హోం మంత్రిత్వ శాఖ
‘చింతన్ శివిర్’ సదస్సులో కేంద్ర హోంమంత్రి ప్రసంగం
హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో నిర్వహణ
Posted On:
27 OCT 2022 6:28PM by PIB Hyderabad
ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో
దేశం ముందున్న సవాళ్లను
సమైక్యంగా ఎదుర్కోవడానికి ఒక వేదికను
అందించనున్న ‘చింతన్ శివిర్’ సదస్సు..
ఒకప్పుడు హింసకు, అశాంతికి
కేంద్రాలైన వామపక్ష తీవ్రవాద ప్రభావితప్రాంతాలు,
జమ్ముకాశ్మీర్ నేడు అభివృద్ధి కేంద్రాలుగా మారాయి.
దేశానికీ, ప్రపంచానికీ నేడు పెద్ద సవాలు
సైబర్-క్రైమ్: అమిత్ షా,
దీనిపై పోరాటానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని స్పష్టీకరణ..
మాదకద్రవ్యాల ముప్పు నుంచి దేశాన్ని, యువతను
రక్షించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం
కృతనిశ్చయంతో ఉంది,..
ప్రభుత్వం చేపట్టిన విధాన చర్యలతో
రూ. 20,000 కోట్ల మాదక ద్రవ్యాల స్వాధీనం..
నేటి ప్రపంచంలో నేరాల స్వభావం మారుతోంది
ఎల్లలు లేని రీతిలో నేరాలు పెరుగుతున్నాయి..
అందుకే, నేరాలపై పోరాటానికి రాష్ట్రాలు
ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించు కోవాలి..
తీవ్రవాదంపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని పాటిస్తున్న
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం..
ఉగ్రవాదంపై నిర్ణయాత్మక విజయం లక్ష్యంగా
ఎన్.ఐ.ఎ. ఇతర ఏజెన్సీలను బలోపేతం చేస్తున్నాం..,
2024 లోగా రాష్ట్రాల్లో ఎన్.ఐ.ఎ శాఖల ఏర్పాటుతో
తీవ్రవాద వ్యతిరేక వ్యవస్థ నిర్మాణానికి ప్రయత్నాలు..
నేరనిర్ధారణ రేటును పెంచడానికి అన్ని రాష్ట్రాలు
ఫోరెన్సిక్ సైన్స్‌ను గరిష్టంగా ఉపయోగించుకోవాలి,
ఎన్.ఎఫ్.ఎస్.యు. ద్వారా సాధ్యమైనంత సాయం,
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అందించింది..
సరిహద్దు భద్రత, తీరప్రాంత భద్రత బలోపేతానికి
కేంద్ర ఏజెన్సీలు, భద్రతా బలగాలతో
సరిహద్దు రాష్ట్రాలు సమన్వయంగా కృషిచేయాలి..
విపత్తు నిర్వహణలో అనేక ప్రభుత్వ కార్యక్రమాలు..,
ఈ కార్యక్రమాల అమలును స్వయంగా
పర్యవేక్షించవలసిందిగా సి.ఎం.లను కోరుతున్నాను
జమ్మూ కాశ్మీర్, ఈశాన్యం, ఉగ్రవాదం,
మాదకద్రవ్యాల అక్రమ రవాణా,
వామపక్ష తీవ్రవాదం, మహిళల భద్రతకు సంబంధించిన ముఖ్యమైన, సున్నితమైన అంశాలపై
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో,
అనేక చర్యలు చేపట్టిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.
'చింతన్ శివిర్' పేరిట హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో జరిగే రెండు రోజుల మేధోమధన శిబిరంలో భాగంగా ఈ రోజు నిర్వహించిన తొలి రోజు కార్యక్రమంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రసంగించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల హోం మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా సారథులు ఈ చింతన్ శివిర్‌లో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తూ,..మూకుమ్మడిగా పెరిగే సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వ్యాప్తి, సీమాంతర ఉగ్రవాదం వంటి సవాళ్లను, సమస్యలను ఎదుర్కొనేందుకు వీలుగా ఒక ఉమ్మడి వేదికను అందించేందుకు ఈ చింతన్ శివిర్‌ను నిర్వహిస్తున్నామని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. నేడు నేరాల స్వభావాలు తీవ్రంగా మారుతున్నాయని, అవి ఎల్లలు లేనివిగా తయారయ్యాయని అందుకే ఈ సవాళ్లపై అన్ని రాష్ట్రాలు ఉమ్మడి వ్యూహంతో పోరాడాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి, అమలు చేయడానికి, 'సహకార సమాఖ్య', 'పరిపూర్ణ ప్రభుత్వం' 'టీమ్ ఇండియా' విధాన స్ఫూర్తితో, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. ఆంగ్లంలో ‘’సి’’ అనే అక్షరంతో మొదలయ్యే, సహకారం, సమన్వయం, కేంద్ర-రాష్ట్రాల మధ్య సహకారం వంటి అంశాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అమిత్ షా అన్నారు.
వామపక్ష తీవ్రవాదం ప్రభావిత ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు ఒకప్పుడు హింసకు, అశాంతికి ఆటపట్టువులుగా ఉండేవని, అవే ప్రాంతాలు ఇప్పుడు క్రమంగా అభివృద్ధికి కేంద్రాలుగా మారుతున్నాయని కేంద్ర హోం మంత్రి అన్నారు. గత ఎనిమిదేళ్లలో ఈశాన్య ప్రాంతంలో భద్రతా పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని, 2014 నుంచి తిరుగుబాటు ఘటనలు 74 శాతం, భద్రతా బలగాల్లో మృతులు, క్షతగాత్రుల సంఖ్య 60 శాతం, పౌరుల మరణాల్లో 90 శాతం తగ్గుదల నమోదవుతూ వస్తోందని అన్నారు. ఇది కాకుండా, జాతీయ త్రిపుర విమోచన ఫ్రంట్ (ఎన్.ఎల్.ఎఫ్.టి.), బోడో, బ్రూ, కార్బీ అంగ్లాంగ్ వంటి సంస్థల తీవ్రవాదులతో సహా 9,000 మందికి పైగా ఉగ్రవాదుల లొంగుబాటుపై ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా ఈ ప్రాంతంలో శాశ్వత శాంతిని నెలకొల్పడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయన్నారు. ఈశాన్య ప్రాంతంలో చేపట్టిన శాంతి పునరుద్ధరణ ప్రక్రియ కారణంగా 60 శాతానికి పైగా ఈశాన్య ప్రాంతాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ.ని) ఉపసంహరించుకున్నట్టు ఆయన చెప్పారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడినట్టు ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు 77 శాతం వరకూ తగ్గాయని, హింసాత్మక ఘటనల్లో మరణాలు 85 శాతానికి పైగా తగ్గాయని ఆయన చెప్పారు. 2019వ సంవత్సరం ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, అక్కడ శాంతి, పురోగతికి కొత్తశకం ప్రారంభమైందన్నారు. 2019 ఆగస్టు5వ తేదీకి మునుపు, 37 నెలలతో పోలిస్తే 2019 ఆగస్టు 5 తర్వాత 37 నెలల కాలంలో ఉగ్రవాద ఘటనలు 34 శాతం, భద్రతా దళాల మరణాలు 54 శాతం తగ్గాయని అన్నారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించరాదన్న విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అనుసరించారని, ఉగ్రవాదంపై నిర్ణయాత్మక విజయం సాధించడానికి జాతీయ దర్యాప్తు సంస్థను (ఎన్.ఐ.ఎ.ని) ఇతర ఏజెన్సీలను బలోపేతం చేస్తున్నారని చెప్పారు. 2024కి లోగా అన్ని రాష్ట్రాల్లో ఎన్.ఐ.ఎ. శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా ఉగ్రవాద వ్యతిరేక వ్యవస్థను నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరులో నిర్ణయాత్మక విజయం సాధించేందుకు, చట్టపరమైన వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని, దీని కింద ఎన్.ఐ.ఎ. చట్టాన్ని, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని, (యు.ఎ.పి.ఎ.ని) సవరించడం ద్వారా వ్యక్తిగత ఉగ్రవాదులను ప్రకటించే నిబంధనను రూపొందించామని చెప్పారు. ఎన్.ఐ.ఎ.కి అదనపు ప్రాదేశిక అధికార పరిధిని ఇచ్చామని, దీనితో పాటుగా ఉగ్రవాదానికి సంబంధించిన/ ఉగ్రవాదం ద్వారా సంపాదించిన ఆస్తులను జప్తు చేసే హక్కు కూడా ఎన్.ఐ.ఎ.కి దఖలుపరిచామని ఆయన తెలిపారు. 2024వ సంవత్సరం నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎన్.ఐ.ఎ. శాఖలను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యమని అమిత్ షా అన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం కారణంగా,. దేశంలోని సెక్యూరిటీ హాట్‌స్పాట్‌లుగా పేరు పొందిన పలు ప్రాంతాలు నేడు దేశ వ్యతిరేక కార్యకలాపాల నుంచి దాదాపు విముక్తి పొందాయన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానం మంచి ఫలితాలను ఇస్తోందని, గత ఎనిమిదేళ్లలో 3,000 కేసులు నమోదయ్యాయని, రూ. 20,0000 కోట్లకుపైగా ఖరీదు చేసే మాదద్రవ్యాలు స్వాధీనమయ్యాయని చెప్పారు.
సైబర్ నేరాలు నేడు దేశానికి, ప్రపంచానికి పెద్ద ముప్పుగా పరిణమించాయని, ఈ సమస్యపై పోరాడేందుకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంసిద్ధంగా ఉందని అమిత్ షా స్పష్టంచేశారు. నేర శిక్షా స్మృతి (సి.ఆర్.పి.సి.), భారతీయ శిక్షా స్మృతి (ఐ.పి.సి.), విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్.సి.ఆర్.ఎ.) వంటి శాసనాల్లో సంస్కరణలపై హోం మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తోందని, సవరించిన వాటి బ్లూప్రింట్‌లను త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. నేర నిర్ధారణ ప్రక్రియ రేటును పెంచడానికి ఫోరెన్సిక్ సైన్స్ పరిజ్ఞానాన్ని రాష్ట్రాలన్నీ గరిష్టస్థాయిలో వినియోగించుకోవాలని, జాతీయ ఫోరెన్సింగ్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని (ఎన్.ఎఫ్.ఎస్.యు.ని) ఏర్పాటు ద్వారా కేంద్ర ప్రభుత్వం సాధ్యమైన మేర సహాయాన్ని అందించిందని అమిత్ షా చెప్పారు. సరిహద్దు భద్రత, తీరప్రాంత భద్రత పటిష్టంగా అమలయ్యేలా చూసేందుకు కేంద్ర ఏజెన్సీలతో, భద్రతా దళాలతో మరింత సమన్వయం కోసం సరిహద్దు రాష్ట్రాలు కృషి చేయడం ఎంతో ముఖ్యమని అన్నారు. విపత్తు నిర్వహణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఈ కార్యక్రమాల అమలు ప్రక్రియను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ అభ్యర్థించినట్లు అమిత్ షా తెలిపారు.
దేశం ముందున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్గత భద్రతకు సంబంధించి అందుబాటులో ఉన్న అన్ని వనరులను సక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దీని కోసం వనరుల గరిష్టస్థాయి వినియోగం, హేతుబద్ధ వినియోగం, వనరుల ఏకీకరణ జరగాలని, ఇది రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరుస్తుందని అన్నారు. "ఒకే సమాచారం, ఒక ప్రవేశం" అనే సూత్రంపై ప్రభుత్వం పనిచేస్తోందని, దీని కింద ఉగ్రవాద కేసులకు సంబంధించిన జాతీయ డేటాబేస్ ఎన్.ఐ.ఎ.కి అందించామని, జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ బోర్డుకు (ఎన్.సి.బి.కి) మాదకద్రవ్యాల కేసులకు సంబంధించిన జాతీయ స్థాయి సమాచార వ్యవస్థ (డేటాబేస్) అందుబాటులో ఉందని, ఆర్థిక నేరాలకు సంబంధించిన డేటాబేస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు (ఇ.డి.కి) అందుబాటులో ఉందని, ఆయన చెప్పారు. వేలిముద్రల సమాచార వ్యవస్థను (నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం-ఎన్.ఎ.ఎఫ్.ఐ.ఎస్.)ను, లైంగిక నేరస్తుల డేటాబేస్ (ఎన్.డి.ఎస్.ఒ.)ను ఏర్పాటు చేసే బాధ్యతను జాతీయ నేర రికార్డుల మండలికి (ఎన్.సి.ఆర్.బి.కి) అప్పగించినట్టు చెప్పారు. నియంత్రణాపూర్వక సంస్కరణల ప్రకారం, ఇండియన్ సైబర్ నేరాల సమన్వయ కేంద్రాన్ని. సైబర్ క్రైమ్ పోర్టల్‌ను, నాట్‌గ్రిడ్‌ను అనుసంధానించే వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రైవేట్ భద్రతా ఏజెన్సీ లైసెన్సింగ్ పోర్టల్ కూడా ఏర్పాటైందని, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్.సి.ఆర్.ఎ.)లో సంస్కరణలు జరిగాయని చెప్పారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలు, మతమార్పిడి పోకడలు, అభివృద్ధి ప్రాజెక్టులకు రాజకీయ వ్యతిరేకత, లేదా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడే కొన్ని సంస్థలపై ఎఫ్.సి.ఆర్.ఎ. సంస్కరణల కింద చర్యలు తీసుకోవడం ప్రారంభించామని చెప్పారు. విదేశీ నిధుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి వీలుగా 2020లో చేసిన చట్ట సవరణ ప్రకారం సమర్థవంతమైన పర్యవేక్షణ సాధ్యమైందని కేంద్రమంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడు ప్రధాన సవాళ్లపై కాలానుగుణమైన వ్యూహంతో పని చేస్తోందని అమిత్ షా అన్నారు. మొదట, ఆరోగ్య సేవల కోసం సంపూర్ణ ప్రణాళిక చేపట్టామని. ఈ ప్రణాళిక కింద ఆయుష్మాన్ కేంద్ర సాయుధ పోలీసుఫోర్స్ (సి.ఎ.పి.ఎఫ్.) పథకం ప్రారంభమైందని, ఈ పథకం కింద సుమారు 35 లక్షల ఆరోగ్య కార్డులు పంపిణీ జరిగిందని, సుమారు రూ. 20 కోట్ల మేర పంపిణీ జరిగిందని అన్నారు. రెండవ కార్యక్రమంగా, గృహ నిర్మాణంలో సంతృప్త స్థాయి నిష్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. 2014వ సంవత్సరంలో ఆవాస సంతృప్తి స్థాయి దాదాపు 37 శాతం ఉండగా, ప్రస్తుతం అది 48 శాతానికి పెరిగిందన్నారు. ఇది కాకుండా, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు సంబంధించిన CAPFs e-Awas వెబ్ పోర్టల్‌ను రూపొందించడంతో, ఈ స్థాయిని 60 శాతానికి పెంచాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు ఆయన చెప్పారు. మూడవ కార్యక్రమంగా, పోలీసింగ్ వయస్సును చేపట్టారు, దీని కింద 100 రోజుల సెలవు ఇవ్వడం, పదవీ విరమణ వయస్సును 57నుంచి 60 సంవత్సరాలకు పెంచడం, 64,640 మంది అభ్యర్థుల నియామకం చేపట్టినట్టు తెలిపారు. పోలీసింగ్‌లో మనం ప్రాంతీయ దృక్పథం నుంచి సైద్ధాంతిక విధానం వైపు వెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు.
దేశాభివృద్ధికి, స్థిరత్వానికి, సుపరిపాలనకు అంతర్గత భద్రత చాలా ముఖ్యమని, అంతర్గత భద్రత రక్షణ మనందరి ఉమ్మడి బాధ్యత అని అమిత్ షా అన్నారు. దేశ నిర్మాణంలో కేంద్రానికి, రాష్ట్రాలకు సమాన బాధ్యత ఉందన్నారు. అన్ని సంస్థల మధ్య సన్నిహిత సహకారం ఉన్నప్పుడే దేశం పురోగమిస్తుందని చెప్పారు. 75 వత్సరాల స్వాతంత్ర్య వేడకలు జరుపుకుంటున్న ప్రస్తుత అమృత కాలంలో సహకార సమాఖ్య స్ఫూర్తి మనలను నడిపించే చోదక శక్తి కావాలని కేంద్ర హోం మంత్రి అన్నారు. దేశంలో ప్రాంతీయ సహకారాన్ని మరింతగా విస్తరింపజేసేందుకు ఈ చింతన్ శివిర్ మరింతగా దోహదపడుతుందన్న ఆత్మవిశ్వాసాన్ని అమిత్ షా వ్యక్తం చేశారు.
*****
(Release ID: 1871414)
Visitor Counter : 239
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada