ఆర్థిక మంత్రిత్వ శాఖ
సామాజిక భద్రత పథకాలు- ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పిఎంజెజెబివై).. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పిఎంబిఎస్‌వై).. అటల్ పెన్షన్ యోజన (ఎపివై)కు ఎనిమిదేళ్లు పూర్తి;
మూడు జన సురక్ష పథకాలు పౌరుల శ్రేయస్సుకే అంకితం... అనూహ్య ముప్పులు.. నష్టాలు.. ఆర్థిక అనిశ్చితి నుంచి జన జీవనానికి ఇవి భద్రత కల్పిస్తాయి: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటన;
జన సురక్ష పథకాల విస్తృతిని మరింత పెంచాలని క్షేత్రస్థాయి యంత్రాంగానికి ఆర్థికశాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరద్ సూచన
Posted On:
09 MAY 2023 7:45AM by PIB Hyderabad
పిఎంజెజెబివై: 16 కోట్లు దాటిన సంచిత నమోదు
పిఎంబిఎస్‌వై: 34 కోట్లు దాటిన సంచి నమోదు
ఎపివై: 5 కోట్ల మందికిపైగా చందాదారులు
దేశంలో అమలవుతున్న సామాజిక భద్రత పథకాలు- ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పిఎంబిఎస్‌వై), అటల్ పెన్షన్ యోజన (ఎపివై)లకు 8 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఎనిమిదో వార్షికోత్సవం నేపథ్యంలో ప్రజలకు చౌకగా బీమా రక్షణ, జీవన భద్రత కల్పిస్తున్న ఈ పథకాల ప్రధానాంశాలు, వాటి విజయాలను ఒకసారి స్థూలంగా పరిశీలిద్దాం:
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ మూడు పథకాలనూ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో 2015 మే 9వ తేదీన ప్రారంభించారు.
పౌరుల సంక్షేమమే ఈ మూడు పథకాల ప్రధాన లక్ష్యం. అనూహ్య పరిణామాలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులలో జీవన భద్రత అవసరాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా దేశంలోని అసంఘటిత వర్గాల ప్రజల ఆర్థిక భద్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం రెండు బీమా పథకాలు- ‘పిఎంజెజెబివై, పిఎంబిఎస్‌వై’లకు శ్రీకారం చుట్టింది. అదేవిధంగా వృద్ధాప్యంలో తలెత్తే అనూహ్య అవసరాలను తీర్చడం ప్రధానంగా ‘ఎపివై’ని ప్రవేశపెట్టింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఈ మూడు జన సురక్ష పథకాల వెనుకగల దార్శనికతను గుర్తుచేస్తూ- “భారతదేశంలో ప్రతి పౌరుడికి బ్యాంకింగ్ సౌకర్యాలు, ఆర్థిక అక్షరాస్యతసహా సామాజిక భద్రత సౌలభ్యం కల్పించే ప్రధాన లక్ష్యంతో 2014లో ‘జాతీయ ఆర్థిక సార్వజనీనత కార్యక్రమం’ ప్రారంభించబడింది. ఈ చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015 మే 9వ తేదీన ఈ మూడు జన సురక్ష పథకాలను ప్రవేశపెట్టారు” అని పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ఇంకా ఏమన్నారంటే- “ఈ మూడు సామాజిక భద్రత పథకాలు పౌరుల శ్రేయస్సుకే అంకితం. ఇవి అనూహ్య ముప్పులు, నష్టాలు, ఆర్థిక అనిశ్చితి నుంచి జన జీవనానికి ఇవి భద్రత కల్పిస్తాయి. అలాగే అణగారిన వర్గాల నేపథ్యంగల వ్యక్తులందరికీ అత్యావశ్యకమైన ఆర్థిక సేవల సౌలభ్యం కల్పించడం ద్వారా వారి ఆర్థిక దుర్బలతను దూరం చేయడం కూడా ఈ పథకాల ధ్యేయం.”
ఈ సామాజిక భద్రత పథకాల 8వ వార్షికోత్సవం నేపథ్యంలో సంబంధిత గణాంకాలను శ్రీమతి సీతారామన్ ఉటంకించారు. ఈ మేరకు ‘పిఎంజెజెబివై, పిఎంబిఎస్‌వై, ఎపివై’ పథకాల కింద 2023 ఏప్రిల్ 26వ తేదీవరకూ వరుసగా 16.2 కోట్లు, 34.2 కోట్లు, 5.2 కోట్లమంది వంతున ప్రజలు నమోదు చేసుకున్నారని వివరించారు.
వీటిలో ‘పిఎంజెజెబివై’ ద్వారా 6.64 లక్షల కుటుంబాలకు ఇప్పటిదాకా క్లెయిముల కింద రూ.13,290 కోట్లదాకా సహాయం అందించినట్లు ఆర్థికశాఖ మంత్రి వెల్లడించారు.
అలాగే ‘పిఎంబిఎస్‌వై’ ద్వారా 1.15 కోట్ల కుటుంబాలు క్లెయిముల కింద రూ.2,302 కోట్ల మేర ప్రయోజనం పొందాయని శ్రీమతి సీతారామన్ పేర్కొన్నారు. ఈ రెండు పథకాలకు సంబంధించి క్లెయిమ్ ప్రక్రియను సరళం చేయడం వల్ల పరిష్కార వేగం పెరిగిందని ఆమె వివరించారు.
అంతేకాకుండా “ఈ పథకాలు మరింత విస్తృతమయ్యే రీతిలో నిర్దిష్ట విధానం ద్వారా అమలవుతుండటం హర్షదాయకం. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు దేశవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చూడటంపై మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది” అని శ్రీమతి సీతారామన్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కిషన్‌రావ్ కరద్ మాట్లాడుతూ- “గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పథకాల ప్రయోజనాలు చేరేవిధంగా ప్రభుత్వం లక్ష్య నిర్దేశిత విధానం అనుసరించింది. ఆ మేరకు దేశవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు ప్రతి పంచాయతీ స్థాయిలో నమోదు కార్యక్రమం నిర్వహిస్తోంది” అన్నారు.
ఈ పథకాలకు బహుళ ప్రాచుర్యం దిశగా కీలకపాత్ర పోషించిన క్షేత్రస్థాయి సిబ్బందిని, కార్యకర్తలను అభినందిస్తూ, వీటి విస్తృతిని మరింత పెంచడానికి కృషి చేయాల్సిందిగా డాక్టర్ కరద్ పిలుపునిచ్చారు.
ఈ సామాజిక భద్రత పథకాల 8వ వార్షికోత్సవం నేపథ్యంలో ఈ పథకాల ప్రధానాంశాలు, వాటి విజయాలను స్థూలంగా పరిశీలిద్దాం:
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై)
పథకం: ‘పిఎంజెజెబివై’ కింద సంవత్సరం పాటు జీవిత బీమా రక్షణ లభిస్తుంది. ఈ పథకం కింద ఏటా రుసుము చెల్లించి నవీకరించుకోవచ్చు. దురదృష్టవశాత్తూ పాలసీదారు మరణిస్తే వారి కుటుంబానికి జీవన భద్రత కల్పిస్తుంది.
అర్హత: బ్యాంకు లేదా తపాలా ఆఫీసులో వ్యక్తిగత పొదుపు ఖాతాగల 18-50 ఏళ్ల మధ్య వయస్కులు ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చు. ఇలా 50 ఏళ్లు పూర్తికాకముందే పథకంలో చేరిన వ్యక్తులు క్రమం తప్పకుండా సాధారణ రుసుము చెల్లిస్తూ 55 ఏళ్లు వచ్చేదాకా ప్రమాద బీమా రక్షణను పొడిగించుకోవచ్చు.
ప్రయోజనాలు: ఈ పథకం కింద జీవిత బీమా రక్షణ కోసం సంవత్సరానికి రూ.436 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పాలసీదారు ఏదైనా కారణంవల్ల మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షలు అందుతాయి.
నమోదు: ఈ పథకం కింద నమోదు కోసం బ్యాంకు లేదా తపాలా ఆఫీసులో వ్యక్తిగత పొదుపు ఖాతాగల వారు ఆ బ్యాంకు శాఖ/బి.సి. కేంద్రం/వెబ్‌సైట్ లేదా తపాలా ఆఫీసులో సంప్రదించవచ్చు. ఖాతాదారు నుంచి సమ్మతి ఆదేశం ప్రాతిపదికన బీమా రుసుము (రూ.436) చందాదారుల ఖాతా నుంచి ఏటా నేరుగా చెల్లించబడుతుంది. ఈ పథకం, దరఖాస్తు ఫారంపై సమగ్ర సమాచారం (హిందీ, ఆంగ్లంసహా ప్రాంతీయ భాషలలోనూ) https://jansuraksha.gov.inలో లభ్యమవుతుంది.
విజయాలు: ఈ పథకం కింద 26.04.2023 నాటికి సంచిత నమోదు 16.19 కోట్లకుపైగా ఉంది. అదేవిధంగా 6,64,520 క్లెయిముల కింద రూ.13,290.40 కోట్లు చెల్లించబడింది.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్‌బివై)
పథకం: ‘పిఎంబిఎస్‌వై’ కింద సంవత్సరం పాటు ప్రమాద బీమా రక్షణ లభిస్తుంది. ఈ పథకం కింద ఏటా రుసుము చెల్లించి నవీకరించుకోవచ్చు. పాలసీదారు ఏదైనా ప్రమాదంలో మరణించినా, అంగ వైకల్యానికి గురైనా బీమా రక్షణ లభిస్తుంది.
అర్హత: బ్యాంకు లేదా తపాలా ఆఫీసులో వ్యక్తిగత పొదుపు ఖాతాగల 18-70 ఏళ్ల మధ్య వయస్కులు ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చు.
ప్రయోజనాలు: ఈ పథకం కింద ప్రమాద బీమా రక్షణ కోసం సంవత్సరానికి రూ.20 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పాలసీదారు ఏదైనా కారణంవల్ల మరణించినా/అంగ వైకల్యం (పాక్షిక వైకల్యానికి రూ.లక్ష) సంభవించినా బీమా రక్షణ కింద రూ.2 లక్షలు లభిస్తాయి.
నమోదు: ఈ పథకం కింద నమోదు కోసం బ్యాంకు లేదా తపాలా ఆఫీసులో వ్యక్తిగత పొదుపు ఖాతాగల వారు ఆ బ్యాంకు శాఖ/బి.సి. కేంద్రం/వెబ్‌సైట్ లేదా తపాలా ఆఫీసులో సంప్రదించవచ్చు. ఖాతాదారు నుంచి సమ్మతి ఆదేశం ప్రాతిపదికన బీమా రుసుము (రూ.20) చందాదారుల ఖాతా నుంచి ఏటా నేరుగా చెల్లించబడుతుంది. ఈ పథకం, దరఖాస్తు ఫారంపై సమగ్ర సమాచారం (హిందీ, ఆంగ్లంసహా ప్రాంతీయ భాషలలోనూ) https://jansuraksha.gov.inలో లభ్యమవుతుంది.
విజయాలు: ఈ పథకం కింద 26.04.2023 నాటికి సంచిత నమోదు 34.18 కోట్లకుపైగా ఉంది. అదేవిధంగా 1,15,951 క్లెయిముల కింద రూ.2,302.26 కోట్లు చెల్లించబడింది.
అటల్ పెన్షన్ యోజన (ఎపివై)
నేపథ్యం: భారత పౌరులందరికీ.. ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాలకు, అసంఘటిత రంగ కార్మికులకు సార్వత్రిక సామాజిక భద్రత వ్యవస్థగా అటల్ పెన్షన్ యోజన (ఎపివై) ప్రారంభించబడింది. భవిష్యత్ అనూహ్య పరిణామాలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులలో అసంఘటితరంగ కార్మికులకు ఆర్థిక భద్రత అవసరాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం దీనికి రూపకల్పన చేసింది. జాతీయ పెన్షన్ వ్యవస్థ (ఎన్‌పిఎస్) పరిధిలోని సంస్థాగత నిర్మాణంలో భాగమైన పెనన్ష్ నిధి నియంత్రణ-అభివృద్ధి ప్రాధికార సంస్థ (పిఎఫ్‌ఆర్‌డిఎ) ద్వారా అటల్ పెన్షన్ యోజన నిర్వహించబడుతుంది.
అర్హత: బ్యాంకు లేదా తపాలా ఆఫీసులో వ్యక్తిగత పొదుపు ఖాతాగల, ఆదాయపు పన్ను చెల్లింపు పరిధిలో లేని 18-40 ఏళ్ల మధ్య వయస్కులు ‘ఎపివై’ కింద నమోదుకు అర్హులు. తామెంచుకునే పెన్షన్ మొత్తం ప్రాతిపదికన వారు చందా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రయోజనాలు: ఈ పథకంలో చేరినవారు చెల్లించే చందా మొత్తాన్నిబట్టి వారికి 60 ఏళ్లు దాటిన తర్వాత రూ.1,000/2,000/3,000/4,000/5,000 వంతున పూర్తి హామీగల నెలవారీ పెన్షన్ లభిస్తుంది.
పథకం ప్రయోజనాల వితరణ: చందాదారుకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలవారీ పెన్షన్ లభిస్తుంది. దురదృష్టవశాత్తూ వారు మరణిస్తే జీవిత భాగస్వామికి, వారు కూడా మరణించిన పక్షంలో చందాదారుకు 60 ఏళ్లు వచ్చేదాకా పోగుపడిన పెన్షన్ నిధి మొత్తాన్ని వారు ప్రతిపాదించిన వ్యక్తి (నామినీ)కి చెల్లిస్తారు.
ఒకవేళ చందాదారు అకాల మరణం (60 ఏళ్లలోపు) పాలైతే, మిగిలిన కాలానికిగాను (చందాదారు వయసు 60 పూర్తయ్యేదాకా) వారి జీవిత భాగస్వామి చందా మొత్తం చెల్లిస్తూ ‘ఎపివై’ ఖాతాను కొనసాగించవచ్చు.
కేంద్ర ప్రభుత్వ సహకారం: కనీస నెలవారీ పెన్షనుకు ప్రభుత్వం హామీ ఇస్తుంది... చందాదారుల నుంచి చందాల ప్రాతిపదికన సేకరించి నిధితో పెట్టిన పెట్టుబడులపై వచ్చే రాబడి అంచనాలకన్నా తగ్గి, హామీ ఇచ్చిన పెన్షన్ మొత్తం చెల్లించలేని పరిస్థితి ఉంటే- కేంద్ర ప్రభుత్వం ఆ లోటును భర్తీచేస్తూ నిధులందిస్తుంది. ఒకవేళ పెట్టుబడిపై రాబడి అంచనాలకు మించి ఆర్జిస్తే చందాదారులు మెరుగైన పెన్షన్ ప్రయోజనం పొందుతారు.
చెల్లింపు వ్యవధి: చందాదారులు ‘ఎపివై’ కింద చెల్లించాల్సిన తమవంతు చందా మొత్తాన్ని నెల/త్రైమాసిక/అర్ధ సంవత్సర ప్రాతిపదిన చెల్లించవచ్చు.
పథకం నుంచి ఉపసంహరణ: ప్రభుత్వం తరఫు చందాల మినహాయింపు/రాబడి/వడ్డీ తగ్గింపు వంటి కొన్ని నిబంధనలకు అనుగుణంగా చందాదారులు స్వచ్ఛందంగా ‘ఎపివై’ పథకం నుంచి వైదొలగవచ్చు.
విజయాలు: ఈ పథకం కింద 27.04.2022 నాటికి 5 కోట్ల మందికిపైగా నమోదు చేసుకున్నారు.
*****
(Release ID: 1922626)
Visitor Counter : 937
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Nepali
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam