మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పరీక్ష పే చర్చా 2025 ఏడో ఎపిసోడ్ లో పాల్గొన్న మేరీ కోమ్, అవని లేఖరా, సుహాస్ యతిరాజ్
Posted On:
17 FEB 2025 3:57PM by PIB Hyderabad
పరీక్షా పే చర్చా 2025 ప్రారంభ ఎపిసోడ్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన లోతైన చర్చలను కొనసాగిస్తూ, ఈ రోజు ప్రసారమైన ఏడో ధారావాహికలో ప్రముఖ క్రీడాకారులు ఎమ్ సి మేరీ కోమ్, అవని లేఖా, సుహాస్ యతిరాజ్ పాల్గొన్నారు. క్రమశిక్షణ ద్వారా లక్ష్య నిర్దేశం, స్థిరత్వం, ఒత్తిడిని అదుపు చేయడం, నిర్వహణ గురించి వారు మాట్లాడారు. తమ జీవితాల్లోని వ్యక్తిగత విషయాలను, క్రీడల ద్వారా నేర్చుకున్న విషయాలను వారు పంచుకున్నారు.
బాక్సింగ్ అనేది మహిళల క్రీడ కాదనే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి కేవలం తన కోసమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మహిళల కోసం కూడా సామాజిక భావనను సవాలు చేసిన విధానాన్ని మేరీ కోమ్ వివరించారు. ఎవరైనా జీవన ప్రయాణంలో ఎవరిపై ఆధారపడకుండా ఆత్మబలంతో ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సలహాను ఉటంకిస్తూ, కుమార్తెగా, భార్యగా, తల్లిగా తన 20 ఏళ్ల ప్రయాణాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. అంకితభావం, పట్టుదల విజయానికి నిజమైన చోదకాలని స్పష్టం చేస్తూ, కఠోర శ్రమ ప్రాముఖ్యతను ఆమె వివరించారు.
విజయానికి భయమే ప్రధాన అవరోధమని, అలాంటి ప్రతికూల భావోద్వేగాలను మనో బలంతో అధిగమించాలని సుహాస్ యతిరాజ్ విద్యార్థులను ఉత్తేజపరిచారు. భయాన్ని జయించడం ఒక్కటే సహజసిద్ధంగా రాణించడానికి ఉత్తమ మార్గమని ఆయన స్పష్టం చేశారు. సూర్యుడిలా ప్రకాశించాలంటే సూర్యుడిలా మండేందుకు సిద్ధంగా ఉండాలని, సవాళ్లను ధైర్యంగా, దృఢ సంకల్పంతో స్వీకరించాలని ఆయన విద్యార్థులను కోరారు. అలాగే సానుకూల శక్తిని పొందడానికి మ్యూజిక్ థెరపీ గురించి కూడా కూడా ఆయన వారికి వివరించారు. ఎవరినైనా నడిపించేది వారి ఆలోచనలే కాబట్టి మంచి అవగాహనతో ఆలోచించవలసిన అవసరాన్ని ఆయన ప్రముఖంగా తెలిపారు.
అవని లేఖరా మాట్లాడుతూ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, భయాన్ని తగ్గించుకోవడానికి సరైన నైపుణ్యాలను పొందడం అవసరమని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి ప్రాముఖ్యతను అవని లేఖరా వివరించారు. క్రీడల నుండి పోలికలను తీసుకుంటూ, విశ్రాంతి, చదువులో విరామం అవసరాన్ని వివరించారు. పరీక్షలను సమర్థంగా ఎదుర్కోవడానికి విద్యార్థులకు పరీక్షలకు ముందు తగినంత నిద్ర అవసరమని సూచించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రదర్శించి ఆమె వారికి మార్గనిర్దేశం చేశారు.
తమ వృత్తి, ఉద్యోగ ఎంపికపై తల్లిదండ్రులను ఒప్పించడం, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచుకోవడం, ఏకాగ్రతను నిలుపుకోవడం వంటి అంశాలపై విద్యార్థులు ప్రశ్నలు అడిగారు. దుబాయ్, ఖతార్‌ల నుండి వచ్చిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొని, తమ సందేహాలను అతిథులతో పంచుకున్నారు.
విజయానికి కఠోర శ్రమే కీలకమని, సులభ మార్గాలు (షార్ట్ కట్) ఎంచుకోవడం ద్వారా ఏమీ సాధించలేమని అతిథులందరూ ఏకగ్రీవంగా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో క్రీడారంగ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు, వినోద పరిశ్రమ ప్రముఖులు, ఆధ్యాత్మిక నాయకులు వంటి వివిధ రంగాల విశిష్ట వ్యక్తులు పాల్గొని విద్యార్థులకు వారి సమగ్ర వికాసానికి దోహదపడే పాఠ్యపుస్తకాలకు అతీతమైన అమూల్యమైన విషయాలను అందిస్తున్నారు. ఇప్పటికే మరో మూడు ఎపిసోడ్లు ప్రసారం కాగా, ప్రతి సెషన్... విద్యార్థులకు విద్యాపరంగా, వ్యక్తిగతంగా రాణించడానికి అవసరమైన సాధనాలు, వ్యూహాలను అందిస్తూనే ఉంది. ప్రతి సెషన్ తరువాత విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను పంచుకున్నారు.
నవీకరించిన, పరస్పర అనుసంధానిత రూపంలో పరీక్షా పే చర్చా (పిపిసి) 2025 ఎనిమిదో ఎడిషన్ దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుండి విస్తృతమైన ప్రశంసలను పొందుతోంది. సాంప్రదాయ టౌన్ హాల్ ఫార్మాట్ కు భిన్నంగా, ఈ సంవత్సరం ఎడిషన్ 2025 ఫిబ్రవరి 10న న్యూఢిల్లీలోని అందమైన సుందర్ నర్సరీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాకతో ఆకట్టుకునే రీతిలో సెషన్ తో ప్రారంభమైంది.
ప్రారంభ ఎపిసోడ్‌లో, ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా 36 మంది విద్యార్థులతో సంభాషించారు. పోషకాహారం, ఆరోగ్యం, ఒత్తిడిపై నియంత్రణ, ఎవరికి వారు సవాల్ ను నిర్దేశించుకోవడం, నాయకత్వ కళ, పుస్తకాలకు మించి – 360º వికాసం, సానుకూలత పెంచుకోవడం వంటి లోతైన అంశాలను ప్రధాని ప్రస్తావించారు. ఆయన అందించిన విలువైన మార్గనిర్దేశం విద్యార్థులకు ఆత్మవిశ్వాసంతో విద్యాపరంగా సవాళ్లను ఎదుర్కొనడానికి ఆచరణాత్మక వ్యూహాలను అందించడమే కాకుండా, మనోవికాసాన్ని, సమగ్ర అభ్యసనాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడింది.
కొనసాగుతున్న పరీక్షా పే చర్చా 2025- విద్యార్థులకు ప్రేరణ అందించే కార్యక్రమంగా మారింది. సానుకూల ఆలోచనతో విద్యా, జీవన సవాళ్లను ఎదుర్కొనడానికి వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం నింపుతోంది.
Link to watch the 1st episode: https://www.youtube.com/watch?v=G5UhdwmEEls
Link to watch the 2nd episode: https://www.youtube.com/watch?v=DrW4c_ttmew
Link to watch the 3rd episode: https://www.youtube.com/watch?v=wgMzmDYShXw

***
(Release ID: 2104253)
Visitor Counter : 18
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam