ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్థిక సర్వే 2024-25 సారాంశం

Posted On: 31 JAN 2025 2:23PM by PIB Hyderabad

 

* 2025-26 లో భారత జీడీపీ వృద్ధి 6.3 నుంచి 6.8 శాతం మధ్య ఉంటుందని అంచనా
• దశాబ్ధ సగటుకు దగ్గరగా 2025 ఆర్థిక సంవత్సరంలో వాస్తవిక జీడీపీ 6.4 శాతంగా ఉండొచ్చని అంచనా
• 2025 ఆర్థిక సంవత్సరంలో వాస్తవిక జీవీఏ 6.4 శాతం వృద్ధి నమోదు చేస్తుందని అంచనా
• గతేడాది జూలై - నవంబరులో మూలధన వ్యయంలో 8.2 శాతం వృద్ధి: ఇంకా పెరిగే అవకాశం
• గతేడాది ఏప్రిల్ - డిసెంబరు మధ్య 4.9 శాతానికి తగ్గిన మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణం
• 2026 ఆర్థిక సంవత్సరంలో 4 శాతం లక్ష్యానికి చేరువగా వినియోగదారీ ధరల ద్రవ్యోల్బణం
• అంతకుముందు ఏడాదితో పోలిస్తే గత ఏప్రిల్ - డిసెంబరులో 6 శాతం పెరిగిన ఎగుమతులు
• మెరుగుపడిన సేవల ఎగుమతి వృద్ధి: అంతకుముందు 5.7 శాతం నుంచి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - నవంబరులో 12.8 శాతానికి చేరిక
• స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో పెరుగుదల: గత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో 47.2 బిలియన్ డాలర్ల నుంచి ఈసారి అదే సమయానికి 55.6 బిలియన్ డాలర్లకు చేరిక.. 17.9 శాతం వృద్ధి
• గతేడాది డిసెంబరు చివరి నాటికి 640.3 బిలియన్ డాలర్ల విదేశీ మారకం.. 10.9 నెలల దిగుమతులు, 90 శాతం వరకు విదేశీ రుణాలు తీర్చడానికి సరిపడా నిల్వ
• గతేడాది డిసెంబరు నాటికి సౌర, పవన ఇంధన సామర్థ్యంలో 15.8 శాతం అదనపు పెరుగుదల
• గతేడాది డిసెంబరు చివరి నాటికి జీడీపీలో బీఎస్ఈ స్టాక్ మార్కెట్ నిష్పత్తి విలువ 136 శాతం.. చైనా (65 శాతం), బ్రెజిల్ (37 శాతం) కన్నా ఇది చాలా అధికం
• ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి, నిరంతరంగా కొనసాగించడానికి నియంత్రణల సడలింపును సూచించిన ఆర్థిక సర్వే
• అధిక వృద్ధిని కొనసాగించాలంటే.. వచ్చే రెండు దశాబ్దాల్లో మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులను కొనసాగించడం ఆవశ్యం
• ఎంఎస్ఎంఈలకు ఈక్విటీ నిధుల కోసం రూ. 50,000 కోట్లతో స్వావలంబన భారత నిధి
• 2025 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం 3.8 శాతం వృద్ధిని సాధిస్తుందని అంచనా
• 2024లో ఖరీఫ్ ఆహారధాన్యాల ఉత్పత్తి 1647.05 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని అంచనా.. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 89.37 లక్షల మెట్రిక్ టన్నుల వృద్ధి
• వ్యవసాయ వృద్ధికి కీలక చోదకాలుగా నిలిచిన ఉద్యాన పంటలు, పశుసంపద, మత్స్య రంగాలు
• 2025 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగం 6.2 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా
• 2021 - 2025 ఆర్థిక సంవత్సరాల మధ్య సామాజిక సేవల వ్యయంలో 15 శాతం వార్షిక వృద్ధి రేటు
• 29 శాతం నుంచి 48 శాతానికి పెరిగిన ప్రభుత్వ ఆరోగ్య వ్యయం.. ఫలితంగా 2015 – 2022 మధ్య మొత్తం ఆరోగ్య వ్యయంలో 62.6 శాతం నుంచి 39.4 శాతానికి తగ్గిన సొంత ఖర్చులు
• 2017 జూలై - 2018 జూన్ నుంచి 2023 జూలై - 2024 జూన్ మధ్య 6 శాతం నుంచి 3.2 శాతానికి తగ్గిన నిరుద్యోగ రేటు
• కృత్రిమ మేధ ద్వారా ప్రతికూల సామాజిక ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం, ప్రైవేటు రంగం, విద్యా సంస్థల సమష్టి కృషి అత్యావశ్యకం
 
“2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.3 శాతం వృద్ధి సాధించింది. వచ్చే ఐదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా వృద్ధి సగటున 3.2 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ అంచనా వేసింది. గతంలోని గణాంకాలతో పోలిస్తే ఇది స్వల్పమైనదే” అని 2024-25 ఆర్థిక సర్వే పేర్కొన్నది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంటులో ఈ సర్వేను ప్రవేశపెట్టారు.

2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని నమోదు చేసినప్పటికీ, ప్రాంతాల వారీగా అసమానతలున్నాయని సర్వే తెలిపింది. సరఫరా వ్యవస్థలో ఆటంకాలతోపాటు విదేశీ డిమాండ్లు పేలవంగా ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా ఐరోపాలోనూ ఆసియాలోని పలు ప్రాంతాల్లోనూ తయారీలో మందగమన ధోరణి ఉండడం గమనార్హం. ఇందుకు భిన్నంగా చాలా ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధిని పెంపొందిస్తూ సేవల రంగం మెరుగైన ప్రదర్శన కనబరిచింది. చాలా ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గినప్పటికీ, సేవల ద్రవ్యోల్బణం మాత్రం అలాగే ఉందని సర్వే తెలిపింది.

అంతర్జాతీయంగా అనిశ్చితులు ఉన్నప్పటికీ, భారత్ స్థిరమైన ఆర్థిక వృద్ధిని కనబరిచిందని సర్వే ప్రముఖంగా ప్రస్తావించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత వాస్తవిక జీడీపీ వృద్ధి 6.4 శాతంతో దశాబ్ద కాలపు సగటుకు దగ్గరగా ఉంది.
మొత్తం డిమాండ్ కోణంలో చూస్తే.. గ్రామీణ డిమాండ్ పుంజుకోవడం వల్ల స్థిర ధరల్లో ప్రైవేటు తుది వినియోగ వ్యయం 7.3 శాతం పెరుగుతుందని సర్వే అంచనా వేసింది.

సప్లై వైపు నుంచి చూస్తే.. వాస్తవికంగా జోడించిన స్థూల విలువ (రియల్ జీవీఏ) 6.4 శాతం పెరుగుతుందని అంచనా. 2025 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం 3.8 శాతానికి పుంజుకోగలదని సర్వే అంచనా వేసింది. 2025 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగం 6.2 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. నిర్మాణ కార్యకలాపాలు, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవలలో బలమైన వృద్ధి రేట్లు పారిశ్రామిక విస్తరణకు తోడ్పడుతాయని భావిస్తున్నారు. ఆర్థిక, స్థిరాస్తి, వృత్తి పరమైన సేవలు, ప్రజాపాలన, రక్షణ తదితర సేవలలో మెరుగైన కార్యకలాపాల వల్ల సేవారంగంలో వృద్ధి 7.2 శాతంతో పటిష్టంగా నిలుస్తుందని సర్వే అంచనా.

వృద్ధిలో ఒడుదుడుకులను దృష్టిలో పెట్టుకుని.. 2026 ఆర్థిక సంవత్సరంలో వాస్తవిక జీడీపీ వృద్ధి 6.3 నుంచి 6.8 శాతం మధ్య ఉంటుందని సర్వే అంచనా వేసింది.

ఆర్థిక, వాణిజ్య విధాన అనిశ్చితులపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనల వల్ల నష్టం కలిగే అవకాశాలు పెరిగిన నేపథ్యంలో.. దేశీయ వృద్ధికి సంబంధించిన వ్యూహాలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను, అంతర్జాతీయ అంశాలను మధ్యకాలిక దృక్పథంపై రూపొందించిన అధ్యయనం  వివరిస్తుంది.
2047 నాటికి వికసిత భారత్ సాధించాలన్న ఆశయం నెరవేరాలంటే.. భౌగోళిక పరమైన ఆర్థిక విభజనలు (జీఈఎఫ్), చైనా తయారీ నైపుణ్యం, ఇంధన పరివర్తన చర్యల్లో అంతర్జాతీయ సమాజం చైనాపై ఆధారపడుతుండడం వంటి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత మధ్యకాలిక వృద్ధి ధోరణిని మదింపు చేయడం అత్యంత ప్రధానమైన అంశం. క్రమంగా నియంత్రణల సడలింపు ద్వారా దేశీయ వృద్ధి సాధనాలు, వ్యూహాలను పునరుత్తేజితం చేయవచ్చని సర్వే సూచిస్తోంది. ఈ సడలింపులు వ్యక్తులు, సంస్థల వ్యాపారాలకు ఆర్థిక స్వేచ్ఛను అందించి.. చట్టబద్ధమైన ఆర్థిక కార్యకలాపాలను సులభంగా కొనసాగించడానికి అవకాశం కల్పిస్తాయి. సులభతర వాణిజ్యం 2.0కు అనుగుణంగా క్రమబద్ధమైన నియంత్రణల సడలింపుపైనే ప్రస్తుత సంస్కరణలు, ఆర్థిక విధానం ఉండాలని సర్వే స్పష్టం చేసింది. తద్వారా  భారతీయ చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నది.

2025 ఆర్థిక సంత్సరం ప్రథమార్థంలో వ్యవసాయ వృద్ధి స్థిరంగా ఉందని, రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు 3.5 శాతంగా నమోదైందని ఆర్థిక సర్వే పేర్కొన్నది. ఇందులో గత నాలుగు త్రైమాసికాల కన్నా మెరుగుదలను గమనించవచ్చు. ఖరీఫ్ లో చెప్పుకోదగ్గ ఉత్పత్తి, సాధారణం కన్నా ఎక్కువ రుతుపవనాలు, సరిపడా నీటి సదుపాయాలు వ్యవసాయ వృద్ధికి తోడ్పడ్డాయి.

2024-25లో మొత్తం ఖరీఫ్ ఆహార ధాన్యాల ఉత్పత్తి 1647.05 లక్షల మెట్రిక్ టన్నులుగా సర్వే అంచనా వేసింది. ఇది 2023-24తో పోలిస్తే 5.7 శాతం, గత ఐదేళ్ల సగటు ఆహార ధాన్యాల ఉత్పత్తి కన్నా 8.2 శాతం ఎక్కువ.

2025 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 6 శాతం వృద్ధిని సాధించిన పారిశ్రామిక రంగం.. మొత్తం ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా. తొలి త్రైమాసికంలో 8.3 శాతంతో గణనీయమైన వృద్ధిని సాధించినప్పటికీ.. రెండో త్రైమాసికంలో వృద్ది మందగించింది. ఇందుకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి. మొదటిది- దిగుమతి దేశాల నుంచి డిమాండ్ తగ్గిపోవడం వల్ల తయారీ ఎగుమతులు మందగించడం.. దానితోపాటు ప్రధాన వాణిజ్య దేశాల్లో దూకుడైన వాణిజ్య, పారిశ్రామిక విధానాలు. రెండోది- సగటు కన్నా ఎక్కువ రుతుపవన వర్షాల వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చాయి: ఇది రిజర్వాయర్లను నింపి వ్యవసాయానికి దోహదపడినప్పటికీ.. గనుల తవ్వకం, నిర్మాణం, కొంతరకూ తయారీ వంటి రంగాలకు అంతరాయం కూడా కలిగించింది. మూడోది - గత, ప్రస్తుత సంవత్సరాల్లో సెప్టెంబర్, అక్టోబర్ మధ్య పండుగల సమయాల్లో తేడాలు 2025 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వృద్ధి మందగమనానికి కారణమయ్యాయి.

అనేక సవాళ్లు ఉన్నప్పటికీ తయారీలో కొనుగోలు నిర్వాహక సూచీ (పీఎంఐ)లో వేగవంతమైన వృద్ధి నమోదును భారత్ కొనసాగించిందని సర్వే పేర్కొన్నది. 2024 డిసెంబరులో తాజా తయారీ పీఎంఐ పెరుగుతున్న దశలో నిలిచింది. సరికొత్త వ్యాపార లాభాలు, బలమైన డిమాండ్, ప్రకటన చర్యలు దీనికి చోదకాలుగా నిలిచాయి.

సేవల రంగం 2025 లో మెరుగైన ప్రదర్శనను కొనసాగించిందని సర్వే ప్రముఖంగా పేర్కొన్నది. మొదటి రెండు త్రైమాసికాల్లో చెప్పుకోదగ్గ వృద్ధి వల్ల 2025 ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతం వృద్ధి నమోదైంది. ఉప విభాగాల వారీగా అన్ని ఉప రంగాలూ మెరుగైన పనితీరును కనబరిచాయి. 2025  ఏప్రిల్ – నవంబరులో భారత సేవల ఎగుమతుల్లో వృద్ధి 12.8 శాతానికి పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 5.7 శాతం ఎక్కువ.
 
ద్రవ్యోల్బణం, నిలకడైన ఆర్థిక పరిస్థితి, విదేశీ వాణిజ్య సమతౌల్యం వంటి అంశాలలో స్థిరత్వం వల్ల వృద్ధి ప్రక్రియ సమర్థవంతంగా సాగిందని ఆర్థిక సర్వే పేర్కొన్నది. మొత్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం 2024 ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతం నుంచి గతేడాది ఏప్రిల్ - డిసెంబరులో 4.9 శాతానికి తగ్గింది. వినియోగదారీ ఆహార ధరల సూచీ (సీఎఫ్ పీఐ) ద్వారా కొలిచే ఆహార ద్రవ్యోల్బణం 2024 ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం ఉండగా, 2025 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ - డిసెంబర్)లో 8.4 శాతానికి పెరిగింది. ప్రధానంగా కూరగాయలు, పప్పు ధాన్యాల వంటి ఆహార పదార్థాలు దీనికి కారణంగా చెప్పొచ్చు. భారత్ లో వినియోగదారీ ధరల ద్రవ్యోల్బణం 2026 ఆర్థిక సంవత్సరంలో క్రమంగా 4 శాతం లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆర్బీఐ, ఐఎంఎఫ్ పేర్కొన్నాయి.

కేంద్ర వ్యయంలో మూలధన వ్యయ శాతం 2021 నుంచి 2024 మధ్య క్రమంగా పెరిగింది. సాధారణ ఎన్నికల అనంతరం 2024 జూలై – నవంబరులో కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం గతేడాదితో పోలిస్తే 8.2 శాతం పెరిగిందని సర్వే తెలిపింది.

సర్వే ప్రకారం కేంద్ర స్థూల పన్ను ఆదాయం, రాష్ట్రాల సొంత పన్ను ఆదాయం 2024 ఏప్రిల్ - నవంబర్ సమయంలో చెప్పుకోదగిన రీతిలో పెరిగాయి. 2024 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాష్ట్రాల రెవెన్యూ వ్యయం 12 శాతం (అంతకుముందు ఏడాది అదే సమయంతో పోలిస్తే) పెరిగింది. అందులో సబ్సిడీలు 25.7 శాతం, చెల్లించాల్సిన మొత్తాలు 10.4 శాతం పెరిగాయి.

ఆస్తుల్లో లోటు విలువ తగ్గడం, బలమైన మూలధన నిల్వలు (క్యాపిటల్ బఫర్స్), పటిష్టమైన నిర్వహణ వల్ల బ్యాంకింగ్‌ రంగంలో స్థిరత్వం ఏర్పడిందని సర్వే పేర్కొన్నది. బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల నిరర్ధక ఆస్తులు పన్నెండేళ్ల కనిష్ట స్థాయికి తగ్గాయి. ప్రస్తుతం స్థూల రుణాలు, ముందస్తు చెల్లింపుల్లో నిరర్ధక ఆస్తులు 2.6శాతంగా ఉన్నాయి. షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకుల్లో క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ నిష్పత్తి 2024 సెప్టెంబరు నాటికి నిబంధనల కన్నా ఎక్కువగా 16.7 శాతంగా ఉందని సర్వే తెలిపింది.

విదేశీ వాణిజ్యం స్థిరత్వాన్ని కొనసాగించడంలో సేవల వాణిజ్యం, రికార్డు స్థాయి చెల్లింపులను పొందడం కీలకపాత్ర పోషించాయని స్పష్టం చేసిన ఆర్థిక సర్వే.. 2024 ఏప్రిల్-డిసెంబరులో దేశంలో సరుకుల ఎగుమతులు అంతకుముందు ఏడాది అదే సమయంతో పోలిస్తే 1.6 శాతం పెరిగాయని తెలిపింది. దిగుమతులు 5.2 శాతం పెరిగాయి.

 

 దృఢమైన సేవల ఎగుమతులు దేశాన్ని ప్రపంచ సేవల ఎగుమతుల్లో ఏడో  అత్యధిక వాటా సాధించే స్థాయికి తీసుకెళ్లాయి, ఇది దేశపు పోటీ సామర్థ్యాన్ని చాటి చెప్పింది.


సేవల వాణిజ్య మిగులుతో పాటు, విదేశాల నుంచి చెల్లింపులు ఆరోగ్యకరమైన, స్థిరమైన ప్రైవేట్ బదిలీలకు దారితీశాయి. ఓఈసీడీ ఆర్థిక వ్యవస్థల్లో ఉద్యోగాల కల్పన పెరగడంతో ప్రపంచంలో చెల్లింపుల  రూపంలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ రెండు అంశాలు కలిసి 2025 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) జీడీపీలో 1.2 శాతంగా ఉండేలా చూశాయి.

స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల లభ్యత 2025 ఆర్థిక సంవత్సరంలో మళ్ళీ పుంజుకున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో 47.2 బిలియన్ డాలర్ల నుండి 2025 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 55.6 బిలియన్ డాలర్లకు పెరిగాయి, ఇది 17.9 శాతం వృద్ధి అని సర్వే తెలిపింది. ప్రధానంగా ప్రపంచ భౌగోళిక, ద్రవ్య విధాన పరిణామాల కారణంగా 2024 ద్వితీయార్థంలో విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడుల (ఎఫ్ పిఐ ) ప్రవాహాలు అస్థిరంగా ఉన్నాయి. స్థిరమైన మూలధన లభ్యత ఫలితంగా, భారత విదేశీ మారక నిల్వలు 2024 జనవరి చివరి నాటికి 616.7 బిలియన్ డాలర్ల నుండి 2024 సెప్టెంబర్ నాటికి 704.9 బిలియన్ డాలర్లకు పెరిగాయని, 2025 జనవరి 3 నాటికి 634.6 బిలియన్ డాలర్లకు పెరిగాయని ఆర్థిక సర్వే పేర్కొంది. భారత విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్) నిల్వలు 90 శాతం విదేశీ రుణాన్ని భర్తీ చేయగల సామర్ధ్యం కలిగి, పది నెలలకు పైగా దిగుమతులకు సరిపడే స్థాయిలో ఉన్నాయి. ఈ స్థాయి నిల్వలు అంతర్జాతీయ  అస్థిరతలకు వ్యతిరేకంగా రక్షణను అందిస్తాయి.

ఉపాధి రంగం  పనితీరు మెరుగ్గా కొనసాగుతున్నట్టు ఆర్థిక సర్వే పేర్కొంది. ఇటీవలి సంవత్సరాలలో భారత కార్మిక మార్కెట్ వృద్ధికి మహమ్మారి అనంతరం తీసుకున్న చర్యలు, పెరిగిన ప్రామాణీకరణ సహాయపడ్డాయని పేర్కొంది.

15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారి నిరుద్యోగ రేటు 2017-18లో 6 శాతంగా ఉండగా, 2023-24లో ఇది స్థిరంగా తగ్గి 3.2 శాతానికి చేరుకుంది. అలాగే శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్ ఎఫ్ పిఆర్), కార్మిక-జనాభా నిష్పత్తి (డబ్ల్యుపిఆర్) కూడా పెరిగాయి.
భారత్ వంటి సేవాధారిత ఆర్థిక వ్యవస్థలో, యువ,  శ్రామిక శక్తితో, కృత్రిమ మేధస్సు (ఎ.ఐ) ) ను అనుసరించడం ఆర్థిక వృద్ధికి, కార్మిక మార్కెట్ ఫలితాలను మెరుగుపరచడానికి భారీ అవకాశాలను అందిస్తుందని కూడా సర్వే పేర్కొంది. కృత్రిమ మేధ ఆధారంగా ప్రస్తుత సమయంలో వృద్ధి చెందడానికి అవసరమైన సామర్థ్యాలతో కార్మికులను సన్నద్ధం చేయడానికి వారి విద్య,  నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం కీలకం. ప్రస్తుత పరిస్థితిలో విస్తృత స్థాయిలో కృత్రిమ మేధను స్వీకరించడానికి కొన్ని ఆటంకాలు ఉన్నాయని,  ఈ పరిస్థితి విధాన నిర్ణేతలకు సరైన చర్యలు తీసుకునేందుకు ఒక అవకాశాన్ని అందిస్తోందని సర్వే తెలిపింది. ఎ ఐ ఆధారిత మార్పులు కార్మిక రంగంపై కలిగించే ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ప్రభుత్వం, ప్రైవేట్ రంగం,  విద్యా సంస్థల మధ్య సమష్టి సహకారం అవసరమని సర్వే పేర్కొంది.

మౌలిక సదుపాయాల రంగంలో, అధిక వృద్ధిని కొనసాగించడానికి రాబోయే రెండు దశాబ్దాలలో మౌలిక సదుపాయాల పెట్టుబడులను నిరంతరం పెంచాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. రైల్వే కనెక్టివిటీ కింద, 2024 ఏప్రిల్ - నవంబర్ మధ్య 2031 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ ను ప్రారంభించారు. 2024 ఏప్రిల్ - అక్టోబర్ మధ్య 17 కొత్త జతల వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టారు. 2025 ఆర్థిక సంవత్సరంలో నౌకాశ్రయ సామర్థ్యం గణనీయంగా మెరుగుపడింది, ఇది నిర్వహణ సామర్థ్యంలో మెరుగుదలలకు దారితీసింది ఇంకా ప్రధాన నౌకాశ్రయాలలో సగటు కంటైనర్ టర్నరౌండ్ సమయం 2024 ఆర్థిక సంవత్సరంలో 48.1 గంటల నుండి 2025 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్-నవంబర్) 30.4 గంటలకు తగ్గింది.


పీఎం - సూర్య ఘర్, ముఫ్త్ బిజ్లీ యోజన, నేషనల్ బయోఎనర్జీ ప్రోగ్రామ్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, పీఎం-కుసుమ్ వంటి పథకాలు, విధానాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు, నియంత్రణ చర్యల ద్వారా దేశంలో పునరుత్పాదక ఇంధనాన్ని, హరిత పెట్టుబడులను పెంచడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆర్థిక సర్వే వివరించింది. సౌర, పవన విద్యుత్ సామర్థ్యాన్ని పెంచడం వల్ల 2024 డిసెంబర్ నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 15.8 శాతం పెరిగింది.

ప్రభుత్వ సామాజిక సేవల వ్యయానికి 2021 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం వరకు వార్షిక సమ్మేళిత వృద్ధి రేటు (సి ఎ జి ఆర్) లో (కేంద్రం, రాష్ట్రాలు కలిపి) 15 శాతం పెరుగుదల నమోదైంది

వినియోగ వ్యయంలో అసమానతకు కొలమానమైన గిని ప్రామాణికం ఇటీవలి సంవత్సరాలలో క్షీణిస్తోంది గ్రామీణ ప్రాంతాల్లో ఇది 2022-23 లో 0.266 నుండి 2023-24 లో 0.237 కు తగ్గింది. పట్టణ ప్రాంతాలలో ఇది 2023-24 లో 0.284 కు పడిపోయింది. ఇది ఆదాయ పంపిణీ విధానాన్ని తిరిగి నిర్ధారించడంలో ప్రభుత్వ చొరవల సానుకూల ప్రభావాన్ని ప్రతిబింబిస్తోంది,


పాఠశాల విద్యారంగం విషయానికొస్తే జాతీయ విద్యావిధానం 2020 లక్ష్యాలను వివిధ కార్యక్రమాలు, పథకాల ద్వారా చేరుకునే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. సమగ్ర శిక్షా అభియాన్, దీక్ష, స్టార్స్, పరాఖ్, పీఎం శ్రీ, ఉల్లాస్, పీఎం పోషణ్ మొదలైనవి వీటిలో ఉన్నాయి.


2015 ఆర్థిక సంవత్సరం నుంచి 2022 ఆర్థిక సంవత్సరం మధ్య దేశ మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యయం వాటా 29.0 శాతం నుంచి 48.0 శాతానికి పెరిగిందని సర్వే పేర్కొంది. ఇదే సమయంలో మొత్తం ఆరోగ్య వ్యయంలో జేబు లోంచి పెట్టే ఖర్చు వాటా 62.6 శాతం నుంచి 39.4 శాతానికి తగ్గింది.


సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ) రంగం భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత  శక్తిమంతమైన \రంగం గా ఆవిర్భవించిందని సర్వే పేర్కొంది. ఎంఎస్ఎంఈలకు ఈక్విటీ నిధులు అందించేందుకు ప్రభుత్వం రూ.50,000 కోట్ల కార్పస్ తో స్వావలంబ భారత్ నిధి (సెల్ఫ్ రిలయెంట్ ఇండియా ఫండ్)  ని  ప్రారంభించింది.

అదనపు నియంత్రణల భారాన్ని తగ్గించడం ద్వారా, ప్రభుత్వాలు వ్యాపారాలను మరింత సమర్థవంతంగా మార్చేందుకు, ఖర్చులను తగ్గించడానికి, కొత్త వృద్ధి అవకాశాలను అందించడానికి సహాయం చేయగలవని సర్వే పేర్కొంది. నియంత్రణలు సంస్థలలో అన్ని రకాల నిర్వహణ ఖర్చును పెంచుతాయని తెలిపింది. రాష్ట్రాలు వాటి వ్యయ-సమర్థత కోసం నిబంధనలను క్రమపద్ధతిలో సమీక్షించడానికి మూడు దశల ప్రక్రియను సర్వే సూచించింది. క్రమబద్ధీకరణ కోసం ప్రాంతాలను గుర్తించడం, నిబంధనలను ఇతర రాష్ట్రాలు,  దేశాలతో విశ్లేషణాత్మకంగా పోల్చడం, వ్యక్తిగత సంస్థలపై ఈ ప్రతీ నిబంధన ఖర్చును అంచనా వేయడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయి.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఇఒడిబి) 2.0 అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్యక్రమంగా ఉండాలని, ఇది వ్యాపారాలు చేయడంలో అసౌలభ్యతను కలిగించే మూలకారణాలను పరిష్కరించడానికి దృష్టి సారించాలని సర్వే పేర్కొంది. ఇఒడిబి తదుపరి దశలో ప్రమాణాలు, నియంత్రణలను సరళీకరించడం, అమలుకు చట్టపరమైన రక్షణలను ఏర్పాటు చేయడం,సుంకాలు, ఫీజులను తగ్గించడం, రిస్క్ నియంత్రణ చర్యలను వర్తింపజేయడంపై కొత్త దృష్టి పెట్టాలని సూచించింది.


2026 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికావకాశాలు సమతుల్యంగా ఉన్నాయని సర్వే స్పష్టం చేసింది. పెరిగిన భౌగోళిక, వాణిజ్య అనిశ్చితులు, ధరల పెరుగుదల వంటివి వృద్ధికి విఘాతం కలించవచ్చని హెచ్చరించింది. దేశీయంగా, ప్రైవేట్ క్యాపిటల్ గూడ్స్ రంగానికి చెందిన ఆర్డర్ లను స్థిరమైన పెట్టుబడి వృద్ధిగా అనువదించడం, వినియోగదారుల విశ్వాసం పెంచడం, కార్పొరేట్ వేతన పెంపు వృద్ధిని ప్రోత్సహించడంలో కీలకం కాగలవని సర్వే పేర్కొంది. వ్యవసాయోత్పత్తి పుంజుకోవడం, ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, స్థిరమైన స్థూల ఆర్థిక వాతావరణంతో గ్రామీణ డిమాండ్ దాదాపుగా వృద్ధికి ఊతమిచ్చింది. మొత్తం మీద, భారతదేశం తన మధ్యకాలిక వృద్ధి సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయి నిర్మాణాత్మక సంస్కరణలు,  నియంత్రణల తొలగింపు ద్వారా తన అంతర్జాతీయ పోటీతత్వాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది.

 

***


(Release ID: 2099586) Visitor Counter : 913