ప్రధాన మంత్రి కార్యాలయం

ఉపాధి సమ్మేళనంలో 51,000కుపైగా నియామక లేఖలు పంపిణీ చేసిన ప్రధానమంత్రి


“ఈ ‘అమృత కాలం’లో మీరంతా ‘అమృత రక్షకులు”;

“కొన్నేళ్లుగా అర్థ-సైనిక బలగాల నియామక
ప్రక్రియలో మేం ఎన్నో కీలక మార్పులు చేశాం”;

“శాంతిభద్రతల ద్వారా ఏర్పడే సురక్షిత
వాతావరణం ప్రగతిని వేగిరం చేస్తుంది”;

“గడచిన తొమ్మిదేళ్లుగా మార్పులో కొత్త దశ సుస్పష్టం”;

“తొమ్మిదేళ్ల కిందట ఇదే రోజున ప్రారంభించిన జన్‌ధన్ యోజన
గ్రామాలు-పేదల ఆర్థిక సాధికారతలో కీలక పాత్ర పోషించింది”;

“దేశంలో సామాజిక-ఆర్థిక మార్పులు వేగిరం చేయడంలో జన్‌ధన్
యోజన పోషించిన పాత్ర నిస్సందేహంగా అధ్యయనం చేయదగినదే”;

“ప్రభుత్వం.. పాలనలో మార్పు తేవాలనే నా లక్ష్యానికి బలం మీ యువతరమే”

Posted On: 28 AUG 2023 11:58AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కొత్తగా ఉద్యోగాలు పొందిన 51,000 మందికిపైగా యువతకు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా నియామక లేఖలు పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా 45 చోట్ల నిర్వహించిన ఉపాధి సమ్మేళనం కింద తన పరిధిలోని కేంద్ర సాయుధ బలగాల (సిఎపిఎఫ్‌) కోసం దేశీయాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ వీరిని ఎంపిక చేసింది. తదనుగుణంగా వీరంతా కేంద్ర రిజర్వు పోలీసు దళం (సిఆర్‌పిఎఫ్‌), సరిహద్దు భద్రత దళం (బిఎస్‌ఎఫ్‌), సాయుధ సరిహద్దు భద్రత దళం (ఎస్‌ఎస్‌బి), అస్సాం రైఫిల్స్, కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సిఐఎస్‌ఎఫ్‌), ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు దళం (ఐటిబిపి), మాదక ద్రవ్య నిరోధం-నియంత్రణ సంస్థ (ఎన్‌సిబి), ఢిల్లీ పోలీసు విభాగాల్లో వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఆయా సంస్థలలో సబ్-ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ (సాధారణ విధులు); సహా సాధారణేతర విధులు నిర్వర్తించాల్సిన బాధ్యతలలో చేరుతారు.

   నియామక లేఖల పంపిణీకి శ్రీకారం చుట్టాక ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- ఉద్యోగ బాధ్యతలు స్వీకరించబోయే యువతకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని ‘అమృతకాల’ ‘అమృత రక్షకులు’గా ఆయన అభివర్ణించారు. దేశ సేవతోపాటు పౌరులకు రక్షణ కల్పిస్తారు కాబట్టే వారిని ‘అమృత రక్షకులు’గా తాను పిలురిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రయాన్-3, ‘ప్రజ్ఞాన్’ రోవర్ చంద్రుని తాజా చిత్రాలను నిరంతరం పంపుతున్నాయని ప్రధాని గుర్తుచేశారు. దేశమంతా దీనిపై సగర్వంగా, ఆత్మవిశ్వాసంతో ఉప్పొంగుతున్న వేళ ప్రస్తుత ఉపాధి సమ్మేళనం నిర్వహించడం ముదావహమని ప్రధాని నొక్కిచెప్పారు. ఈ ప్రతిష్టాత్మక తరుణంలో తమ జీవితంలో అత్యంత కీలక అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న ఈ యువతరంతోపాటు వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

   క్షణ/భద్రత లేదా పోలీసు బలగాల్లోకి ఎంపిక ద్వారా నిర్వర్తించాల్సిన బాధ్యతల ప్రాధాన్యాన్ని ఈ సందర్భంగా ప్రధాని నొక్కిచెప్పారు. అందుకు తగినట్లు ఆయా బలగాల అవసరాల విషయంలో ప్రభుత్వం ఎంతో శ్రద్ధ వహిస్తున్నదని తెలిపారు. మరో్వైపు అర్థసైనిక బలగాల నియామక ప్రక్రియలో పెనుమార్పులు తెచ్చామని ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు దరఖాస్తు నుంచి తుది ఎంపికదాకా ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. అయితే, మునుపటిలా హిందీ/ఆంగ్లంలో మాత్రమే కాకుండా 13 స్థానిక భాషలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సలైట్‌ ప్రభావిత ప్రాంతాల్లో నిబంధనల  సడలింపు వల్ల వందలాది గిరిజన యువత ఎంపిక కావడాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే సరిహద్దు ప్రాంతంతోపాటు ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల యువతకూ ప్రత్యేక కోటా ఇవ్వడాన్ని ఆయన గుర్తుచేశారు.

   దేశ ప్రగతికి భరోసా ఇవ్వడంలో కొత్త సిబ్బంది బాధ్యతలను స్పష్టం చేస్తూ- శాంతిభద్రతల పరిరక్షణ ద్వారా ఏర్పడే సురక్షిత వాతావరణంతో అభివృద్ధి వేగం పుంజుకుంటుందని ప్రధాని వివరించారు. ఈ మేరకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ను ఉదాహరిస్తూ- ఈ రాష్ట్రం ఒకనాడు అభివృద్ధి రీత్యా బాగా వెనుకబడిందన్నారు. అలాగే నేరాల సంఖ్యలోనూ అగ్రస్థానంలో ఉండేదని గుర్తుచేశారు. అయితే, చట్టాల పటిష్ట అమలుద్వారా శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇవ్వడంతో నేడు ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నదని ప్రధాని పేర్కొన్నారు. అంతేకాకుండా భయానికి తావులేని సరికొత్త సమాజం ఏర్పడుతుందని చెప్పారు. “ఈ విధంగా శాంతిభద్రతల నిర్వహణ వల్ల ప్రజలలో నమ్మకం ఇనుమడిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. నేరాల తగ్గుదలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతుండగా నేరాల శాతం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు స్వల్పమేనని, తద్వారా ఉపాధి అవకాశాలు స్తంభించాయని వివరించారు.

   ప్రపంచంలో వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ గుర్తింపు పొందడాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఈ క్రమంలో ప్రస్తుత దశాబ్దంలోనే ప్రపంచంలోని తొలి మూడు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదుగుతుందని పునరుద్ఘాటించారు. “మోదీ అత్యంత బాధ్యతతో  మీకు గట్టి హామీ ఇస్తున్నాడు” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సామాన్య పౌరులపై ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ప్రభావాన్ని వివరిస్తూ- ప్రతి రంగం వృద్ధి సాధించడమే ఆర్థిక వ్యవస్థ వృద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు. మహమ్మారి సమయంలో ఫార్మా పరిశ్రమ పాత్ర గురించి ఆయన ప్రస్తావించారు. నేడు భారత ఫార్మా పరిశ్రమ విలువ దాదాపు రూ.4 లక్షల కోట్లు కాగా, 2030 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరగలదని అంచనా పేర్కొంటున్నట్లు తెలిపారు. ఈ వృద్ధి ఫలితంగా భవిష్యత్తులో ఈ పరిశ్రమకు యువత అవసరం మరింతగా ఉంటుందని, ఆ మేరకు అపార ఉపాధి అవకాశాలు అందివస్తాయని ప్రధానమంత్రి అన్నారు.

   మోటారువాహన తయారీ/విడిభాగాల పరిశ్రమల విస్తరణపై మాట్లాడుతూ- ప్రస్తుతం ఈ రెండు పరిశ్రమల విలువ రూ.12 లక్షల కోట్లకుపైగా ఉందన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఇది మరింత వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ వృద్ధి వేగం కొనసాగాలంటే పరిశ్రమకు మరింత మంది యువత అవసరం కాబట్టి దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన నొక్కి చెప్పారు. ఇక నిరుడు ఆహార తయారీ పరిశ్రమ విలువ దాదాపు రూ.26 లక్షల కోట్లు కాగా, మరో మూడున్నరేళ్లలో అది రూ.35 లక్షల కోట్ల స్థాయికి చేరగలదన్నారు. “ఈ పరిశ్రమ విస్తరణతోనూ ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి” అని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ- గడచిన తొమ్మిదేళ్లలో ప్రభుత్వం ఈ రంగంలో రూ.30 లక్షల కోట్లు వెచ్చించిందని ప్రధాని గుర్తుచేశారు. తద్వారా అనుసంధానంతోపాటు పర్యాటక-ఆతిథ్య రంగాల్లోనూ కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.

   ర్యాటక రంగం 2030 నాటికల్లా 13-14 కోట్ల ఉద్యోగాల సృష్టిద్వారా ఆర్థిక వ్యవస్థకు రూ.20 లక్షల కోట్లకుపైగా సమకూరుస్తుందని అంచనా వేసినట్లు ప్రధాని చెప్పారు. ఇవన్నీ కేవలం గణాంకాలు కాదని, ఈ పరిణామాలన్నీ ఉద్యోగ సృష్టి, జీవన సౌలభ్యం, ఆదాయం పెంపు ద్వారా సామాన్య పౌరుల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయని ఆయన వివరించారు. దేశంలో “గడచిన తొమ్మిదేళ్లుగా సరికొత్త పరివర్తన శకం పరిణతి చెందడాన్ని మనం చూడవచ్చు” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గత ఏడాది భారత ఎగుమతులు కొత్త రికార్డు సృష్టించడం ప్రపంచ మార్కెట్‌లో మన వస్తువులకు పెరిగిన డిమాండ్‌కు సంకేతమని ఆయన అన్నారు. దీనివల్ల ఉత్పత్తి.. ఉపాధితోపాటు తదనుగుణంగా కుటుంబాల ఆదాయం కూడా  పెరిగిందని శ్రీ మోదీ వివరించారు. మొబైల్‌ ఫోన్ల తయారీలో భారత్‌ ప్రపంచంలో రెండో స్థానానికి దూసుకెళ్లిందని, దేశంలోనూ ఫోన్లకు డిమాండ్‌ బాగా పెరిగిందని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ విషయంలో ప్రభుత్వం ప్రశంసనీయ కృషి చేస్తున్నదని చెప్పారు.

    న దేశం ఇప్పుడు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపైనా దృష్టి సారించిందని శ్రీ మోదీ ప్రస్తావించారు. మొబైల్‌ ఫోన్ల రంగంలో విజయంతో పెరిగిన భారత ఆత్మవిశ్వాసం ఐటీ, హార్డ్‌ వేర్ రంగంలోనూ ప్రతిబింబించగలదని ఆయన ఆశాభాగం వ్యక్తం చేశారు. “మేడ్ ఇన్ ఇండియా ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు మనం గర్వపడేలా చేసేరోజు ఎంతో దూరంలో లేదు” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘స్థానికం కోసం స్వగళం’ మంత్రాన్ని ప్రస్తావిస్తూ- దేశీయ తయారీ ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల కొనుగోలుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుండటంతో ఉత్పత్తి,  ఉపాధి కూడా పెరిగాయన్నారు. దేశంలో చోటు చేసుకుంటున్న ఆర్థిక పరిణామాలకు అనువైన సురక్షిత వాతావరణ కల్పనలో కొత్తగా నియమితులైన యువత భుజస్ంధాలపైగల  బాధ్యతను ప్రధాని పునరుద్ఘాటించారు.

   దేశంలో 9 సంవత్సరాల కిందట ఇదేరోజున ‘ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన’కు శ్రీకారం చుట్టడాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. “గ్రామాలు-పేదల ఆర్థిక సాధికారతసహా ఉపాధి కల్పనలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది” అని ఆయన పేర్కొన్నారు. దీనికింద 9 ఏళ్లలో 50 కోట్లకుపైగా బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు తెలిపారు. పేద-అణగారిన ప్రజలకు నేరుగా లబ్ధిని చేరవేయడంలో ఇది ఎంతగానో దోహదం చేసిందన్నారు. అలాగే గిరిజన, దళిత, మహిళా, ఇతర వెనుకబడిన వర్గాల ఉపాధి-స్వయం ఉపాధికి తోడ్పడిందని చెప్పారు. ఈ మేరకు 21 లక్షలకుపైగా యువత బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా, బ్యాంక్ మిత్రలు, బ్యాంకు సేవికలుగా ఉపాధి పొందారని గుర్తుచేశారు.

   న్‌ధన్‌ యోజనతో ముద్ర యోజనల కూడా పటిష్టంగా మారిరందని ప్రధాని చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటిదాకా రూ.24 లక్షల కోట్లకుపైగా హామీరహిత రుణాలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ లబ్ధిదారుల్లో 8 కోట్లమంది తొలిసారి పారిశ్రామికవేత్తలుగా మారారని వివరించారు. అలాగే ‘పిఎం స్వానిధి’ పథకం కింద 45 లక్షలమంది వరకూ వీధి వ్యాపారులకు తొలివిడత పూచీకత్తురహిత రుణం మంజూరు చేయబడిందని పేర్కొన్నారు. ఈ పథకాల లబ్ధిదారులలో గిరిజన, దళిత, మహిళా, వెనుకబడిన వర్గాల యువత అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. జన్‌ధన్‌ ఖాతాలు గ్రామాల్లో మహిళా స్వయం సహాయ సంఘాలను బలోపేతం చేశాయని ప్రధానమంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో “దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక మార్పును వేగిరపరచడంలో జన్‌ధన్ యోజన పోషించిన పాత్ర నిస్సందేహంగా అధ్యయనం చేయదగినదే”నని ఆయన వ్యాఖ్యానించారు.

   నేక ఉపాధి సమ్మేళనాల సందర్భంగా లక్షలాది యువతనుద్దేశించి ప్రసంగించే సమయంలో- వారికి ప్రజా సేవ లేదా ఇతర రంగాలలో ఉపాధి లభించిందని గుర్తు చేసేవాడినని ప్రధానమంత్రి అన్నారు. ఆ మేరకు “ప్రభుత్వం, పాలనలో మార్పు తేవాలనే నా లక్ష్యానికి బలం మీ యువతరమే”నని వ్యాఖ్యానించారు. నేటి యువత కేవలం ఒక క్లిక్‌తో అందుకోగలిగేంత సమీపంలోనే ఉన్నారని చెబుతూ- అందుకు తగినట్లు వేగంగా సేవలందించాల్సిన ఆవశ్యకతను ప్రధాని నొక్కిచెప్పారు. అలాగే నేటి తరం సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలు కాకుండా శాశ్వత మార్గాలను అన్వేషిస్తున్నదని అన్నారు. ఆ మేరకు ప్రభుత్వోద్యోగులుగా నియమితులైన వారు దీర్ఘకాలంలో ప్రజలకు మేలుచేసే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. “మీ తరం ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఉంది తప్ప ఎవరి అనుగ్రహాన్ని ఆశించడం లేదు. తమ మార్గానికి ఎవరూ అడ్డు రాకూడదని మాత్రమే ఆకాంక్షిస్తోంది” అన్నారు. ప్రజా సేవకులుగా వారి ఆకాంక్షలు నెరవేర్చడంలోని ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పారు. వారు ఈ అవగాహనతో విధులు నిర్వర్తిస్తే శాంతిభద్రతల పరిరక్షణలో్ ఎంతో సహకరించినవారు కాగలరని స్పష్టం చేశారు.

   చివరగా- అర్థసైనిక బలగాలు తమ అనుభవాల నుంచి నేర్చుకునే వైఖరిని కొనసాగించాలని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఇందులో భాగంగా ‘ఐగాట్‌ (iGOT) కర్మయోగి పోర్టల్‌లో అందుబాటులోగల 600కుపైగా కోర్సులను ప్రముఖంగా ప్రస్తావించారు. “ఈ పోర్టల్‌లో 20 లక్షలకుపైగా ప్రభుత్వ ఉద్యోగులు నమోదు చేసుకున్నారు. మీరంతా కూడా తప్పనిసరిగా నమోదై, ఈ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను” అని ప్రధాని సూచించారు. ముఖ్యంగా కొత్త ఉద్యోగులంతా తమ జీవితంలో శరీర దృఢత్వంపైనా, రోజువారీ యోగాభ్యాస్యంమీదా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతయినా ఉందంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

నేపథ్యం

   కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ఢిల్లీ పోలీసు విభాగం బలోపేతం ద్వారా దేశ అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధం, తిరుగుబాట్లు-వామపక్ష తీవ్రవాద నియంత్రణ, దేశ సరిహద్దుల రక్షణ వంటి బహుముఖ పాత్రను ఆయా దళాల సిబ్బంది సమర్థంగా నిర్వహించగలుగుతారు.

   ఇక ఉపాధి సమ్మేళనం అనేది ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలనే ప్రధానమంత్రి నిబద్ధత దిశగా ఒక ముందడుగు. ఉపాధి కల్పనలో ఈ సమ్మేళనం ఒక ఉత్ప్రేరకం కావాలని, యువతకు సాధికారతతోపాటు దేశ ప్రగతిలో భాగస్వామ్యానికి అర్థవంతమైన అవకాశాలు కల్పించాలన్నది ఆయన లక్ష్యం. మరోవైపు కొత్తగా నియమితులైన వారికి కర్మయోగి (iGOT) పోర్టల్‌లోని ఆన్‌లైన్ మాడ్యూల్ ‘కర్మయోగి ప్రారంభ్‌’ ద్వారా శిక్షణ పొందే అవకాశం కూడా లభిస్తుంది. ఇందులో ‘ఎక్కడైనా, ఏ పరికరం ద్వారానైనా’ నేర్చుకునే ప్రాతిపదికన 673కుపైగా ఇ-లెర్నింగ్ కోర్సులు అందుబాటులో ఉంటాయి.

*****

DS/TS



(Release ID: 1952995) Visitor Counter : 126