యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

క్రీడలతో సానుకూల శక్తికి నిద్శనం ‘ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ (కేఐబీజీ)’, ఇది సరికొత్త అధ్యాయం: ప్రధాని నరేంద్ర మోదీ

క్రీడలను ప్రారంభించిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ

అన్ని రకాల క్రీడల్లో అభ్యున్నతి సాధించే దిశగా భారత కృషికి కేఐబీజీ నిదర్శనం: డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ

Posted On: 20 MAY 2025 8:45AM by PIB Hyderabad

క్రీడలు సానుకూల శక్తినిస్తాయని, దేశ క్రీడా చరిత్రలో ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ కీలకమైన ఘట్టమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా, నాగర్ హవేలీ - డామన్, డయ్యూతోపాటు భారత క్రీడా ప్రాధికార సంస్థలోని క్రీడల నిర్వాహకులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం తన సందేశాన్ని అందించారు. భారత క్రీడా ప్రస్థానంలో బీచ్ గేమ్స్ సంచలనం సృష్టిస్తాయని అభినందనలు చెప్తూ శుభాకాంక్షలు తెలిపారు.

 

ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ వేదికగా డయ్యూను ఎంచుకోవడం ‘సముచితం’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. “ఎండ, ఇసుక, నీటి సమ్మేళనమిది. అవి శారీరక సామర్థ్యానికి సవాళ్లను పెంచడంతోపాటు అదే సమయంలో తీర ప్రాంత వారసత్వ ప్రత్యేకతను చాటుతాయి” అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. “అలలు తీరాన్ని తాకుతూ, క్రీడాకారులు తలపడుతుండగా క్రీడా రంగంలో భారత్ ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

 

నిరంతరం విస్తరిస్తున్న ఖేలో ఇండియా క్రీడల్లో భాగంగా బీచ్ గేమ్స్‌ను మొదటిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ క్రీడల వేదిక అయిన డయ్యూలోని ఘోగ్లా బీచ్‌లో సోమవారం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖల మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు.

 

ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1,350 కి పైగా క్రీడాకారులను ఒకచోట చేర్చాయి. మే 24న పోటీలు ముగిసే సమయానికి అథ్లెట్లు తలపడే ఈ ఆరు క్రీడల్లో పతకాలు అందిస్తారు - సాకర్, వాలీబాల్, సెపక్ తక్రా, కబడ్డీ, పెన్‌కాక్ సిలాట్, ఓపెన్ వాటర్ స్విమ్మింగ్. మల్లఖంబ్, టగ్ ఆఫ్ వార్ రెండూ పతకేతర (ప్రదర్శన) విభాగం కిందకు వస్తాయి. సోమవారం ఉదయం బీచ్ సాకర్ పోటీ మొదలైంది.

 

“మనలాంటి వైవిధ్యభరితమైన దేశంలో సంస్కృతులు, ప్రాంతాలు, భాషలను ఏకం చేసే ప్రత్యేకమైన శక్తి క్రీడలకు ఉంది. కేవలం వినోదానికే పరిమితం కాదు.. క్రీడలతో లభించే ఉత్సాహవంతమైన శక్తి ప్రభావవంతమైన సానుకూల శక్తిగా నిలుస్తోంది. దేశ ప్రతిష్ఠకు, మన యువత ఆకాంక్షలకు క్రీడలు ప్రతీక. ఈ నేపథ్యంలో ఖేలో ఇండియా బీచ్ గేమ్స్‌కు అమితమైన ప్రాధాన్యముంది” అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

 

అద్భుతమైన దేశ సాంప్రదాయక నృత్య రూపాల వైవిధ్యాన్ని చాటేలా, చక్కగా రూపొందించిన ప్రారంభోత్సవాన్ని అనేక మంది ప్రముఖులు వీక్షించారు. దాద్రా-నాగర్ హవేలీ, డామన్ - డయ్యూ, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ ప్రఫుల్ పటేల్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కె. కైలాశ్ నాథన్, అండమాన్ - నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె. జోషి పాల్గొన్నారు.

 

“ఈరోజు కేవలం ఓ క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభించడం మాత్రమే కాదు, భారత మొదటి బీచ్ స్పోర్ట్ విప్లవాన్ని మనం చాటుతున్నాం! అలలతోపాటు ఆకాంక్షలు వెల్లివిరుస్తాయని, ఈ మట్టి ఉత్సాహాన్ని రగిలిస్తుందని నేను నమ్ముతున్నాను — ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ నేడు మనందరి హృదయాల్లో ఒక ఉత్తేజాన్ని నింపాయి” అని డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ అన్నారు. “మోడీ ప్రభుత్వ హయాంలో మేము ఏ కార్యక్రమాన్నీ కేవలం లాంఛనప్రాయంగా నిర్వహించడం లేదు – ఓ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. క్రీడలను ఉపాధితో అనుసంధానం చేయడం మా లక్ష్యం. వికసిత భారత్ దిశగా.. యువత తమ కలలను సాకారం చేసుకోడానికి ఖేలో ఇండియా ఓ కచ్చితమైన మార్గం” అని ఆయన అన్నారు.

ఖేలో ఇండియా దేశీయ క్రీడా రంగంలో మరిన్ని క్రీడలను చేర్చిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నట్టు- గత కొన్నేళ్లుగా మౌలిక సదుపాయాలు, మెరుగైన శిక్షణ సౌకర్యాలు, క్రీడాకారులకు సహాయక చర్యల్లో పెట్టుబడుల ద్వారా క్రీడా రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ వివరించారు. ‘దేశీయ క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, ఏ స్థాయి అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలనైనా భారత్ నిర్వహించగలదని ప్రపంచానికి బలమైన సందేశాన్ని పంపడానికి’ కొత్త క్రీడలు మంచి అవకాశమని డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ వివరించారు.

 

ఖేలో ఇండియా బీచ్ గేమ్స్‌ను ‘సాధారణ’ వ్యవహారంగా చూడొద్దని డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ అన్నారు. “బీచ్ వాలీబాల్ వంటి క్రీడలు ఓ అభిరుచిగా యువతను ఆకర్షించడమే కాకుండా, కెరీర్ అవకాశాలను కూడా వారికి అందిస్తాయి. దేశంలోని బీచ్‌లలో ఇంత పెద్ద ఎత్తున పోటీ క్రీడలను నిర్వహిస్తుండడం ఇదే తొలిసారి” అన్నారు.

 

భారత్‌లో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోందని, క్రీడా సంస్కృతి ‘సరికొత్త నియమావళి’గా మారిందని డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. కేంద్రపాలిత ప్రాంతంపట్ల ప్రభుత్వానికి బలమైన నిబద్ధత ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

 

 

ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025 గురించి మరిన్ని వివరాల కోసం: https://beach.kheloindia.gov.in/

 

ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025 పతకాల పట్టిక కోసం: https://beach.kheloindia.gov.in/medal-tally

 

 

ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ గురించి:

 

ఖేలో ఇండియా కింద నిర్వహిస్తున్న మొదటి బీచ్ గేమ్స్ ఇవి. దాద్రా, నాగర్ హవేలీ - డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతం డయ్యూలో మే 19 నుంచి 24 వరకు ఖేలో ఇండియా పథకంలో భాగంగా క్రీడా పోటీలు, నైపుణ్యాభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. బీచ్ క్రీడలను ప్రోత్సహించడంతోపాటు వాటిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ ఎడిషన్‌లో ఆరు క్రీడల్లో పోటీలు నిర్వహించి పతకాలను అందించనున్నారు: బీచ్ సాకర్, బీచ్ వాలీబాల్, బీచ్ సెపక్ తక్రా, బీచ్ కబడ్డీ, పెన్‌కాక్ సిలాట్, ఓపెన్ వాటర్ స్విమ్మింగ్. వీటితోపాటు మరో రెండు (పతకేతర) ప్రదర్శన క్రీడలు కూడా నిర్వహించనున్నారు: మల్లఖంబ్, టగ్ ఆఫ్ వార్ పోటీలను కూడా డయ్యూలో నిర్వహిస్తారు. 

***


(Release ID: 2130154)