రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

77వ స్వాతంత్ర్య దినోత్సవాలకు సర్వం సిద్ధం; ప్రతిష్టాత్మక ఎర్రకోట నుంచి వేడుక‌ల‌కు నేతృత్వం వహించనున్న ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ


ఉత్సవాలు తిలకించేందుకు దేశంలోని వివిధ రంగాలనుంచి
సుమారు 1,800 మందికి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానం

Posted On: 13 AUG 2023 11:01AM by PIB Hyderabad

భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవాల నేపథ్యంలో 2023 ఆగస్టు 15న ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి నాయకత్వం వహిస్తారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, చరిత్రాత్మక స్మారకం బురుజుల నుంచి పౌరులనుద్దేశించి సంప్రదాయ ప్రసంగం చేస్తారు. అలాగే 2021 మార్చి 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోగల సబర్మతి ఆశ్రమం నుంచి ప్రధాని ప్రారంభించిన ‘స్వాతంత్ర్య అమృత మహోత్సవ’ వేడుకలు ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవంతో పరిసమాప్తమవుతాయి. తద్వారా భారతదేశం మరోసారి ‘అమృత కాలం’లోకి ప్రవేశిస్తుంది. ఈ మేరకు 2047కల్లా దేశాన్ని ‘వికసిత భారతం’గా రూపుదిద్దాలన్న శ్రీ నరేంద్ర మోదీ కలను సాకారం చేసే సంకల్పం పునరుత్తేజం పొందుతుంది. ఈసారి 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అనేక కొత్త కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు నిరుటితో పోలిస్తే ఈ ఏడాది పెద్ద సంఖ్యలో అతిథులను ఆహ్వానించారు.

ప్రత్యేక అతిథులు

ఎర్రకోట వద్ద నిర్వహించే వేడుకలలో పాల్గొనేందుకు వివిధ రంగాల నుంచి జీవిత భాగస్వాములుసహా సుమారు 1,800 మందిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. ‘జన భాగస్వామ్యం’ పేరిట ప్రభుత్వం అనుసరిస్తున్న దార్శనిక కార్యక్రమానికి అనుగుణంగా ఈ ఆహ్వానం పంపబడింది. ఈ ప్రత్యేక అతిథులలో ఉజ్వల గ్రామాల నుంచి 400 మంది సర్పంచులు సహా 660 మందికిపైగా ఆహ్వానితులున్నారు. అలాగే రైతు ఉత్పత్తిదారు సంస్థల నుంచి 250 మంది; ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం-ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి పథకం కింద 50 మంది వంతున; కొత్త పార్లమెంట్ భవనంసహా సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న 50 మంది శ్రమ యోగులు (కార్మికులు); సరిహద్దు రోడ్ల నిర్మాణం, అమృత సరోవరాల తవ్వకం, ఇంటింటికీ నీరు పథకం వగైరాలలో పాల్గొన్న 50 మంది ఖాదీ కార్మికులు; ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారుల నుంచి 50 మంది వంతున వీరిలో ఉన్నారు. ఈ ప్రత్యేక అతిథులలో కొందరు జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించడంతోపాటు రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్‌తో భేటీ అవుతారు. వీరే కాకుండా ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం నుంచి 75 జంటలు సంప్రదాయ వస్త్రధారణతో ఎర్రకోటలో వేడుకలు తిలకించేందుకు ఆహ్వానించబడ్డారు.

సెల్ఫీ ప్రదేశాలు

సందర్శకులు స్వీయ చిత్రాలు (సెల్ఫీ) తీసుకునేందుకు 12 నిర్దిష్ట ప్రదేశాలను ప్రకటించారు. ఈ మేరకు “నేషనల్ వార్ మెమోరియల్, ఇండియా గేట్, విజయ్ చౌక్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ప్రగతి మైదాన్, రాజ్ ఘాట్, జామా మసీదు/రాజీవ్ చౌక్/ఢిల్లీ గేట్ మెట్రో స్టేషన్లు, ఐటిఓ మెట్రో గేట్, నౌబత్ ఖానా, షీష్ గంజ్ గురుద్వారా ప్రాంతాలను వివిధ పథకాలు-ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతిబింబించేలా సిద్ధం చేశారు.

   పథకాలు/కార్యక్రమాల జాబితాలో: ప్రపంచ ఆశాకిరణం: టీకాలు-యోగా; ఉజ్వల యోజన; అంతరిక్ష శక్తి; డిజిటల్ భారతం; నైపుణ్యం భారతం; అంకుర భారతం; స్వచ్ఛ భారతం; సశక్త భారతం-నవ భారతం; శక్తియుత భారతం; ప్రధానమంత్రి ఆవాస్ యోజన; జల్ జీవన్ మిషన్.

   మరోవైపు వేడుకల్లో భాగంగా ఆగస్టు 15 నుంచి 20 వరకు ‘మైగవ్‌’ (MyGov) పోర్టల్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ సెల్ఫీ పోటీ నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొనేవారు 12 ప్రసిద్ధ ప్రదేశాల్లో తీసుకున్‌న ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సెల్ఫీలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. ఈ పోటీ ఆధారంగా ప్రతి ప్రదేశంలోని సెల్ఫీ ఆధారంగా 12 మంది విజేతలను ఎంపిక చేసి, తలా రూ.10,000 వంతున నగదు బహుమతి అందజేచేస్తారు.

ఇ-ఆహ్వానాలు

   అధికారిక ఆహ్వానాలన్నీ ‘ఆమంత్రణ్‌’ పోర్టల్ (www.aamantran.mod.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో పంపబడ్డాయి. మొత్తంమీద ఈ పోర్టల్ ద్వారా 17,000 ఇ-ఆహ్వాన పత్రికలు జారీ చేయబడ్డాయి.

*****

వేడుకలు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకోగానే రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్, కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమానే ఆయనకు స్వాగతం పలుకుతారు. ఢిల్లీ ప్రాదేశిక లెఫ్టినెంట్‌ జనరల్‌/జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జిఒసి) ధీరజ్‌ సేఠ్‌ను ప్రధానమంత్రికి రక్షణశాఖ కార్యదర్శి పరిచయం చేస్తారు. అటుపైన ‘జిఒసి’ ఢిల్లీ ప్రాదేశిక బలంగా శ్రీ నరేంద్ర మోదీకి గౌరవ వందనం సమర్పిస్తుంది. అలాగే సంయుక్త ఇంటర్-సర్వీసెస్, ఢిల్లీ పోలీస్ గార్డ్ బలగాలు ప్రధానికి వందన సమర్పణ చేస్తారు. ఆ త‌ర్వాత ప్ర‌ధానమంత్రి సైనిక బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు.

   ఈ గౌరవ వందన కవాతు బృందంలో ఆర్మీ, వైమానిక దళం, ఢిల్లీ పోలీసు విభాగం నుంచి ఒక్కొక్క అధికారితోపాటు 25 మంది సిబ్బంది; నావికాదళం నుంచి ఒక అధికారితోపాటు 24 మంది సిబ్బంది ఉంటారు. ఈ ఏడాది కవాతు సమన్వయ బాధ్యతను భారత సైన్యం నిర్వర్తిస్తుంది. గౌరవ వందనానికి మేజర్ వికాస్ సంగ్వాన్ నాయకత్వం వహిస్తారు. ప్రధానమంత్రి రక్షణ బృందంలోని సైనిక సిబ్బందికి మేజర్ ఇంద్రజీత్ సచిన్, నావికాదళానికి లెఫ్టినెంట్ కమాండర్ ఎం.వి రాహుల్ రామన్, వైమానిక దళానికి స్క్వాడ్రన్ లీడర్ ఆకాష్ గంగాస్ నాయకత్వం వహిస్తారు. ఢిల్లీ పోలీసు బృందానికి అదనపు డీసీపీ సంధ్యా స్వామి నేతృత్వం వహిస్తారు.

   ప్రధానమంత్రి గౌరవ వందనం స్వీకరించాక ఎర్రకోట బురుజులపైకి చేరుకుంటారు. అక్కడ రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌, సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్‌తో పాటు సైనిక, నావికా, వైమానిక దళాల అధిపతులు జనరల్ మనోజ్ పాండే, అడ్మిరల్ ఆర్.హరికుమార్, చీఫ్ మార్షల్ వీ.ఆర్.చౌదరి స్వాగతం పలుకుతారు. ‘జిఒసి’ ఢిల్లీ ప్రాదేశిక సిబ్బంది ప్రధానమంత్రిని జాతీయ పతాకం ఆవిష్కరణ కోసం వేదిక వద్దకు సగౌరవంగా తీసుకెళ్లారు.

   పతాకావిష్కరణ తర్వాత జాతీయ జెండా ‘జాతి గౌరవ వందనం’ అందుకుంటుంది. జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో, జాతి గౌరవ వందనం ఆచరించే వేళ ఒక ‘జెసిఒ’, 20 మంది ఇతర ర్యాంకులుగల ఆర్మీ వాద్యదళం జాతీయ గీతాన్ని ఆలపిస్తుంది. నాయబ్ సుబేదార్ జతీందర్ సింగ్ ఆధ్వర్యంలో ఈ దళం తమ నైపుణ్యం ప్రదర్శిస్తుంది.

   జాతీయ పతాకం ఆవిష్కరణలో మేజర్ నికితా నాయర్, మేజర్ జాస్మిన్ కౌర్ ప్రధానమంత్రికి సహకరిస్తారు. దీనికి సమాంతరంగా ప్రసిద్ద ‘8711 ఫీల్డ్ బ్యాటరీ’ (వేడుకల విభాగం) వీర సైనికులు 21 తుపాకులు పేలుస్తారు. ఈ బృందానికి లెఫ్టినెంట్ కల్నల్ వికాస్ కుమార్ నాయకత్వం వహిస్తారు. నాయబ్ సుబేదార్ (ఎఐజి) అనూప్ సింగ్ గన్ పొజిషన్ ఆఫీసరుగా వ్యవహరిస్తారు.

  ప్రధాని జాతీయ జెండా ఆవిష్కరిస్తుండగా జాతీయ పతాక దళంలోని ఐదుగురు అధికారులతోపాటు సైనిక, నావికా, వైమానిక దళాలుసహా ఢిల్లీ పోలీసు విభాగం నుంచి మొత్తం 128 మంది ఇతర ర్యాంకుల సిబ్బంది జాతీయ పతాకానికి జాతి వందనం ఆచరిస్తారు. ఆర్మీకి చెందిన మేజర్ అభినవ్ దేథా ఈ ఇంటర్-సర్వీసెస్ గార్డ్, పోలీస్ గార్డ్‌ కమాండ్‌గా వ్యవహరిస్తారు.

   జాతీయ పతాక దళంలోని ఆర్మీ సిబ్బందికి మేజర్ ముఖేష్ కుమార్ సింగ్, నావికా సిబ్బందికి లెఫ్టినెంట్ కమాండర్ హర్‌ప్రీత్ మాన్, వైమానిక దళానికి స్క్వాడ్రన్ లీడర్ శ్రేయ్ చౌదరి నాయకత్వం వహిస్తారు. ఢిల్లీ పోలీసు బృందానికి అదనపు డీసీపీ శశాంక్ జైస్వాల్ నేతృత్వం వహిస్తారు.

   ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించగానే భారత వైమానిక దళానికి చెందిన రెండు మార్క్-III ధ్రువ్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు వేదికపై పూలవర్షం కురిపిస్తాయి. వీటికి వింగ్ కమాండర్ అంబర్ అగర్వాల్, స్క్వాడ్రన్ లీడర్ హిమాన్షు శర్మ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.

   పూలవర్షం అనంతరం ప్రధానమంత్రి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రసంగం ముగిశాక నేషనల్ క్యాడెట్ కోర్‌ (ఎన్‌సిసి) కేడెట్లు జాతీయ గీతాలాపన చేస్తారు. దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 1,100 మంది బాలబాలికల (ఆర్మీ, నేవీ, వైమానిక) కేడెట్లు ఈ జాతీయ వేడుకలలో పాల్గొంటారు. జ్ఞాన్‌పథ్‌లో ఏర్పాటు చేసిన బెంచీలపై ఈ కేడెట్లు తెల్లని అధికారిక దుస్తులలో ఆసీనులవుతారు. ఇక యూనిఫాంలో ఉన్న ఎన్‌సిసి కేడెట్లు కూడా జ్ఞాన్‌పథ్‌ వద్దనే కూర్చుంటారు. కాగా, ఎర్రకోట వద్ద పుష్పాలంకరణలో జి-20 లోగో విశేషాకర్షణగా నిలవనుంది.

 

*****

 

 


(Release ID: 1948264) Visitor Counter : 486