ప్రధాన మంత్రి కార్యాలయం
ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలితో సమావేశమైన ప్రధాని మోదీ
Posted On:
04 JUL 2025 11:37PM by PIB Hyderabad
ట్రినిడాడ్ అండ్ టొబాగో రాజధాని నగరం పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ఉన్న అధ్యక్ష భవనంలో ఆ దేశ అధ్యక్షురాలు గౌరవ క్రిస్టీన్ కార్లా కంగాలూతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహబంధాన్ని తెలియజేసేలా హృదపూర్వక వాతావరణంలో ఈ భేటీ జరిగింది.
తనతో పాటు తన బృందానికి అందించిన ఆతిథ్యానికి ప్రధానమంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 'ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో' అవార్డునిచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. దీనిని 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా అభివర్ణించారు.
ఈ సంవత్సరం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు అందుకున్నందుకు అధ్యక్షురాలు కంగాలూను ప్రధానమంత్రి అభినందించారు. విశిష్ట ప్రజా సేవ విషయంలో ఆమెను ప్రశంసించారు. ప్రధానమంత్రి నాయకత్వాన్ని, భారతదేశానికి సంబంధించి ఆయనకున్న దార్శనికతను అధ్యక్షురాలు కంగాలూ ప్రశంసించారు.
మానవ సంబంధాల ద్వారా రెండు దేశాలు ఏర్పరచుకున్న శాశ్వత బంధాలను ఇరువురు నాయకులు గుర్తు చేసుకున్నారు.
గ్లోబల్ సౌత్ భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ట్రినిడాడ్ అండ్ టొబాగో, కరీబియన్ దేశాల ప్రజలకు (క్యారీకామ్) భారతదేశం నిరంతరం మద్దతును అందిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. భారతదేశాన్ని సందర్శించాలని అధ్యక్షురాలు కంగాలూను ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
***
(Release ID: 2142474)
Visitor Counter : 2
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam