ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జనవరి 12న జరగనున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025లో పాల్గొననున్న ప్రధాని


30 లక్షల మంది నుంచి ప్రతిభ ఆధారంగా బహుళ స్థాయి ఎంపిక ప్రక్రియ ద్వారా ఎంపికైన 3000 మంది యువ నాయకులతో సంభాషించనున్న ప్రధానమంత్రి


దేశం ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించడానికి సృజనాత్మక ఆలోచనలు, పరిష్కారాలను తెలియజేస్తూ ప్రధానికి ప్రజెంటేషన్ ఇవ్వనున్న యువ నాయకులు


భోజన సమయంలో ఆలోచనలు, అనుభవాలు, ఆకాంక్షలను నేరుగా ప్రధాన మంత్రితో పంచుకునేందుకు యువతకు ప్రత్యేక అవకాశం

Posted On: 10 JAN 2025 9:21PM by PIB Hyderabad

\స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జరుపుకొంటున్న జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జనవరి 12న ఉదయం 10 గంటలకు దిల్లీలోని భారత్ మండపంలో జరిగే వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే 3,000 మంది ప్రతిభావంతులైన యువ నాయకులతో ఆయన సంభాషించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సభనుద్దేశించి ప్రసంగించనున్నారు.


జాతీయ యూత్ ఫెస్టివల్‌ను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించే 25 ఏళ్ల సంప్రదాయానికి తెరదింపాలని వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ లక్ష్యంగా పెట్టుకుంది. రాజకీయ సంబంధాలు లేని లక్ష మంది యువతను రాజకీయాల్లోకి తీసుకురావటంతో పాటు వికసిత్ భారత్ కోసం వారి ఆలోచనలను సాకారం చేయడానికి జాతీయ వేదికను అందించాలన్న ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ పిలుపునకు ఇది తోడ్పటును అందించనుంది. ఈ పిలుపునకు అనుగుణంగా ఈ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దేశ భావి నాయకులకు ప్రేరణ, సాధికారత కల్పించడానికి రూపొందించిన వివిధ కార్యక్రమాలలో ప్రధాన మంత్రి పాల్గొననున్నారు. భారత అభివృద్ధిలో కీలకమైన పది అంశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ సృజనాత్మక యువ నాయకులు పది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను ప్రధాని ముందు ఉంచనున్నారు. భారత్‌కు సంబంధించిన అత్యంత క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించడానికి యువ నాయకులు ప్రతిపాదించిన వినూత్న ఆలోచనలు, పరిష్కారాలను ఇవి తెలియజేస్తాయి.


పది అంశాలపై పాల్గొన్నవారు రాసిన ఉత్తమ వ్యాసాల సంకలనాన్ని కూడా ప్రధాని విడుదల చేయనున్నారు. సాంకేతికత, సుస్థిరత, మహిళా సాధికారత, తయారీ, వ్యవసాయం వంటి విభిన్న రంగాల ఇతివృత్తాలను ఇవి కలిగి ఉండనున్నాయి.

ఒక ప్రత్యేకమైన ఏర్పాటులో భాగంగా ప్రధాన మంత్రి యువ నాయకులతో కలిసి భోజనం చేయనున్నారు. వారి ఆలోచనలు, అనుభవాలు, ఆకాంక్షలను నేరుగా ప్రధానితో పంచుకునే అవకాశం ఈ సందర్భంగా యువ నాయకులకు దక్కనుంది. ఈ వ్యక్తిగత సంభాషణ పాలన, యువత ఆకాంక్షల మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది.  పాల్గొనేవారిలో యాజమాన్యం, బాధ్యతకు సంబంధించిన గాఢమైన భావాన్ని పెంపొందిస్తుంది.


జనవరి 11వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సదస్సులో వివిధ పోటీలు, కార్యకలాపాలు, సాంస్కృతిక, థీమాటిక్ ప్రజెంటేషన్లలో యువనేతలు పాల్గొంటారు. ఇందులో మెంటార్లు, విషయ నిపుణుల నేతృత్వంలో పలు ఇతివృత్తాలపై చర్చలు కూడా ఉంటాయి. భారత కళాత్మక వారసత్వాన్ని, దేశ ఆధునిక పురోగతికి ప్రదర్శిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉండనున్నాయి.


దేశవ్యాప్తంగా అత్యంత ప్రేరణ పొందిన, మంచి యువ గొంతుకలను గుర్తించడానికి, వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి సునిశితంగా రూపొందించిన మెరిట్ ఆధారిత బహుళ స్థాయి ఎంపిక ప్రక్రియ అయిన వికసిత్  భారత్ ఛాలెంజ్ ద్వారా 3,000 మంది ధీటైన, ప్రేరేపిత యువతను వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో పాల్గొనడానికి ఎంపిక చేశారు. ఇందులో మూడు దశలు ఉన్నాయి. పాల్గొనేవారిలో 15 - 29 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఉన్నారు. అన్ని రాష్ట్రాలకు చెందిన యువత పాల్గొనేందుకు వీలుగా 12 భాషల్లో నిర్వహించిన తొలి దశ వికసిత్ భారత్ క్విజ్‌లో సుమారు 30 లక్షల మంది యువకులు పాల్గొన్నారు. ఇందులో అర్హత సాధించిన వారు రెండవ దశ అయిన వ్యాస పరీక్షలో పాల్గొన్నారు. ఇందులో "విససిత్ భారత్" దార్శనికతను సాకారం చేయడానికి కీలకమైన పది ముఖ్యమైన అంశాలపై తమ ఆలోచనలను వ్యక్తీకరించారు. ఈ రౌండ్‌లో 2 లక్షలకు పైగా వ్యాసాలు అందాయి. రాష్ట్రాలకు సంబంధించి జరిగిన మూడో రౌండ్‌లో ఒక్కో ఇతివృత్తానికి 25 మంది అభ్యర్థులు కఠినమైన వ్యక్తిగత పోటీల్లో పాల్గొన్నారు. ప్రతి రాష్ట్రం ఒక్కో పద్ధతి ద్వారా ముగ్గురిని అంతిమంగా ఎంపిక చేసింది. వీళ్లే ఢిల్లీలో జరిగే ప్రస్తుత జాతీయ స్థాయి కార్యక్రమంలో పాల్గొననున్నారు.


వికసిత్ భారత్ ఛాలెంజ్ నుంచి 1,500 మంది, రాష్ట్ర‌ స్థాయి ఛాంపియన్‌షిప్‌ల నుంచి 500ల బృందాలను ఎంపింక చేశారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యూత్ ఫెస్టివల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆవిష్కరణల ప్రదర్శన ద్వారా ఎంపికైన 1,000 మంది కూడా ఇందులో పాల్గొననున్నారు. వివిధ రంగాలలో వివిధ మైలురాళ్ల లాంటి విజయాలను సాధించిన 500 మంది కూడా చర్చల్లో భాగస్వామ్యం కానున్నారు.

 

***


(Release ID: 2092515) Visitor Counter : 36