ప్రధాన మంత్రి కార్యాలయం
బాలిలో జరిగిన జి-20 సదస్సు లో, "సెషన్ III : డిజిటల్ పరివర్తన" అనే అంశం పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చేసిన ప్రసంగానికి - తెలుగు అనువాదం
Posted On:
16 NOV 2022 11:59AM by PIB Hyderabad
గౌరవనీయులారా !
డిజిటల్ పరివర్తన అనేది మన యుగంలో అత్యంత అద్భుతమైన మార్పు. పేదరికానికి వ్యతిరేకంగా దశాబ్దాలుగా సాగుతున్న ప్రపంచ పోరాటంలో డిజిటల్ టెక్నాలజీని సరిగ్గా వినియోగిస్తే, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కోవిడ్ సమయంలో రిమోట్-వర్కింగ్ తో పాటు పేపర్-లెస్ గ్రీన్ ఆఫీసుల ఉదాహరణలలో మనందరం చూసినట్లుగా - వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటం లో కూడా డిజిటల్ పరిష్కారాలు సహాయపడతాయి. అయితే, డిజిటల్ వినియోగాన్ని నిజంగా కలుపుకొని ముందుకు వెళ్ళి, డిజిటల్ టెక్నాలజీ వినియోగం నిజంగా విస్తృతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రయోజనాలను మనం పూర్తిగా గ్రహించ గలుగుతాము. దురదృష్టవశాత్తు, ఇప్పటి వరకు మనం ఈ శక్తివంతమైన సాధనాన్ని, లాభ, నష్టాల లెక్కలు చూడటం వంటి సాధారణ వ్యాపార ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించడం జరిగింది. డిజిటల్ పరివర్తన యొక్క ప్రయోజనాలు మానవ జాతికి ఉపయోగపడే చిన్న చిన్న అవసరాలకు మాత్రమే పరిమితం కాకుండా చూడాల్సిన బాధ్యత జి-20 నాయకుల పై ఉంది.
మనం డిజిటల్ ఆర్కిటెక్చర్ ను కలుపుకుంటే, అది సామాజిక-ఆర్థిక పరివర్తనను తీసుకురాగలదని, గత కొన్ని సంవత్సరాల భారత దేశ అనుభవం మనకు చూపుతోంది. డిజిటల్ వినియోగం వల్ల ఎక్కువ పని, వేగంగా పూర్తి చేయవచ్చు. పాలనలో పారదర్శకత తీసుకురావచ్చు. ప్రజలకు ఉపయోగపడే డిజిటల్ ఉత్పత్తులను, భారతదేశం అభివృద్ధి చేసింది, దీని ప్రాథమిక నిర్మాణంలో అంతర్నిర్మిత ప్రజాస్వామ్య సూత్రాలు ఉన్నాయి. ఈ పరిష్కారాలు ఓపెన్ సోర్స్, ఓపెన్ ఏ.పి.ఐ. లు, ఓపెన్ స్టాండర్డ్స్ పై ఆధారపడి ఉంటాయి, ఇవి పరస్పరం, బహిరంగంగా ఉంటాయి. ఈ రోజు భారతదేశంలో కొనసాగుతున్న డిజిటల్ విప్లవం ఆధారంగా ఇది మా విధానం. దీనికి ఉదాహరణగా, మా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యు.పి.ఐ) ని తీసుకోండి.
గత సంవత్సరం, ప్రపంచంలోని మొత్తం చెల్లింపు లావాదేవీలలో 40 శాతానికి పైగా యు.పి.ఐ. ద్వారా జరిగాయి. అదేవిధంగా, మేము డిజిటల్ గుర్తింపు ఆధారంగా 460 మిలియన్ల కొత్త బ్యాంకు ఖాతాలు తెరిచాము. ఈ రోజు ఆర్థిక చేరిక లో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాము. మేము ఏర్పాటు చేసిన సార్వత్రిక కో-విన్ వేదిక మానవ చరిత్రలో అతిపెద్ద టీకా ప్రచారాన్ని చేసింది, ఇది మహమ్మారి సమయంలో కూడా విజయవంతమైంది.
గౌరవనీయులారా !
భారతదేశంలో, మేము డిజిటల్ విధానాన్ని బహిరంగంగా అమలు చేస్తున్నాము. కానీ అంతర్జాతీయ స్థాయిలో, ఇప్పటికీ భారీ డిజిటల్ విభజన ఉంది. ప్రపంచంలోని చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజలకు ఏ విధమైన డిజిటల్ గుర్తింపు లేదు. కేవలం 50 దేశాలు మాత్రమే డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను కలిగి ఉన్నాయి. రాబోయే పదేళ్లలో ప్రతి మనిషి జీవితంలో డిజిటల్ పరివర్తన తీసుకువస్తామని మనం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. తద్వారా ప్రపంచంలోని ప్రతివ్యకీ డిజిటల్ టెక్నాలజీ ప్రయోజనాలు పొందే అవకాశం లభిస్తుంది.
వచ్చే ఏడాది తన జి-20 అధ్యక్ష పదవీ కాలం సమయంలో, ఈ లక్ష్యం కోసం భారతదేశం జి-20 భాగస్వాములతో కలిసి సంయుక్తంగా పని చేస్తుంది. మా అధ్యక్ష పదవీ కాలానికి "ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు" అనే మొత్తం ఇతివృత్తం లో, "అభివృద్ధి కోసం సమాచారం" అనే సూత్రం అంతర్భాగంగా ఉంటుంది.
ధన్యవాదములు.
గమనిక:
ఇది ప్రధానమంత్రి హిందీ లో చేసిన ప్రసంగానికి స్వేచ్చానువాదం.
*****
(Release ID: 1876551)
Visitor Counter : 208
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam