గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

జల దీపావళి - "మహిళల కోసం నీరు, నీటి కోసం మహిళలు" కార్యక్రమం


జల నిర్వహణలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యం

ఈ ప్రచారంలో భాగంగా 550కి పైగా నీటి శుద్ధి కేంద్రాలను పరిశీలించనున్న మహిళా స్వయం సహాయక సంఘాలు

Posted On: 06 NOV 2023 11:57AM by PIB Hyderabad

కేంద్ర గృహ నిర్మాణం & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‍‌(ఎంవోహెచ్‌యూఏ), తన ప్రధాన పథకమైన 'అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్' (అమృత్) కింద, "మహిళల కోసం నీరు, నీటి కోసం మహిళలు" అనే ప్రచారాన్ని ప్రారంభించబోతోంది. మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్‌' (ఎన్‌యూఎల్‌ఎం) భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఒడిశా అర్బన్ అకాడమీ ఈ కార్యక్రమానికి విజ్ఞాన భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ప్రచారంలో భాగంగా "జల దీపావళి" నిర్వహిస్తారు. ఇది నవంబర్ 7న ప్రారంభమై నవంబర్ 9న వరకు కొనసాగుతుంది.

 

 

జల నిర్వహణలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఒక వేదికను అందించడం ఈ ప్రచారం లక్ష్యం. ఈ ప్రచారంలో భాగంగా, తమ సొంత నగరాల్లోని నీటి శుద్ధి కేంద్రాలను మహిళలు పరిశీలిస్తారు, నీటి శుద్ధి ప్రక్రియల గురించి ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. ఈ సందర్శనల ద్వారా, ఇంటింటికీ పరిశుభ్రమైన & సురక్షితమైన తాగునీటిని అందించేందుకు అవసరమైన విధానాలపై వారికి ఒక అవగాహన వస్తుంది. దీంతోపాటు, నీటి నాణ్యత పరీక్ష విధానాలను కూడా మహిళలు తెలుసుకుంటారు. తద్వారా, నాణ్యమైన నీటిని పొందేలా వారిని ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది. నీటి మౌలిక సదుపాయాల పట్ల మహిళల యాజమాన్యాన్ని, నీరు మా సొంతం అనే భావనను పెంచడం ఈ ప్రచారం ప్రధాన లక్ష్యం.

మన దేశంలో 65,000 ఎల్‌ఎండీ పైగా నీటి శుద్ధి సామర్థ్యంతో 3,000కు పైగా నీటి శుద్ధి కేంద్రాలు ఉన్నాయి, ప్రస్తుతం 55,000 ఎల్‌ఎండీ పైగా సామర్థ్యంతో పని చేస్తున్నాయి. ఈ ప్రచారంలో భాగంగా, మహిళా స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీలు) 20,000 ఎల్‌ఎండీకి పైగా (దేశం మొత్తం సామర్థ్యంలో 35%కు పైగా) సామర్థ్యం ఉన్న 550కు పైగా నీటి శుద్ధి కేంద్రాలను సందర్శిస్తాయి.

జల శుద్ధి పద్ధతుల గురించి మహిళలకు అవగాహన & సాధికారత కల్పించడం ద్వారా, తమ ఇళ్లలో సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీరు ఉండేలా చూసుకునే సామర్థ్యాన్ని వారిలో పెంచడాన్ని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అనాదిగా పురుషులు ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ రంగంలో మహిళ పాత్రను పెంచడం ద్వారా లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం కూడా ప్రచారం లక్ష్యం.

 "మహిళల కోసం నీరు, నీటి కోసం మహిళలు" కార్యక్రమం మొదటి దశ అయిన "జల దీపావళి"లో, దేశంలోని అన్ని రాష్ట్రాలు/యూటీల (ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలు మినహా) నుంచి 15,000కు పైగా ఎస్‌హెచ్‌జీ మహిళలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ ప్రచారం ముఖ్యాంశాలు ఇవి:

  1. నీటి శుద్ధి కేంద్రాలు & నీటి పరీక్ష సౌకర్యాల పనితీరుపై మహిళలకు అవగాహన కల్పించడం
  2. మహిళా స్వయం సహాయక సంఘాలు రూపొందించిన సావనీర్లు & కథనాల ద్వారా మహిళ ప్రమేయాన్ని ప్రోత్సహించడం
  3. అమృత్ పథకం, నీటి మౌలిక సదుపాయాలపై దాని ప్రభావం గురించి మహిళలకు అవగాహన కల్పించడం

నీటి శుద్ధిపై మహిళల్లో అవగాహన పెంచడం, యాజమాన్య భావన & బాధ్యత, మహిళల పాత్రను ప్రోత్సహించడం, ఎస్‌హెచ్‌జీల సాధికారత, సానుకూల సమాజ ప్రభావం, భవిష్యత్‌ కార్యక్రమాలకు నమూనాగా ఉండడం వంటివి ఈ ప్రచారం ద్వారా ఆశిస్తున్న ఫలితాల్లో ఉన్నాయి.

అమృత్‌, ఎన్‌యూఎల్‌ఎంకు చెందిన రాష్ట్ర, నగర అధికారులు డబ్ల్యూటీపీలను గుర్తించడం ద్వారా మహిళల సందర్శనలను సులభంగా మారుస్తారు. అమృత్ కింద నడిచే జల మౌలిక సదుపాయాల ప్రదేశాల్లోకి మహిళలను తీసుకువెళ్లడం ద్వారా ఈ ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని రాష్ట్ర, నగర అధికారులకు మంత్రిత్వ శాఖ సూచించింది.

 

***



(Release ID: 1975086) Visitor Counter : 70