ప్రధాన మంత్రి కార్యాలయం

న్యూఢిల్లీలోని భారత మండపంలో భగవాన్ మహావీర్ 2550వ నిర్వాణ మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగ పాఠం

Posted On: 21 APR 2024 12:52PM by PIB Hyderabad

జై జినేంద్ర... జై జినేంద్ర... జై జినేంద్ర!

గౌరవనీయ శ్రీ ప్రజ్ఞాసాగర్జీ మునిరాజ్, గౌరవనీయ ఉపాధ్యాయ్ శ్రీ రవీంద్ర మునిజీ మహారాజ్ సాహిబ్, గౌరవనీయ సాధ్వి శ్రీ సులక్షణశ్రీజీ మహారాజ్ సాహిబ్, గౌరవనీయ సాధ్వి శ్రీ అణిమశ్రీజీ మహారాజ్ సాహిబ్, ప్రభుత్వంలోని నా సహచరులైన అర్జున్ రామ్ మేఘ్వాల్ జీ,  శ్రీమతి మీనాక్షి లేఖి జీ, గౌరవనీయ సాధువులు... సోదరసోదరీమణులారా!

   గవాన్ మహావీర్ 2550వ నిర్వాణ మహోత్సవాల ప్రారంభానికి ఈ అద్భుత భారత మండపం నేడు సాక్ష్యంగా నిలుస్తోంది. విద్యార్థి మిత్రులు రూపొందించిన భగవాన్ మహావీర్ జీవిత సమగ్ర చిత్రణను మనం ఇప్పుడే చూశాం! దీంతోపాటు మన యువ సహచరులు ‘వర్తమానంలో వర్ధమానుడు’ పేరిట సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ప్రదర్శించారు. అనాదిగా వస్తున్న మన విలువలతోపాటు భగవాన్ మహావీరునిపై యువతరానికిగల ఈ ఆసక్తి, అంకితభావం హర్షణీయం. దీన్నిబట్టి దేశం సరైన దిశలోనే పయనిస్తోందన్న విశ్వాసం కలుగుతుంది. ఈ చారిత్రక సందర్భంలో నేను ప్రత్యేక తపాలా బిళ్లలు-నాణాలను ఆవిష్కరించడం కూడా ఒక విశేషం. ఈ కార్యక్రమ నిర్వహణ ముఖ్యంగా మన జైన సాధువులు-సాధ్విల మార్గదర్శకత్వం, ఆశీర్వాదాలతోనే సాధ్యమైంది. అందుకే వారందరికీ నా నమస్కారం. ఈ పవిత్ర మహావీర్ జయంతి నేపథ్యంలో దేశ పౌరులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్నికల హడావుడి నడుమన ఇలాంటి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం హృదయానికి ఎంతో ఉపశమనం కలిగిస్తుందన్న వాస్తవం మీకందరికీ తెలిసిందే. గౌరవనీయ సాధువులారా! ఈ కార్యక్రమంలో భాగంగా మహనీయుడైన 108వ ఆధ్యాత్మిక గురువు ఆచార్య శ్రీ విద్యాసాగర్‌జీ మహారాజ్‌ని స్మరించుకోవడం నాకెంతో సహజం. ఛత్తీస్‌గఢ్‌లోని చంద్రగిరి ఆలయంలో నిరుడు ఆయనను కలిసే అవకాశం నాకు లభించింది. నేడు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశీర్వాదాలు మనందరికీ కచ్చితంగా ఉంటాయి.

మిత్రులారా!

   భగవాన్ మహావీరుని ఈ 2550వ నిర్వాణ మహోత్సవం వేలాది ఏళ్ల అరుదైన సందర్భం. ఇటువంటి సమయాలు సహజంగానే అనేక ప్రత్యేక యాదృచ్ఛిక సంఘటనలను కూడా వెంట తీసుకొస్తాయి. ఆ మేరకు ప్రస్తుత సమయాన భారత ‘అమృత కాలం’ ప్రారంభ దశలో ఉంది. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్యం శతాబ్ది సంవత్సరాన్ని స్వర్ణ శతాబ్ద ఉత్సవ సమయంగా మార్చేందుకు దేశం కృషి చేస్తోంది. అలాగే ఈ ఏడాదిలోనే మన రాజ్యాంగ 75 వార్షికోత్సవం కూడా సమీపిస్తోంది. అంతేగాక దేశంలో నేడు ప్రజాస్వామ్య మహోత్సవమైన సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి నవ్య భవిష్యత్ పయనం ప్రారంభం కాగలదని దేశం విశ్వసిస్తోంది. ఇన్ని యాదృచ్ఛిక వాస్తవాల నడుమ ఇవాళ మనమంతా ఈ భారత మండపంలో సమీకృతం కావడం విశేషం. ఇలా మనమంతా ఒక ప్రదేశంలో కలుసుకోవడంలోని ప్రత్యేకత ఏమిటో మీకిప్పుడు అర్థమైందని భావిస్తున్నాను. మీ అందరితో నా సాన్నిహిత్యం ఏనాటినుంచో కొనసాగుతున్నదే. అయినా, ప్రతి ఒక్కరికీ తమదైన ప్రపంచం ఒకటి ఉంటుంది.

సోదరసోదరీమణులారా!

   దేశం కోసం ‘అమృత కాలం’ అనే భావన కేవలం గొప్ప సంకల్పానికి పరిమితం కాబోదు; అమరత్వం, శాశ్వతత్వం నిత్యసత్యాలని భారత ఆధ్యాత్మిక స్ఫూర్తి మనకు నేర్పుతుంది. కాబట్టే 2500 ఏళ్ల తర్వాత కూడా మనం నేడు భగవాన్ మహావీర్ నిర్వాణోత్సవం నిర్వహించుకుంటున్నాం. అంతేకాదు... మరికొన్ని వేల ఏళ్లు కూడా ఈ దేశం మహావీరునితో ముడిపడి ఉంటుందని, ఇలాంటి ఉత్సవాలను నిర్వహించుకుంటూనే ఉంటుందని మనకు తెలుసు. శతాబ్దాలు, సహస్రాబ్దాల దూరదృష్టి  సామర్థ్యం... ఈ దార్శనికత, భవిష్యత్ దృక్పథం భారత్ సొంతం. కాబట్టే ప్రపంచ ప్రాచీన జీవన నాగరికతకు మాత్రమేగాక మానవత్వానికీ భారత దేశం సురక్షిత స్వర్గధామం. ‘తన’ అని కాకుండా ‘మన’ కోసం ఆలోచించేదే భారతదేశమంటే... ఈ భారతం కేవలం ‘సొంతం’ అనుకోదు.. ‘సార్వత్రికం’  అనుకుంటుంది. ఇది ‘నేను’ అని కాకుండా ‘మనం’ అని భావించే భారత దేశమిది. ఈ భారతం ‘హద్దు’ను కాకుండా ‘అనంతం’పై విశ్వాసం ఉంచుతుంది. ఈ భారతం విధానం గురించి మాట్లాడుతుంది... ‘నేతి’ (ఇది) ‘నేతి’ (అది) కానిదే బ్రహ్మం అని సిద్ధాంతీకరిస్తుంది. ఇది అణువులో విశ్వం గురించి మాట్లాడే భారతం... విశ్వంలో దివ్యత్వం గురించి మాట్లాడుతుంది.. ఆత్మలో శివుడి గురించి చర్చిస్తుంది!

మిత్రులారా!

   ప్రతి యుగంలోనూ అవసరాలకు తగినట్లు కొత్త సిద్ధాంతాలు ఉద్భవిస్తాయి. అయితే, సిద్ధాంత స్తబ్దత ఫలితంగా ఆలోచనలు వాదాలుగా... వాదాలు ఘర్షణలుగా మారుతాయి. కానీ, ఘర్షణ నుంచి అమృతం ఆవిర్భవించినపుడు, మనం దాని తోడ్పాటుతో సాగుతున్నపుడు పునరుజ్జీవనం వైపు ముందుకెళ్తాం. అయితే, ఘర్షణ నుంచి హాలాహలం (విషం) ఉద్భవిస్తే మనం అనుక్షణం విధ్వంస బీజాలు నాటుతాం. స్వాతంత్ర్యం వచ్చాక మనం 75 ఏళ్లదాకా మనం వాదించుకున్నాం... చర్చించుకున్నాం... సంభాషించుకున్నాం. కానీ, ఈ 75 సంవత్సరాల తర్వాత మథనం తర్వాత ఉద్భవించిన అమృత సేవనం చేస్తూ హాలాహలాన్ని విసర్జించడం, ప్రస్తుత ‘అమృత’ యుగంలో జీవించడం నేటి మన బాధ్యత. ప్రపంచవ్యాప్త సంఘర్షణల నడుమ అనేక దేశాలు యుద్ధాలతో డస్సిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో మన తీర్థంకరుల ప్రబోధాలు మరింత ప్రాధాన్యం ఉంది. వాద-వివాదాలు సంఘర్షణల నుంచి మానవాళిని కాపాడటం కోసమే ‘అనేకాంతవాదం’, ‘శ్యాదవాదం’ వంటి తత్త్వాలను మనకు అందించారు. ‘అనేకాంతవాదం’ అంటే- ఒక విషయంలోని బహుళాంశాలను అవగతం చేసుకోవడం. తద్వారా ఇతరుల దృక్పథాన్ని గ్రహించి, అంగీకరించడానికి సిద్ధం కావడం. విశ్వాసానికి సంబంధించి ఇలాంటి స్వేచ్ఛాయుత వ్యాఖ్యానం భారతదేశ వైశిష్ట్యం. ఇది భారతదేశం ప్రపంచానికి అందించిన మానవతా సందేశం.

మిత్రులారా!

   నేటి సంఘర్షణల నడుమ ప్రపంచం యావత్తూ ఇప్పుడు శాంతికోసం భారత్ వైపు దృష్టి సారిస్తోంది. నవ భారతం పోషిస్తున్న ఈ కొత్త పాత్ర ఘనత మొత్తం ఇనుమడిస్తున్న మన సామర్థ్యాలు, విదేశాంగ విధానానికే చెందుతుందని చెప్పవచ్చు. అయితే, మన సాంస్కృతిక నేపథ్యమే ఇందుకు గణనీయ తోడ్పాటునిస్తున్నదని నేను ఘంటాపథంగా మీకు చెబుతున్నాను. ఇవాళ భారత్ ఈ విలక్షణ పాత్రను పోషిస్తున్నదంటే- ప్రపంచ వేదికలపై సత్యం-అహింస వంటి సూత్రాలను మనం సంపూర్ణ విశ్వాసంతో నిలబెట్టుకోవడమే కారణం. ప్రపంచ సంక్షోభాలు-సంఘర్షణలకు పరిష్కారం భారత ప్రాచీన సంస్కృతి- సంప్రదాయాల్లో ఉన్నదని మనం ప్రపంచానికి చాటుతున్నాం. కాబట్టే విభజిత ప్రపంచానికి ‘విశ్వబంధు’ (ప్రపంచ మిత్రుడు)గా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. ‘వాతావరణ మార్పు’ వంటి సంక్షోభాలకు పరిష్కారం లక్ష్యంగా భారత్ నేడు ‘మిషన్ లైఫ్’ వంటి వినూత్న ప్రపంచ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అలాగే ‘ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు’ పేరిట దార్శనిక మార్గాన్ని ప్రపంచానికి చూపింది. అంతేగాక పరిశుభ్ర ఇంధనం, సుస్థిర ప్రగతి దిశగా ‘ఒకే ప్రపంచం-ఒకే సూర్యుడు-ఒకే గ్రిడ్’ పేరిట భవిష్యత్ ప్రణాళికను కూడా మనం ఇవాళ ప్రపంచానికి అందించాం. ఈ విధంగా మనం ఇవాళ ‘అంతర్జాతీయ సౌర కూటమి’ (ఐఎస్ఎ) వంటి భవిష్యత్ ప్రపంచ కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నాం. ఇలా ఒకవైపు మన కృషి ప్రపంచం ఆశలను చిగురింపజేస్తుండగా, మరోవైపు భారత ప్రాచీన సంస్కృతిపై ప్రపంచ దృక్పథంలోనూ మార్పు స్పష్టమవుతోంది.

మిత్రులారా!

   జైనమత సారాంశం విజయానికి... అంటే- ఆత్మనిగ్రహ మార్గం. తదనుగుణంగానే ఇతర దేశాలను జయించాలంటే మనం ఏనాడూ దూకుడు విధానాలను ఆశ్రయించలేదు. స్వీయ సంస్కరణ, లోపాలను అధిగమించడం ద్వారా మనం విజయం సాధించాం. అంటే... ప్రతి యుగంలోనూ కొందరు రుషులు, మహనీయులు ప్రతి యుగంలోనూ క్లిష్ట సమయాల్లో మనకు దిశానిర్దేశం చేశారు. కాబట్టే ఎంతో ఘనత వహించిన నాగరికతలు నాశనమైనా, భారతదేశం మాత్రం తనదైన మార్గంలో ముందుకు వెళ్తూనే ఉంది.

సోదరసోదరీమణులారా!

   ఓ దశాబ్దం కిందట మన దేశంలో ఎలాంటి వాతావరణం ఉండేదో మీరు గుర్తుకు తెచ్చుకోవాలి. ఆనాడు ఎటుచూసినా పటు నిరాశ-నిస్సహాయతలే రాజ్యమేలుతున్నాయి! ఈ దేశానికి ఏ మేలూ జరగదన్న నమ్మకమే ఎల్లెడలా కనిపించేది! ఈ నిరాశ అదే స్థాయిలో భారతీయ సంస్కృతిని కూడా చుట్టుముట్టింది. అటువంటి దుస్థితి నడుమ 2014 తర్వాత ప్రత్యక్ష ప్రగతితోపాటు మన వారసత్వం పట్ల గర్వించే విధంగా కృషి చేయాలని మేం సంకల్పించాం. తదనుగుణంగా ఇవాళ మనం భగవాన్ మహావీర్ 2550వ నిర్వాణ మహోత్సవానికి శ్రీకారం చుట్టాం. గడచిన పదేళ్లలో ఇలాంటి అనేక కీలక సందర్భాలలో మనం వేడుకలు చేసుకున్నాం. మన జైన ఆచార్యులు నన్ను ఆహ్వానించినప్పుడల్లా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడానికే నేను సదా ప్రయత్నించాను. పార్లమెంటు కొత్త భవనంలోకి అడుగుపెట్టే ముందు కూడా ‘మిచ్ఛామి దుకడమ్’ సూత్రాన్ని ప్రస్తావించడం ద్వరా ఈ విలువలను నేను గుర్తుచేశాను. అదేవిధంగా మన వారసత్వ పరిరక్షణ కృషిని కూడా ప్రారంభించాం. మనం యోగా, ఆయుర్వేదం గురించి చెబుతున్నాం. ఇవాళ నవభారతంలోని నవతరం మన గుర్తింపు మనకు గర్వకారణమని విశ్వసిస్తోంది. ఈ భావన దేశంలో మేల్కొన్న నేపథ్యంలో దాన్నిక నిలువరించడం ఎవరికీ సాధ్యం కాదు. భారతదేశ పురోగమనమే దీనికి నిదర్శనం.

మిత్రులారా!

   భారతేశానికి ఆధునికత శరీరమైతే, ఆధ్యాత్మికత దాని ఆత్మ. ఆధునికత నుంచి ఆధ్యాత్మికతను దూరం చేస్తే అది అన్యాయం ఆవిర్బావానికి దారితీస్తుంది. ప్రవర్తనలో త్యాగం లేనపుడు ఘనమైన భావజాలం కూడా వక్రీకరణకు గురవుతుంది. భగవాన్ మహావీర్ శతాబ్దాల కిందట మనకు ప్రబోధించిన దృక్పథమిది. సమాజంలో ఈ విలువల పునరుద్ధరణ నేటి తక్షణావసరం.

సోదరసోదరీమణులారా!

   మన దేశం దశాబ్దాలుగా ఎంతో అవినీతి వేదనను కూడా భరించింది. పేదరికం వల్ల కలిగే దుర్భర వేదనలు కూడా మన అనుభవంలోనివే. అయితే, నేడు 25 కోట్ల మందిని మనం పేదరికం నుంచి విముక్తులను చేసే స్థితికి చేరాం. ‘ఇదే తరుణం.. సముచిత తరుణం.. ఇంతకు మించిన తరుణం రాదు’ అంటూ నేను ఎర్రకోట నుంచి చెప్పిన మాటలు మీకు గుర్తుండే ఉంటాయి. పూజ్య మహారాజ్ కూడా ఇదే మాటలను పునరుద్ఘాటించారు- ఆ మేరకు ‘అస్తేయ’ ‘అహింస’ ఆదర్శాల బలోపేతానికి ఇదే సరైన సమయం. ఈ దిశగా దేశం తన కృషిని కొనసాగిస్తుందని నేను ఇక్కడి సాధువులందరికీ హామీ ఇస్తున్నాను. భవిష్యత్ భారత నిర్మాణ పయనంలో మీ మద్దతు దేశం ఆకాంక్షలను బలోపేతం చేస్తుందని, దేశం ‘వికసిత’ (సుసంపన్న) భారతం కాగలదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.

   భగవాన్ మహావీరుని ఆశీర్వాదం 140 కోట్ల మందది పౌరులతోపాటు యావత్ మానవాళి సంక్షేమానికి భరోసా ఇస్తుంది. ఈ నేపథ్యంలో నేను గౌరవనీయ సాధువులందరికీ సగౌరవ ప్రణామాలు అర్పిస్తున్నాను. ఒక విధంగా- వారి ప్రసంగాల్లో ఎన్నో ఆణిముత్యాలున్నాయి. అది మహిళా సాధికారత కావచ్చు.. ప్రగతి పయనం కావచ్చు లేదా గొప్ప సంప్రదాయాలు కావచ్చు...  గౌరవనీయ సాధువులంతా ప్రస్తుత వ్యవస్థలలో జరుగుతున్నదేమిటో, ఇంకా ఏమి అవసరమో చాలా స్వల్ప సమయంలో, అద్భుత రీతిలో వివరించారు. అందుకే నేను వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, వారి ప్రతి పలుకునూ ఒక ఆశీర్వాదంగా స్వీకరిస్తున్నాను. ఆ పలుకులు నాకు అమూల్య నిధులు.. ప్రతి పదమూ దేశానికి స్ఫూర్తిదాయకం... ఇది నా నమ్మకం. బహుశా ఇప్పుడు ఎన్నికల వాతావరణం కాని పక్షంలో నా మనోభావనలు మరోవిధంగా ఉండేవి. ఏదిఏమైనా, ఆ విషయాలను పక్కకునెట్టి, ఇక్కడకు రావడం కోసం నేను అన్నివిధాలా ప్రయత్నించాను. ఆ విషయాలను నేనిక్కడి తీసుకురాలేదేమోగానీ, మీరు మాత్రం కచ్చితంగా వాటిని తీసుకొచ్చారు. వీటన్నిటికీ అతీతంగా ఆ వేడినుంచి బయటపడటానికి ఆలస్యం చేయకండి. ఉదయాన్నే ఇంటినుంచి బయటకు రండి... మన సాధువులు, మహంతులు, దివ్యజనంతో, తామర పుష్పంతో మీకందరికీ ప్రత్యక్ష సంబంధం ఉంది. ఇవాళ మీ అందరి మధ్యన ఉన్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఇదే  మనోభావంతో మరోసారి భగవాన్ మహావీరుని పాదాలకు ప్రణమిల్లుతున్నాను. సాధువులందరికీ నమస్కరిస్తున్నాను. చాలాచాలా ధన్యవాదాలు!

 

బాధ్యత నిరాకరణ ప్రకటన: ప్రధానమంత్రి హిందీ భాషలో ప్రసంగించారు. ఆ ప్రసంగానికి ఇది సామీప్య తెలుగు అనువాదం.

***



(Release ID: 2018553) Visitor Counter : 49