హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధింపునకు ఆమోదం కోరుతూ లోక్ సభలో చట్టబద్ధ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


మణిపూర్‌ హింసలో ప్రాణాలు కోల్పోయిన వారిపట్ల సానుభూతిని, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసిన సభ

మణిపూర్ హైకోర్టు నిర్ణయం దరిమిలా.. రిజర్వేషన్లకు సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం, మణిపూర్‌లో జాతుల ఘర్షణ

మణిపూర్‌లో గత నాలుగు నెలలుగా హింస లేదు

సహాయక శిబిరాల్లో ఆహారం, మందులు, వైద్య సేవలు సహా అవసరమైన అన్ని సదుపాయాలను అందిస్తున్న ప్రభుత్వం

సాంకేతిక విద్య, వైద్య విద్య కోసం ఆన్‌లైన్ ఏర్పాట్లు

ప్రాథమిక విద్య కోసం శిబిరాల్లోనే తరగతులు

హింసకు తావివ్వొద్దు, జాతి హింసను ఏ రాజకీయ పార్టీతోనూ ముడిపెట్టొద్దు: హోంమంత్రి

మణిపూర్ లో చాలా కాలంగా అశాంతి ఉంది.. కానీ, అక్కడ హింస ఇదే మొదటిసారి అన్నట్టుగా ప్రతిపక్షాలు చిత్రీకరిస్తున్నాయి

గత ప్రభుత్వ హయాంలో 1993 తర్వాత మణిపూర్‌లో మూడు సార్లు భారీగా జాతుల ఘర్షణలు: ఒకటి పదేళ్లు, ఇంకొకటి మూడేళ్లు, మరో ఘర్షణ ఆరు నెలలపాటు కొనసాగినప్పటికీ.. హోం మంత్రి సహా ప్రభుత్వం నుంచి ఎవ్వరూ ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు

జాతి హింస లేకపోయినా 2012, 2017 మధ్య ఏటా సగటున 212 రోజుల పాటు మణిపూర్ స్తబ్ధంగానే ఉండిపోయింది

హైకోర్టు ఆదేశానికి ముందు.. మా హయాంలో మణిపూర

నాడు పోస్టు చేయడమైనది: 03 APR 2025 4:21PM by PIB Hyderabad

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధింపునకు ఆమోదం కోసం కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా లోక్‌సభలో ఓ చట్టబద్ధమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దిగువ సభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. మణిపూర్‌లో జరిగిన హింసలో ప్రాణాలు కోల్పోయిన వారిపట్ల సభ సానుభూతిని, ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది.

తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ.. రిజర్వేషన్ సంబంధిత వివాదంపై మణిపూర్ హైకోర్టు నిర్ణయం దరిమిలా మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య జాతి ఘర్షణ మొదలైందన్నారు. ఇవి అల్లర్లో, ఉగ్రవాద చర్యలో కావని, హైకోర్టు తీర్పును అన్వయించుకున్న తీరు/ భిన్న వ్యాఖ్యానాల ఫలితంగా ఇరువర్గాల మధ్య జరిగిన జాతి హింస అని పేర్కొన్నారు. డిసెంబర్ నుంచి మార్చి వరకు దాదాపు నాలుగు నెలలుగా మణిపూర్‌లో ఎలాంటి హింసా జరగలేదని.. సహాయక శిబిరాలలో ఆహారం, ఔషధాలు, వైద్య సదుపాయాలను అందిస్తున్నామని శ్రీ అమిత్ షా తెలిపారు. సాంకేతిక, వైద్య విద్యల కోసం ఆన్‌లైన్ ద్వారానూ.. అలాగే ప్రాథమిక విద్య కోసం శిబిరాల్లోనే తరగతులను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

ఎటువంటి హింసకు తావివ్వవద్దని, జాతి హింసను ఏ రాజకీయ పార్టీతోనూ ముడిపెట్టకూడదని శ్రీ అమిత్ షా అన్నారు. తమ పాలనలోనే జాతి హింస జరిగినట్లు చిత్రీకరించేలా ప్రతిపక్షాలు ప్రయత్నించాయని విమర్శించారు. 1993-1998 మధ్య మణిపూర్‌లో ఐదేళ్లపాటు నాగా – కుకీ ఘర్షణ కొనసాగిందని, ఇందులో 750 మంది మరణించారని ఆయన సభకు తెలిపారు. దీనివల్ల మరో దశాబ్దం పాటు అక్కడక్కడా ఉధ్రిక్త ఘటనలు కూడా జరిగాయన్నారు. తమ పాలనలో ఇలాంటి ఘటనలను జరగనీయొద్దని కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ.. దురదృష్టవశాత్తూ ఓ నిర్ణయం హింసకు దారితీసిందని, దానినీ వెంటనే అదుపులోకి తెచ్చామని శ్రీ అమిత్ షా అన్నారు. హింసలో 260 మంది ప్రాణాలు కోల్పోయారని, అందులో 80 శాతం మొదటి నెలలోనే మృతిచెందగా, మిగిలిన వ్యక్తులు తరువాతి నెలల్లో మృత్యువాత పడ్డారని తెలిపారు. 1997-98 కుకి-పైట్ ఘర్షణలో 50కి పైగా గ్రామాలు నాశనమయ్యాయని, 40,000 మంది నిరాశ్రయులయ్యారని, 352 మంది మరణించారని, వందలాది మంది గాయపడ్డారని, 5,000 ఇళ్లు కాలిపోయాయని కూడా ఆయన ప్రస్తావించారు. 1993లో ఆరు నెలల పాటు జరిగిన మెయిటీ-పంగల్ ఘర్షణలోనూ 100 మందికి పైగా మరణించారని ఆయన చెప్పారు.

మణిపూర్ లో హింస ఇదే మొదటిసారి అన్నట్టుగా, తమ పాలన విఫలమైందన్నట్టుగా ప్రతిపక్షాలు చిత్రీకరిస్తున్నాయని హోం మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో మణిపూర్‌లో మూడు సార్లు భారీగా జాతుల ఘర్షణలు- ఒకటి పదేళ్లు, ఇంకొకటి మూడేళ్లు, మరో ఘర్షణ ఆరు నెలలపాటు కొనసాగాయని అన్నారు. ఈ హింసాత్మక ఘటనల తర్వాత నాటి హోంమంత్రి సహా ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరూ కూడా ఆ ప్రాంతంలో సందర్శించలేదన్నారు.

2017లో ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందనీ.. అయితే, కిందటి అయిదేళ్ల కాలంలో జాతి హింస ఘటనలు లేకపోయినప్పటికీ, ఏటా సగటున 212 రోజుల పాటు మణిపూర్ లో కార్యకలాపాలు స్తంభించిపోయాయని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. వెయ్యికి పైగా ఎన్‌కౌంటర్లు జరిగాయని, వీటిపై సుప్రీంకోర్టు విచారణ జరపాలని అన్నారు. 2017 నుంచి ఆరేళ్ల బీజేపీ పాలనలో.. హైకోర్టు ఉత్తర్వుకు ముందు మణిపూర్‌లో ఒక్క రోజు కూడా బంద్ గానీ దిగ్బంధనం గానీ లేవని, ఎలాంటి హింస జరగలేదని శ్రీ అమిత్ షా తెలిపారు. హైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా ఉన్నదని రెండువర్గాలూ భావించడంతో, నిర్దిష్ట పరిస్థితుల వల్ల కేవలం రెండు రోజుల్లోనే హింస చెలరేగిందన్నారు.

మణిపూర్‌లో హింసను ప్రభుత్వం విస్మరిస్తోందని కూడా ప్రతిపక్షాలు ఆరోపించాయని శ్రీ అమిత్ షా అన్నారు. హైకోర్టు ఉత్తర్వు జారీ అయిన రోజే వైమానిక దళ విమానాల ద్వారా ఆ ప్రాంతానికి భద్రతా దళాలను పంపించామని ఆయన సభకు తెలిపారు. ఈ అల్లర్లు అందరికీ ఆందోళన కలిగించే విషయమే అన్నారు. మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని, ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని సభ్యులకు హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ హింసలో కోల్పోయిన ప్రతి ప్రాణం పట్ల సభ హృదయపూర్వకంగా సానుభూతినీ, సంతాపాన్ని తెలపాలని కోరారు.

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత.. రెండు వర్గాలతో చర్చలు, ఇరు వర్గాలకు చెందిన అన్ని సంస్థలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో త్వరలో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. హింసను అంతం చేసే మార్గాన్ని ప్రభుత్వం అన్వేషిస్తోందని, శాంతిని నెలకొల్పడానికే తమ ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. గత నాలుగు నెలలుగా మణిపూర్‌లో ఎవరూ మృతిచెందలేదని, ఇద్దరు మాత్రమే గాయపడ్డారని, పరిస్థితి చాలావరకు అదుపులో ఉందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. అయితే, నిర్వాసితులైన ప్రజలు శిబిరాల్లో ఉండాల్సిన అవసరం లేనప్పుడే పరిస్థితులు సంతృప్తికరంగా ఉన్నట్టు భావిస్తామన్నారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీకి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

తమ ముఖ్యమంత్రి రాజీనామా చేశారనీ.. అనంతరం 37 మంది బీజేపీ, ఆరుగురు ఎన్సీపీ, అయిదుగురు ఎన్‌పీఎఫ్, ఒక జేడీ (యూ), అయిదుగురు కాంగ్రెస్ సభ్యులతో గవర్నర్ చర్చలు జరిపారనీ కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో తాము లేమని చాలా మంది సభ్యులు చెప్పడంతో రాష్ట్రపతి పాలన విధించాలని క్యాబినెట్ సిఫార్సు చేసిందని, దానిని రాష్ట్రపతి ఆమోదించారని ఆయన తెలిపారు. మణిపూర్‌లో వీలైనంత త్వరగా శాంతిని పునరుద్ధరించడానికి, బాధితులకు పునరావాసం కల్పించడానికి, క్షతగాత్రులు కోలుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీ అమిత్ షా చెప్పారు.  


(రిలీజ్ ఐడి: 2118638) సందర్శకుల సూచీ సంఖ్య : : 103
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , Punjabi , Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali-TR , Gujarati , Tamil , Malayalam