హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హిందీ భాషా దినోత్సవం - 2024 సందర్భంగా కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సందేశం

Posted On: 14 SEP 2024 9:15AM by PIB Hyderabad

ఈ రోజు హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోం మంత్రి తన సందేశంలో, 1949 సెప్టెంబర్ 14 న భారత రాజ్యాంగ పరిషత్  హిందీని దేశ అధికార  భాషగా ఆమోదించిన ఈ పవిత్రమైన రోజు మనందరికీ చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. దీనికి 75 ఏళ్లు పూర్తవుతున్నాయని, ఈ ఏడాది అధికార భాష వజ్రోత్సవాలను నిర్వహించుకోబోతున్నట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. హిందీకి, అధికార భాషకు, మన అన్ని రాష్ట్రాల భాషలకు ఈ 75 ఏళ్ల  ప్రయాణం చాలా ముఖ్యమని అన్నారు. హిందీ ఎన్నో ఆటుపోట్లను చవిచూసిందని, కానీ ఏ స్థానిక భాషతోనూ హిందీకి పోటీ లేదన్న విషయాన్ని కచ్చితంగా చెప్పగలనని ఆయన అన్నారు.

హిందీ అన్ని భారతీయ భాషలకు మిత్రుడని, అవి  ఒకదానికొకటి సహకరించుకుంటాయని శ్రీ అమిత్ షా అన్నారు. గుజరాతీ, మరాఠీ, తెలుగు, మళయాళం, తమిళం, బంగ్లా ఇలా అన్ని భాషలూ హిందీని బలోపేతం చేస్తాయని, అలాగే, హిందీ ప్రతి భాషకీ బలాన్ని ఇస్తుందని అన్నారు. హిందీ ఉద్యమాన్ని నిశితంగా పరిశీలిస్తే రాజగోపాలాచారి, మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాలా లజపతిరాయ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆచార్య కృపలానీ ఇలా అందరూ హిందీయేతర ప్రాంతాలకు చెందిన వారేనని కేంద్ర హోం మంత్రి అన్నారు. శ్రీ అయ్యంగార్, శ్రీ కె.ఎం.మున్షీ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ హిందీని అధికార భాషగా గుర్తించి హిందీతో పాటు మన ఇతర భాషలన్నింటికీ బలాన్ని చేకూర్చాలని రాజ్యాంగ సభకు నివేదిక సమర్పించిందని,  ఈ ఇద్దరు నేతలు కూడా హిందీయేతర ప్రాంతాలకు చెందినవారేనని శ్రీ అమిత్ షా గుర్తు చేశారు. 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 10 సంవత్సరాల్లో హిందీ, స్థానిక భాషల బలోపేతానికి ఎంతో కృషి జరిగిందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. అనేక అంతర్జాతీయ వేదికలపై హిందీలో సగర్వంగా ప్రసంగించిన శ్రీ నరేంద్ర మోదీ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందీ ప్రాముఖ్యతను చాటి చెప్పారని, దీనితో పాటు దేశంలోని మన భాషల పట్ల కూడా గౌరవ భావాన్ని పెంచారని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఈ పదేళ్లలో అనేక భారతీయ భాషల బలోపేతానికి ఎంతో కృషి చేశామనీ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొత్త విద్యా విధానంలో- ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించేందుకు మాతృభాషకు ముఖ్యమైన స్థానం కల్పించడం ద్వారా మన అన్ని భాషలకు, హిందీకి కొత్త జీవం పోశారని అన్నారు.

ఈ పదేళ్లలో 'కంఠస్త్' అనే టూల్ ను అభివృద్ధి చేశామని శ్రీ అమిత్ షా చెప్పారు. అలాగే, గత పదేళ్లలో పార్లమెంటరీ అధికార భాషా సంఘం నాలుగు నివేదికలు అందించిందనీ, మరోవైపు ప్రభుత్వ వ్యవహారాల్లో హిందీ భాష వాడకం ప్రాధాన్యాన్ని పెంచామని చెప్పారు.  రానున్న రోజుల్లో, ఎనిమిదో షెడ్యూల్ లో పేర్కొన్న అన్ని భాషలకు హిందీ నుండి అనువాదం కోసం అధికార భాషా విభాగం ఒక వెబ్ సైటును కూడా తీసుకువస్తోందని, కృత్రిమ మేథను ఉపయోగించి ఏదైనా వాక్యం  లేదా ప్రసంగాన్ని చాలా తక్కువ సమయంలో అన్ని భాషల్లోకి అనువదించగలుగుతామని శ్రీ అమిత్ షా తెలిపారు. ఇది హిందీ, స్థానిక భాషలను మరింత పరిపుష్టం చేస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు హోం మంత్రి చెప్పారు.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన భాషల్లో మన భాషలు కూడా ఉన్నాయని, ఇదే విషయాన్ని ఈ రోజు అందరికీ మరోసారి చెప్పాలనుకుంటున్నానని హోం మంత్రి అన్నారు. హిందీ మనల్ని, మన భాషలన్నిటినీ కలుపుతుంది. దేశ పౌరులందరూ  హిందీ అయినా లేదా తమిళం, తెలుగు, మలయాళం , గుజరాతీ మొదలైన అన్ని భారతీయ భాషలలో పరస్పరం మాట్లాడుకోవాలన్నదే భారత రాజ్యాంగ పరిషత్ ఆవిర్భావ స్ఫూర్తి అని ఆయన అన్నారు. హిందీ భాష అందించే బలంతో ఇతర భాషలన్నీ కూడా సరళంగా, సుసంపన్నంగా మారుతాయని,  ఏకీకరణ ద్వారా అన్ని భాషలు- మన సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, వ్యాకరణం ద్వారా మన పిల్లల సంస్కారాన్ని కూడా ముందుకు తీసుకు వెళతాయని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.

నేడు హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని హిందీని, మన స్థానిక భాషలను బలోపేతం చేసేందుకు,  ఈ దిశగా అధికార భాషా విభాగం చేస్తున్న కృషికి మద్దతు ఇచ్చేందుకు ప్రతిజ్ఞ చేయాలని దేశప్రజలందరికీ కేంద్ర హోం మంత్రి పిలుపు ఇచ్చారు. 

‘‘మరోసారి దేశప్రజలందరికీ హిందీ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అధికార భాషను బలోపేతం చేద్దాం. వందేమాతరం’’

 

***


(Release ID: 2055130) Visitor Counter : 46