ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జరిగిన దీపోత్సవ వేడుకలలో ప్రధానమంత్రి ప్రసంగం : తెలుగు అనువాదం
Posted On:
23 OCT 2022 8:37PM by PIB Hyderabad
సియావర్ రామచంద్ర కీ జై!
సియావర్ రామచంద్ర కీ జై!!
సియావర్ రామచంద్ర కీ జై!!!
వేదికపై ఆశీనులైన ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్; ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, అందరూ అవధ్వాసీలు; దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ రామ్ మరియు శ్రీ భరత్ భక్తులందరూ; సోదర సోదరీమణులారా !
ఈ రోజు అయోధ్య దీపాలతో దివ్యంగా, మనోహరంగా కనిపిస్తోంది. ఈ రోజు అయోధ్యా నగరం భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనం యొక్క బంగారు అధ్యాయానికి ప్రతిబింబంగా దర్శనమిస్తోంది. రామాభిషేకం తర్వాత నేను ఇక్కడికి వస్తున్నప్పుడు రకరకాల భావాలు, ఉద్వేగాలు, విశ్వాసాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. 14 సంవత్సరాల అజ్ఞాతవాసం అనంతరం, శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు, అయోధ్య ఎలా అలంకరించి ఉంటారా అని నేను ఆశ్చర్యపోయాను. 'త్రేతా యుగం' నాటి అయోధ్యను మనం చూడలేకపోయాం, కానీ ఈ రోజు శ్రీరాముని ఆశీస్సులతో 'అమృతకాల్' లో ఆద్యంత రహిత మైన అయోధ్య యొక్క దివ్యత్వాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం.
మిత్రులారా !
మనం ఆ నాగరికత మరియు సంస్కృతికి చెందినవారము, పండుగలు, వేడుకలు జీవితంలో చాలా సహజంగా జరిగేవి. సమాజంలో ఏదైనా కొత్త సంఘటన జరిగినప్పుడల్లా ఒక కొత్త పండుగ ను సృష్టించుకున్నాం. సమాజంలో 'సత్యానికి విజయం, అసత్యానికి పరాజయం' అనే సందేశాన్ని మనం సజీవంగా ఉంచిన విధానంలో భారతదేశానికి ఏదీ సాటిరాదు. వేల సంవత్సరాల క్రితమే రావణుని దౌర్జన్యాన్ని భగవాన్ శ్రీరాముడు అంతం చేశాడు. కానీ, ఈ రోజు, వేల సంవత్సరాల తర్వాత కూడా, ఆ సంఘటన నుండి ఉద్భవించిన ప్రతి మానవీయ, ఆధ్యాత్మిక సందేశం నిరంతరం దీపాల రూపంలో ప్రకాశిస్తోంది.
మిత్రులారా !
ఈ రోజు, దీపాలు మనకు కేవలం ఒక సరుకు మాత్రమే కాదు. అవి భారతదేశ ఆదర్శాలు, విలువలు, తత్వశాస్త్రం యొక్క శక్తివంతమైన ఆత్మ తో సమానం. మనం చూడగలిగినంత వరకు, ఈ దీపాల ప్రకాశం, ఈ కాంతి ప్రభావం, రాత్రి దిగంతాలకు వ్యాపించిన ఈ కిరణాల పుంజం, భారతదేశ మూల మంత్రమైన 'సత్యమేవ జయతే' యొక్క సాధికార ప్రకటన వంటిది. మన ఉపనిషత్తులో పేర్కొన్న ఈ పంక్తులలో పేర్కొన్నట్లు – “सत्यमेव जयते नानृतं सत्येन पन्था विततो देवयानः”. అంటే విజయం సత్యానిదే, అసత్యానికి కాదు అని అర్ధం. అదేవిధంగా మన మహర్షి మాటల ప్రవచనంప్రకారం - - “रामो राजमणि: सदा विजयते”. అంటే, విజయం ఎల్లప్పుడూ శ్రీరామునికి పర్యాయపదంగా ఉండే మంచిదే తప్ప రావణుడిని గుర్తించిన చెడు కాదు అని అర్ధం. అందుకే మట్టి దీపంలో కూడా దైవశక్తిని చూసే మన ఋషులు పేర్కొన్నట్లు - दीपो ज्योतिः परब्रहम दीपो ज्योतिः जनार्दन। అంటే దీప-కాంతి బ్రహ్మ స్వరూపం అని అర్ధం. ఈ ఆధ్యాత్మిక భావం భారతదేశ పురోగమనానికి, పునరుజ్జీవనానికి మార్గనిర్దేశం చేస్తుందని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా !
ఈ రోజు, ఈ శుభ సందర్భంగా, ఈ లక్షల దీపాల వెలుగులో దేశప్రజలకు మరో విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. రామచరితమానస్ లో, గోస్వామి తులసీదాస్ జీ ఇలా అన్నారు. - “जगत प्रकास्य प्रकासक रामू”।. అంటే రాముడు సమస్త జగత్తును ప్రకాశింపజేస్తాడు అని అర్ధం. ఆయన యావత్ ప్రపంచానికి దీపస్తంభం వంటివారు. ఈ కాంతి ఏమిటి? ఇది దయ మరియు కరుణ యొక్క కాంతి; ఇది మానవత్వం మరియు గౌరవం యొక్క కాంతి; ఇది సమానత్వం మరియు ప్రేమ యొక్క కాంతి. ఈ వెలుగు అందరి కోసం; ఈ వెలుగు అందరితో కలిసి నడవాలనే సందేశాన్ని ఇస్తుంది. నేను గుజరాతీ భాషలో, బహుశా చాలా ఏళ్ళ క్రితం, 'దీపం' మీద ఒక కవిత రాశాను. ఆ కవిత శీర్షిక - 'దియా'.
నేను ఈ రోజు ఆ కవితలో కొన్ని పంక్తులు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
દીવા જેવી આશ ને દીવા જેવો તાપ, દીવા જેવી આગ ને દીવા થકી હાશ. ઊગતા સૂરજને હર કોઈ પૂજે, એ તો આથમતી સાંજે’ય આપે સાથ. જાતે બળે ને બાળે અંધાર, માનવના મનમાં ઊગે રખોપાનો ભાવ.
దీని అర్ధం ఏమిటి అంటే -
దీపం ఆశను అందించడమే కాకుండా వేడిని ప్రసరింపజేస్తుంది. దీపం అగ్నిని ఉత్పత్తి చేస్తుంది, సౌకర్యాన్ని కూడా ఇస్తుంది. ప్రతి ఒక్కరూ ఉదయించే సూర్యుడిని పూజిస్తారు, కానీ దీపం చీకటిలో మనల్ని నడిపిస్తుంది. దీపం స్వయంగా మండుతుంది, చీకటిని కూడా తొలగిస్తుంది. దీపం వ్యక్తిలో అంకిత భావాన్ని కలిగిస్తుంది. మనం కష్టపడి పనిచేసి, అన్నింటినీ ఇస్తాం (ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకోడానికి), కానీ అది నెరవేరినప్పుడు, నిస్వార్థ స్ఫూర్తితో ప్రపంచం మొత్తానికి ఆ సాధన యొక్క కాంతిని వ్యాప్తి చేస్తాము, దానిని మొత్తం ప్రపంచానికి అంకితం చేస్తాము.
సోదర సోదరీమణులారా !
ఎప్పుడైతే మనం స్వార్థం నుండి పైకి లేచి, ఈ నిస్వార్థ యాత్ర చేపడతామో, అప్పుడు స్వయంచాలకంగా సమీకరణ తీర్మానం అందులో లీనమైపోతుంది. మన ఆలోచనలు నెరవేరినప్పుడు, మనం ‘इदम् न मम्’, అని చెబుతాము. అంటే, ఈ సాధన నా కోసం కాదు; ఇది మానవజాతి సంక్షేమం కోసం. అని అర్ధం. ‘దీపం నుంచి దీపావళి వరకు’ అనేది భారతదేశపు సిద్ధాంతం; ఇది భారతదేశ ఆలోచన; ఇది భారతదేశ సనాతన సంస్కృతి. భారతదేశం మధ్యయుగ మరియు ఆధునిక కాలంలో అనేక చీకటి యుగాలను ఎదుర్కొందని మనందరికీ బాగా తెలుసు. కొన్ని గొప్ప నాగరికతలను నాశనం చేసిన తుఫానులలో కూడా మన దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. మనం ఆ తుఫానులను తగ్గించిన తర్వాత మళ్లీ మేల్కొన్నాము, ఎందుకంటే మనం దీపాలను వెలిగించడం ఎప్పుడూ ఆపలేదు కాబట్టి. మనం నమ్మకాన్ని పెంచుకోవడం ఎప్పుడూ ఆపలేదు. ఇటీవల, కష్టతరమైన కరోనా కాలంలో, ప్రతి భారతీయుడు ఈ స్ఫూర్తితో దీపంతో లేచి నిలబడ్డాడు. భారతదేశం కరోనాపై బలంగా పోరాడుతున్న విధానాన్ని, ఈ రోజు యావత్ ప్రపంచం గమనిస్తోంది. చీకటిలో ఉన్న ప్రతి యుగం నుంచి ఉద్భవించిన భారతదేశం, గతంలో తన శక్తి యొక్క కాంతిని వ్యాప్తి చేసిందని, అదేవిధంగా, భవిష్యత్తులో కూడా దానిని వ్యాప్తి చేస్తుందని ఇది రుజువు చేస్తోంది. కాంతి మన చర్యలకు సాక్షిగా నిలిచినప్పుడు, చీకటి దానంతట అదే అంతమౌతుంది. దీపం మన చర్యలకు సాక్షిగా మారినప్పుడు, కొత్త ఉషస్సు, కొత్త ప్రారంభం యొక్క విశ్వాసం దానంతట అదే బలపడుతుంది.
ఈ నమ్మకంతో మరోసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను !
సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో నాతో పాటు చెప్పండి -
సియావర్ రామచంద్ర కీ జై!
సియావర్ రామచంద్ర కీ జై!!
సియావర్ రామచంద్ర కీ జై!!!
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ లో చేసిన ప్రసంగానికి స్వేచ్చానువాదం.
*****
(Release ID: 1870720)
Visitor Counter : 153
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam