గొప్ప విజయాలు సాధించేలా ఇది మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.

ధన్యవాదాలు.

సూచన: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.

 

***


(Release ID: 2151261)