ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023-24 ఆర్థిక సంవత్సరంలో లక్షకు పైగా పేటెంట్ల మంజూరు


2023-24 ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షలు దాటిన గుర్తింపు పొందిన స్టార్టప్ ల సంఖ్య

టైర్ 2, టైర్ 3 నగరాల్లో 45 శాతం స్టార్టప్ లు

భారతీయ పరిశ్రమలో శాస్త్రీయ పరిశోధనకు మార్గనిర్దేశం చేయనున్న అనుసంధాన్ జాతీయ పరిశోధన సంస్థ (ఏఎన్ఆర్ఎఫ్): సర్వే

Posted On: 22 JUL 2024 2:33PM by PIB Hyderabad

పేటెంట్లు, స్టార్టప్ లు శరవేగంగా పెరగడం దేశంలో ఆర్థికాభివృద్ధికి తోడ్పడిన విజ్ఞానం, ఆవిష్కరణలకు నిదర్శనం. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక సర్వే, సమగ్ర ఆవిష్కరణ ఆధారిత పారిశ్రామిక వ్యవస్థకు బలమైన ఉదాహరణలను అందిస్తోంది.

అంతర్జాతీయ ఆవిష్కరణ సూచీలో భారత స్థిరమైన మెరుగుదలకు నిదర్శనంగా ఇటీవలి సంవత్సరాలలో పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధిలో పురోగతి ఉందని సర్వే పేర్కొన్నది. దేశీయ మార్కెట్ స్కేల్ ఇండెక్స్ సూచకాల్లో అంతర్జాతీయంగా భారత్ అగ్రస్థానంలో ఉంది. 2014-15లో 5,978గా ఉన్న పేటెంట్ల సంఖ్య 2023-24 నాటికి పదిహేడు రెట్లు పెరిగి 1,03,057కు చేరుకుందని సర్వే పేర్కొంది. 2014-15లో నమోదైన డిజైన్లు 7,147 ఉండగా, 2023-24 నాటికి 30,672కు పెరిగాయి. 2023-28లో రూ.50,000 కోట్ల అంచనా వ్యయంతో, భారతీయ పరిశ్రమలో శాస్త్రీయ పరిశోధనలకు ఉన్నత స్థాయి వ్యూహాత్మక దిశానిర్దేశం చేసే అత్యున్నత సంస్థగా అనుసంధాన్ జాతీయ పరిశోధన సంస్థను (ఏఎన్ఆర్ఎఫ్) ఏర్పాటు చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కూడా సర్వే చెప్పింది.

భారతదేశ శక్తిమంతమైన స్టార్టప్ వ్యవస్థను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి 45 శాతానికి పైగా స్టార్టప్ లు పుట్టుకొచ్చాయని, 2016లో 300గా ఉన్న డీపీఐఐటీ గుర్తింపు పొందిన స్టార్టప్ ల సంఖ్య 2024 మార్చి నాటికి 1.25 లక్షలకు పెరిగిందని సర్వే పేర్కొంది. వీటిలో 13,000కు పైగా స్టార్టప్ లు కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, నానోటెక్నాలజీ వంటి విభిన్న రంగాలకు చెందినవని సర్వే తెలిపింది. 2016 నుంచి 2024 మార్చి వరకు 12,000కు పైగా పేటెంట్ దరఖాస్తులను స్టార్టప్ లు దాఖలు చేశాయని, భారత స్టార్టప్ లు దేశంలో ఆవిష్కరణల్లో ముందంజలో ఉన్నాయని ఆర్థిక సర్వే ప్రస్తావించింది. సర్వే ప్రకారం, 135 ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు 2024 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి స్టార్టప్ లలో రూ.18,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. ఇదిలా ఉండగా, స్టార్టప్ రంగంలోని విభిన్న భాగస్వాములను భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ ఏకతాటిపైకి తెస్తోంది.

***


(Release ID: 2035460) Visitor Counter : 204