రాష్ట్రపతి సచివాలయం
తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి
Posted On:
23 AUG 2024 1:31PM by PIB Hyderabad
తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవం (2024 ఆగస్టు 23) నేపథ్యంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఇవాళ భారత్ మండపంలో వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగంలో భాగంగా ఇదే రోజున చంద్రుని ఉపరితలంపై ‘విక్రమ్’ ల్యాండర్ విజయవంతంగా పాదం మోపింది. ఈ సందర్భాన్ని స్మరించుకుంటూ ఏటా ఆగస్టు 23వ తేదీన ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా నేడు నిర్వహించిన వేడుకలలో ‘రోబోటిక్స్ ఛాలెంజ్’, ‘భారతీయ అంతరిక్ష హ్యాకథాన్’ పోటీల విజేతలకు రాష్ట్రపతి బహుమతి ప్రదానం చేశారు.
అనంతరం ఆమె ప్రసంగిస్తూ- ‘ఇస్రో’ ఆదినుంచీ అభినందనీయ రీతిలో ముందుకు సాగుతున్నదని, అంతరిక్ష రంగంలో అద్భుత విజయాలు సాధించిందని కొనియాడారు. అంతేకాకుండా దేశంలో సామాజిక-ఆర్థిక ప్రగతికి తనవంతుగా ఎనలేని కృషి చేసిందన్నారు. అత్యంత తక్కువ వ్యయం, పరిమిత వనరులతో జాతీయ అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమైన వాటిలో ఒకటిగా నిలిపిందని పేర్కొన్నారు. ఇదంతా అంకితభావంగల శాస్త్రవేత్తల ఘనతేనంటూ వారికి అభినందనలు తెలిపారు. అంతరిక్ష శాస్త్రంలో నిరంతర పురోగమనంతోపాటు అత్యుత్తమ ప్రమాణాలను కూడా భారత్ సృష్టించగలదని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
అంతరిక్ష రంగంలో భారత్ అద్భుత విజయాలతో అసాధారణ ప్రగతి సాధించిందని రాష్ట్రపతి అన్నారు. అంగారక గ్రహానికి ప్రయోగాన్ని పరిమిత వనరులతో విజయవంతం చేసిందని, ఒకే రాకెట్ ప్రయోగంతో వందకుపైగా ఉపగ్రహాలను వాటి నిర్దేశిత కక్ష్యలో నిలిపిందని గుర్తుచేశారు.
అంతరిక్ష పరిశోధనలు మానవాళి సామర్థ్యాన్ని ఇనుమడింపజేసి, ఊహలను వాస్తవంగా మార్చాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. అయితే, ఇది సులభ సాధ్యమేమీ కాదని, పెను సవాళ్ల కూడుకున్నదని చెప్పారు. వివిధ ప్రయోగాల సమయంలో సమస్యలను అధిగమించే దిశగా నిర్వహించిన పరిశోధనలు శాస్త్ర విజ్ఞాన ప్రగతిని వేగిరపరుస్తాయని రాష్ట్రపతి అన్నారు. తద్వారా మానవ జీవన సౌలభ్యం మరింత మెరుగుపడుతుందని చెప్పారు. అంతరిక్ష రంగ పురోగమనంతో ఆరోగ్యం-ఔషధం, రవాణా, భద్రత, ఇంధనం, పర్యావరణం, సమాచార సాంకేతికతతో సహా అనేక రంగాలు ప్రయోజనం పొందాయన్నారు.
అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని అనుమతించడంతో అంకుర సంస్థల సంఖ్య అమిత వేగంగా పెరిగిందని రాష్ట్రపతి అన్నారు. దీనివల్ల అంతరిక్ష పరిశోధనలు మరింత ముందంజ వేస్తాయన్నారు. అంతేగాక మన యువతరం తమ ప్రతిభను ప్రదర్శించడంతోపాటు మరింత పదును పెట్టుకునేలా కొత్త అవకాశాలు అందివచ్చాయని చెప్పారు. యువ ప్రతిభా ప్రదర్శనలో భాగంగా కొన్ని నెలల కిందట ఒక భారతీయ కంపెనీ ‘‘సింగిల్-పీస్ 3డి ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్’ చోదక రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించి, ఈ విభాగంలో తొలి విజయం నమోదం చేసిందని ఆమె హర్షం ప్రకటించారు.
అంతరిక్షానికి సంబంధించి భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి అన్నారు. ముఖ్యంగా అంతరిక్ష వ్యర్థాలు వల్ల అనేక సమస్యలు ఎదురయ్యే ముప్పు ఉందన్నారు. అంతరిక్ష పరిశోధన కార్యకలాపాలలో నిరంతర పురోగతికి భరోసా ఇస్తున్న ‘‘ఇస్రో సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టైనబుల్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్’’ సదుపాయాన్ని ఆమె కొనియాడారు. భారత్ 2030 నాటికి తన అంతరిక్ష యాత్రలన్నింటినీ అవశేష రహితంగా మార్చే దిశగా పురోగమిస్తుండటంపై ఆమె హర్షం వెలిబుచ్చారు.
***
(Release ID: 2048387)
Visitor Counter : 150
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam